‘‘ఓ మగ గొంతు ఇచ్చిన ఆదేశాలతోనే ముగ్గురు పిల్లలను చంపేసినట్టు నా భార్య చెప్పింది’’

మసాచుసెట్స్ మహిళ, పాట్రిక్ క్లాన్సీ, లిండే, ముగ్గురు పిల్లలను చంపిన తల్లి

ఫొటో సోర్స్, The Boston Globe via Getty Images

ఫొటో క్యాప్షన్, కేసు విచారణ సమయంలో ముఖాన్ని దాచుకుంటున్న లిండ్సే క్లాన్సీ
    • రచయిత, బ్రాండన్ డ్రెనన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలో ఆత్మహత్యాయత్నం, తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసే వివరాలు ఉన్నాయి)

తన ముగ్గురు పిల్లలు హత్యకు గురైన రోజు నాటి సంఘటనలను తండ్రి పాట్రిక్స్ క్లాన్సీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన పడకగదిలో ‘‘ఎక్కడ చూసినా రక్తం’ కనిపించిందని చెప్పారు. పిల్లలను చంపారనే కేసులో పాట్రిక్ క్లాన్సీ భార్య విచారణ ఎదుర్కొంటున్నారు.

ఈ కేసుకు సంబంధించి క్లాన్సీ బుధవారం కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఆ రోజు ఇల్లు వింతగా ప్రశాంతంగా ఉందని, బెడ్‌రూమ్ తలుపు లాక్ చేసి ఉండటం చూసి ‘‘ఏదో ఘోరం జరిగిందని నాకు అర్ధమైంది’’ అని ఆయన తెలిపారు.

ఆయన భార్య లిండ్సే రెండో అంతస్తు కిటికీలోంచి కిందకు దూకడంతో, ఆమె పెరట్లో పడి ఉండటం చూశానని తెలిపారు. ఆమె మణికట్టుపై లోతైన గాయాలు, మెడపై ఎర్రటి గీత ఉన్నాయని వివరించారు.

జనవరి 2023లో తమ ఇంట్లోని బేస్‌మెంట్‌లో ఫిట్‌నెస్ బ్యాండ్‌లతో పిల్లలను ఉరివేసి చంపిన తర్వాత లిండ్సే ఈ పని చేసిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. కానీ ఆమె తాను దోషిని కానని కోర్టులో వాదించారు.

ఐదేళ్ల కోరా, మూడేళ్ల డాసన్, ఎనిమిది నెలల కల్లాన్ మరణాలకు కారణమైనందుకు లిండ్సే క్లాన్సీపై మూడు ఫస్ట్-డిగ్రీ హత్య కేసులు నమోదయ్యాయి.

ఆ సమయంలో ఆమె "తీవ్ర మానసిక రుగ్మతతో బాధపడుతోందని" ఆమె న్యాయవాదుల బృందం కోర్టులో వాదించింది. కానీ ఆమె ఆ హత్యలు చేసిందనే విషయాన్ని వారు తిరస్కరించలేదు.

పైనుంచి కిందకు దూకడం వల్ల పక్షవాతం వచ్చి వీల్‌చైర్‌కే పరిమితమైన లిండ్సే, తన మాజీ భర్త సాక్ష్యం ఇచ్చిన రెండు రోజులు కోర్టుకు హాజరయ్యారు. బుధవారం ఆయన సాక్ష్యం చెబుతున్నప్పుడు ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కోర్టు కెమెరా దృశ్యాలలో, ఆమె తన న్యాయవాది చేతిని పట్టుకుని, ముఖం కనిపించకుండా పక్కకు తిప్పుకుని, కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మసాచుసెట్స్ మహిళ, పాట్రిక్ క్లాన్సీ, లిండే, ముగ్గురు పిల్లలను చంపిన తల్లి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్ సుపీరియర్ కోర్టులో సాక్షుల బోనులో పాట్రిక్ క్లాన్సీ.

ఆ రోజు ఏం జరిగిందంటే..

పాట్రిక్ క్లాన్సీ మాజీ భార్య తన పిల్లలను చంపడానికి ముందుస్తు ప్రణాళిక వేసుకుందని 12 మంది సభ్యుల జ్యూరీకి నిరూపించడానికి, ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ఆయనను ప్రాసిక్యూటర్లు వివరంగా ప్రశ్నించారు.

2023 జనవరి 24న తాను మసాచుసెట్స్‌లోని డక్స్‌బరీలో ఉన్న తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆహారం తీసుకొని, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు క్లాన్సీ గుర్తుచేసుకున్నారు.

ఇల్లు "ఒక వింతైన ప్రశాంతం"గా ఉండటంతో, ఆయన బేస్‌మెంట్‌తో సహా పలు గదులను పరిశీలించి, ఆ తర్వాత పై అంతస్తుకు వెళ్లి బెడ్‌రూమ్ తలుపు లాక్ చేసి ఉండటం గమనించారు.

బెడ్‌రూమ్ లోపల "ఎక్కడ చూసినా" రక్తం కనిపించిందని క్లాన్సీ చెప్పారు.

మసాచుసెట్స్ మహిళ, పాట్రిక్ క్లాన్సీ, లిండే, ముగ్గురు పిల్లలను చంపిన తల్లి

ఫొటో సోర్స్, The Boston Globe via Getty Images

ఫొటో క్యాప్షన్, తన ముగ్గురు పిల్లల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న లిండ్సే క్లాన్సీ.

ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు

ప్రాసిక్యూటర్లు బెడ్‌రూమ్ ఫోటోలను చూపించి, గోడలపై లేదా బెడ్ షీట్లపై రక్తం లేదనే విషయాన్ని ధ్రువీకరించాలని క్లాన్సీని ప్రశ్నించారు.

"అవును, ఆ గోడలపై, బెడ్ షీట్లపై లేదు" అని ఆయన సమాధానమిచ్చారు.

ఈ తరహా ప్రశ్నల ద్వారా లిండ్సే క్లాన్సీ ఆత్మహత్యాయత్నం నిజమైనదా, కాదా అనే అనుమానాన్ని ప్రాసిక్యూషన్ వ్యక్తంచేసే ప్రయత్నం చేసింది.

ఈ కేసు ప్రధాన ప్రాసిక్యూటర్ జెన్నిఫర్ స్ప్రాగ్ 2024లో జరిగిన ప్రాథమిక విచారణ సందర్భంగా మాట్లాడుతూ, మణికట్టుపై ఉన్న గాయాలు 'చిన్న గీతలు' మాత్రమేనని, ఆమె పైనుంచి దూకలేదని, ఇంటి గోడ పక్క నుంచి 'కిందకు జారారని' చెప్పారు.

మసాచుసెట్స్ మహిళ, పాట్రిక్ క్లాన్సీ, లిండే, ముగ్గురు పిల్లలను చంపిన తల్లి

ఫొటో సోర్స్, Boston Herald vía Getty

ఫొటో క్యాప్షన్, మరణించిన పిల్లల జ్ఞాపకార్థం క్లాన్సీ ఇంటి వెలుపల బొమ్మలను ఉంచిన పొరుగువారు.

బేస్‌మెంట్‌లో భయానక దృశ్యాలు

బెడ్‌రూమ్‌లో రక్తం చూసిన తర్వాత తాను కిందకు పరిగెత్తి, బయటకు వెళ్లానని పాట్రిక్ క్లాన్సీ ఆ రోజు సంఘటనలను గుర్తుచేసుకుంటూ చెప్పారు. అక్కడ ఆయన భార్య మణికట్టు, మెడపై గాయాలతో కింద పడి ఉండటం చూసి, వెంటనే అత్యవసర సేవల సిబ్బందికి ఫోన్ చేసినట్లు తెలిపారు.

ఆ గాయాల తీవ్రత గురించి క్లాన్సీని ప్లైమౌత్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెన్నిఫర్ స్ప్రాగ్ ప్రశ్నించారు. లిండ్సే గాయాల నుంచి రక్తం రాకుండా అణచి ఉంచాల్సిన అవసరం లేదని తానే అత్యవసర సేవల సిబ్బందికి చెప్పిన విషయాన్ని ధ్రువీకరించాలని కోరగా, ఆయన అవునని అంగీకరించారు.

అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్న తర్వాత, పిల్లలు బేస్‌మెంట్‌లో ఉన్నారని భార్య చెప్పడంతో తాను వెంటనే అక్కడికి పరిగెత్తానని క్లాన్సీ చెప్పారు. తాను బేస్‌మెంట్‌కు వెళ్లినప్పుడు, మొదట తన ఐదేళ్ల కుమార్తె కోరా కనిపించిందని ఆయన సాక్ష్యం ఇచ్చారు. వ్యాయామం చేసే బ్యాండ్ గురించి క్లాన్సీ ప్రస్తావిస్తూ, "ఆమె మెడ చుట్టూ ఒక బ్యాండ్ ఉంది, ఆమె బోర్లా పడి ఉంది" అన్నారు.

వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ బ్యాండ్ తొలగించడానికి ప్రయత్నించినట్లు, అయితే ఆ సమయంలో పాపలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు.

ఆ తర్వాత ఆమె పక్కనే మెడకు ఎక్సర్‌సైజ్ బ్యాండ్ చుట్టి ఉన్న ఎనిమిది నెలల కల్లాన్‌ను చూశానని చెప్పారు. ఆపై తాను మూడేళ్ల డాసన్ కోసం వెతకగా, తన ఆఫీస్ గదిలో మెడకు బ్యాండ్ చుట్టి ఉన్న బాలుడు కనిపించాడని క్లాన్సీ తెలిపారు

"అతడు ఇక లేడని నాకు అర్థమైంది" అని క్లాన్సీ చెప్పారు.

ప్రథమ చికిత్స సిబ్బంది వచ్చే చూసే వరకు తాను పిల్లల మధ్య 'అటు ఇటు తిరుగుతూ' వారికి సీపీఆర్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

ఈ ఘటన జరిగిన దాదాపు వారం తర్వాత, పిల్లలను చంపమని 'ఒక పురుషుడి వాయిస్' తనకు ఆదేశాలు ఇచ్చిందని తన భార్య చెప్పినట్లు క్లాన్సీ కోర్టుకు వివరించారు. ఇలాంటి తీవ్ర మానసిక జబ్బు (సైకోసిస్) ఒకటి ఉంటుందనే విషయం ఈ ఘటనకు ముందు తనకు అస్సలు తెలియదని ఆయన చెప్పారు.

పిల్లల రక్తంతో తడిసిన దుస్తులతో సహా ఇతర ఆధారాలను ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించారు. ఆపై క్లాన్సీ, అత్యవసర సేవల సిబ్బంది మధ్య జరిగిన 911 ఫోన్ కాల్ రికార్డింగ్‌ను ప్లే చేయడంతో లిండ్సే క్లాన్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కోర్టు విరామం ప్రకటించడానికి ముందు, ఆమె తల దించుకుని గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ప్రాసిక్యూటర్లు మరికొంత మంది సాక్షులను విచారణకు పిలవనున్నారు. ఈ విచారణ కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు.

ఒకవేళ నేరం రుజువైతే, లిండ్సే క్లాన్సీకి పరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

హెల్ప్‌లైన్ నంబర్లు

(మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే, దిగువన ఉన్న హెల్ప్‌లైన్‌ల ద్వారా మీకు అవసరమైన సహాయం పొందవచ్చు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

అంతేకాకుండా, మీరు తీవ్ర మానసిక ఆవేదన లేదా నిరాశతో బాధపడుతూ సహాయం కోరుతుంటే, ఆరోగ్య నిపుణులను లేదా సహాయం అందించే సంస్థను సంప్రదించవచ్చు. వివిధ దేశాలలో అందుబాటులో ఉన్న సహాయ కేంద్రాల వివరాల కోసం 'బిఫ్రెండర్స్ వరల్డ్‌వైడ్' వెబ్‌సైట్ www.befrienders.org సందర్శించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)