హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకర పోస్టులంటూ ఫిర్యాదు, మెటా ఇండియా అధిపతి సహా పలువురిపై కేసులు

ఫొటో సోర్స్, GettyImages/ Ajay Aggarwal/Hindustan Times via Getty Images
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టారంటూ కొందరిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో 20 మంది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్లతోపాటు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చారు పోలీసులు.
కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను బీబీసీ సంపాదించింది. ఇందులో నిందితుల జాబితాలో ఫిర్యాదులో పేర్కొన్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్లు ఏ1గా, మెటా ఇండియా హెడ్ ఏ2గా ఉన్నారు.
ఆ యూజర్ల వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66(సీ), 67, బీఎన్ఎస్ సెక్షన్ 353(2), 336(4) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు పెట్టింది ఎవరు?
తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న టి.సాయి కిరణ్ గౌడ్ జులై 29 రాత్రి తమకు ఈ ఫిర్యాదు అందించారని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
"సోషల్ మీడియా చూస్తున్న క్రమంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలోని కొన్ని అకౌంట్లలో తీవ్ర అభ్యంతరకరమైన వీడియోలు కనిపించాయి.
ముఖ్యంగా కొన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుచితంగా చూపిస్తున్నట్లు ఉంది. ఈ పోస్టులు జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా పక్షపాతంగా ఉన్నాయి. ఈ పోస్టులను తొలగించడంతోపాటు యూజర్లపై చర్యలు తీసుకోండి" అని ఫిర్యాదులో పేర్కొన్నారు సాయికిరణ్.

ఫొటో సోర్స్, UGC
మార్ఫింగ్ కంటెంట్ తొలగింపు
మొత్తం 20 అకౌంట్లకు సంబంధించిన యూఆర్ఎల్‌లను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో 7 ఇన్‌స్టాగ్రాం అకౌంట్లు కాగా, 13 ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయి.
ప్రధాని మోదీ గురించి మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫోటోలతో అసభ్యకర, అవమానకరరీతిలో ఆయా అకౌంట్లలో యూజర్లు పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేశారు.
తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టామని, మెటా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు పంపించనున్నామని హైదరాబాద్ సైబర్ క్రైం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు మీడియాకు చెప్పారు.
ఫిర్యాదులో పేర్కొన్న 20 అకౌంట్లకు సంబంధించిన పోస్టులను పరిశీలించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయా అకౌంట్లలో ఆ కంటెంట్ ఇప్పుడు కనిపించడం లేదు.
ఆయా యూఆర్ఎల్‌లను ఓపెన్ చేసేందుకు బీబీసీ ప్రయత్నించినప్పుడు, అందులోని కంటెంట్ ఓపెన్ కావడం లేదు.
''ఈ వీడియో లేదా పోస్టు భారత్‌లో అందుబాటులో లేదు'' అని సమాచారం వస్తోంది.
భారత ఐటీ చట్టం, 2021కు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం సవరణలు చేసింది.
సోషల్ మీడియాలో పోస్టు చేసే చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు సంబంధించి సమాచారం అందిన మూడు గంటల్లోపు తొలగించాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయని రాయిటర్స్ తెలిపింది.
గతంలో ఉన్న 36 గంటల సమయాన్ని మూడు గంటలకు తగ్గించింది భారత ప్రభుత్వం.
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు యూజర్లతోపాటు ప్లాట్‌ఫారం యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బీబీసీతో కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్సుడ్ లీగల్ స్టడీస్ వైస్ చాన్స్‌లర్ ప్రొ. జీబీ రెడ్డి చెప్పారు.
''గతంలో ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల యజమానులకు 'సేఫ్ హార్బర్' వెసులుబాటు ఉండేది. తాజాగా మార్చిన నిబంధనల మేరకు ప్లాట్‌ఫామ్‌ల యజమానులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.
ఏ వ్యక్తికైనా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని, రాజ్యాంగంలోనూ ఆ మేరకు పరిమితులు ఉన్నాయని ప్రొ. జీబీ రెడ్డి వివరించారు.
మరోవైపు, ఈ కేసు విషయంపై మెటా ఇండియాను ఈ-మెయిల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వారి నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, UGC
ఫిర్యాదులో ఇంకా ఏమున్నాయంటే..
ఫిర్యాదుదారు పేర్కొన్న వివరాలను ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు.
''ఆయా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ అకౌంట్లలో పోస్టులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలి. ఈ అకౌంట్లను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. ఆయా పోస్టులలోని కంటెంట్ ద్వారా భారతీయ చట్టాలను ఉల్లంఘించిన తీరుపై సమగ్ర విచారణ జరగాలి. మెటా ప్లాట్‌ఫామ్‌ల నుంచి సాయం తీసుకుని అవసరమైన వివరాలు తీసుకోవాలి'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు సాయికిరణ్ గౌడ్.
ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో మార్ఫింగ్ చేసిన రీల్స్‌ను పోస్టు చేసేందుకు అనుమతిస్తున్న మెటాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళన తర్వాత మోదీపై కొందరు అసభ్యకర రీతిలో పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ప్రధాని మోదీ గురించి అసభ్యకరంగా, అవమానకరంగా మార్ఫింగ్ చేసిన వీడియోలు, పోస్టులు పెట్టినందుకు బీజేపీ తరఫున సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ బీబీసీతో చెప్పారు.
''రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం ప్రతి పౌరుడికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో సార్వభౌమాధికారం, సమగ్రత, నైతికత, శాంతికి లోబడి భావ ప్రకటన ఉండాలని ఆర్టికల్ 19(2) చెబుతుంది.
రాజకీయంగా విభేదించడం, విమర్శించడం, ప్రజాస్వామిక పద్ధతితో కూడిన చర్చను స్వాగతిస్తాం. సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీ కంటే ఎక్కువగా ఎవరూ విమర్శలు ఎదుర్కొని ఉండరు. విమర్శ అనేది సమస్య కాదు. కానీ, మార్ఫింగ్‌కు పాల్పడుతూ అసభ్యకరంగా దూషించడాన్ని సహించేది లేదు'' అని చెప్పారు.
ప్రధాని మోదీ చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్టును కొంత సమయం పాటు భారత్‌లో మెటా నిలిపివేయడంపై కూడా ఇటీవల వివాదం రాజుకుంది. అయితే దానికి క్షమాపణ చెప్పిన మెటా... సాంకేతిక లోపాన్ని కారణంగా పేర్కొందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎన్.కృష్ణన్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























