‘109 ఏళ్ల కిందట బ్రిటిష్ వారికి 35,000 రూపాయలు అప్పు ఇచ్చాం’.. బ్రిటన్ ప్రభుత్వం ఆ డబ్బు తిరిగి చెల్లించాలంటున్న భారతీయ కుటుంబం

    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమ పూర్వీకులైన(ముత్తాత) జుమ్మాలాల్ రుఠియా 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి రూ.35,000 అప్పుగా ఇచ్చారని మధ్యప్రదేశ్‌లో‌ని సీహోర్‌కు చెందిన రుఠియా కుటుంబం అంటోంది. దాదాపు 109 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది.

బ్రిటిష్ ప్రభుత్వానికి 35 వేల రూపాయలు ఇచ్చినట్లు 1917 జూన్ 4 నాటి ధ్రువీకరణ పత్రం తమ వద్ద ఉందని జుమ్మూలాల్ రుఠియా కుటుంబం చెబుతోంది.

భోపాల్ ఏజెన్సీలోని బ్రిటిష్ ప్రభుత్వ పొలిటికల్ ఏజెంట్ ద్వారా ఈ మొత్తాన్ని అందజేశారని ఆ కుటుంబం అంటోంది.

ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలు, కుటుంబ వివరాలు అందజేయాలని తాజాగా యూకేకు చెందిన 'డెబిట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్' (డీఎంవో) ఆ కుటుంబాన్ని కోరింది.

ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటిష్ అధికారులు విచారణ జరుపుతున్నారని, పత్రాలను ధ్రువీకరించేందుకు మరికొంత సమాచారం అడిగారని జుమ్మాలాల్ మునిమనవడు గౌతమ్ రుఠియా తెలిపారు.

ఆయన బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. "ఈ విషయాన్ని నిర్ధరించేందుకు మరింత సమాచారం కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాకొక ఈమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని తదుపరి విచారణకు పంపినట్లు కూడా అందులో ఉంది. అలాగే, ధ్రువీకరణ కోసం వాళ్లడిగిన సమాచారం కూడా మేం పంపుతున్నాం" అని చెప్పారు.

అయితే, ఈ కుటుంబ వాదనలను అంగీకరిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని బ్రిటిష్ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

అవసరమైన పత్రాలను కోరడం కూడా ఆ వాదనలను ధ్రువీకరించుకునే ప్రక్రియలో ఒక భాగం మాత్రమే.

ఈ విషయం ఫిబ్రవరిలో వారికి తెలిసింది..

జుమ్మాలాల్ మనవడు, గౌతమ్ తండ్రి వినమ్ రుఠియా మాట్లాడుతూ, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రాథమిక స్పందనపై తమ కుటుంబం సంతోషంగా ఉందని అన్నారు.

"నెలల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మాకు మొదటిసారి రిప్లై వచ్చింది. దీంతో మా ఆశలు చిగురించాయి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మా పూర్వీకుల వారసత్వానికి సంబంధించిన విషయం" అన్నారు.

వినయ్ రుఠియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ పత్రం గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో వారి కుటుంబానికి తెలిసింది.

"ఈ ఏడాది మొదట్లో, ఏదో కేసుకి సంబంధించిన పాత పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన రుణానికి సంబంధించిన ఈ పత్రం కనిపించింది. అనంతరం, న్యాయవాది ద్వారా మేం బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంప్రదించాం" అని ఆయన అన్నారు.

జుమ్మాలాల్ బ్రిటిష్ వారికి అప్పు ఎందుకిచ్చారు?

కుటుంబ సభ్యులు తెలిపిన దాని ప్రకారం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జుమ్మాలాల్ ఈ మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చారు.

దీని గురించి వినయ్ రుఠియాను అడగ్గా, "మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ సైనికులు కూడా బ్రిటిష్ వారి తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో, సైనిక వ్యయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిధులు సేకరిస్తోంది. ఈ క్రమంలో, యుద్ధానికి వెళ్లిన భారతీయ సైనికుల ఖర్చుల కోసం మా తాతగారైన జుమ్మాలాల్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ డబ్బు ఇచ్చారు" అని అన్నారు.

ఆ కుటుంబం వద్ద ఉన్న పత్రంలో, 1917 జూన్ 4న ఈ డబ్బు అందజేసినట్లు ఉంది.

జుమ్మాలాల్ కుటుంబం దీనిని వార్‌ లోన్(యుద్ధ రుణం)గా చెబుతోంది. ఇది సాధారణ బ్యాంకు రుణం వంటిది కాదని, రెండు లేదా ఐదేళ్లలో తిరిగి చెల్లించాలనే నిర్దిష్ట గడువు ఏమీ లేదని వారు చెబుతున్నారు.

"ఒకవేళ ఇది బ్యాంకింగ్ పత్రం అయి ఉంటే, దానికి ఐదు లేదా పది సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలనే కాలపరిమితి ఉండేది. కానీ, ఇది వార్ లోన్. యుద్ధం కోసం ఇచ్చిన రుణం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అప్పటికి కచ్చితంగా తెలియదు కదా" అని గౌతమ్ రుఠియా అంటున్నారు.

కుటుంబానికి సంబంధించిన పాత రికార్డుల్లో ఈ పత్రం ఉందని, అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీని గురించి తెలిసిందని ఆయన అన్నారు.

బ్రిటిష్ అధికారులు తాజాగా కుటుంబ పత్రాలు, వంశ వృక్షం, పాత ధ్రువీకరణ పత్రాలు, ఆనాటి వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు అడిగారని గౌతమ్ చెప్పారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 1917లో డబ్బులు ఇచ్చిన కుటుంబం, ఇప్పుడు దానిని తిరిగి చెల్లించాలంటున్న కుటుంబం ఒకటేనా? కాదా? అని అధికారులు నిర్ధరించుకోవాల్సి ఉంది.

ఆ రూ.35 వేలు ఇప్పుడు ఎంతవుతుంది?

1917లో ఇచ్చిన 35 వేల రూపాయలు ప్రస్తుతం ఎంత విలువ ఉంటుందనేది తేల్చేందుకు రుఠియా కుటుంబం లెక్కలు వేస్తోంది.

అసలు మొత్తంతో పాటు వడ్డీ, చక్ర వడ్డీ, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గౌతమ్ అంటున్నారు.

"మేం పూర్తి మొత్తం అడుగుతాం. అసలు 35 వేల రూపాయలు. దానికి వడ్డీ, ఇతర ఖర్చులు కూడా తోడవుతాయి. అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, అన్నింటినీ లెక్కించిన అనంతరం, ఆ మొత్తాన్ని ప్రస్తుత కరెన్సీలో లెక్కగడతాం" అని ఆయన అన్నారు.

దాదాపు 109 ఏళ్ల కిందట ఇచ్చినట్లుగా చెబుతున్న ఈ రుణానికి ప్రతిఫలంగా ఎంత మొత్తం డిమాండ్ చేయాలనే దానిపై ఆ కుటుంబం ఇంకా ఎలాంటి నిర్ణయానికీ రాలేదు.

'మొదటి ప్రపంచ యుద్ధం నాటి అప్పు బ్రిటన్ చెల్లించింది'

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తీసుకున్న అప్పులో అత్యధిక భాగాన్ని 2015లో బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని వినయ్ రుఠియా అంటున్నారు.

"దీనిని పరిశీలిస్తున్న సమయంలో ఒక విషయం తెలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం 2015లో మొదటి ప్రపంచ యుద్ధం నాటి అప్పుకి సంబంధించి భారీ మొత్తాన్ని చెల్లించింది. ఇవి 1917 నాటి అప్పులు. 2015లో తీర్చారు" అని ఆయన అన్నారు.

డిసెంబర్ 2014లో బ్రిటిష్ పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం, మొదటి ప్రపంచ యుద్ధం నాటి గడువు తేదీ నిర్ణయించని 4 శాతం కన్సాలిడేటెడ్ లోన్స్, 3.5 శాతం వార్ లోన్స్‌ను 2015 ఫిబ్రవరి 1న, మార్చి 9న తిరిగి చెల్లించి వాటిని రద్దు చేయనున్నట్లు తెలిపింది.

మొదటి ప్రపంచ యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు జారీ చేసిన బాండ్లలో దాదాపు 99 శాతం ఈ రెండు బాండ్లే ఉన్నాయి.

అయితే, 2015లో బ్రిటన్ తన పాత రుణాలను తిరిగి చెల్లించినప్పటికీ, 1917లో జుమ్మాలాల్ రుఠియా ఇచ్చిన 35 వేల రూపాయలు కూడా ఈ బాండ్లలో భాగమని కాదు.

ఎవరీ జుమ్మాలాల్ రుఠియా?

జుమ్మాలాల్ రుఠియా అప్పట్లో పెద్ద వ్యాపారవేత్త అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

జుమ్మాలాల్‌‌కు దాదాపు 3 వేల ఆవులతో పెద్ద గోశాల ఉండేదని ఆయన మనవడు వినయ్ రుఠియా చెప్పారు.

జుమ్మాలాల్‌కు సంబంధించిన పాత ఫోటోలు, ఆ కాలంలో ఆయన ఉపయోగించిన వాహనం ఫోటోలు కూడా ఆ కుటుంబం వద్ద ఉన్నాయి.

అప్పటి వ్యాపారం, కుటుంబానికి సంబంధించిన ఇతర పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆ కుటుంబం చెబుతోంది.

"మా తాతగారికి పెద్ద వ్యాపారం ఉండేది. ఆ కాలంలో ఆయన నల్లమందు కూడా సాగు చేసేవారు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ కారు ఉండేది. కాబట్టి ఆయన రుణం ఇచ్చారా లేదా అనేది ప్రశ్నే కాదు. ఆయన దగ్గర డబ్బు ఉంది, రుణం ఇచ్చినట్లు సంబంధిత పత్రం కూడా ఉంది. ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందనేదే అసలు ప్రశ్న" అని వినయ్ రుఠియా అన్నారు.

రుణం ఇచ్చిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, 1937లో జుమ్మాలాల్ రుఠియా మరణించారు. ఆ తర్వాత, పదేళ్లకు 1947లో బ్రిటిష్ వారు భారత్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల, ఆ డబ్బును తిరిగి చెల్లించలేదని ఆ కుటుంబం అంటోంది.

పత్రాల ధ్రువీకరణ జరగాల్సి ఉంది..

ప్రస్తుతానికి, ఆ కుటుంబం చేస్తున్న వాదనలను బ్రిటిష్ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

ఆ కుటుంబం నుంచి అడిగిన పత్రాలు, ఇతర సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంది. ఆ తర్వాతే, 1917లో ఇచ్చిన 35 వేల రూపాయలకు సంబంధించిన పత్రాలు బ్రిటిష్ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయో లేదో స్పష్టమవుతుంది.

అయితే, ఆ కుటుంబం తదుపరి న్యాయపరమైన ప్రక్రియ, మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

అసలు పత్రాలను ధ్రువీకరించిన తర్వాతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వినయ్ రుఠియా తెలిపారు.

109 ఏళ్ల నాటి ఈ వ్యవహారంలో, బ్రిటిష్ అధికారులు అడిగిన పత్రాలను అందజేసేందుకు ఆ కుటుంబం ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకుంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)