మోసగాళ్లకు చెక్ పెడతామంటున్న డేటింగ్ స్టార్టప్స్, ఎలాగంటే..

    • రచయిత, మైఖేల్ డెంప్సే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మొదటి ప్రపంచ యుద్ధకాలపు కందకాల మాదిరిగా ఏర్పాటు చేసిన గోతులలో నిలబడి ఉన్నప్పుడు డెన్నీ స్మిత్‌కు ఒక ఆలోచన వచ్చింది.

సైనిక చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న తనలాంటి మరి కొందరితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో ఉన్న ఒక ప్రధాన లోపాన్ని ఆమె గుర్తించారు.

తనలాగే యుద్ధాల చరిత్ర గురించి ఆసక్తి ఉన్న వారు ఏం కోరుకుంటున్నారో యాప్‌లలో సరిగ్గా ప్రస్తావించడం లేదని ఆమె గ్రహించారు.

"డేటింగ్ సైట్లు చాలా వరకు తమ క్లయింట్ల సంఖ్య మీదనే దృష్టి పెడతాయి. అందులో చాలా వరకు మోసం చేసే నకిలీ అకౌంట్లు ఉంటాయి" అని ఆమె చెప్పారు.

ఉత్తర లండన్‌లోని క్రోయ్‌డాన్ ప్రాంతంలో హెయిర్ డ్రసింగ్ సెలూన్ యజమానైన డెన్నీ స్మిత్ "ప్రత్యేక ఆసక్తి ఉన్న వ్యక్తుల అతి పెద్ద మార్కెట్" అయిన డేటింగ్ బిజినెస్‌లోకి రావాలని నిర్ణయించారు.

ఇందుకోసం గీక్ మీట్ క్లబ్ స్థాపించారు. ఒకేరకమైన ఆలోచనలు ఉన్న వారిని ఒక వేదిక మీదకు తీసుకు రావాలని భావించిన డెన్నీ స్మిత్ ఆన్‌లైన్ డేటింగ్‌ను దెబ్బ తీస్తున్న నకిలీ ప్రొఫైల్స్‌ను తన క్లబ్‌కు దూరంగా ఉంచాలని భావిస్తున్నారు.

తన క్లబ్‌లో చేరే వారిని వ్యక్తిగతంగా పరిశీలించడాన్ని ఆమె ఇష్టపడుతున్నారు.

"నకిలీలను గుర్తించడంలో నాకు నైపుణ్యం ఉంది. కొన్నిసార్లు అది చాలా తేలిక కూడా. ఒక వ్యక్తి తన ప్రొఫైల్‌తో బోరిస్ జాన్సన్ ఫోటో పెట్టారు" అని ఆమె చెప్పారు. (బోరిస్ జాన్సన్ బ్రిటన్ మాజీ ప్రధాని)

క్లబ్‌లో ఉన్న 3,300 మంది సభ్యులకు చెడ్డపేరు తీసుకు రావడంకంటే నెలకు 50 మంది అప్లికేషన్లను తిరస్కరించేందుకు ఇష్టపడుతున్నారు.

గీక్ మీట్ క్లబ్ సభ్యులు ఆన్‌లైన్‌లో కాకుండా ప్రత్యక్షంగా కలుసుకుని డేటింగ్ చేయాలని డెన్నీ స్మిత్ భావిస్తున్నారు.

"మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. నెలవారీ క్విజ్‌ప్రోగ్రామ్స్ చేపడతాం. ప్రజలు రకరకాల దుస్తుల్లో వచ్చేందుకు వీలుగా కొన్ని వేదికల్ని అద్దెకు తీసుకుంటాం" అని ఆమె చెప్పారు.

సైన్స్ ఫిక్షన్ సమావేశాలకు హాజరయ్యే వారు, తమకు ఇష్టమైన దుస్తులు ధరించి వచ్చేందుకు ఆమె ఈ సూచన చేసారు. ఇది క్లబ్‌లో ఎవరుంటారో సూచించే అంశం కూడా.

"ఒకేరకమైన ఆసక్తులు ఉన్న వారికి కామిక్, సైన్స్ ఫిక్షన్ సమావేశాలు చాలా పెద్ద ఆకర్షణ" అని ఆమె చెప్పారు.

ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వెనుక స్మిత్ ఆలోచన ఒకటే.

సాధ్యమైనంత త్వరగా తన క్లబ్‌లో సభ్యులు నేరుగా కలుసుకునే ఏర్పాటు చేయడం.

దీని వల్ల ఆన్‌లైన్‌ డేటింగ్ యాప్‌లలో జరిగే మోసాలను అరికట్టవచ్చనేది స్మిత్ ఆలోచన.

"వీలైనంత త్వరగా వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవాలని నేను నా క్లబ్ సభ్యులకు చెబుతాను. పార్క్‌లో లేదా హై స్ట్రీట్‌లో కాఫీకి వెళ్లడం ద్వారా ఎదుటి వ్యక్తి నిజమైన వారేనా అని తెలుసుకోవాలని సూచిస్తాను" అని ఆమె చెప్పారు.

డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్‌ తొలగించడమే 'చెర్రీ డేటింగ్' ఏర్పాటు లక్ష్యం.

సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో విసిగిపోయిన సిటీ ఆఫ్ లండన్ బ్యాంకర్ జో మేసన్ 'చెర్రీ డేటింగ్' సంస్థ ఏర్పాటు చేశారు.

"ఈ సైట్లలో ప్రొఫైల్స్ చూడండి. ఈ వ్యక్తి నిజంగా ఉన్నాడా అని మిమ్మల్ని మీరే అడుగుతారు. ఒక వ్యక్తిని కలవడానికి ముందు అతని ప్రొఫైల్‌ని మీరు ప్రైవేట్ డిటెక్టివ్ మాదిరిగా పరిశోధించాలి" అని మేసన్ చెప్పారు.

ఆన్‌లైన్ డేటింగ్ వల్ల ప్రజలు ఎలా నిరాశకు లోనవుతారో ఆమె వివరించారు.

"కొంతమంది ప్రేమ పేరుతో ఊహా లోకాల్లో విహరిస్తుంటారు. వారికి ఎలాంటి మిమ్మల్ని కలిసే ఉద్దేశం కూడా ఉండదు. లేదా వారికి పెళ్లై ఉండవచ్చు. లేదా ఆన్‌లైన్‌ రిలేషన్ షిప్ ఒకటి ఉంటే చాలని అనుకోవచ్చు" అని మేసన్ చెప్పారు.

ప్రొఫైల్స్‌లో నకిలీ చిత్రాలు లేదా స్టేటస్ ఉంచి ఇతరులను ఆకర్షించడాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు. ఇది సోషల్ మీడియా ప్రొఫైల్స్ డేటింగ్ యాప్‌లలో అనేక రూపాలలో కనిపిస్తుంది.

"క్యాట్ ఫిషింగ్‌లో తక్కువ స్థాయి అంటే ఒక వ్యక్తి తన పదేళ్ల నాటి ఫోటో ఉపయోగిస్తారు. అయితే కొంతమంది వాళ్లు ప్రొఫైల్‌లో పెట్టిన ఫోటోలో మాదిరిగా ఉండరు. లేదా అసలు వేరే వ్యక్తి అయి ఉంటారు" అని మేసన్ అన్నారు.

ఇలాంటి మోసాలను నియంత్రించేందుకు టెక్నాలజీ వాడుకోవచ్చు. ప్రతీ సభ్యుడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్‌తో సెల్ఫీ తీసి దాన్ని సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చూడటం ద్వారా ఆ సభ్యులు నిజమైనవారేనా కాదా అని 'చెర్రీ డేటింగ్' చెక్ చేస్తోంది.

కొంతమంది సభ్యులు వారి గుర్తింపును చెక్ చేయాలని చెప్పే సరికి వెనకడుగు వేస్తారు. సైట్‌లో తర్వాతి ప్రక్రియను పూర్తి చేయకుండా వెళ్లిపోతారు.

"పెద్ద బ్యాంకులు తమ ఖాతాల్లో అసహజమైన వాటిని గుర్తించడానికి ఇలాంటి విధానాన్నే ఉపయోగిస్తుంటాయి"

మీరు అవతలి వ్యక్తిని కలవగవడం ఎంత శాతం సాధ్యమని మీరు భావిస్తున్నారు అని చెర్రీ డేటింగ్ తన సభ్యులను అడుగుతుంది.

"ఒక వేళ మీరు 80శాతం సానుకూలంగా ఉంటే అది మీకు మంచిది. అదే మీరు 5 శాతం మాత్రమే అలా భావిస్తుంటే అవతలి వ్యక్తుల సమయం వృథా చేస్తారు అని చెబుతుంది"

డేటింగ్ యాప్స్‌లో ఏవీ కూడా తమకు కావల్సిన వాటిని అందించడం లేదని మేసన్ నిర్వహించిన ఒక పరిశోధనలో 47శాతం బ్రిటిషర్లు చెప్పారు.

డేటింగ్ యాప్‌ల వల్ల తాము ఇతరులను కలవాలనే ఆసక్తి తగ్గిపోయిందని 40శాతం మంది చెప్పారు.

ఇదిలా ఉంటే మోసాలను ఎదుర్కొనే సేవలు అందించే సమ్‌సబ్ అనే కంపెనీ బ్రిటన్‌లో డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న 2 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో మరో వాస్తవం బయట పడింది. డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు 'ఏఐ' ఉపయోగిస్తున్నట్లు అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది అంగీకరించారు.

ఏఐని ఉపయోగించి తప్పుడు సమాచారంతో డేటింగ్ యాప్‌లలో పోస్ట్ చేసే ప్రొఫైల్స్ సమస్యను పరిష్కరించేందుకు కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే డేటింగ్‌ కోచ్‌, డేటింగ్ క్లాస్ రూమ్ వ్యవస్థాపకురాలు బ్రిటన్‌కు చెందిన జోస్‌లిన్ పెంక్యూ ప్రయత్నిస్తున్నారు.

"నా వద్దకు వచ్చే వారికి వారి రిలేషన్ షిప్ స్ట్రాటజీ గురించి నేను కోచింగ్ ఇస్తాను. సంబంధాన్ని కాకుండా ఆ సంబంధంలో విజయం సాధించాలనుకునే వారే నా ప్రేక్షకులు" అని పెంక్యూ చెప్పారు.

టెక్ రంగానికి చెందిన పెంక్యూ, ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లకు వ్యతిరేకం కాదు. టెక్సస్‌లోని తన కుటుంబంలో బంధాల గురించి చెబుతూ "మా నాన్నకు 79ఏళ్లు. ఆయన వృద్ధుల కోసం ఉన్న అవర్ టైమ్ అనే డేటింగ్ యాప్ ద్వారా తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిశారు" అని వివరించారు.

తన తండ్రి విషయంలో వయసుకు సంబంధించిన సైట్ల మాదిరిగానే ఒకే రకమైన ఆసక్తి ఉన్న వారి విషయంలో సైట్లలో జరిగే పరిచయాలు విజయవంతమవుతాయని ఆమె అభిప్రాయపడుతున్నారు. అలాగే పెంక్యూ ప్రపంచంలో ఏఐకి కూడా స్థానముంది.

"అనేక మంది తమ గురించి తాము చెప్పుకోవడంలో అంత నిపుణులు కాదు. అందుకే కో పైలట్ లేదా చాట్ జీపీటీ అందుకు ఉపయోగపడతాయి" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)