You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు, శిక్షణ నుంచి సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
హైదరాబాద్ శివరాంపల్లిలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఒక మహిళ ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జులై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.
తన తోటి ఐపీఎస్ శిక్షణ అభ్యర్థి ఉదయ్ కృష్ణారెడ్డి తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపుల సందేశాలు పంపుతున్నారని, అకాడమీలోని తోటి స్నేహితుల ముందు తెలుగులో తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో రాశారు.
మరో ట్రైనీతో తనకు శారీరక సంబంధం ఉందని అసత్య ఆరోపణలు చేశారని, అంతేకాకుండా ఆ విషయం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో రాశారు. చెప్పలేని పదంతో తిట్టాడని కూడా ఆమె తెలిపారు.
ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
"బెదిరింపు, బ్లాక్‌మెయిల్ ద్వారా నా పర్సనల్ మెసేజీలు చూపించేలా ఒత్తిడి చేశాడు. నా మొబైల్‌ను తన రూమ్‌కి తీసుకెళ్లి పాస్‌వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. నన్ను తన గదికి తీసుకువెళ్లి, దాడికి ప్రయత్నించాడు.
నాకు తెలియకుండా నా ప్రైవేటు వీడియో ఒకటి తీసి దాని ద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం కోసం నా భర్తకు ఆ వీడియోను పంపాడు" అని ఆమె ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు పోలీసులు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు, బీఎన్ఎస్ 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2), ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆరోపణలను తిరస్కరించిన ఉదయ్ కృష్ణారెడ్డి
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఎందుకు చేరారు అనేదాని మీద నిర్ధరించదగిన నిర్దిష్ట కారణాలు బయటకు రాలేదు. కాకపోతే, ఆ సందర్భంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ బయటకు వచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆ లేఖ ఆయనదే అని స్థానిక మీడియాతో ధ్రువీకరించారు.
తనకు, ఆమెకు మధ్య సాన్నిహిత్యం ఉందని, కానీ ఇప్పుడు తానే దాడి చేశానని ఆమె చెబుతున్నారని ఉదయ్ కృష్ణారెడ్డి రాశారంటున్న ఆ లేఖలో ఉంది.
'సత్యమేవ జయతే, ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి..' అని ఆ లేఖలో రాశారు. 2025 జూన్ నుంచి ఇప్పటి వరకూ తమ బంధానికి సంబంధించిన అన్ని ఆధారాలూ తన ఫోన్లో ఉన్నాయని అందులో తెలిపారు. తరువాత జులై 19న ఆయన మరో పోస్ట్ షేర్ చేశారు.
''తన వెనుక మాట్లాడేవారంతా తన వెనకే ఉండిపోయారు'' అనే అర్థంలో ఆ పోస్ట్ ఉంది.
కేంద్ర హోం శాఖ సస్పెన్షన్ వేటు
ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఉదయ్ కృష్ణారెడ్డిని ఐపీఎస్ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ తరువాత పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి కోసం వెతుకుతున్నట్టు ప్రకటించారు. ఆయన పరారీలో ఉన్నారని వార్తలు వచ్చిన క్రమంలోనే తెలుగు చానెల్ ఎన్టీవీతో ఆయన మాట్లాడారు.
జులై 28న ప్రసారమైన ఆ ఇంటర్య్వూలో... ''ఈ గొడవల వల్ల మా నానమ్మ అనారోగ్యం పాలయ్యారని తెలిసింది. అందుకే సొంతూరు వచ్చి ఆమెను చూశాను. నేను కేసు విచారణకు హాజరై పోలీసులకు సహకరిస్తాను. పోలీసులు నేను గతంలో హైదరాబాద్‌లో ఉన్న తాత్కాలిక అడ్రస్‌లో నోటీసులు ఇచ్చారు తప్ప నా సొంతూరులో నోటీసులు ఇవ్వలేదు. నేను పరారీలో లేను. ఇవాళ నేను హైదరాబాద్ వెళుతున్నాను. నా మీద ఆరోపణలన్నీ అవాస్తవం'' అని చెప్పారు.
వివాదాల సుడిగుండంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డిని తెలంగాణ పరిధిలో జులై 28న పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు అత్తాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బీబీసీకి తెలిపారు.
ఉదయ్ కృష్ణా రెడ్డి కానిస్టేబుల్‌గా 2019లో రాజీనామా చేసి, 2024లో ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల అవమానాలు భరించలేక కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి, ఐపీఎస్ కోసం చదువుకున్నానని ఆయన చెప్పిన ఇంటర్వ్యూ, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం అంటూ మీడియాలో విస్తృతంగా కవరేజీ వచ్చింది. బీబీసీ తెలుగు కూడా అప్పట్లో కథనం చేసింది.
కానీ, ప్రస్తుత ఘటనలతో ఆయన కేసుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో అసలు హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో పరిస్థితులపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి.
(మొదటిసారి పబ్లిష్ చేసిన తర్వాత బీబీసీ ఎడిటోరియల్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఈ కథనంలో కొన్ని మార్పులు చేశాం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)