You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుప్తనిధుల కోసం మద్యంలో విషం కలిపి 8మందిని హత్య చేశాడని ఆరోపణ, పోలీసులు ఏం చెప్పారు?
- రచయిత, అలోక్ పుతుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలోని ఒక గ్రామంలో వ్యక్తిగత మనస్పర్థలు మద్యంలో విషప్రయోగానికి దారితీశాయి.
ఎనిమిది మంది గ్రామస్ధులను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
విచారణ సమయంలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో వేర్వేరు నెలల్లో హత్యకు గురైన వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
గుప్త నిధుల కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.
ఇప్పటివరకు అలాంటి ఆధారాలేవీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. విచారణ సమయంలో నిందితుడు కూడా అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...
"జూన్ 6న, కస్డోల్‌లోని ఖర్వే గ్రామంలో ఎనిమిది మంది అనుమానాస్పద మరణాలపై గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా నిందితుడు రామ్‌సహాయ్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. చిన్న చిన్న గొడవల కారణంగా మద్యంలో విషం కలిపి ప్రజలను చంపినట్లు నిందితుడు అంగీకరించాడు" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓపీ శర్మ చెప్పారు.
ఈ కేసులో తన తండ్రిని అక్రమంగా ఇరికించారనీ, ఆయన నిర్దోషని నిందితుడి కుమారుడు వాదిస్తున్నారు.
మృతులతో చివరిసారిగా కనిపించింది నిందితుడే..
2026 ఫిబ్రవరి 6 నుంచి మే 14 మధ్య ఖర్వే గ్రామానికి చెందిన ఎనిమిది మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఊరి ప్రజలు చెబుతున్నారు.
వారందరూ మద్యం సేవించిన తర్వాత మరణించారు. అదే గ్రామానికి చెందిన రామ్‌సహాయ్ జైస్వాల్‌తో వాళ్లు చివరిసారిగా కనిపించారనేది స్థానికుల ఆరోపణ.
గ్రామానికి చెందిన కామ్తా ప్రసాద్ సాహు సోదరుడైన ఛత్తురామ్ మార్చి 12న మరణించారు. అతని మేనల్లుడు వినోద్ సాహు మార్చి 31న మరణించారు.
"ఊళ్లో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నప్పుడే గుప్త నిధుల కోసం రామ్‌సహాయ్ జైస్వాల్ 21 మందిని బలి ఇవ్వబోతున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత, జూన్ 6న మేము పోలీసులకు కంప్లైంట్ చేశాం" అని కామ్తా ప్రసాద్ సాహు అన్నారు.
మూఢనమ్మకాలను విశ్వసించే రామ్‌సహాయ్ జైస్వాల్ గుప్త నిధుల కోసం 21 మందిని హత్య చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తమకు తెలిసిందని గ్రామస్థులు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
నిందితుడు కార్తీక్ అనే వ్యక్తికి కూడా విషం ఇచ్చాడనీ, మద్యం తాగిన తర్వాత కార్తీక్ ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకోవడం ప్రారంభించాడని ఊరి ప్రజలు చెబుతున్నారు.
కార్తీక్ కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రిలో చేర్చడంతో అతని ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన మరిన్ని అనుమానాలు రేకెత్తించిందని ఊరి ప్రజలు చెబుతున్నారు.
మద్యంలో 'బోరాక్స్' కలిపినట్లు ఆరోపణలు
గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు మృతులలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీసి రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ మెమోరియల్ ఆసుపత్రికి పంపారు. అక్కడ పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. అనుమానాలు బలపడటంతో ఇతర మృతదేహాలను కూడా వెలికితీసి పరీక్ష కోసం పంపారు.
ఫిబ్రవరి 6 నుంచి మే14 మధ్య మరణించిన 8 మందిలో బుద్రమ్ జైస్వాల్ అనే వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన ఏడుగురి మృతదేహాలను ఖననం చేశారు.
ఆ గ్రామంలో ఎక్కువ మంది కబీర్పంథీ వర్గానికి చెందినవారు. వీరికి మృతదేహాలను పూడ్చిపెట్టే సంప్రదాయం ఉంది. ఏడు మృతదేహాలను వెలికితీసి, ఒక ప్రత్యేక వైద్య బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది.
దర్యాప్తు సమయంలో ఒక బృందం గ్రామంలోనే ఉంటూ ప్రజలను విచారిస్తుండగా, మరో బృందం సాంకేతిక ఆధారాలు సేకరించడంలో నిమగ్నమై ఉందని పోలీసులు తెలిపారు.
నిందితుడు గ్రామంలోని ఒక వ్యక్తి నుంచి ఎలుకల్ని చంపేందుకు అని చెప్పి 'బోరాక్స్' అనే విష పదార్థాన్ని సంపాదించాడని పోలీసులకు సమాచారం అందింది.
నిందితుడు మొదట ఒక కుక్కపై ఈ విష పదార్థాన్ని పరీక్షించాడు. ఆ తర్వాత బోరాక్స్ ఆల్కహాల్లో కలిపి ఇతరులకు ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు మొదట తనపై ఆరోపణలను ఖండించినప్పడికీ తర్వాత ఆ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.
పాత కక్షలు, క్షుద్రవిద్యకు సంబంధించిన అనుమానాల కారణంగా వేర్వేరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతులలో కొందరితో నిందితుడితో భూ వివాదాలు ఉన్నాయి. మరికొందరికి వారితో ఆర్థిక లావాదేవీలు ఉండగా, ఇంకొందరికి వారిపై వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే నిందితుడు మద్యం కలిపి బాధితులకు ఒక్కొక్కరిగా తాగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
నిందితుడిపై 8హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసుతో సహా 9 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
"మా నాన్నను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు నిరాధారమైనవి. మాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనో లేదా ఆలస్యంగానో నిజం బయటకొస్తుంది" అని రామ్‌సహాయ్ జైస్వాల్ కుమారుడు రుద్రేశ్వర్ జైస్వాల్ చెప్పారు.
పోలీసుల ప్రకారం హత్యలకు కారణాలు
మార్చి 12, 2026: ఛత్తురామ్ సాహు మరణించారు. తన భార్యపై ఛత్తురామ్ కన్నేశాడని నిందితుడు అనుమానించినట్లు పోలీసులు తెలిపారు.
మార్చి 20, 2026: బుద్రమ్ జైస్వాల్ మరణించారు. పోలీసుల ప్రకారం భూ వివాదం, కుల వైరం వల్ల నిందితుడు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు.
మార్చి 31, 2026: వినోద్ కుమార్ సాహు కస్డోల్ ఆసుపత్రిలో మరణించారు. తనను వేధించినందుకు ప్రతీకారంగా నిందితుడు అతనికి మద్యం కలిపి విషమిచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 28, 2026: గజానంద్ మరణించాడు. గజానంద్ తనపై క్షుద్రవిద్య ప్రయోగించి తన జీవితంలో సమస్యలు సృష్టిస్తున్నాడని నిందితుడు అనుమానించినట్లు పోలీసులు చెప్పారు.
ఏప్రిల్ 29, 2026: చైతురామ్ మరణించాడు. రూ.50వేలు అప్పు, దానిపై వడ్డీ చెల్లించకుండా తప్పించుకోవడానికే నిందితుడు ఈ హత్యకు కుట్ర పన్నాడని పోలీసులు చెబుతున్నారు.
మే 14, 2026: మహేత్రు రామ్ మరణించారు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన వివాదం, తర్వాతి కాలంలో వేధింపుల కారణంగా నిందితుడు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు పోలీసులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)