విరాట్ కోహ్లీ: ఛేజింగ్‌ అంటే, ఎప్పటికీ గుర్తుండిపోయే 5 ఐకానిక్ ఇన్నింగ్స్‌

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

'విన్నింగ్ షాట్ కొట్టాలనేది నా కల' అని ఐపీఎల్ ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ అన్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి తన మార్క్ ఛేజింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీ జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. లక్ష్యఛేదనలో మైండ్ గేమ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం కోహ్లీకి కొత్తేమీకాదు.

ఛేదించాల్సిన లక్ష్యం ఎంత భారీగా ఉన్న క్రీజులో విరాట్ కోహ్లీ ఉంటే మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం గత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.

అలా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒంటిచేత్తో భారత్‌కు అసాధ్యమైన విజయాలను అందించి, కోహ్లీని 'అల్టిమేట్ ఛేజ్ మాస్టర్'గా నిలబెట్టిన ఐదు చరిత్రాత్మక ఇన్నింగ్స్‌లను ఇక్కడ చూద్దాం.

1. పాకిస్తాన్‌పై 82 నాటౌట్ (మెల్‌బోర్న్, 2022 టీ20 ప్రపంచకప్)

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను స్వయంగా విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే బెస్ట్ టి20 ఇన్నింగ్స్‌గా చెప్పుకున్నాడంటే దీని ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

మ్యాచ్ పరిస్థితి: 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ 4, కెప్టెన్ రోహిత్ శర్మ 4, సూర్యకుమార్ యాదవ్ 15, అక్షర్ పటేల్ 2 పరుగులకే అవుటయ్యారు. మైదానంలోని భారత అభిమానులతో పాటు టీవీల్లో చూస్తున్న వారంతా కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్న తరుణం అది.

విరాట్ మ్యాజిక్: ఆ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ మొదటి 21 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40)తో కలిసి ఇన్నింగ్స్ రొటేట్ చేశాడు. రన్ రేట్ కొండలా పెరిగిపోయింది.

భారత్ విజయానికి చివరి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. రవూఫ్ వేసిన స్లోయర్ షార్ట్ పిచ్ బంతిని బ్యాక్‌పుట్‌పై నిలబడి లాంగాన్‌లోకి స్ట్రెయిట్ సిక్స్‌గా మలిచిన ఆ షాట్‌ను చూసి మైదానంలోని వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.

ఆఖరి ఓవర్‌కు 16 పరుగులు చేయాల్సి ఉంది. మొహమ్మద్ నవాజ్ వేసిన ఈ చివరి ఓవర్ అత్యంత డ్రామాటిక్ ఓవర్‌గా నిలిచింది.

డ్రామా సాగిందిలా..

మొదటి బంతికే హార్దిక్ అవుటయ్యాడు. మరుసటి రెండు బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. నాలుగో బంతి నో బాల్ కాగా కోహ్లీ దాన్ని సిక్సర్‌గా మలిచాడు. ఈ దెబ్బతో భారత గెలుపు సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ఈ నాలుగో బంతి టర్నింగ్ పాయింట్. నవాజ్ వేసిన హై-ఫుల్‌టాస్ బంతిని కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దాన్ని 'నో బాల్'గా ప్రకటించడంతో భారత్‌కు ఉచితంగా 'ఫ్రీ-హిట్' లభించింది.

నోబాల్ ఒత్తిడిలో నవాజ్ తర్వాతి బంతిని వైడ్ వేశాడు (ఫ్రీ-హిట్ అలాగే ఉంది). నవాజ్ వేసిన ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ, మైండ్ గేమ్ ఆడిన కోహ్లీ థర్డ్ మ్యాన్ వైపు బంతి వెళ్లడం చూసి వెంటనే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి 3 బైస్ పరుగులు రాబట్టాడు.

అయిదో బంతికి దినేశ్ కార్తీక్ అవుటయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని అశ్విన్ చాకచక్యంగా వదిలేశాడు. అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించడంతో స్కోర్లు సమమయ్యాయి. వైడ్ స్థానంలో వేసిన ఆఖరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ మరపురాని విజయాన్ని సాధించింది.

ఒత్తిడిలో నో బాల్స్, వైడ్లు వేయడంతో పాకిస్తాన్ బౌలర్ ఆఖరి ఓవర్‌లో మొత్తం 9 బంతులు వేయాల్సి వచ్చింది.

మ్యాచ్ గెలిచిన వెంటనే మైదానంలో మోకాళ్లపై కూర్చొని, కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో తన విలువను మరోసారి చాటుకున్నాడు.

53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు అసాధ్యమైన విజయాన్ని అందించాడు.

2. శ్రీలంకపై 133 నాటౌట్ (హోబర్ట్, 2012 సీబీ సిరీస్)

ఈ మ్యాచ్‌తోనే విరాట్ కోహ్లీని 'ఛేజ్ మాస్టర్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకోవడం మొదలైంది.

ఆస్ట్రేలియాలోని హోబర్ట్ వేదికగా 2012లో జరిగిన ఈ మ్యాచ్.. వన్డే క్రికెట్ చరిత్రలోనే దాదాపు అసాధ్యమనుకున్న రన్ ఛేజింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.

పరిస్థితి: ఫైనల్‌ రేసులో నిలవాలంటే శ్రీలంక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 40 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది.

విరాట్ మ్యాజిక్: అప్పట్లో వన్డే క్రికెట్‌లో 50 ఓవర్లలోనే 300 పరుగులు దాటడం చాలా పెద్ద విషయంగా భావించేవారు. అలాంటిది 40 ఓవర్లలోనే 321 పరుగులు చేయడం అసాధ్యమనే అనుకున్నారు.

ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్ వేగంగా ఆడటానికి ప్రయత్నించి 9.2 ఓవర్లలో 86 పరుగుల వద్ద అవుటయ్యారు. రన్‌రేట్ బాగున్నప్పటికీ వికెట్లు పడటంతో మ్యాచ్ శ్రీలంక వైపు మొగ్గుతున్నట్లుగా కనిపించింది. ఆ దశలో 23 ఏళ్ల విరాట్ కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. గంభీర్ (64 బంతుల్లో 63)తో కలిసి ఒత్తిడి లేకుండా పరుగులు రాబట్టాడు.

యార్కర్లతో వణికించే లసిత్ మలింగ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం అప్పట్లో ఏ బ్యాటర్‌కైనా ఇబ్బందిగానే ఉండేది. అలాంటిది అతను వేసిన 35వ ఓవర్‌లో కోహ్లీ వరుసగా 2,6,4,4,4,4 బాదాడు.

ఒక వన్డే మ్యాచ్‌లో, అది కూడా ఒత్తిడిలో మలింగ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టడంతో సహా 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 133 పరుగులు చేశాడు.

సురేశ్ రైనా (24 బంతుల్లో 40)తో కలిసి 36.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా చేశాడు.

3. పాకిస్తాన్‌పై 183 పరుగులు (ఢాకా, 2012 ఆసియా కప్)

అంతర్జాతీయ వన్డేల్లో విరాట్ కోహ్లీ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇది.

పరిస్థితి: పాకిస్తాన్ బ్యాటర్లు మొహమ్మద్ హఫీజ్ (105), నసీర్ జంషెడ్ (112) సెంచరీలతో చెలరేగారు. దీంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో భారత్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ గౌతమ్ గంభీర్ వికెట్‌ను కోల్పోయింది. గంభీర్ డకౌట్ అయ్యాడు.

విరాట్ మ్యాజిక్: వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒత్తిడిని అధిగమిస్తూ సచిన్ తెందూల్కర్‌ (48 బంతుల్లో 52)తో రెండో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సచిన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ(83 బంతుల్లో 68)తో కలిసి కోహ్లీ విశ్వరూపం చూపించాడు.

పాక్ బౌలర్లను ఏమాత్రం కుదురుకోనివ్వకుండా మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. కోహ్లీ, రోహిత్ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 172 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశారు.

అప్పట్లో పాకిస్తాన్ బౌలింగ్ లైనప్‌లో ఉమర్ గుల్, ఐజాజ్ చీమా వంటి పదునైన పేసర్లు, సయీద్ అజ్మల్, షాహిద్ అఫ్రిది వంటి స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ అజ్మల్‌ను ఎదుర్కోవడాన్ని సవాలుగా భావించేవారు. కానీ. కోహ్లీ ఆ రోజు అజ్మల్ దూస్రాలను, అఫ్రిది గూగ్లీలను అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లు ఆడాడు. ఉమర్ గుల్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన ఫ్లిక్ షాట్లు పాక్ ఫీల్డర్లను ప్రేక్షకుల్లా మార్చేశాయి.

కేవలం 148 బంతుల్లోనే 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 183 పరుగులు చేసి భారత్‌ను గెలుపు ముంగిట నిలిపాడు. కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత్ విజయం ఖాయమైపోయింది.

4. ఆస్ట్రేలియాపై 82 నాటౌట్ (మొహాలీ, 2016 టీ20 ప్రపంచకప్)

ఈ ఇన్నింగ్స్‌ను కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత 'పర్‌ఫెక్ట్ ప్లాన్డ్ ఛేజ్'గా క్రిక్ఇన్ఫో అభివర్ణించింది.

పరిస్థితి: సెమీఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించాలి. మొహాలీ పిచ్‌పై ఆ లక్ష్యం చాలా పెద్దది. ఒక దశలో భారత్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. యువరాజ్ సింగ్ కూడా గాయపడి సరిగ్గా పరుగెత్తలేక అవుటయ్యాడు. రన్ రేట్ చూస్తే ఓవర్‌కు 10 పరుగుల పైనే కావాలి. భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకుంటున్న తరుణమది.

విరాట్ మ్యాజిక్: యువరాజ్ అవుట్ అయ్యాక కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అసలైన 'ఛేజ్ మాస్టర్' ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పెద్ద బౌండరీలను నమ్ముకుని ఫీల్డింగ్‌ను దూరం పెట్టాడు. కానీ కోహ్లీ, ధోనీలు భారీ షాట్ల కోసం ప్రయత్నించి వికెట్లు పారేసుకోకుండా, వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తడం ప్రారంభించారు. ఒక పరుగు వచ్చే చోట రెండు పరుగులు, రెండు పరుగులు వచ్చే చోట అసాధ్యమనుకున్న మూడు పరుగులు తీశారు. దీంతో భారత విజయ సమీకరణం చివరి 18 బంతుల్లో 39 పరుగులుగా మారిపోయింది.

జేమ్స్ ఫాక్నర్ వేసిన 18వ ఓవర్లో వరుసగా ఫోర్, ఫోర్, సిక్స్ బాది 19 పరుగులు రాబట్టాడు. నాథన్ కూల్టర్ నీల్ తదుపరి ఓవర్‌లో 4 ఫోర్లు బాదాడు. ఇక చివరి ఓవర్ మొదటి బంతికి ధోనీ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. అలా మరో 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. కేవలం 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. గెలిచిన వెంటనే మైదానంలో మోకాళ్లపై కూలబడిపోయాడు.

అంతటి శారీరక శ్రమ, విపరీతమైన ఒత్తిడి తర్వాత వచ్చిన విజయం కావడంతో భావోద్వేగంతో కాసేపు తలదించుకుని అలాగే ఉండిపోయాడు.

5. ఆస్ట్రేలియాపై 100 నాటౌట్ (జైపూర్, 2013)

భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది రికార్డు సృష్టించింది.

మ్యాచ్ పరిస్థితి: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫించ్, హ్యూస్, వాట్సన్, బెయిలీ, మ్యాక్స్‌వెల్ అందరూ అర్ధసెంచరీలు చేయడంతో భారత్ ముందు 360 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఆ కాలంలో 360 పరుగుల ఛేజింగ్ అంటే మ్యాచ్ ముగియక ముందే అవతలి జట్టు విజయాన్ని ఖాయం చేసుకునే పరిస్థితి.

విరాట్ మ్యాజిక్: రోహిత్ శర్మ (123 బంతుల్లో 142; 17 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధవన్ (86 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఇచ్చిన బలమైన పునాదిని కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌తో శిఖరానికి చేర్చాడు. శిఖర్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ... 52 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో మెరుపు సెంచరీ చేసి భారత్‌కు ఇంకా 39 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)