పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా? అమెరికా, చైనాల వాదనేంటి

    • రచయిత, లూయిస్ బారుచో
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన నౌకా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని అస్తవ్యస్తం చేసింది. అదే సమయంలో అక్కడికి వేల మైళ్ల దూరంలో ఉన్న మరొక వ్యూహాత్మక కీలక సముద్ర మార్గం సరికొత్త ఘర్షణకేంద్రంగా మారింది.

అదే అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య కీలక వారధి పనామా కాలువ.

ఈ కాలువపై పెరుగుతోన్న చైనా ప్రభావం, ప్రపంచ వాణిజ్యానికి, భద్రతకు ముప్పు కలిగించవచ్చని అమెరికా హెచ్చరించింది.

ఈ వాదనను బీజింగ్ తిరస్కరించింది. ఆ జలమార్గంపై తన నియంత్రణను విస్తరించుకోవడానికే వాషింగ్టన్ దీనిని ఒక సాకుగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.

ఈ రెండు దేశాల మధ్య పనామా కాలువ చిక్కుకోవడంతో, కాలువపై తన సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించింది పనామా. అది శాశ్వతంగా తటస్థంగా ఉంటుందని నొక్కిచెప్పింది.

పనామా కాలువ అంటే ఏమిటి? దీన్నెలా ఆపరేట్ చేస్తున్నారు?

పనామా కాలువ అనేది పనామా భూసంధి ద్వారా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతున్న 80 కిలోమీటర్ల కృత్రిమ జలమార్గం.

నౌకలు దక్షిణ అమెరికాలో దక్షిణ భాగంలో ఉన్న కేప్ హార్న్ చుట్టూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది ఈ కాలువ. ప్రయాణ సమయాన్ని, రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.

నౌక పరిమాణం, నౌక రకం, అందులోని సరుకు వంటి అంశాల ఆధారంగా ఇక్కడ రవాణా సుంకాలను వసూలు చేస్తారు. ఈజిప్ట్ సూయజ్ కాలువ కూడా ఇలాంటి ఫీజు ఆధారిత విధానాన్నే ఉపయోగిస్తుంది..

ఈ కాలువ నౌకలను సముద్ర మట్టం నుంచి గాటున్ సరస్సుకు ఎత్తడానికి, ఆపై అవతలి తీరంలో వాటిని తిరిగి కిందికి దించడానికి 'లాక్స్' వ్యవస్థను ఉపయోగిస్తుంది.

ప్రతి నౌక రాకపోకకు గాటున్ సరస్సు, సమీప జలాశయాల నుంచి తీసిన లక్షలాది గాలన్ల నీరు అవసరం అవుతుంది.

ఆ నీటిపై ఆధారపడటం వల్ల ఈ కాలువ కరువు బారిన పడే అవకాశం ఉంది.

నీటి మట్టాలు పడిపోయినప్పుడు, అధికారులు నౌకల మ్యాక్సిమమ్ డ్రాఫ్ట్‌ను (మునిగి ఉండే లోతును) పరిమితం చేయవచ్చు.

దీనివల్ల అవి తేలికైన బరువులను మోయవలసి వస్తుంది. ఈ మార్గం మొత్తం సామర్థ్యం తగ్గుతుంది.

ఈ కాలువ గుండా రాకపోకలు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ షిప్పింగ్ అసోసియేషన్ అయిన 'బాల్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ కౌన్సిల్' (బిమ్కో) ప్రకారం, మే చివరి నాటికి పనామా కాలువ గుండా మొత్తం నౌకల రాకపోకలు సంవత్సరానికి 8 శాతం పెరిగి రోజువారీ సగటున 38 నౌకలకు చేరుకున్నాయి.

ఈ జలమార్గం గరిష్ఠ సామర్థ్యానికి చాలా దగ్గరగా ఉంది.

ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐదు వారాల్లో, రాకపోకలు సంవత్సర ప్రాతిపదికన 16 శాతం పెరిగాయని బిమ్కో తెలిపింది.

ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది. అయితే, ఇరాన్-అమెరికా సంఘర్షణ కారణంగా ఈ రవాణా మరింత కష్టతరం అయింది.

ఆసియా కొనుగోలుదారులు యూఎస్ గల్ఫ్ తీరంలోని సరఫరాదారుల నుంచి ముడి చమురును, శుద్ధి చేసిన ఇంధనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్గోలలో చాలా వరకు అట్లాంటిక్, పసిఫిక్ బేసిన్‌ల మధ్య పనామా కాలువ గుండానే ప్రయాణిస్తాయి. దీనివల్ల ట్రాన్సిట్ స్లాట్‌లకు డిమాండ్ పెరిగింది.

ఈ ట్రాఫిక్ పెరుగుదల ఎక్కువ వెయిటింగ్ టైమ్స్‌కు (వేచి ఉండే సమయం), బుకింగ్‌ల కోసం తీవ్రమైన పోటీకి, ప్రాధాన్యత ప్రయాణం కోసం రికార్డు స్థాయి ప్రీమియమ్‌లకు దారితీసింది.

వేగవంతమైన రాకపోకల కోసం కొందరు ఆపరేటర్లు వేలంలో మిలియన్ల డాలర్లు చెల్లించినట్లు రిపోర్టులు వచ్చాయి.

'హార్ముజ్ లాగా పనామా తప్పనిసరి మార్గం కాదు'' అని డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఓర్లాండో జె పెరెజ్ అన్నారు.

ఎందుకంటే హార్ముజ్‌ను మూసేస్తే వేరే మార్గం లేదు. కానీ, పనామాను మూసేస్తే నౌకలు కేప్‌ హార్న్ చుట్టూ తిరిగి గమ్యాలకు చేరుకోవచ్చు.

''ఇక్కడి పరిస్థితులు వేరు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 5 శాతమే ఇక్కడి నుంచి జరుగుతుంది. అయితే, యూఎస్ కంటైనర్ ట్రాఫిక్‌లో దాదాపు 40 శాతం ఇక్కడి నుంచే వెళుతుంది. హార్ముజ్ అనేది ప్రపంచానికి ఇంధన శక్తిని సరఫరా చేసే మార్గం. పనామా అనేది ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ సప్లై చైన్‌కు మాత్రమే కీలక మార్గం. అయితే రెండూ ముఖ్యమైనవే'' అని పెరెజ్ అన్నారు.

ఈ కాలువ కూడా పర్యావరణ అడ్డంకులను ఎదుర్కొంటోంది.

గాటున్ సరస్సులో నీటి మట్టాలు గత సంవత్సరాల సగటు స్థాయిల కంటే తక్కువగానే ఉన్నాయి. దీనివల్ల పనామా కాలువ అధికార యంత్రాంగం డ్రాఫ్ట్ నిబంధనలను విధించాల్సి వచ్చింది. అంతేకాక 2026 సెప్టెంబర్ 15 నుంచి, ఈ కాలువ గుండా అనుమతించే రోజువారీ నౌకల సంఖ్య 36 నుంచి 32కి తగ్గించనుంది.

మరోవైపు, ఎల్ నినో పరిస్థితులతో సహా విస్తృతమైన వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు తెలిపారు.

ఈ ఆంక్షలు తీవ్రమైన 2023 కరువును మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఆ సమయంలో నౌకల పరిమితుల వల్ల భారీగా క్యూ లైన్లు ఏర్పడి, సప్లయి చెయిన్లు దెబ్బతిన్నాయి.

పనామా కాలువ చరిత్ర

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ కాలువను నిర్మించినప్పుడు, దీన్ని అమెరికా నియంత్రించింది.

1977 నాటి టోరిజోస్-కార్టర్ ఒప్పందాల వరకు కెనాల్ జోన్‌లోని చుట్టుపక్కల ప్రాంతమంతా అమెరికా ఆధీనంలోనే ఉండేది.

అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నేతృత్వంలో జరిగిన చర్చలు, ఈ నియంత్రణను పనామాకు బదిలీ చేసేందుకు ఒక టైమ్ టేబుల్‌ను నిర్ణయించాయి. ఈ బదిలీ 1999 డిసెంబర్ 31న పూర్తయింది.

నేడు, పనామా కాలువ అధికార యంత్రాంగం అంతర్జాతీయ షిప్పింగ్‌కు తటస్థతను, యాక్సెస్‌ను హామీ ఇచ్చే ఒప్పందాల ప్రకారం ఈ జలమార్గాన్ని నిర్వహిస్తోంది.

చైనా విషయంలో అమెరికా ఆందోళనలు ఏంటి?

ఈ వివాదం యాజమాన్యానికి సంబంధించినది కన్నా, పలుకుబడికి సంబంధించినది.

దశాబ్దాలుగా, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్, తన అనుబంధ సంస్థ పనామా పోర్ట్స్ కంపెనీ ద్వారా, పనామాతో కుదుర్చుకున్న ఒక రాయితీ ఒప్పందం ప్రకారం, కాలువ పసిఫిక్, అట్లాంటిక్ ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న బల్బోవా, క్రిస్టోబల్ ఓడరేవులను నిర్వహించింది.

ఒక కంపెనీకి కానీ, లేదా చైనాకు కానీ ఈ కాలువను నడిపే విషయంలో ఎలాంటి ప్రమేయం లేదు. అయితే, ఈ జలమార్గం గుండా ముఖ్యంగా ఓడరేవులు, లాజిస్టిక్స్, రవాణా సదుపాయాల విషయంలో చైనా సంబంధిత ఉనికిపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో, సీకే హచిసన్ పోర్ట్ కన్సెషన్‌కు ఆధారమైన చట్టపరమైన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పనామా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

ప్రస్తుతం ఈ కాలువ తటస్థత విషయంలో పరీక్షకు గురవుతోందని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఓర్లాండో జె పెరెజ్ తెలిపారు.

అయితే, ఈ వివాదం పూర్తిగా అనవసరమైందని చిలీ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆనరరీ ప్రొఫెసర్ జార్జ్ హీన్ అన్నారు.

చైనా సార్వభౌమత్వంలోకి హాంకాంగ్ తిరిగి రావడానికి కొన్ని నెలల ముందు అంటే 1997 నాటి నుంచే సీకే హచిసన్ కాలువ నిర్వహణలో భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు.

వారు చేసిందంతా కంటైనర్లు, పోర్టు ఆపరేషన్లను నిర్వహించడమేనని తెలిపారు. కానీ, వారు స్వయంగా కాలువను నిర్వహించలేదన్నారు.

పనామాపై చైనా ఆధిపత్యం పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు. కాలువపై ఆధిపత్యాన్ని అమెరికా తిరిగి తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను పనామా తిరస్కరించింది.

చైనా ఓడరేవుల్లో పనామా జెండా కలిగిన నౌకలపై తనిఖీలు పెంచడం ద్వారా బీజింగ్ ప్రతీకారం తీర్చుకుంటోందని అమెరికా ఆరోపించింది.

చైనా ఎలా స్పందించింది?

జనవరిలో విదేశాంగ శాఖకు చెందిన అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వాషింగ్టన్ ఈ సమస్యను వక్రీకరిస్తోందని ఆరోపించారు.

దీర్ఘకాలంగా పనామా కాలువను ఆక్రమించింది ఎవరు? తన సైన్యంతో పనామాపై దండెత్తి, దాని సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఇష్టానుసారంగా కాలరాసింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

శాశ్వతంగా తటస్థంగా ఉండాల్సిన ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని సొంత భూభాగంగా మార్చుకోవాలని ఎవరు ఆశిస్తున్నారు? దీనికి సమాధానం అందరికీ తెలుసని చెప్పారు.

పనామా సార్వభౌమత్వాన్ని, ఈ కాలువ తటస్థ హోదాను తాము గౌరవిస్తామని బీజింగ్ చెప్పింది.

''అమెరికా అల్లిన అబద్ధాలు, చైనాపై నిరాధారణమైన దాడులు కేవలం కాలువను పూర్తిగా వారి నియంత్రణలోకి తెచ్చుకునేందుకు చూపిస్తున్న ఒక సాకు మాత్రమే'' అని గతవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో చైనా రాయబారి ఫూ కాంగ్ అన్నారు.

మరోవైపు, పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో కాలువపై పనామా సార్వభౌమత్వాన్ని నొక్కిచెప్పారు. నిర్దిష్టమైన, ప్రపంచ స్థాయి ముప్పుల నుంచి తట్టుకునే అత్యుత్తమమైన రక్షణ, ఒకటే దాని తటస్థత అని అభివర్ణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)