E20 పెట్రోల్‌‌తో లాభమా, నష్టమా?

ప్రచురణ
చదివే సమయం: 8 నిమిషాలు

ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను తప్పనిసరి చేసిన తర్వాత తమ వాహనాల మైలేజ్, పనితీరు దెబ్బతిన్నాయని చాలా మంది వాహన వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి 10 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ కోసం రూపొందించిన వాహనాలు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో మార్కెట్‌లో ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

ఈ సమయంలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. ఇ20ని అమలు చేయడానికి ముందు తగినంత సన్నాహాలు ఎందుకు చేయలేదు? దీనిని 2030లో అమలు చేయాల్సి ఉండగా ఐదేళ్ల ముందే ఎందుకు చేశారు?

ఇ20 వల్ల కొన్ని వాహనాల ఇంధన సామర్థ్యం మూడు నుంచి ఐదు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గత శుక్రవారం(జూలై 10) అంగీకరించింది. అయితే వాహనం ఇంజిన్ లేదా పనితీరుపై దీని ప్రభావం ఉండబోదని, ఇథనాల్ మిశ్రమం విధానం పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇథనాల్ సాపేక్షంగా పర్యావరణహితమైన ఇంధనమని, పెట్రోలియం దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.

ఇ20 ఇంధనం వల్ల ఇంజిన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మిడిల్‌ఈస్ట్‌లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వాదన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కానీ ఇది కేవలం "తక్కువ మైలేజ్" గురించి మాత్రమే కాదు.

ఇ20 పై చర్చలో ఇంధన భద్రత, చమురు దిగుమతులు, రైతుల ఆదాయం, నీటి వనరులు, పర్యావరణం, వ్యయం వంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.

బీబీసీ న్యూస్ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో పాల్గొన్న ఇంధన నిపుణురాలు స్వాతి శేషాద్రి, ఈ సమస్యలు అభివృద్ధి, వాతావరణం రెండింటినీ ఏకకాలంలో ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్‌ఏ)తో స్వాతి శేషాద్రికి అనుబంధం ఉంది.

ఇథనాల్ ఇంధనం దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ ప్రభావాలపై మరింత లోతైన అధ్యయనాలు జరగాలని ఆమె అంటున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ, ఆటోరంగ నిపుణులు అమిత్ ఖరే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ జాతీయ ఇంధన సెల్ కన్వీనర్‌గా పనిచేసిన పెట్రోలియం నిపుణులు నరేంద్ర తనేజాతో మాట్లాడారు.

"ఇ20 ఇంధనంతో ఉన్న అతిపెద్ద సాంకేతిక సవాలు ఏంటంటే ఇథనాల్ సాపేక్షంగా అధిక పరిమాణంలో నీటిని గ్రహిస్తుంది" అని ఆటో రంగ నిపుణులు అమిత్ ఖరే పేర్కొన్నారు.

"ఇంధనంలో తేమ లేదా నీళ్లు కలిసినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇథనాల్, పెట్రోల్ మిశ్రమం వేరుపడడం ప్రారంభమవుతుంది. ఇది వివిధ సాంకేతిక సమస్యలకు దారితీయవచ్చు" అని అన్నారు.

అయితే ఇంధనంలో నీళ్లు ఉండటం ఏ రకమైన పెట్రోల్‌కు కూడా మంచిది కాదని, ఇది కేవలం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సమస్య మాత్రమే కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

"సాధారణ పరిస్థితుల్లో ఇంధన ట్యాంక్‌లోకి నీళ్లు ప్రవేశించకుండా నిరోధించే వ్యవస్థ ఆధునిక వాహనాలలో ఉంటుంది" అని తెలిపింది.

"నీళ్లు, ఇథనాల్ మిశ్రమం వల్ల మలినాలు, మురికి సాపేక్షంగా త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల ఫ్యూయల్ ఫిల్టర్ మూసుకుపోయే ప్రమాదం పెరుగుతుంది" అని ఖరే అన్నారు.

ఫిల్టర్ లేదా పంప్ దెబ్బతిన్నప్పుడు ఇంజిన్‌కు, ఇంధన సరఫరాకు అంతరాయం కలగవచ్చు. ఫలితంగా వాహనం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. ఇది డ్రైవర్‌కు తీవ్రమైన చికాకును కలిగిస్తుంది.

"నా అనుభవంలో, చాలా సందర్భాలలో సమస్యకు మూల కారణం ఫ్యూయల్ సిస్టమ్ క్లీనింగ్ లేదా ఫిల్టర్‌లో ఉంటుంది, కానీ తరచుగా దాన్ని రిపేర్ చేయడానికి బదులుగా మొత్తం ఫ్యూయల్ పంప్‌నే మార్చేస్తారు. దీనివల్ల కస్టమర్ల ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. అప్పుడు ఇ20 ఇంధనంపై వారి ఆందోళనలు సహజంగానే పెరుగుతాయి" అని ఆయన అన్నారు.

తన వాదనకు మద్దతుగా దిల్లీలో 18 నెలలుగా వాహనాల్లో ఇ20 పెట్రోల్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు తమ వాహనాలకు సర్వీసింగ్ చేయించుకున్నారు. కానీ కంపెనీలు ఫ్యూయల్ పంపులను శుభ్రపరచలేదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దాని ప్రభావాలు ఇప్పుడు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.

అందుకే ఇ20 పై చర్చ కేవలం మైలేజ్ లేదా పనితీరుకే పరిమితం కాకుండా, వాహనం ఇంధన వ్యవస్థ దీర్ఘకాలిక విశ్వసనీయత నిర్వహణ ఖర్చుల గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇ20 పెట్రోల్ వల్ల ఎక్కువగా ఎవరు ప్రభావితమవుతారు?

ఇ20 పెట్రోల్ పెట్రోలియం నిపుణులు నరేంద్ర తనేజా, ఆటో రంగ నిపుణులు అమిత్ ఖరే ఇద్దరూ ద్విచక్ర వాహనాలు, పాత నాలుగు చక్రాల వాహనాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు. అయితే ఇథనాల్-మిశ్రిత పెట్రోల్ ఉత్పత్తి దీర్ఘకాలిక ఖర్చులు, ప్రయోజనాలపై చర్చ కొనసాగుతోంది.

వాహన మైలేజీపై ప్రభావానికి ప్రధాన కారణం ఇథనాల్ లక్షణాలేనని అమిత్ ఖరే అన్నారు. ఇథనాల్‌కు అధిక ఆక్టేన్ సంఖ్య ఉన్నప్పటికీ, దాని శక్తి, సాంద్రత పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఇ20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతుంది.

"నా అనుభవంలో, చాలా ఫిర్యాదులు ద్విచక్ర వాహన యజమానుల నుంచే వస్తున్నాయి. చాలా మంది బైక్ యజమానులు మైలేజీలో సుమారు 10 నుంచి 12 శాతం తగ్గుదలను ఎదుర్కొంటున్నారు. ఇది వారికి ఆందోళన కలిగించే విషయం."

"నాలుగు చక్రాల వాహనాలపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. 1500 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాల మైలేజీలో సాధారణంగా 8 నుంచి 10 శాతం వ్యత్యాసం కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.

అయితే, 2 లీటర్లు లేదా అంతకంటే పెద్ద ఇంజిన్ల విషయంలో ఈ తగ్గుదల సాపేక్షంగా తక్కువగా, సుమారు 6 నుంచి 7 శాతం వరకు ఉంటుంది. భారత్‌లో చిన్న ఇంజిన్ వాహనాలే అత్యధికంగా ఉన్నందున ఈ చర్చ ఈ వాహనాల విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

మైలేజీలో తగ్గుదల సాధారణంగా 3 నుంచి 5 శాతానికి పరిమితమై ఉంటుందని ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఈ వ్యత్యాసాన్ని ఇరుపక్షాలు కొంత అతిశయోక్తి చేసి ఉండవచ్చని నిపుణులు అమిత్ ఖరే అభిప్రాయపడుతున్నారు.

"ప్రభుత్వం నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తుండగా, సోషల్ మీడియాలోని కొంతమంది వినియోగదారులు తమ సమస్యలను అతిశయోక్తిగా చెబుతున్నారు. అందుకే వాస్తవ అనుభవాలకు, అధికారిక వాదనలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది" అని విశ్లేషించారు.

మైలేజ్ విషయంపై కార్ల తయారీ కంపెనీలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని అమిత్ ఖరే కూడా అంటున్నారు.

పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు ఇ20కి సంబంధించిన ఫిర్యాదులు పెరిగితే భవిష్యత్తులో ప్రజలు ఇంధనంతో పాటు కార్ల కంపెనీలను కూడా బాధ్యులుగా భావించవచ్చని నమ్ముతున్నారు.

అందువల్ల చాలా కంపెనీలు ప్రస్తుతం బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా పరిస్థితిని గమనిస్తూ, ప్రభుత్వం తదుపరి చర్య కోసం వేచి చూస్తున్నాయి.

పాత వాహనాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొత్త ఇంధనం వల్ల వాహనాలకు ఎదురయ్యే ప్రధాన సమస్య వాటి మైలేజీ తగ్గడం, నిర్వహణ ఖర్చు పెరగడమేనని నిపుణుడు ఖరే అభిప్రాయపడ్డారు.

ఈ ఇంధనం గత 18 నెలలుగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాడుకలో ఉందని అందుకే దాని ప్రభావం ఇప్పుడు వాహనాలపై కనిపిస్తోందని అమిత్ ఖరే అన్నారు.

వాహనాల సాధారణ సర్వీసింగ్ సమయంలో ఫ్యూయల్ పంప్‌ను శుభ్రం చేస్తే చాలా సందర్భాల్లో ఈ సమస్య తగ్గే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.

కొత్త ఇంధనం వల్ల ఇంజిన్ దెబ్బతినడానికి గల ప్రారంభ సంకేతాలు అంత స్పష్టంగా ఉండవని ఖరే అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వాహనం నడుస్తున్నప్పుడు స్వల్పంగా కుదుపులకు గురికావచ్చు. ఇది ఇంధన సరఫరాలో అంతరాయాన్ని సూచించవచ్చు.

కానీ చాలా మంది డ్రైవర్లు ఈ సంకేతాలను తీవ్రంగా పరిగణించరు. అందువల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయి, డ్రైవర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసినప్పుడే ఈ సమస్య తరచుగా బయటపడుతుంది.

ఇ20ని అమలు చేయడానికి అంత తొందర ఎందుకు?

ఒకవేళ 2030 నాటి అసలు గడువు ప్రకారం ఇ20ని అమలు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆటోరంగ నిపుణుడు అమిత్ ఖరే అంటున్నారు.

అప్పటికి పదేళ్ల ఉత్పత్తిని పూర్తి చేసుకున్నందున ఇ5, పెద్ద సంఖ్యలో ఇ10-అనుకూల వాహనాలు సహజంగానే రోడ్లపైకి రావు. ప్రస్తుత సమస్యలు ఈ పాత వాహనాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

"నీతి ఆయోగ్ ఫ్రేమ్‌వర్క్ కూడా ఈ క్రమమైన మార్పు గురించి ప్రస్తావించింది. కానీ ఇథనాల్ తగినంతగా అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుగానే అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్లే సమస్యలు పెరిగాయి"

షెడ్యూల్‌కు ముందే ఇ20ని అమలు చేయడానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సకాలంలో అభివృద్ధి చేయడమేనని పెట్రోలియం నిపుణులు నరేంద్ర తనేజా అంటున్నారు.

"తగినంత ఇథనాల్ ఉత్పత్తి అందుబాటులో ఉందని, దీనివల్ల దిగుమతుల బిల్లును కొంతమేర తగ్గించవచ్చని భావించినప్పుడు, ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఐదు సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన అన్నారు.

"ఈ పథకం ఉద్దేశం మంచిదేనని నేను నమ్ముతున్నాను. కానీ దాని అమలు సమయంలో అవసరం, ప్రయోజనాలు,సంభావ్య ప్రభావం గురించి సాధారణ వినియోగదారునికి సరిగ్గా వివరించలేదు. బహుశా అందుకే ఇ20 పై గందరగోళం, ఆందోళనలు పెరిగాయి"

ఇ20 ఇంధనంపై విస్తృతమైన పరీక్షలు నిర్వహించామని, ఇ20కి అనుకూలమైన వాహనాల్లో దాని వాడకంలో ఎలాంటి పెద్ద సాంకేతిక సమస్యలు కనుగొనలేదని ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి .

కొత్త ఇంధనంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం, ఆటో కంపెనీలు రెండూ మరింత పారదర్శకతను ప్రదర్శించాలని నరేంద్ర తనేజా అభిప్రాయపడ్డారు. పాత వాహనాల యజమానుల నుంచి ఫిర్యాదులు వస్తుంటే, వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఫలితాలను బహిరంగపరచాలి.

పాత మోడళ్లలో ఇ20 ఏవైనా సాంకేతిక సమస్యలను కలిగిస్తుంటే, కంపెనీలు వాటిని పరిష్కరించి, పాత ఇంజిన్ల పనితీరును మెరుగుపరచడానికి కృషి చేయాలి.

పెట్రోల్ పంపులు ఇ10, ఇ20 రెండింటినీ అమ్మాలా?

పెట్రోల్ పంపుల వద్ద ఇ10, ఇ20 రెండింటికీ వేర్వేరు వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఆచరణాత్మకంగా, ఆర్థికంగా చాలా కష్టమని పెట్రోలియం నిపుణులు నరేంద్ర తనేజా అంటున్నారు.

భారత్‌లో ఇథనాల్ ఇంధనాన్ని అమలు చేసే విధానాన్ని, వినియోగదారులకు ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఉన్న బ్రెజిల్‌తో పోల్చలేమని ఆయన అంటున్నారు.

దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు ఇంధనాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకురావాలంటే, ప్రత్యేక నిల్వ ట్యాంకులు, ప్రత్యేక ట్యాంకర్లు, ప్రత్యేక పంపిణీ వ్యవస్థ అదనపు శిక్షణ అవసరమవుతాయి. దీనికి అయ్యే ఖర్చు చాలా భారీగా ఉంటుంది.

ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ప్రత్యామ్నాయంపై ఖర్చు చేస్తే, ఇ20 ఇంధనం వల్ల సాధ్యమయ్యే పొదుపు కూడా సాధ్యపడదని ఆయన అంటున్నారు.

ద్రవ ఇంధనంలో పెట్రోల్ వాటా కేవలం 16-17 శాతం మాత్రమే కాగా, డీజిల్ వాటా 40 శాతంగా ఉందని, ప్రస్తుతం డీజిల్ మిశ్రమం జరగడం లేదు కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉంటుందని కూడా వారు వాదిస్తున్నారు.

మరోవైపు, సాధారణ వినియోగదారులకు పది, ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఎంపిక అందుబాటులో ఉంటే, పెద్ద సంఖ్యలో పాత వాహనాలు ప్రస్తుత సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేది కాదని అమిత్ ఖరే అభిప్రాయపడ్డారు.

ఈ రెండు ఎంపికలను అందించడం ప్రభుత్వానికి సాధ్యమైందని కూడా ఆయన అన్నారు. ఇ20 అమలు సమయంలో అనేక పెట్రోల్ పంపులు తమ ప్రీమియం ఇంధన ఎంపికల్లో కొన్నింటిని మార్చాయని ఆయన చెప్పారు.

ఇ10ని అవే డిస్పెన్సర్ల వద్ద సరఫరా చేయడం కొనసాగించి ఉండవచ్చు. దీనికి పెద్ద మౌలిక సదుపాయాల మార్పులు అవసరం లేదని, కేవలం ఇంధన సరఫరా,లేబులింగ్‌లో మార్పులు చేస్తే సరిపోతుందని ఆయన అంటున్నారు.

కొత్త ఇంధనం నిజంగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందా?

ఇ20 లక్ష్యం చమురు దిగుమతులను తగ్గించడమే కాకుండా, పెట్రోల్ వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కూడా అని నరేంద్ర తనేజా అభిప్రాయపడ్డారు. అయితే ఇథనాల్ ఉత్పత్తితో ముడిపడి ఉన్న పర్యావరణపరమైన ఆందోళనలు కూడా సరైనవేనని ఆయన భావిస్తున్నారు.

"ఇథనాల్‌ను కేవలం చెరకు నుంచే కాకుండా, ఎక్కువ నీటిని వినియోగించే విరిగిన బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి కూడా ఉత్పత్తి చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లాంటి దేశంలో నీటిని ఎక్కువగా వినియోగించే పంటలను పండించి ఇథనాల్ ఉత్పత్తి చేయడం సరైన వ్యూహమా? లేక ఆ వనరులను ఎలక్ట్రిక్ వాహనాల వంటి ప్రత్యామ్నాయ వాహనాలకు ఉపయోగించాలా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

మరోవైపు పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించే మార్గంగా ఇథనాల్ మిశ్రమాన్ని చూస్తున్నప్పటికీ ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని ఇంధన నిపుణురాలు స్వాతి శేషాద్రి అభిప్రాయపడ్డారు.

చాలా వాహనాలు ఇప్పటికీ సాంప్రదాయ ఇంధనాలపైనే ఆధారపడి ఉన్నందున, ఇది పెట్రోల్‌పై ఆధారపడటం అనే ప్రాథమిక సమస్యను పరిష్కరించదు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను 'గ్రీన్ ఫ్యూయల్' అని పిలుస్తున్నారని, కానీ దాని ఉత్పత్తి ప్రక్రియ మొత్తాన్ని పరిశీలిస్తే అది గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుందని తెలుస్తుందని ఆమె అంటున్నారు.

భూమి, నీరు, శక్తి,ఎరువులను ఉపయోగించే ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవలసిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు.

"ఇథనాల్‌కు డిమాండ్ పెరిగేకొద్దీ చెరకు,మొక్కజొన్న వంటి పంటల సాగు విస్తీర్ణం కూడా పెరగవచ్చు"

ఈ పంటలకు అధికంగా ఎరువులు వాడతారు. ఇవి హరితగృహ వాయువులను విడుదల చేస్తాయి. ఈ పంటల సాగు విస్తీర్ణం పెరిగితే, ఇతర ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఇది ఆహార భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది"

"ప్రైవేట్ వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలను కనుగొనడమే పరిష్కారమా లేక మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడమేనా అనే విషయాన్ని రవాణా రంగం పరిగణనలోకి తీసుకోవాలి" అని ఆమె అన్నారు.

"నీటి వినియోగం అనే ప్రశ్న కూడా ముఖ్యమైనది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సుమారు 2,860 లీటర్ల నీరు అవసరం. ఈ వినియోగం దశాబ్దాలుగా చెరకు పండిస్తున్న ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే అక్కడ ఇప్పటికే నీటిని అధికంగా వాడుతున్నారు" అని ఆయన అన్నారు.

అప్పుడు పరిమిత నీటి వనరులను ఇథనాల్ ఉత్పత్తికి, దేశీయ అవసరాలకు, లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగించాలా అనేది విధానపరమైన ఎంపికగా మారుతుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)