'ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని అమ్మను చంపేశారు'.. కరీంనగర్‌లో వృద్ధురాలి హత్యకేసును ఛేదించామని చెప్పిన పోలీసులు

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

(ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉండొచ్చు)

'దుర్ముహూర్తంలో చనిపోతే ఇల్లు వీడాలనే మూఢనమ్మకం.. బతికున్న తల్లిని బావిలో పడేసి చంపిన కొడుకులు.. ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం' అని పోలీసులు బయటపెట్టిన కేసులో ఐదు నెలల తర్వాత విచారణలో ఏం తేలింది?

'తల్లి తమ ఇంట్లో చనిపోతే 'ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది' అనే మూఢనమ్మకంతో ఆమెను బావిలోకి తోసి హత్య చేసిన కేసులో ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ పోలీసులు చెప్పారు.

మొదట ఆత్మహత్యగా నమోదైన ఈ కేసును ఐదు నెలల విచారణ తర్వాత ఛేదించారు.

‘‘వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో అది ఆత్మహత్య కాదని, కొడుకులు పథకం ప్రకారం చేసిన హత్య అని తేలింది" అని హుజురాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

ఎలాంటి బలమైన ఆధారాలు తమ వద్ద లేకపోయినప్పటికీ.. శారీరకంగా ఆశక్తురాలైన వృద్ధురాలు, ఇంటికి దూరంగా ఉన్నచోటుకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యం అన్న బలమైన కారణంతో పోలీసుల దర్యాప్తు నెలల తరబడి కొనసాగిందని ఆయన వెల్లడించారు.

పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఏప్రిల్ 6న కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎలబోతారం గ్రామానికి చెందిన గోనె రవీందర్ తన తల్లి గోనె వెంకటమ్మ (80) ఆత్మహత్య చేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు.

‘నేలపై పాకుతూ వెళ్లే పరిస్థితీ లేదు’

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే వెంకటమ్మ నివసిస్తున్న ఇంటి నుంచి ఆమె మృతదేహం దొరికిన బావి చాలా దూరం ఉండటం దర్యాప్తు చేస్తున్న పోలీసుల దృష్టిలో కీలకంగా మారింది.

''వెంకటమ్మ వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. కనీసం మంచం దిగి నడవలేని పరిస్థితి ఆమెది. నేలపై పాకుతూ వెళ్లే పరిస్థితిలో కూడా ఆమె లేరు. అలాంటి పరిస్థితిలో ఇంటి నుంచి సుమారు 300 మీటర్లు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడంపై మాకు మొదటి నుంచీ అనుమానంగానే ఉంది" అని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

వంతుల వారీగా తల్లి బాగోగులు

వెంకటమ్మకు నలుగురు కొడుకులు. సమ్మయ్య, రవీందర్, కుమార స్వామి, శ్రీనివాస్. వీరికంటే పెద్దదైన కూతురు కూడా ఉన్నారు.

పెద్ద కొడుకు సమ్మయ్య ఇంట్లోనే వెంకటమ్మ ఉంటున్నారు. ఆమె కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు.

'గతంలో నలుగురు కుమారులు వంతుల వారిగా నెలకు ఒకరు చొప్పున తల్లి దగ్గరకు వచ్చి ఆమె బాగోగులు చూసుకునేవారు. ఇటీవల వెంకటమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. కూర్చోలేని పరిస్థితికి చేరుకోవడంతో వారానికి ఒకరు చొప్పున తల్లిని చూసుకునేలా బాధ్యతలు పంచుకున్నారు' అని పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన సమయంలో మూడో కుమారుడు కుమార స్వామి వంతు ముగియనుంది. మరో రెండు రోజుల్లో చిన్న కుమారుడు శ్రీనివాస్ వంతు ప్రారంభం కావాల్సి ఉంది.

'ఇంట్లో చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలి'

వెంకటమ్మ చావుబతుకుల మధ్య ఉందని, ఒకటి రెండు రోజులకు మించి బతకకపోవచ్చని కుటుంబసభ్యులు భావించారు.

ఈ సమయంలో పెద్ద కొడుకు సమ్మయ్య.. ఇక నుంచి తల్లిని వంతుల వారీగా అన్నదమ్ములందరు తాము నివసించే ఇళ్లకే తీసుకెళ్లి చూసుకోవాలని చెప్పారు.

దుర్ముహూర్తం నడుస్తున్న సమయంలో ( పంచాగం ప్రకారం చెడ్డ రోజులు నడుస్తున్న సమయం) తల్లి తన ఇంట్లో చనిపోతే కొంతకాలం ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సి వస్తుందని సమ్మయ్య భావించారు. గతంలో వారి తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారని పోలీసులు తెలిపారు.

'తన ఇంట్లో తల్లి మరణిస్తే తానూ ఇల్లు ఖాళీచేయాల్సి వస్తుందని భావించిన చిన్న కొడుకు శ్రీనివాస్.. తల్లి ఎలాగూ ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు కాబట్టి ఆమెను ముందుగానే హత్య చేయాలని తన పెద్దన్న సమ్మయ్యతో కలిసి నిర్ణయించుకున్నట్టు విచారణలో అంగీకరించారని పోలీసులు చెప్పారు.

‘పెద్దకొడుకు, చిన్న కొడుకు కలిసి’

హుజురాబాద్ పోలీసులు, గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం..

'ఏప్రిల్ 5 రాత్రి తమ వంతు ముగించుకుని మూడో కుమారుడు కుమార్‌స్వామి కుటుంబసభ్యులు తమ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత పథకం ప్రకారం సమ్మయ్య, శ్రీనివాస్ కలిసి తమ తల్లిని ఇంటి నుంచి తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు.'

'తల్లిని చంపేందుకు బావిని అన్నదమ్ములిద్దరూ ముందుగానే గుర్తించారు. శ్రీనివాస్ తల్లిని మోసుకుని వెళ్లగా, సమ్మయ్య దారిలో ఎవరూ చూడకుండా జాగ్రత్తపడ్డారు' అని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మరుసటి రోజు వెంకటమ్మ కనిపించడం లేదని కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు.

ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తూ మోటార్లు పెట్టి అందులోని నీటిని తోడారు. చివరకు అంతకుముందు రోజు వెంకటమ్మను పడేసిన బావి వద్దకు వెళ్లగా ఆమె మృతదేహం కనిపించింది.

"వెంకటమ్మ చాలా కాలంగా అనారోగ్యం, పక్షవాతంతో బాధపడుతోంది. పాకుతూ వచ్చి ఇంటి వెనుక బావిలో పడిపోయిందేమో అనుకున్నాం. అన్నదమ్ములిద్దరూ గ్రామస్థులను పక్కదోవ పట్టించారని ఆ తర్వాత అర్థం అయింది" అని ఎలబోతారం సర్పంచ్ నమిండ్ల రవీందర్ బీబీసీతో అన్నారు.

ముందుకు సాగని కేసు

కుటుంబసభ్యులు ఎవరూ వెంకటమ్మ మరణంపై అనుమానం వ్యక్తం చేయలేదు.

పోలీసులకు అనుమానాలు ఉన్నప్పటికీ.. కేవలం సాంకేతిక ఆధారాలతో తేల్చే కేసు కాకపోవడం, హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో ఆలోచిస్తే.. వెంకటమ్మ శరీరంపై భౌతిక ఆధారాలేవీ దొరక్కపోవడం, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మధ్యలో బదిలీ కావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు.

''కొందరు కుటుంబసభ్యులే ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన వెంకటమ్మ మృతిపై గ్రామస్థులకూ అనుమానాలు లేవు. మాకు మాత్రం ఇది ఆత్మహత్య అన్న నమ్మకం కుదరలేదు. అలాగని హత్యగా నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలు మా దగ్గర లేవు. ఇంటి దొంగను పట్టుకోవడం కష్టమైన పని. అందుకే శాస్త్రీయ ఆధారాలపై దృష్టి పెట్టాం'' అని తరువాత ఈ కేసు విచారణ చేపట్టి, పూర్తి చేసిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

'పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల విశ్లేషణలో చిక్కుముడి వీడింది'

వెంకటమ్మ మృతి ప్రమాదమా లేక హత్య అన్నది తేల్చేందుకు అనేక కోణాల్లో పోలీసులు కేసును తరచిచూశారు.

అదే సమయంలో కొందరు గ్రామస్థుల నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

గొంతు పిసికి చంపారా? బలవంతంగా బావిలోకి తోశారా? ఎక్కడైనా హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారా? అనే కోణాల్లో స్థానిక డాక్టర్ల పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్, కాకతీయ మెడికల్ కాలేజ్ రిపోర్టుల ఫలితాలను విశ్లేషించారు. వెంకటమ్మది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్ధరణకు వచ్చారు.

'అనుమానాలు ఎన్ని ఉన్నా వాటి నిరూపణకు ఆధారాలు కావాలి. గొంతు పిసికి చంపారా, చంపి బావిలో పడేశారా లేక బావిలో పడ్డాక చనిపోయారా, శరీరంపై గాయాలుంటే అవి చనిపోక ముందు తగిలాయా లేక చనిపోయాక తగిలాయా అనేవి ఫోరెన్సిక్, పోస్ట్ మార్టమ్ నివేదికల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆ నివేదికలు ఆలస్యమవడంతో కేసును ముగించడం, నిందితులిద్దరిని అరెస్ట్ చేయడం ఆలస్యం అయింది'' అని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మూఢనమ్మకమే హత్యకు కారణం

వెంకటమ్మను హత్య చేయడానికి ఆస్తి, డబ్బు లేదా ఇతర కుటుంబ వివాదాలు కారణం కాదని, ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందన్న మూఢనమ్మకమే ఈ హత్యకు ప్రేరణ అని చెప్పారు.

'తల్లి పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వాసుపత్రికైనా తరలించి చికిత్స అందించవచ్చు. కానీ మూఢ నమ్మకంతో తల్లిని హత్య చేశారు' అని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

పోలీస్ దర్యాప్తులో వెల్లడించిన విషయాలు గ్రామస్థులను షాక్‌కు గురిచేశాయని సర్పంచ్ నమిండ్ల రవీందర్ అన్నారు.

"తల్లిదండ్రుల బాగోగులను విస్మరించే వారికి ఈ కేసు ఒక గుణపాఠం కావాలనే మాట గ్రామంలో అందరినోట వినిపిస్తోంది. సహజ మరణం రాకుండా కన్నతల్లిని హత్య చేయడం దుర్మార్గం. ఇల్లు ఖాళీచేయాల్సివస్తుందన్నది మూఢనమ్మకం. ఒకవేళ తప్పనిసరిగా ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడైనా అద్దె ఇల్లు తీసుకుని ఉండాల్సింది" అని అభిప్రాయపడ్డారు.

నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. గ్రామ సర్పంచ్, కొందరు గ్రామస్థులు, పోలీసుల ద్వారా కూడా వారిని సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే, వారు అందుబాటులోకి రాలేదు. వారు స్పందిస్తే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)