‘ఏఐతో జీవాయుధాల తయారీకి ప్రయత్నం’.. అడ్డుకున్నామన్న ఆంథ్రోపిక్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నార్డిన్ సాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఏఐ మోడల్‌ను జీవాయుధాలు, సంప్రదాయ ఆయుధాల తయారీ కోసం ఉపయోగించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ తెలిపింది.
ఆంథ్రోపిక్ తాజా హెచ్చరిక రిపోర్ట్ ప్రకారం, రష్యా, ఇరాన్ సైబర్ ముఠాలతో సంబంధం ఉన్న వారు క్లాడ్‌ను ఉపయోగించారు.
గత 8 నెలల్లో ఫేక్ డేటింగ్ యాప్స్, హోటల్ వైఫై పేరుతో సైబర్ మోసాలు పెరిగినట్టు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు కూడా ఏఐను వాడుతున్నట్టు కేసులు తెలియజేస్తున్నాయి.
ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆంథ్రోపిక్‌లో ఉన్నత పరిశోధకుడు చెప్పిన తర్వాత ఇప్పుడు జీవాయుధాల విషయం వెలుగులోకి వచ్చింది.

'జీవాయుధాలపై చైనా, రష్యా హ్యాకర్ల కన్ను'
క్లాడ్ శక్తి సామర్థ్యాలను కాపీ చేసేందుకు చైనాకు చెందిన కంపెనీలు ప్రయత్నిస్తున్నట్టు ఆంథ్రోపిక్ ఆరోపించింది.
ఆంథ్రోపిక్ తన తాజా థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ను గురువారం విడుదల చేసింది.
అందులో "మా సేవలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది" అని పేర్కొంది.
ఆంథ్రోపిక్ విడుదల చేసిన రిపోర్టులో చాలా కేసులను పేర్కొంది.
దేశాల మద్దతుతో నడుస్తున్నట్టు భావించే సంస్థలు, సైబర్ నేరగాళ్లు, స్పైవేర్ కంపెనీలు, ప్రభుత్వ ప్రచార సంస్థలు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది.
డిసెంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు క్లాడ్‌లోని హైకు, సోనెట్, ఓపస్ మోడళ్లను విస్తృతంగా దుర్వినియోగానికి యత్నించారని, వాటిని అడ్డుకున్నామని ఆ సంస్థ వివరించింది.
క్లాడ్‌లో అత్యంత భద్రత కలిగి ఉన్న టాప్ మోడల్స్ ఏవీ కూడా దుర్వినియోగానికి వీలుపడలేదని స్పష్టం చేసింది.
అందుకే నిపుణుల ద్వారా ఆ మోడల్స్‌ను కాపీ కొట్టేందుకు ప్రయత్నాలు చేశారని వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రిపోర్టులో కేసుల వివరణ
తమ ఏఐ టెక్నాలజీని వినియోగించి జీవాయుధాల తయారీతోపాటు సైబర్ నేరాలకు, వాటిని ప్రభావితం చేసే కార్యకలాపాలకు, నిఘా కోసం, స్కామ్‌లు చేసేందుకు, ఇతర ఆయుధాల తయారీకి యత్నించిన శాస్త్రవేత్తలను బ్లాక్ చేసినట్టు ఆంథ్రోపిక్ తెలిపింది.
"ఏఐ మోడల్‌ను ఉపయోగించి జీవాయుధాల తయారీకి యత్నించిన ఐదు కేసుల"గురించి ఆంథ్రోపిక్ హైలైట్ చేసింది.
"ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఈ బయోలాజికల్ దుర్వినియోగం, సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా సామర్థ్యాలు అందిస్తే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు" అని ఆంథ్రోపిక్ తెలిపింది.
"మంచి పని కోసం.. ఉదాహరణకు టీకాల తయారీ లేదా వ్యాధుల నివారణకు ఉపయోగించిన సమాచారాన్ని జీవాయుధాల తయారీకి ఉపయోగించవచ్చు" అని ఆంథ్రోపిక్ తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడిన ఆంథ్రోపిక్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి జాకబ్ క్లైన్ " ఏఐ నియంత్రణ చాలా సంక్లిష్టమైన అంశం" అని అభిప్రాయపడ్డారు.
"మీరు కామిక్ బుక్‌లో చూసినట్టు, అందర్నీ చంపేయడానికి నాకు జీవాయుధం ఇవ్వు, అనేంత సులభంగా ఉండదు " అని తెలిపారు.
ప్రమాదకరమైన కోడ్స్ రాసుకుంటున్నట్టు రిపోర్టు
తుపాకులు, క్షిపణులు, డ్రోన్లు, బాంబులు, ఇతర మందుగుండు సామగ్రి సహా సంప్రదాయ ఆయుధాల తయారీ, లక్ష్యాల నిర్ధారణ, నియంత్రణ వ్యవస్థల కోసం కూడా క్లాడ్‌ను ఉపయోగించిన ఆరు కేసుల గురించి ఆంథ్రోపిక్ రిపోర్ట్ చెబుతోంది.
సైబర్ నేరగాళ్లు, ప్రభుత్వ మద్దతు కలిగిన హ్యాకర్లు తమ పనికి మరింత సహాయం కోసం ఎక్కువగా ఏఐ సాంకేతికతను వాడుతున్నట్టు రిపోర్టు తెలియజేస్తోంది.
హ్యాకింగ్ గ్రూప్ షైనీహంటర్స్‌తోపాటు, చైనాకు చెందిన ల్యాబ్‌ల పేర్లు కూడా ఈ రిపోర్టులో ఉన్నాయి.
రష్యా ప్రభుత్వ మద్దతు ఉందనే అనుమానాలు ఉన్న మిడ్‌నైట్ బ్లిజార్డ్ అనే హ్యాకింగ్ కంపెనీ సెక్యూరిటీ వ్యవస్థలను దాటుకొని మాల్‌వేర్ తప్పించుకొని పని పూర్తి చేసే వరకు కోడ్ రాసుకున్నట్టు వెల్లడించింది.
భవిష్యత్‌లో ఇలాంటి కార్యకలాపాలను మరింత సమర్థంగా అడ్డుకోవడానికి, గుర్తించడానికి, నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఈ కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ పేర్కొంది.
అవసరమైన చోట అధికారులతో, పరిశ్రమ భాగస్వాములతో ఈ సమాచారాన్ని పంచుకున్నట్టు కూడా ఆంథ్రోపిక్ తెలిపింది.
నిదానంగా పని చేయాలని సూచిస్తున్న శాస్త్రవేత్తలు
ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ సాంకేతికత మానవులను అంతం చేసే అవకాశం పది శాతం కంటే ఎక్కువగా ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు చెప్పిన తర్వాత ఈ ఏడాది వచ్చిన తొలి రిపోర్టు ఇది.
'పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేసే వరకు పరిశ్రమ కాస్త వెనక్కి తగ్గితే మేలు' అని ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకల్ పచోకి సెప్టెంబర్ 6న రాసిన వ్యాసంలో తెలిపారు.
"వేగవంతమైన మెషిన్ ఇంటెలిజెన్స్ పెరుగుదలతో వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నదే నా ఆందోళన" అని పచోకి చెప్పారు.
చాట్‌జీపీటీ తయారు చేసిన ఓపెన్ఏఐ నిరంతరం రక్షణ వ్యవస్థలపై పని చేస్తోందని, దీనికి మరిన్ని చర్చలు, చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ హెచ్చరికల వేళ ఏఐ నిపుణులు, భద్రతా పరిశోధకులు, టెక్నాలజీ నిపుణులు బ్రిటన్ ప్రధానమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. సురక్షితమైన ఏఐ అభివృద్ధి వ్యవస్థ, సూపర్ ఇంటెలిజెన్స్ నియంత్రణ కోసం దేశాల మధ్య సరికొత్త ఒప్పందం అవసరమని లేఖలో కోరారు.

ఫొటో సోర్స్, BBC newsnight
ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్‌ను నిషేధించడానికి, అధునాతన ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని అమెరికా డెమొక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు బెర్నీ శాండర్స్ చట్టసభల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
"మానవాళిపై పెను ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పుడు వేగాన్ని తగ్గించమని చెప్పకపోవడం మూర్ఖత్వమే అవుతుంది" అని ఆయన బీబీసీ న్యూస్ నైట్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























