నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’

    • రచయిత, నితేష్ రౌత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(ఈ కథనంలో మిమ్నల్ని కలవరపరిచే అంశాలు ఉన్నాయి)

"నా భార్య ఆగస్టు 23న (ఆదివారం) ప్రసవించింది. మా బాబును నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయు)లో ఉంచారు. బాబు పుట్టడం చాలా సంతోషంగా అనిపించింది. ఉదయం 3 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉన్నా. నాతో పాటు నా స్నేహితుడూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ మహిళ అరుపు వినిపించడంతో ఏం జరిగిందని సెక్యూరిటీని అడిగినప్పుడు నాకు విషయం ఏమిటో తెలిసింది." అని స్వప్నిల్ బార్గే తెలిపారు.

ఆగస్టు 24న (సోమవారం) ఉదయం, మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో స్వప్నిల్‌కి జన్మించిన బాబు మృతిచెందాడు.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు స్వప్నిల్ ఆస్పత్రిలోనే ఉన్నారు.

"నేను.. నా భార్య, బాబు కోసం వెతుకుతున్నా. వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఉదయం 6-7గంటల మధ్యలో బాబు చనిపోయినట్లు చెప్పారు." అని స్వప్నిల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన ఉదయం 3.30 గంటలకు జరిగిందని, ఎన్‌ఐసీయూలో వెంటిలేటర్ పేలి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలోని మూడో అంతస్తులో నవజాత శిశువుల చికిత్సా కేంద్రం ఉంది. అక్కడ 39 మంది శిశువులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది. మంటలు చెలరేగిన వెంటనే వైద్యులు, నర్సులు, సిబ్బంది కలిసి పిల్లలను అక్కడి నుంచి తరలించినప్పటికీ ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు.

36 మంది శిశువులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వారు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అమరావతి జిల్లా కలెక్టర్ ఆశిష్ యెరేకర్ తెలిపారు.

ప్రమాదం జరిగిన వార్డులో 9 మంది చిన్నారులు ఉండగా, అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని క్షేమంగా బయటకు తీసుకురాగలినట్లు అమరావతి జిల్లా సర్జన్ డాక్టర్ వినోద్ పవార్ తెలిపారు. "ముగ్గురిని మాత్రం తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం ఆ ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది." అని చెప్పారు.

"ఏం జరిగిందో చెప్పడం లేదు"

"ఆస్పత్రిలో ఏం జరిగిందో వైద్యులు సరిగ్గా వివరించడం లేదు. ఇక్కడి నుంచి పిల్లలను తరలించాలని మాత్రమే చెబుతున్నారు." అని చిన్నారుల బంధువులు పేర్కొన్నారు.

"శ్వాస తీసుకోవడంలో సమస్య ఉండటంతో మా పాపని ఆస్పత్రిలో చేర్పించాం. ఇప్పటికి ఎనిమిది రోజులు అవుతుంది. ఇప్పుడు నా చిన్నారి శరీరంపై రెండు చోట్ల కాలిన గుర్తులున్నాయి. తన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది." అని ఓ చిన్నారి తండ్రి చెప్పారు.

"ప్రమాదం గురించి చెబుతూ ఉదయం మాకు ఓ ఫోన్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి వెళ్లాం." అని తస్లీం ఖాన్ చెప్పారు.

తస్లీం ఖాన్ కొద్ది రోజుల కిందట తన కుమార్తెను ఎన్‌ఐసీయూలో చేర్పించారు.

5 లక్షల నష్టపరిహారం

అగ్ని ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోసం కమిటీ వేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు ఫఢ్నవీస్ తెలిపారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రిని, సెక్రటరీని అమరావతి రావాల్సిందిగా ఆదేశించారు.

ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమరావతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. "నా హృదయం కదిలిపోయింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించాం. గాయపడిన చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. వారు త్వరగా కోలుకోవడానికి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం" అని చెప్పారు.

"చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి తగిన సహకారం అందిస్తాం. జిల్లా యంత్రాంగం వద్ద ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నాం." అని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన అనంతరం కాంగ్రెస్ నేత యశోమతి ఠాకుర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

"పాత భవనంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. అధిక సంఖ్యలో బెడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్‌ఐసీయూ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇన్వర్టర్ సరఫరాలో గానీ కనెక్షన్ సప్లైలో గానీ నిర్లక్ష్యం ఉందని తేలితే క్షమించే ప్రసక్తి లేదు." అని మీడియాతో యశోమతి ఠాకుర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)