అమెరికా: జన్మతః పౌరసత్వ హక్కు రద్దుపై ట్రంప్ ఉత్తర్వులను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో జన్మహక్కు ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది.
అమెరికాలో జన్మించిన శిశువులకు సహజంగా అమెరికా పౌరసత్వం కల్పించే 150 ఏళ్లనాటి న్యాయ ఉదంతాన్ని 6 -3 మెజార్టీతో ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు సమర్థించారు.
అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన శిశువులకు ఈ జన్మతఃపౌరసత్వాన్ని నిలిపివేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేశారు.


ఫొటో సోర్స్, Getty Images
'అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే'
అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు, అమెరికా రాజ్యాంగం ప్రకారం 'పుట్టుకతోనే పౌరులు' అవుతారని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు.
ఈ తీర్పులో ఆయన 14వ రాజ్యాంగ సవరణ చరిత్రను ప్రస్తావించారు. అమెరికా అంతర్యుద్ధం తర్వాత, ఇక్కడే జన్మించి బానిసత్వం నుంచి విముక్తి పొందిన మాజీ బానిసల పౌరసత్వ సమస్యను పరిష్కరించడానికి అప్పట్లో ఈ సవరణనుతీసుకువచ్చారు.
"అప్పుడు, ఇప్పుడు కూడా పౌరసత్వం అనేది హక్కులను పొందే ఒక హక్కు. మన రాజకీయ వ్యవస్థలో స్వేచ్ఛగా భాగస్వామ్యం పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 14వ సవరణను రూపొందించిన వారు ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తికీ ఆ హక్కు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈరోజు ఆ వాగ్దానాన్ని మేం నిలబెడుతున్నాం" అని రాబర్ట్స్ తన తీర్పులో పేర్కొన్నారు.
కాగా, ఈ తీర్పును విభేదించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ శామ్యూల్ అలిటోలు ఉన్నారు.
తాను ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో ఎదురైన పరాజయంపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంకా స్పందించలేదు. తన రెండో విడత పదవీకాలంలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజే, పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలపై నిషేధాన్ని సమర్థించిన కోర్టు
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొనకుండా రాష్ట్రాలు నిషేధం విధించవచ్చని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
క్రీడల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పరిశీలించింది. ఐడహో, వెస్ట్ వర్జీనియా అనే ఈ రెండు రాష్ట్రాలు... ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల క్రీడా బృందాలు పుట్టుకతో నమోదైన లింగం ఆధారంగానే పోటీ పడాలని చట్టాలు తీసుకువచ్చాయి.
ఈ నిషేధం అమెరికా రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుల రక్షణను ఉల్లంఘిస్తోందని ఒక పిటిషన్ వాదించగా, ఇది పౌర హక్కుల చట్టాలకు విరుద్ధంగా ఉందని మరొక పిటిషన్ పేర్కొంది.
2020లో ఐడహో రాష్ట్రం ఈ నిషేధాన్ని చట్టబద్ధం చేసినప్పటి నుంచి, ఇప్పటివరకు రెండు డజన్ల కంటే ఎక్కువ రాష్ట్రాలు ఇటువంటి నిషేధ చట్టాలను అమలు చేశాయి.
మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లపై నిషేధాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డోనల్డ్ ట్రంప్ 'ట్రూత్ సోషల్' లో స్పందిస్తూ, "మహిళల క్రీడల్లో పురుషులు పాల్గొనడానికి వీల్లేదని అమెరికా సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పునిచ్చింది. వావ్! దీనితో ఆ వింత పరిస్థితికి తెరపడింది" అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























