విజయ్ పార్టీకి వీసీకే బేషరతు మద్దతు, ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

ఫొటో సోర్స్, ANI
రసవత్తరంగా సాగుతున్న తమిళనాడు రాజకీయాలు కీలకమైన మలుపు తిరిగాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు ఒక సభ్యుడి మద్దతు అవసరమున్న నేపథ్యంలో వీసీకే (విడుదలై చిరుతైగళ్ కట్చి) పార్టీ బేషరతుగా మద్దతిస్తామంటూ లేఖ అందించింది. ఈ మేరకు టీవీకే ప్రకటన చేసింది.
ఈ లేఖతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి మార్గం సుగమం అయ్యింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఉంటే తప్ప, సింగిల్ లార్జెస్ట్ పార్టీ పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయించేది లేదనే వైఖరిలో గవర్నర్ ఉండడంతో, మ్యాజిక్ ఫిగర్ 118 (ఒకవేళ విజయ్ రాజీనామా పరిగణిస్తే 117) కోసం విజయ్ విశ్వ ప్రయత్నాలు చేశారు.
అంతకు ముందుగా కాంగ్రెస్ పార్టీ విజయ్‌కి మద్దతు ఇవ్వగా, ఆ తర్వాత సీసీఐ, సీపీఎం కూడా విజయ్‌కి మద్దతు ప్రకటిస్తూ లేఖలు అందించాయి. ఈ వ్యవహారంలో వీసీకే కూడా మద్ధతు ఇస్తామని ముందుగా చెప్పినా, చర్చోపచర్చల అనంతరం బేషరతుగా మద్దతు ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1


ఫొటో సోర్స్, VCK
వీసీకే నిర్ణయం కోసం విజయ్ పార్టీ ఎదురుచూపులు
వీసీకే పార్టీ నుంచి మద్దతు లభిస్తుందని శనివరం ఉదయం నుంచి టీవీకే పార్టీ నేతలు ఎదురు చూశారు. ఉదయం పదిగంటలకు వీసీకే నుంచి ప్రకటన వస్తుందని మొదట చెప్పారు.
ఆ తర్వాత విజయ్ స్వయంగా వీసీకే పార్టీ ఆఫీసుకు వచ్చి కృతజ్ఞతలు చెబుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ, వీసీకే నేత తిరుమావళన్ పార్టీ ఆఫీసుకు రాలేదు. విజయ్ కూడా ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు.
చివరకు సాయంత్రం 4 గంటలకు తమ అభిప్రాయం చెబుతామని వీసీకే నుంచి సమాచారం వచ్చింది.
అనుకున్నట్లుగానే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో టీవీకే ఎమ్మెల్యే ఆధవ్ అర్జున ఒక ప్రకటన చేస్తూ , వీసీకే నుంచి తమకు మద్దతు లేఖ అందిందని వెల్లడించారు.
ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిచ్చిన రెండు వామపక్షపార్టీలతోపాటు వీసీకేకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖ రాసింది.
ఈ రెండు పార్టీల లేఖలతో విజయ్ పార్టీకి 121 మంది సభ్యుల మద్దతు చేకూరినట్లయింది.(విజయ్ రాజీనామాను పరిగణనలోకి తీసుకుంటే 120 మంది మద్దతు)

ఫొటో సోర్స్, x.com/tvkvijay
లేఖల్లో ఏముంది?
విడుదలై చిరుతైగళ్ కట్చి నాయకుడు తిరుమావళన్ పేరుతో రాసిన ఈ లేఖలో
‘‘తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంకు మద్దతు ఇస్తున్నాం’’ అని వీసీకే పేర్కొంది.
ఈ మద్దతు ఎటువంటి షరతులు లేనిదని కూడా ఆ లేఖలో స్పష్టం చేసింది ఆ పార్టీ.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆధారంగా, తమిళనాడు ప్రజలకు ఒక స్థిరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ మద్దతును అందిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొంది.
మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకేకు బేషరతు మద్దతిస్తూ ఐయూఎంఎల్ పార్టీ కూడా ఒక లేఖను విడుదల చేసింది. పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేల పేరిట సమర్పించిన లేఖలో, ‘‘తమిళనాడులో స్థిరమైన, లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో’’ తాము జోసెఫ్ విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

చివరి వరకూ సస్పెన్స్
ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు, సీపీఐ, సీపీఎం, వీసీకేల మద్దతు కోరారు విజయ్. ముందు నుంచీ ఆ అంశంపై సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు ఈ మూడు పార్టీల నాయకులు.
సాధారణంగా తమిళనాడులో ఈ మూడు పార్టీలది చాలా విషయాల్లో ఉమ్మడి కార్యాచరణ.
అంతేకాకుండా మే 8 శుక్రవారం నాటి విలేఖర్ల సమావేశంలో ''వీసీకే కూడా టీవీకేకి మద్దతు ఇస్తుంది'' అని స్వయంగా తమిళనాడు కమ్యూనిస్టు నాయకులు చెప్పారు. దీంతో వీసీకే మద్దతు పక్కా అనే వాదన స్పష్టం అయింది. కానీ, శనివారం సాయంత్రం వరకు ఆ పార్టీ నుంచి ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. మద్దతు లేఖనూ ఇవ్వలేదు.
ఒక దశలో వీసీకే, ముస్లిం లీగ్ కలిపి విజయ్‌కు 121 మంది సభ్యుల మద్దతు ఉందని శనివారం నాడు ఆ రెండు పార్టీల లేఖలు విడుదలకు ముందే ప్రచారం జరిగింది. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైపోవడమే కాకుండా, మే 9వతేదీ శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ మేరకు లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ అని చాలా మీడియా సంస్థలు వార్తలు కూడా అందించాయి.
వీసీకే శుక్రవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పార్టీ హైలెవెల్ మీటింగ్ తరువాత, వీసీకే నాయకులు తిరుమావళన్ డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిశారు.
ఆ తరువాత కూడా వారి నుంచి ఏ ప్రకటనగానీ, లేఖగానీ రాలేదు. చకచకా వీసీకే నిర్ణయం వస్తుందనుకున్న టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది.
వీసీకే మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కేబినెట్ మంత్రి పదవి, విజయ్ ఖాళీ చేసే అసెంబ్లీ సీటు, దళితుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం – అనే నాలుగు డిమాండ్లు నెరవేర్చాలంటూ వీసీకే, షరతు పెట్టిందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.
చివరకు శనివారం సాయంత్రానికి ఒక స్పష్టతనిస్తూ వీసీకే మద్దతు లేఖను ఇచ్చింది. అటు ఐయూఎంఎల్ కూడా మద్దతు లేఖను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Lok Bhavan, TN
ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ ఆరోపణలు
అంతకు ముందు, విజయ్‌కి మద్దతు చుట్టూ ఈ హడావుడి జరుగుతుండగానే టీటీవీ దినకరన్‌కి సంబంధించిన ఏఎంఎంకే పార్టీ చుట్టూ కొత్త వివాదం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం గెలుచుకుంది.
ఆ పార్టీ ఎమ్మెల్యే కామరాజు విజయ్‌కి మద్దతు ప్రకటించారంటూ ఒక లేఖ బయట వచ్చిందనీ, ఆ లేఖ ఫోర్జరీ అయ్యుండాలి లేదా తమ ఎమ్మెల్యేను కొనడానికి విజయ్ ప్రయత్నం చేసి ఉండాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు దినకరన్.
అయితే ఆయన స్వచ్ఛందంగానే లేఖ ఇచ్చారంటూ టీవీకే ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కామరాజు ఒక లేఖతో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. అర్థరాత్రి తరువాత మరోసారి ఆ ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని గవర్నర్‌ను కలిసిన దినకరన్, మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































