‘ఇరాన్‌పై ఈ రాత్రి భారీ దాడి’.. ట్రంప్ హెచ్చరిక

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ముగిసిపోయిందని ప్రకటించిన కొద్ది గంటలకే, ఈ రాత్రి ఇరాన్‌పై భారీ దాడి చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

తుర్కియేలో జరిగిన నేటో శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ, "మేం మంగళవారం రాత్రి వారిపై చాలా శక్తిమంతమైన దాడి చేశాం, చాలా బలమైనది" అన్నారు.

భవిష్యత్తులో జరిగే దాడుల్లో ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలైన వంతెనలు, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంట్లను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తీరానికి దూరంగా ఉన్న దాని ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్ ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్పారు. తెహ్రాన్ ఏమీ చేయలేదన్నారు.

"నా ఉద్దేశం కేవలం అక్కడ అధికార మార్పిడి చేయడం గురించే కాదు" అని ట్రంప్ చెప్పారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముగించే దిశగా అమెరికా చాలా పురోగతి సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై ఇరాన్ మధ్యప్రాచ్యంలో బెదిరింపులకు పాల్పడే దేశం కాబోదన్నారు.

ట్రంప్ వైఖరిలో మార్పు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

మధ్యమధ్యలో ఘర్షణలు తలెత్తినప్పటికీ, చర్చలు ముందుకు సాగుతున్నాయని, విజయవంతం అవుతాయని కొన్నివారాలుగా ఆశాభావం వ్యక్తమైంది. కానీ, ఈ వివాదంలో ఇక తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసిందనే భావనకు ట్రంప్ వచ్చినట్లు అనిపిస్తోంది.

ఈ రాత్రి నుంచే ప్రారంభమయ్యేలా, సుదీర్ఘ కాలం పాటు మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశాలను ట్రంప్ తోసిపుచ్చలేదు.

"ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను వారి పట్ల సంతోషంగా లేను'' అని ట్రంప్ మీడియాతో అన్నారు.

ఒకవేళ చర్చలు పూర్తిగా విఫలమై, కాల్పుల విరమణ ముగిసిపోతే అమెరికా అంతర్గత రాజకీయాల్లో పరిస్థితులు ట్రంప్‌కు కష్టంగా మారవచ్చు. ఆయన సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు మొదటి నుంచీ ఈ యుద్ధం పట్ల అసంతృప్తితో ఉన్నారు.

కాల్పుల విరమణను పొడిగించే 14 సూత్రాల ఒప్పందం వల్ల అసలు అమెరికాకు దక్కింది ఏమిటని, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతుందని తెహ్రాన్‌ను నమ్మవచ్చా అని కొందరు నాయకులు బహిరంగంగానే ప్రశ్నించారు.

ఒకవేళ మళ్లీ యుద్ధం మొదలైతే, క్యాపిటల్ హిల్‌లోని కొందరు ఎంపీల దృష్టిలో తమ అనుమానాలే నిజమని నిరూపితమవుతుంది.

'వారితో మాట్లాడటం సమయం వృథా'

అంతకుముందు, డోనల్డ్ ట్రంప్ ఇరాన్ గురించి మాట్లాడుతూ, ''నా ఉద్దేశంలో ఇది ముగిసిపోయింది. నేను ఇకపై వారితో డీల్ చేయాలనుకోవడం లేదు. వారు మానసిక రోగులు. వారిని నడిపిస్తున్న నాయకులు కూడా మానసిక రోగులే" అని వ్యాఖ్యానించారు.

ఇరుపక్షాల ప్రతినిధులు కావాలనుకుంటే చర్చలు జరుపుకోవచ్చని, అయితే 'వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని' అన్నారు.

"స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో మాట్లాడతాను" అని ట్రంప్ ముందుకు సాగారు.

అయితే "చర్చల టేబుల్ ముందుకు రావడం అనేది తెహ్రాన్ పైనే ఆధారపడి ఉంది" అని ట్రంప్ అన్నారు.

మరో ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు సమాధానమిస్తూ, "వారి వద్ద అణు ఆయుధాలు ఉండకూడదనే విషయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారు. మేం ఒక ఒప్పందానికి వచ్చాం, కానీ ఆ తర్వాత అలాంటి చర్చలేవీ జరగలేదనేలా వారు మీడియా ముందు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు" అన్నారు.

ఇరాన్, అమెరికా మధ్య పరస్పర దాడులు జరిగిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరికొకరు ఉల్లంఘించారంటూ ఇరు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)