You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతుందా, నిపుణులు ఏమంటున్నారు?
- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్‌లో ఒకే వారంలో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో లీటరుకు నాలుగు రూపాయల మేర ధర పెరిగింది.
ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా కష్టమైంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
నిరుడు నవంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బారల్కు 60 నుంచి 65 డాలర్ల మధ్య ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
అయితే అప్పటి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు సుమారు 6.9 శాతంగా ఉండే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అంతేకాకుండా 2025 నవంబర్‌లో 0.7 శాతంగా ఉన్న రీటెయిల్ ద్రవ్యోల్బణం రేటు ఇప్పుడు 3.48 శాతానికి పెరిగింది. దీని కారణంగా భారత్‌లో ఆహారం, అద్దె, రవాణా, ఇతర నిత్యావసరాల ఖర్చులు పెరిగాయని అర్థమవుతోంది. ప్రస్తుత 3.48 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రమాదకర స్థాయి కానప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరుగుతోందనేది స్పష్టం.
నవంబర్‌లో తక్కువగా ఉన్న హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం రేటు ఇప్పుడు 8.3 శాతానికి చేరింది. అంటే కంపెనీలు, పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని దీనర్థం. ముడి పదార్థాలు, ఇంధనం, లోహాలు, రవాణా మొదలైన వాటి ధరలు పెరగడం వల్ల పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయనడానికి సంకేతం.
ఇటీవల భారత్‌లో పాల ధర కూడా లీటరుకు రెండు రూపాయల చొప్పున పెరిగింది.
ముడి చమురు ధరల పెరుగుదల
ద్రవ్యోల్బణం, వృద్ధి రేట్లను అంచనా వేసి సూచీల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ప్రత్యక్ష కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత నవంబర్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 నుంచి 65 డాలర్ల మధ్య ఉండగా, ఇప్పుడు అది 100 నుంచి 110 డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు రెట్టింపు అయింది.
ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం మార్చి నుంచి మే మధ్య వరకు ఇంధన ధరలను పెంచలేదు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున భారత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన రెండు వారాల్లోపే చమురు కంపెనీలు ధరలు పెంచాయి.
"ఎన్నికల కారణంగా చమురు ధరలను పెంచడానికి ప్రభుత్వం వెనుకాడింది. ముడి చమురు ధరలు పెరుగుతున్న తీరు చూస్తే, భారత్‌లో రాబోయే రోజుల్లో ఇంధన ధరలు పెరగడం అనివార్యం" అని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం ప్రజలపై పడకుండా నివారించడానికి, భారత ప్రభుత్వం మార్చిలో ఎక్సైజ్ పన్నును10 రూపాయల వరకు తగ్గించింది.
"ఒకవేళ హార్ముజ్ జలసంధిని తెరవకపోతే, చమురు అక్కడే నిలిచిపోతే, రాబోయే రోజుల్లో చమురు ధరలు పెరగడం ఖాయం. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు చాలా పరిమితం" అని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా అన్నారు.
పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న దిగుమతులు
పెరుగుతున్న చమురు ధరలు, తగ్గుతున్న దిగుమతులు భారత చమురు నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి.
"భారత్ వద్ద కేవలం యాభై రోజుల వ్యూహాత్మక చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. భారత్ రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే వ్యూహాత్మక నిల్వలపై ఒత్తిడి పెరగవచ్చు" అని ఇంధన నిపుణులు నరేంద్ర తనేజా అన్నారు.
భారత ప్రభుత్వం ఈ ఇంధన సంక్షోభాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమైందని, అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేసిందని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
"ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో దాదాపు 75 రోజులు ఆలస్యం చేసింది. ఇంధన సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేసి, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతిని ఆపివేసి ఉంటే మనం ముడి చమురును ఆదా చేసుకోగలిగేవాళ్ళం. ఏప్రిల్‌లో ముడి చమురు నుంచి ఉత్పత్తి చేసిన శుద్ధి ఉత్పత్తులలో 35 శాతం వరకు ఎగుమతి చేశాం. ఇవి దేశీయ అవసరాలకు ఉపయోగపడేవి" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
అయితే ముడి చమురు ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"మధ్యప్రాచ్య సంక్షోభం మరో ఆరునెలల పాటు కొనసాగితే, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితి భారత్‌కు మరింత ప్రమాదకరంగా మారొచ్చు" అని నరేంద్ర తనేజా అన్నారు.
ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ఏమన్నారంటే, "హార్ముజ్ జలసంధిని తెరిచే వరకు ఇంధన మార్కెట్లో సంక్షోభం కొనసాగుతుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టగలదు" అన్నారు.
ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ
ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ. దీని ప్రభావం భారత విదేశీ మారక నిల్వలపై కూడా పడుతోంది. ఎందుకంటే గత ఆరునెలల్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 10 శాతానికి పైగా విలువ కోల్పోయింది.
నిరుడు నవంబర్‌లో డాలర్‌తో పోలిస్తే 83 నుంచి 84 రూపాయల మధ్య ఉన్నరూపాయి విలువ ఇప్పుడు 96 రూపాయలకు చేరింది.
తన ఇంధన అవసరాలలో 90 శాతాన్ని తీర్చడానికి దిగుమతులపై ఆధారపడే భారత్, తన ముడి చమురులో అధిక భాగాన్ని అమెరికన్ డాలర్లలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఖర్చు మరింత పెరుగుతోంది.
ఇది భారత విదేశీ మారక నిల్వలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. గత నవంబరులో భారత్‌కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉండగా, అవి ఇప్పుడు సుమారు 700 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇది భారీ మొత్తమే అయినప్పటికీ ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా కొనసాగితే, భారతదేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
"ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 15 శాతం చమురు కొరత ఉంది. రాబోయే రోజుల్లో చమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ సహా అన్ని ఇంధనాల ధరలు పెరగడం ఖాయం. భారత్ అధిక ధరలు చెల్లించి, ముడి చమురును అమెరికన్ డాలర్లలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది" అని నరేంద్ర తనేజా అన్నారు.
"మధ్యప్రాచ్య సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగొచ్చు" అని గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
అయితే భారత విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఆర్థిక పరిస్థితి అదుపులో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
కానీ, పెరుగుతున్న ముడిచమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అవుతాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రొఫెసర్ అరుణ్ కుమార్ దీన్ని 'డిస్ట్రిబ్యూషన్ షాక్' అంటున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాగలదని భావిస్తున్నారు.
దీని ప్రత్యక్ష ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై పడుతుందని, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల వారి కుటుంబ బడ్జెట్లు పూర్తిగా దెబ్బతింటాయని ఆయన చెప్పారు.
"ఇంధన కొరత వల్ల తయారీ రంగం దెబ్బతింటుంది. ఇంధనం లేకుండా ఉత్పత్తి జరగదు. దీంతో సరఫరాలో మార్పువల్ల ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతుంది" అని అరుణ్ కుమార్ హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక సూచీల్లో కనిపించే ద్రవ్యోల్బణం కంటే వాస్తవంగా బలహీన వర్గాలపై పడే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువని, ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని ప్రొఫెసర్ కుమార్ అంటున్నారు.
గతంలో పది రూపాయలుగా ఉండే ఒక కప్పు టీ ధర ఇప్పుడు సుమారు పదిహేను రూపాయలకు పెరిగిందని, అలాగే చాలా మంది తమ గృహ అవసరాల కోసం గ్యాస్‌కు కూడా అధిక ధర చెల్లించవలసి వస్తోందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఏమంటోంది?
భారత్‌లో చమురు, గ్యాస్‌కు కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
అయితే ఒకవైపు ఉత్పత్తి స్తంభించిపోతుండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని భారత ప్రభుత్వం ఇటీవల పలు అధికారిక ప్రకటనలు జారీ చేసింది.
ప్రపంచ చమురు ధరల ఒడిదుడుకుల నుంచి ప్రజలను కాపాడటానికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దేశీయ అవసరాలు తీర్చేందుకు డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం పన్ను విధిస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఇంధన కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.
అలాగే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిశితంగా పర్యవేక్షిస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. అనవర ఖర్చులు తగ్గించడానికి మనం జాతీయస్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)