ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు, షార్క్ చేపల వేట... హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడ్డాయా?

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జూన్ నుంచి హార్ముజ్ జలసంధిని పాక్షికంగా తిరిగి తెరిచారు.
    • రచయిత, నవాల్ అల్-మఘాఫీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

వేసవి ఎండలు మండిపోతున్న ఒక రోజున, మత్స్యకారులు తాము వేటాడి తెచ్చిన చేపలను రేవులో దించుతున్నారు.

ఓ వ్యక్తి తన వలలో చిక్కుకున్న అనేక సొరచేప పిల్లలను గర్వంగా చూపుతున్నారు. స్థానికంగా 'షార్క్ శాండ్‌విచ్' చాలా ఇష్టమైన వంటకమని ఆయన వివరించారు. మరో వ్యక్తి రెండు పెద్ద చేపలను మోటార్‌బైక్‌కు రెండువైపులా కట్టుకుని వెళ్లిపోతున్నారు.

చూడటానికి ఇది ఒక సాధారణ చేపల రేవులాగే అనిపిస్తున్నప్పటికీ, ఈ నౌకాశ్రయం బందర్ అబ్బాస్ నగరంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి తీరాన ఉన్న ఒక ఇరాన్ నగరం.

అలాగే అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇది ప్రధాన వ్యూహాత్మక ప్రాంతం.

ఈ సంఘర్షణలు ప్రారంభమైన తరువాత హార్ముజ్ జలసంధిలోని ఇరాన్‌వైపు యూకేకు చెందిన ఓ ప్రసార సంస్థ జర్నలిస్టులు పర్యటించడం ఇదే తొలిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పుడు, ఇరాన్ పాలకవర్గం ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా దళాల స్థావరాలకు ఆశ్రయమిస్తున్న పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలపై ఎదురుదాడులు చేసింది. తన భౌగోళిక స్థానాన్ని ఇరాన్ తనకు అనుకూలమైన ఒక పెద్ద ఆయుధంగా మార్చుకుంది.

తమ అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి ప్రయత్నించే వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) దాడులు చేయడం ప్రారంభించడంతో ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణం అసాధ్యంగా మారింది.

దీంతో, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నౌకా సిబ్బంది సముద్రంలోనే చిక్కుకుపోయారు. ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల ఇంధనం, విద్యుత్ ఖర్చులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే అనేక రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి.

అమెరికా కూడా ఇరాన్ గల్ఫ్ రేవులను ఉపయోగించే అన్ని నౌకలను లక్ష్యంగా చేసుకుని దిగ్బంధనాన్ని విధించింది. ఫలితంగా, ఈ సముద్ర జలాలు కొన్ని నెలలుగా చేపల వేటకు అత్యంత ప్రమాదకరంగా మారాయి. చాలామంది జాలరులు వేటకు వెళ్లడం మానేశారు. మరికొందరు తాము యుద్ధభూమిలోకి వెళ్తున్నామని తెలిసినా వేటను కొనసాగించారు.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి
ఫొటో క్యాప్షన్, బందర్ అబ్బాస్ పరిసర సముద్ర జలాల్లోకి జాలరులు మళ్లీ వేటకు తిరిగొస్తున్నారు. స్థానికంగా 'షార్క్ శాండ్‌విచ్' చాలా ఇష్టమైన వంటకం.

తిరిగొస్తున్న జాలరులు - బందీ అయిన నౌకలు

అమెరికాతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా, ఈ జలసంధిని ఇరాన్ పాక్షికంగా తిరిగి తెరవడానికి అనుమతించిన కొన్నివారాలకే అక్కడ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సముద్రం మళ్లీ ప్రశాంతంగా మారడంతో జాలరులు వేటకు బయల్దేరుతున్నారు.

యుద్ధం కారణంగా బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో క్షేత్రస్థాయిలో చూపించడానికి అబ్దోల్ రెహమాన్ అనే స్థానిక జాలరి బీబీసీ బృందాన్ని జలసంధి లోపలికి తీసుకువెళ్లారు.

మేం జలసంధి గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఘర్షణలు తీవ్రంగా ఉన్న ఏప్రిల్ నెలలో ఐఆర్‌జీసీ స్వాధీనం చేసుకున్న రెండు కంటైనర్ నౌకలు కనిపించాయి.

అప్పట్లో ఈ నౌకలు "అవసరమైన అనుమతులు లేకుండా ప్రయాణిస్తూ, నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేయడం ద్వారా" సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని ఐఆర్‌జీసీ పేర్కొంది.

ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, పనామా, లైబీరియా దేశాల జెండాలతో ఉన్న 'ఎమ్మెస్సీ ఫ్రాన్సెస్కా' , 'ఎపమినోండాస్' నౌకలను ఇరాన్ ఇంకా విడుదల చేయలేదు.

హార్ముజ్ జలసంధి దాటడానికి ఇరాన్ అధికారుల అనుమతి కోసం సముద్ర తీరానికి దూరంగా వేచి ఉన్న డజన్ల కొద్దీ సరుకు రవాణా నౌకలు కూడా అక్కడ కనిపించాయి.

బందర్ అబ్బాస్ తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్ముజ్ ద్వీపానికి చేరువవుతుండగా, సముద్రానికి అభిముఖంగా ఉన్న ఒక పాత కోటను మా గైడ్ రెహమాన్ చూపించారు.

శతాబ్దాలుగా ఈ జలసంధిపై పట్టు సాధించడానికి జరిగిన పోరాటాలను ఆ కోట ఎర్రటి గోడలు గుర్తుచేస్తాయి. 16వ శతాబ్దం ఆరంభంలో నిర్మించిన ఈ కోట, అప్పట్లో ఈ సముద్ర మార్గంపై పోర్చుగీస్ సామ్రాజ్య అధికారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఆ తర్వాత 1622లో పర్షియా పాలకుడు షా అబ్బాస్-1 పోర్చుగీసు వారిని ఇక్కడి నుంచి వెళ్లగొట్టారు. అప్పటినుంచి ఈ నగరానికి 'బందర్ అబ్బాస్' అనే పేరు వచ్చింది.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, ఈ జలసంధి దాటడానికి అనుమతి కోసం సరుకు రవాణా నౌకలు ఎదురుచూస్తున్నాయి.

వ్యూహాత్మక కేంద్రం

ఇప్పుడు కూడా బందర్ అబ్బాస్ నగరం అంతే వ్యూహాత్మకంగా ఉంది. ఈ జలసంధిలోనే అత్యంత ఇరుకైన ప్రాంతానికి దగ్గరగా, ఇరాన్ దక్షిణ తీరాన ఉన్న ఈ నగరం ఆ దేశ అధికారిక నౌకాదళానికే కాకుండా ఐఆర్‌జీసీ విభాగానికి కూడా ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా మారింది.

సాధారణ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, గ్యాస్ రవాణాలో ఐదో వంతు ఈ జలాల గుండానే సాగుతుంది. ఇది ఈ నగరాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మార్చింది. అంతేకాకుండా, తనకంటే బలమైన శత్రువులతో పోరాడటానికి ఇరాన్ రూపొందించుకున్న 'అసమాన యుద్ధ వ్యూహం' లో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఘర్షణలను మరింత తీవ్రం చేస్తామని పదేపదే హెచ్చరించారు. ఈ జలసంధిని తిరిగి తెరవకపోతే ‘ఇరాన్ అనే దేశమే మిగలదని’ హెచ్చరించారు.

ట్రంప్ బెదిరింపులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తెరవలేదు. అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కోసం ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో తెహ్రాన్‌కు ఇదొక బేరమాడే శక్తి అని విశ్లేషకులు వాదిస్తున్నారు.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

బీబీసీ బృందం బందర్ అబ్బాస్ నగరానికి చేరుకునేసరికి, అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సంకేతాలు కనిపించాయి.

వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నాయి. దుకాణాలు తెరుచుకున్నాయి, రహదారులు మళ్లీ వాహనాలతో నిండిపోయాయి. శతాబ్దాలుగా సముద్ర మార్గం ద్వారా వచ్చే వస్తువులను దక్షిణ ఇరాన్ ప్రాంతాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్న ఇక్కడి మార్కెట్, ఇప్పుడు మళ్లీ ప్రజలతో రద్దీగా మారింది.

అయినప్పటికీ, సమీప ప్రాంతాల్లో యుద్ధం మిగిల్చిన చేదు గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయి.

బందర్ అబ్బాస్ ప్రధాన విశ్వవిద్యాలయం వెనుక వైపు ఉన్న ఖుష్నూది వీధిలోని ఒక అపార్ట్‌మెంట్ భవనం శిథిలమైంది. మార్చి 26న జరిగిన ఇజ్రాయెల్ దాడులు ఈ భవనాన్ని తాకాయి.

ఆ భవనంలో సగం భాగం మాత్రమే నిలిచి ఉండగా, మిగిలిన సగం భాగం కాంక్రీట్ కుప్పలా, వంగిపోయిన ఇనుప చువ్వలతో కనిపిస్తోంది. ఒకప్పుడు కుటుంబాలు నివసించిన పడకగదులు, లివింగ్ రూమ్‌లు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న ఆ భవనంపై ఇరాన్ జెండాలు ఎగురుతున్నాయి.

ఈ భవనంలో కొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ పనిచేసే 40 ఏళ్ల వ్యాపారవేత్త ఫాతిమా, దాడి జరిగిన సమయంలో వేరే ప్రాంతంలో ఉన్నారు.

"ఇక్కడ నివసించిన చాలా కుటుంబాలు నాకు తెలుసు" అని ఆమె చెప్పారు.

"అందులో తల్లులు, పిల్లలు ఉన్నారు. దాడి జరిగినప్పుడు వారంతా నిద్రపోతున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసిస్తున్న సైనిక అధికారి. కానీ, ఇది సైనిక స్థావరం మాత్రం కాదు" అని ఫాతిమా అన్నారు.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, దాడిలో కూలిపోయిన భవనంలోఎన్నో కుటుంబాలు ఉండేవని 40 ఏళ్ల వ్యాపారవేత్త ఫాతిమా చెప్పారు.

ఈ దాడి 'ప్రధాన లక్ష్యం ఐఆర్‌జీసీ నౌకాదళ కమాండర్ అలీరెజా తంగ్సిరి' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఈ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆయన మరణించినట్లు ఇరాన్ ధ్రువీకరించింది.

రెండు క్షిపణులు ఈ భవనాన్ని తాకినప్పుడు ముగ్గురు వ్యక్తులు మరణించారని, ఏడుగురు గాయపడ్డారని ఇరాన్ వార్తాసంస్థ 'ఫార్స్' రిపోర్ట్ చేసింది.

రెడ్ క్రెసెంట్ సమాచారం ప్రకారం, బందర్ అబ్బాస్ రాజధానిగా ఉన్న హోర్ముజ్‌గాన్ ప్రావిన్స్‌లో పౌరులు, సైనిక సిబ్బందితో కలిపి మొత్తం 261 మంది ప్రాణాలు కోల్పోయారు.

సైనిక లక్ష్యాలకు, నివాస గృహాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపేస్తూ, పౌరుల జీవితాలు, సైనిక కార్యకలాపాలు ఎంతలా పెనవేసుకుపోయాయో ఈ దాడి స్పష్టం చేస్తోంది.

ఘర్షణల పర్యవేక్షణ సంస్థ 'ఆర్మ్‌డ్ కాంఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్(ఆక్లెడ్)' సేకరించిన గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8న కాల్పుల విరమణ అమలులోకి వచ్చే మధ్య కాలంలో బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాలలో కనీసం 96 అమెరికా దాడులు జరిగాయి.

వీటిలో మూడో వంతు కంటే ఎక్కువ దాడులు ఐఆర్‌జీసీ వసతులు, క్షిపణి స్థావరాలు, నౌకాదళ ఆస్తులు, బందర్ అబ్బాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైమానిక స్థావరం వంటి సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రాంతాలలో చాలావరకు నివాస పరిసరాలకు సమీపంలోనే ఉన్నాయి.

మిగిలిన దాడులలో ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయనే విషయాన్ని 'ఆక్లెడ్' ధ్రువీకరించలేకపోయింది.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ నియామకం ఇరాన్‌ను విభజించలేదని, పైగా మరింత ఏకం చేసిందని బందర్ అబ్బాస్ మేయర్ మెహదీ నోబానీ వాదించారు.

నాయకత్వం మారినా లొంగని ఇరాన్

యుద్ధ సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సహా ఇరాన్ అగ్రశ్రేణి నాయకుల మృతికి కారణమయ్యాయి. అలాగే సైనిక, ఆర్థిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడంతో పాటు ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశాయి.

అయినప్పటికీ, ఈ యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడిందనే వాదనలను బందర్ అబ్బాస్ మేయర్ తిరస్కరించారు.

మెరిసిపోయే బంగారు మినార్ ఉన్న ఒక ప్రభుత్వ భవనం నుంచి బీబీసీతో మాట్లాడిన మెహదీ నోబానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ, అటు అమెరికా కానీ అధికార మార్పిడితో సహా తమ సైనిక లక్ష్యాలలో దేనినీ సాధించలేకపోయాయని చెప్పారు.

అలాగే అలీ ఖమేనీ కుమారుడైన మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమితులు కావడం ఇరాన్‌ను మరింత ఏకం చేసిందని మేయర్ వాదించారు.

ఒకవేళ ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైతే, "ఇరాన్ కచ్చితంగా హార్ముజ్ జలసంధిని మూసివేస్తుంది" అని మెహదీ నోబానీ చెప్పారు.

మార్కెట్ వద్ద బీబీసీ బృందం సంప్రదించిన చాలామంది ప్రజలు మాట్లాడటానికి ఇష్టపడలేదు. వారందరూ అందుకు గల కారణాలను వెల్లడించనప్పటికీ, ఇరాన్‌ను మీడియా చూపే విధానాన్ని తాము నమ్మడం లేదని కొందరు చెప్పారు.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, బందర్ అబ్బాస్ మార్కెట్‌ను బీబీసీ బృందం సందర్శించిన సమయంలో ఎంతో సందడిగా ఉంది.

ఇటీవలే చైనా నుంచి సొంతూరికి తిరిగొచ్చిన ఒక యువతిని పలకరించగా, ఈ సంక్షోభ సమయంలో కుటుంబంతో కలిసి ఉండాలనే ఇక్కడికి వచ్చానని ఆమె మాతో చెప్పారు

"ఇరానియన్లు ఒకరికొకరు మద్దతుగా నిలవడానికి ఏకమయ్యారు" అని ఆమె చెప్పారు.

ఈ మార్కెట్‌లో దాదాపు అన్ని వస్తువులకూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఉదయం పూట గల్ఫ్ నుంచి తెచ్చిన తాజా చేపలు, దక్షిణ ఇరాన్ ప్రాంత ఖర్జూరాలు, దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పెర్ఫ్యూమ్‌లు, గృహోపకరణాలు, సంప్రదాయ బండారీ దుస్తులు ఇక్కడ ఉన్నాయి.

మార్కెట్ ఇరుకైన సందులో మరికొంత ముందుకు వెళ్లగా, 55 ఏళ్ల ఫాతిమేహ్ పీచ్ పండ్లను అమ్ముతూ కనిపించారు. యుద్ధ సమయంలో తన కుమారుడు ఉద్యోగం కోల్పోయాడని, ప్రస్తుతం తన దుకాణం ద్వారా వచ్చే సంపాదనపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోందని ఆమె మాకు చెప్పారు.

"మాకు యుద్ధం ఇష్టం లేదు. బాంబు దాడులు జరిగినప్పుడు మేం భయపడతాం. ట్రంప్ యుద్ధాన్ని కోరుకున్నారు. ఆయన మాపై ఊహించని విధంగా దాడి చేశారు. మేం దీనిని కోరుకోలేదు" అని ఫాతిమేహ్ అన్నారు.

ఇరాన్, బందర్ అబ్బాస్, ప్రజల జీవితాలు, హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Jack Garland / BBC

ఫొటో క్యాప్షన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పుడు బందర్ అబ్బాస్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని ఫాతిమేహ్ చెప్పారు.

దగ్గరలోనే ఉన్న 40 ఏళ్ల మౌసూమే మా సంభాషణను విని మాతో కలిశారు.

"ప్రతి యుద్ధం సమస్యలను సృష్టిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ మనం ఓపికగా ఉండాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు.

చర్చలు కొనసాగుతున్న తరుణంలో, కాల్పుల విరమణ ఒప్పందానికి పరీక్షలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో హార్ముజ్ జలసంధి మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.

కానీ, ఇక్కడి ప్రజల కష్టాలు వేరే రూపంలో కనిపిస్తున్నాయి. కోల్పోయిన ఉపాధి, బాంబు దాడుల భయంతో గడిపిన రాత్రులు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో... కనీసం ఈ తాత్కాలిక శాంతి అయినా ఇలాగే నిలవాలనే ఆశల నడుమ జీవితాలు వెళ్లదీస్తున్నారు.

అదనపు రిపోర్టింగ్: జాస్మిన్ డయ్యర్

తను అందించే ఏ సమాచారాన్నికూడా బీబీసీ పర్షియన్ సర్వీస్‌లో ఉపయోగించకూడదనే షరతుపై నవాల్ అల్-మగాఫీ తెహ్రాన్ నుంచి ఈ వివరాలను అందించారు. ఈ ఆంక్షలు ఇరాన్‌లో పనిచేసే అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలకు వర్తిస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)