లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ వశం

ఫొటో సోర్స్, Alex Davidson/Getty Images
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ (110 బంతుల్లో 138: 17 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో అలరించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రషీద్ బౌలింగ్‌లో గిల్ (77 పరుగులు) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (74 పరుగులు) రోహిత్‌కు జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.
అయితే, కీలక సమయంలో రోహిత్ పెవిలియన్ చేరడం, ఆ తర్వాత ఇషాన్ కిషన్(14), శ్రేయస్ అయ్యర్(0), కోహ్లీ(74)లను స్లో బంతులతో సామ్ కరన్ బోల్తా కొట్టించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 4, ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్, జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు.


ఫొటో సోర్స్, Glyn KIRK / AFP via Getty Images
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి, భారత్‌కు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీతో (141 పరుగులు; 18 ఫోర్లు, ఒక సిక్సర్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతనికి మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ చక్కటి సహకారం అందించాడు.
తొలి వికెట్ కోసం భారత్ 30 ఓవర్ల వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.
93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేసిన బెథెల్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
బెథెల్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 192 పరుగులుగా ఉంది.
బెథెల్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన జో రూట్ కూడా వేగంగా పరుగులు చేయడంతో ఇంగ్లండ్ స్కోరు మరింత పరుగులెత్తింది.
జట్టు స్కోరు 293 పరుగుల వద్ద ఉండగా, 141 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ డకెట్‌ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేశాడు. అనంతరం వచ్చిన హ్యారీ బ్రూక్ 14 పరుగులకే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, Alex Davidson/Getty Images
చివరి ఓవర్లలో జో రూట్ (48 బంతుల్లో 74 పరుగులు నాటౌట్), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41 పరుగులు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































