You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగియడానికి 5 ప్రధాన కారణాలు
- రచయిత, ప్రదీప్ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
తాజా ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు పోరాటం ముగిసింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 89 పరుగుల తేడాతో ఓడిపోయి ప్లే-ఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. వరుసగా మూడో సీజన్‌లోనూ ఆ జట్టు ప్లే-ఆఫ్స్ చేరలేకపోయింది.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన సీఎస్కే 6 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 12 పాయింట్లు సాధించింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సూపర్ కింగ్స్ భారీ పరాజయాన్ని చవిచూసింది.
ఈ సీజన్ ఆరంభం నుంచే సీఎస్కేకు కలిసి రాలేదు. ఆడిన మొదటి 3 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి మొదట్లోనే వెనుకబడిపోయింది. తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి పుంజుకున్నట్లుగా కనిపించింది. ప్లే ఆఫ్స్ ఆశలు చిగురించిన ఈ తరుణంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మళ్లీ రేసులో వెనుకబడింది.
చెపాక్ స్టేడియంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచిన సూపర్ కింగ్స్... 'అవే' మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆదే ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది.
ఈ సీజన్‌లో సీఎస్కే అనుకున్నట్లుగా రాణించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బలమైన జట్టుగా పేరున్న సీఎస్కే వెనుకబడటానికి దారి తీసిన 5 ముఖ్య కారణాలేమిటో చూద్దాం.
1. గాయాలు
కీలక ఆటగాళ్ల గాయాల వల్ల ఈ సీజన్‌లో సీఎస్కే తీవ్రంగా నష్టపోయింది. జట్టు కీలక బౌలర్ నాథన్ ఎల్లిస్, సీజన్ ప్రారంభానికి ముందే గాయంతో దూరమయ్యాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. డెవాల్డ్ బ్రెవిస్ గాయపడటంతో మొదటి 3 మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.
సీజన్ ప్రారంభమైన తర్వాత కొంతమంది ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం జట్టుపై మరింత ప్రభావం చూపింది. వన్ డౌన్‌లో మంచి ఇంపాక్ట్ చూపిస్తున్న ఆయుష్ మాత్రే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో గాయపడి టోర్నీకే దూరమయ్యాడు. సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టడానికి ఆయుష్ మాత్రే ఆడిన అగ్రెసివ్ ఇన్నింగ్స్ ప్రధాన కారణం. సరైన సమయంలో అతను దూరం కావడం జట్టుకు పెద్ద లోటుగా మారింది.
ఆయుష్ మాత్రే తర్వాత జేమీ ఓవర్టన్ గాయపడటంతో జట్టు మరింత కుదేలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఓవర్టన్, ఫీల్డ్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో ప్రభావం చూపించాడు. గాయం కారణంగా అతను దూరం కావడం సీఎస్కే ఆల్‌రౌండర్ విభాగాన్ని దెబ్బ తీసింది. బౌన్స్‌కు సహకరించే పిచ్‌లపై ఓవర్టన్ తన ఆటతో కచ్చితంగా తేడా చూపించగలిగేవాడు. ఓవర్టన్ ఆడని 4 మ్యాచ్‌ల్లో సీఎస్కే మూడింటిలో ఓడిపోయింది.
వీరే కాకుండా ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. వరుసగా ఆటగాళ్లు గాయపడటం, దానివల్ల జట్టులో తరచుగా మార్పులు చేయాల్సి రావడం సీఎస్కే స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
2. బ్యాటింగ్‌లో నిలకడ లేమి
ఈ సీజన్ ఆరంభంలో సీఎస్కేకు బౌలింగ్ విభాగమే బలహీనంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ, చాలా మ్యాచ్‌ల్లో బ్యాటింగే వారి ప్రధాన సమస్యగా కనిపించింది. ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో సీఎస్కే 127 పరుగులకు, చివరి మ్యాచ్‌లో 140 పరుగులకే ఆలౌట్ కావడం వారి బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తుంది. చాలా మ్యాచ్‌ల్లో వారి బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది.
చెన్నై తరఫున ఈ సీజన్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా స్థిరమైన ప్రదర్శన కనబరచలేదు. ఈ మొత్తం సీజన్‌లో ఆ జట్టు తరఫున 300 కంటే ఎక్కువ రన్స్ చేసింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. సంజూ శాంసన్ 477 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 337 పరుగులు చేశారు. అందులోనూ రుతురాజ్ గైక్వాడ్ స్ట్రయిక్ రేట్ (123.44) కారణంగా అభిమానులు, విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
మిడిలార్డర్‌లో కార్తీక్ శర్మ మినహా ఇంకెవరూ స్థిరంగా రాణించలేదు. టోర్నీ మొత్తంలో 270 పరుగులు మాత్రమే చేసిన శివమ్ దూబే ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు.11 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్ 18.88 సగటుతో 151 పరుగులే చేశాడు. ప్రశాంత్ వీర్, సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్ వంటి ఆటగాళ్లలో ఎవరూ కూడా ఆశించిన ప్రభావాన్ని చూపలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సీజన్‌లో బెస్ట్ బ్యాటర్‌గా నిలిచిన సంజూ శాంసన్ కూడా అన్ని మ్యాచ్‌ల్లోనూ రాణించలేదు. ఈ సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన అతను 7 మ్యాచ్‌ల్లో 11 కంటే తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. అన్నింటికంటే ముఖ్యంగా అతను ఆడిన14 మ్యాచ్‌ల్లో కేవలం 4 సార్లు మాత్రమే పవర్‌ప్లే ముగిసేంతవరకు క్రీజులో నిలబడగలిగాడు. ఇలా జట్టులోని ప్రధాన బ్యాటర్లందరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
3. బౌలింగ్ కూర్పులో లోపాలు
నిజానికి ఈ పొరపాటు వేలం సమయంలోనే జరిగింది. ఇతర జట్లలో ఉన్నట్లుగా ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను కొనడంలో సీఎస్కే మేనేజ్‌మెంట్ విఫలమైంది. మెగా వేలంలో బడ్జెట్ అంతా స్పిన్నర్లకే ఖర్చు పెట్టింది. ఫాస్ట్ బౌలింగ్‌పై వారు అంతగా దృష్టి సారించలేదు. పైగా, ప్రధాన పేసర్ నాథన్ ఎల్లిస్ కూడా గాయపడటంతో సీఎస్కే ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత బలహీనపడింది.
దాదాపు అన్ని జట్లలోనూ కనీసం ఒకరు లేదా ఇద్దరు ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్‌సీబీలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్; గుజరాత్ టైటాన్స్‌లో కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్; సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కమిన్స్, రాజస్థాన్ రాయల్స్‌లో జోఫ్రా ఆర్చర్, దిల్లీ క్యాపిటల్స్‌లో మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి ఇలా జాబితా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ, సూపర్ కింగ్స్‌లో ఇలా చెప్పుకోదగ్గ పెద్ద ఆటగాళ్ల పేర్లు లేవు. ఇది వారికి పెద్ద మైనస్‌గా మారింది.
ఇతర జట్లలోని ప్రధాన పేసర్లు, పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టారు. వికెట్లు పడగొట్టారు. కానీ సూపర్ కింగ్స్‌కు ఇది సాధ్యం కాలేదు. అన్షుల్ కాంభోజ్ 21 వికెట్లు తీసినప్పటికీ అవి కొత్త బంతితో తీసినవి కాదు. అతని వికెట్లలో ఎక్కువ భాగం డెత్ ఓవర్లలో వచ్చినవే.
అదేవిధంగా స్పిన్ బౌలింగ్ విభాగం కూడా మునుపటిలా ప్రత్యర్థులను వణికించలేక పోయింది. గత సీజన్‌లో 24 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ ఈసారి 13 వికెట్లే తీశాడు. సీఎస్కే ఈ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌ల్లోనే అకీల్ హుస్సేన్‌ను బరిలోకి దించింది. ప్రశాంత్ వీర్ చాలా తక్కువ ఓవర్లు వేశాడు. మరో స్పిన్నర్ నుంచి సహకారం లేకపోవడంతో నూర్ అహ్మద్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
4. ఫీల్డింగ్ పేలవం
ఈ సీజన్‌లో ఎక్కువ క్యాచ్‌లు వదిలేసిన జట్ల జాబితాలో సీఎస్కే మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు మొత్తం 23 క్యాచ్‌లను వదిలేసింది. మ్యాచ్‌లలో కనీసం ఒక్క క్యాచ్ అయినా వదిలేసిన ఆటగాళ్లు 12 మంది ఉన్నారు. సంజూ శాంసన్, శివమ్ దూబే ఇద్దరూ గరిష్టంగా చెరో 3 క్యాచ్‌లు వదిలేశారు.
ఈ సీజన్‌లో అన్ని జట్లకు ఫీల్డింగ్ సమస్యగానే కనిపించింది. అయితే, బౌలింగ్ విభాగం పటిష్టంగా లేని జట్టు, ఫీల్డింగ్‌లో వచ్చే అవకాశాలను సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. ఫీల్డింగ్ కూడా సరిగా చేయలేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది.
దూబే వరుసగా క్యాచ్‌లు వదిలేయడంతో ఒకానొక దశలో అతడిని సబ్‌స్టిట్యూట్ (ఇంపాక్ట్ ప్లేయర్)గా మార్చింది. సబ్‌స్టిట్యూట్ లిస్ట్‌లో ఉన్న అతనికి ఒక్కో మ్యాచ్‌లో అసలు ఏ రకంగానూ ఫీల్డ్‌లో దిగే అవకాశం రాలేదు.
5.పెద్ద జట్లతో ఆడేటప్పుడు తడబాటు
ఒక జట్టు ప్లే-ఆఫ్స్ రౌండ్‌కు చేరుకోవాలంటే, అన్ని జట్లపై స్థిరమైన ప్రదర్శన ఇవ్వాలి. ముఖ్యంగా బలమైన జట్లపై గెలవాలి. సీఎస్కే ఈ సీజన్‌లో అలా చేయలేకపోయింది.
ఈ సీజన్‌లో చెన్నై సాధించిన 6 విజయాలు పాయింట్ల పట్టికలో చివరి 5 స్థానాల్లో ఉన్న జట్లపై వచ్చినవే. సీఎస్కే ఎదుర్కొన్న 8 ఓటములలో ఏకంగా 7 ఓటములు టాప్ 5 స్థానాల్లో ఉన్న జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లోనే వచ్చాయి.
టాప్ 5 జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటములు కూడా చాలా పెద్ద మార్జిన్‌తో వచ్చాయి. ఆర్‌సీబీపై 43 పరుగుల తేడాతో ఓటమి, టైటాన్స్‌పై 89 రన్స్, 8 వికెట్ల తేడా చొప్పున, రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఎదుర్కొన్న ఓటములు దీనికి నిదర్శనం. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లు మినహా, సీఎస్కే ఓడిపోయిన అన్ని మ్యాచ్‌లూ భారీ ఓటములే.
ఆయా మ్యాచ్‌ల్లో సీఎస్కే తమ సహజసిద్ధమైన పోరాట పటిమను చూపించలేదని అభిమానులు, విశ్లేషకులు పలు సందర్భాల్లో విమర్శించారు. ఓడిన ఈ మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి రెండింటిలోనైనా వారు పోరాడి గెలిచి ఉంటే సీజన్‌ను సీఎస్కే మరోలా ముగించి ఉండేదేమో అని వారు అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)