‘దయ చూపు రఘునందనా..' అంటూ హిందూ ప్రజలు ఓ ముస్లిం పాలకుడి కోసం ఎందుకు ప్రార్థించారు?

    • రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

అవధ్ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం భారత్‌లో ఓ సంచలన ఘట్టం.

అవధ్ ప్రాంతం గంగా-యమునా నదుల మధ్య ఉన్న సారవంతమైన మైదానంలో ఉండేది. దాని రాజధాని లఖ్‌నవూ.

ఇప్పడీ లఖ్‌నవూనే, జనాభా పరంగా భారత్‌లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు రాజధాని.

అయితే, 1856 ఫిబ్రవరిలో బ్రిటిష్ వారు అవధ్ నవాబ్ వాజిద్ అలీషాను అధికారం నుంచి తొలగించినప్పుడు, ఆయన లండన్‌కు వెళ్లి క్వీన్ విక్టోరియాకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

లండన్‌కు వెళ్లడానికి, ఆయన 1856 మార్చిలో లఖ్‌నవూ నుంచి ఆయన కలకత్తాకు (ప్రస్తుత కోల్‌కతాకు) పయనమయ్యారు.

ఈ సంఘటన గురించి చరిత్రకారుడు రోషన్ తాఖీ మొదటి స్వాతంత్య్ర సంగ్రామంపై రాసిన 'లఖ్‌నవూ 1857 - ది టూ వార్స్ ఆఫ్ లఖ్‌నవూ డస్క్ ఆఫ్ ఆన్ ఎరా' అనే పుస్తకంలోనూ ప్రస్తావించారు.

''ఆ సమయంలో నవాబ్ వాజిద్ అలీ షాను సాగనంపడానికి అవధ్ నుంచి చాలా మంది కాన్పూర్‌కు వెళ్లారు. వారిలో చాలా మంది 'హజ్రత్ లండన్‌కు వెళ్తున్నారు, మాపై దయ చూపు రఘునందనా..' అని పాటలు పాడారు'' అని చరిత్రకారుడు రోషన్ తాఖీ బీబీసీ న్యూస్‌కు తెలిపారు.

"తన ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకున్న నవాబు, వారికి ఎక్కువ కష్టం కలిగించకూడదనుకున్నారు. తాను తిరిగి లక్నో వస్తానని తనతో వస్తున్న వారికి హామీ ఇచ్చారు. ఇది విన్న సగానికి పైగా ప్రజలు లక్నోకు తిరిగి వచ్చి, నవాబు పునరాగమనం కోసం ఎదురుచూడసాగారు’’. అయితే, నవాబు మరెన్నడూ లక్నోకు తిరిగి రాలేకపోవడం వేరే విషయం.

ఒక ఇస్లాం మతాన్ని అనుసరించే పాలకుడి హక్కుల కోసం, హిందూ ప్రజలు తమ దేవుడిని ప్రార్థించడం అనేది గంగా-యమునా సంస్కృతికి ఒక విశిష్ట ఉదాహరణగా నిలిచింది.

'కలకత్తాలో స్థిరపడిన నవాబు'

"జనరల్ డల్హౌసీ 1856 ఫిబ్రవరిలో నవాబ్ వాజిద్ అలీ షాను 'అసమర్థుడు'గా ప్రకటించి, అధికారం నుంచి తొలగించారు" అని చరిత్రకారుడు రవి భట్ బీబీసీ న్యూస్‌తో అన్నారు.

నవాబ్ వాజిద్ అలీ షా సముద్ర మార్గంలో కలకత్తా నుంచి లండన్‌కు వెళ్లాల నుకున్నారు. కానీ, ఆయన స్వయంగా వెళ్లలేకపోయారు.

"ఆయన అనుచరుల్లో కొందరు వాజిద్ అలీ షా తల్లి మల్కా కిశ్వర్‌తో కలిసి లండన్‌కు వెళ్లారు. కానీ వారు తిరిగి అవధ్ అధికారాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత వాజిద్ అలీ షా కలకత్తాలో స్థిరపడ్డారు" అని చరిత్రకారుడు రోషన్ తాఖీ చెప్పారు.

"ఆయన తల్లి మల్కా కిశ్వర్ పారిస్‌లో మరణించారు. ఆమె సమాధి కూడా అక్కడే ఉంది. నవాబ్‌ను బ్రిటిష్ వారు అరెస్టు చేశారన్నది కూడా తప్పు. నిజానికి, ఆయనే స్వయంగా కలకత్తాకు వెళ్లారు" అని తెలిపారు.

నవాబ్ కలకత్తాకు వెళ్లిన తర్వాత.. అవధ్ రాజ్యమంతా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లింది.

చరిత్రకారుడు రోషన్ తాఖీ తెలిపిన వివరాల మేరకు ''ఒక ఏడాదిలోనే ప్రజల్లో ఈ కంపెనీ పట్ల తీవ్ర అసంతృప్తి చెలరేగింది''

"ఈ సమయంలో, కొత్త ఎన్‌ఫీల్డ్ రైఫిల్ బుల్లెట్లకు ఆవు, పంది కొవ్వు పూశారనే పుకారు కూడా వ్యాపించింది" అని వివరించారు.

ఈ వార్త భారత సైనికుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది. మీరట్ కంటోన్మెంట్‌లో తిరుగుబాటు చెలరేగింది.

మంగళ్ పాండే తిరుగుబాటు వెనుక కూడా ఈ తూటాల వివాదమే ఉందని భావిస్తారు. 1856కి ముందు భారతీయ సైనికులు "బ్రౌన్ బెస్" అనే తుపాకీని ఉపయోగించేవారు.

చరిత్రకారుడు అమ్రేష్ మిశ్రా రాసిన 'వార్ ఆఫ్ సివిలైజేషన్ - ఇండియా 1857 ఏడీ' అనే పుస్తకంలో పేర్కొన్న వివరాల మేరకు, "కొత్త ఎన్‌ఫీల్డ్ పి-53 రైఫిల్‌ను ఉపయోగించే ముందు తూటాను పంటితో కొరకాల్సి వచ్చేది. 1857 మే 10న మీరట్‌లో తిరుగుబాటు చెలరేగడంతో సైనికులు దిల్లీ వైపు కవాతు నిర్వహించారు"

1857 తిరుగుబాటు జరిగి 2026వ సంవత్సరానికి 169 సంవత్సరాలు.

లఖ్‌నవూలో అప్పటికే తిరుగుబాటు మొదలు

రోషన్ తాఖీ తన 'లఖ్‌నవూ 1857 - ది టూ వార్స్ ఆఫ్ లఖ్‌నవూ డస్క్ ఆఫ్ ఆన్ ఎరా' అనే పుస్తకంలో "కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం నిరంతరం పెరుగుతూ వచ్చింది. మీరట్‌లో తిరుగుబాటు జరిగిన తర్వాత, లఖ్‌నవూ సమీపంలోని మడియాన్వ్ ప్రాంతంలోని బ్రిటిష్ కంటోన్మెంట్‌లో మోహరించిన సైనికులు కూడా తిరుగుబాటు చేసి లఖ్‌నవూలో గుమికూడటం ప్రారంభించారు" అని రాశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లఖ్‌నవూలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ఓ ఏడాది ముందు 1856లో కూడా బ్రిటిష్ వారిని అధికారం నుంచి తొలగించడానికి లఖ్‌నవూలో ఒక పెద్ద ప్రయత్నమే జరిగింది.

"అప్పట్లో అవధ్ రాజ్యం విలీనానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వివిధ మతాలకు చెందిన చాలామంది పెద్దలు లఖ్‌నవూలో సమావేశమయ్యారు. ఖాదిర్ అలీ షా అనే ఒక సూఫీ సన్యాసి, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి 1856 సెప్టెంబర్ 11వ తేదీని నిర్ణయించారు. సుమారు 12,000 మంది శిక్షణ పొందిన సైనికులతో ఒక పెద్ద సైన్యాన్నే తయారు చేశారు" అని రోషన్ తాఖీ చెప్పారు.

'' ఖాదిర్ అలీ షా సాయం చేయాలని కోరుతూ కాబూల్ షాకు ఒక లేఖ కూడా పంపారు సమాజంలోని అల్పాదాయ వర్గాలకు చెందిన చాలా మంది ప్రజలు ఖాదిర్ అలీ షా రహస్య సంస్థలో పాలుపంచుకున్నారు. ఇది ఈ ఉద్యమానికి ఒక ప్రజా ఆధారిత రూపాన్ని ఇచ్చింది. కానీ ఈ తిరుగుబాటు విషయం ముందుగానే బ్రిటిష్ వారికి తెలిసిపోయింది" అని రోషన్ తాఖీ వివరించారు.

''వారు దానిని వెంటనే అణచివేశారు. ఆ తర్వాత లఖ్‌నవూలోని చారిత్రాత్మక మచ్చి భవన్ సమీపంలో చాలామంది మత పెద్దలను ఉరితీశారు. 1857 తిరుగుబాటుకు ముందే అవధ్‌లో అసంతృప్తి లోతుగా వ్యాపించిందని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తుంది'' అని తెలిపారు.

బెయిలీ గార్డ్ గేట్

ఈ సంఘటన తర్వాత, బ్రిటిష్ వారు అప్రమత్తమై రేషన్లు, సైనిక సామగ్రిని సమకూర్చుకోవడం ప్రారంభించారు.

"తిరుగుబాటు భయంతో బ్రిటిష్ అధికారులు రెసిడెన్సీలో తలదాచుకుని, నిత్యావసర వస్తువులను సేకరించడం ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ పనిని రాత్రివేళ చేసేవారు" అని రోషన్ తాఖీ చెప్పారు.

రెసిడెన్సీ అనే ప్రాంతం ప్రస్తుత లఖ్‌నవూలోని కైసర్‌బాగ్ సమీపంలో గోమతి నది ఒడ్డున ఉంది.

ఇది సుమారు 33 ఎకరాలలో విస్తరించిన ఓ కాంప్లెక్స్ . ఇక్కడ బ్రిటిష్ అధికారులు నివసించేవారు. దీనిని 1774లో అవధ్ మూడవ నవాబ్ షుజా-ఉద్-దౌలా నిర్మించారు.

లఖ్‌నవూ రెసిడెన్సీ ప్రధాన ద్వారాన్ని బెయిలీ గార్డ్ అని పిలుస్తారు. దీనిని నవాబ్ షుజా-ఉద్-దౌలా కుమారుడు నవాబ్ సాదత్ అలీ ఖాన్, లఖ్‌నవూ రెసిడెంట్ కెప్టెన్ బెయిలీ గౌరవార్థం నిర్మించారు.

ఈ గేటును 1857లో మట్టితో పూడ్చివేశారు.

"అవధ్ నవాబులు బ్రిటిష్ అధికారులకు ఆతిథ్యం ఇచ్చేవారు. దాన్ని ఆసరగా తీసుకుని బ్రిటిషువారు రాజకీయ జోక్యాన్ని పెంచారు. చివరకు 1856 ఫిబ్రవరి 7న వాజిద్ అలీ షాను గద్దె దించేశారు" అని చరిత్రకారుడు రవి భట్ వివరించారు.

ప్రస్తుతం, ఈ రక్షిత భవనం శిథిలావస్థలో ఉంది, దానిపై తూటాల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఇందులో చర్చి, మసీదు,ఇమాంబారా కూడా ఉన్నాయి. ఇక్కడకు పర్యటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ రెసిడెన్సీ లోపల ఒక మ్యూజియం ఉంది. ఇది 1857 విప్లవ చరిత్రను తెలియజేస్తుంది.

అవధ్ రెండో రాజు నసీరుద్దీన్ హైదర్ భార్య విలాయత్ నివాసం కూడా ఆ రెసిడెన్సీలోనే ఉండేది. ఆమెను మఖ్దారా అలియాగా కూడా పిలిచేవారు. "ఆమె యూరోపియన్ సంతతికి చెందిన వ్యక్తి. ఆమె సవతి సోదరి, అష్రఫున్నీసా మసీదును, ఇమాంబారాను నిర్మించారు" అని అక్కడున్న ఫలకంపై రాసి ఉంది.

"నేడు ఇది శిథిలావస్థలో ఉంది. అయితే, ఇక్కడి భవనాలన్నీ 1857 విప్లవం తర్వాత ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కేవలం సంరక్షణ పనులు మాత్రమే జరిగాయి" రవి భట్ అన్నారు.

"బ్రిటిష్ వారు తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడానికి రెసిడెన్సీని అలానే వదిలిపెట్టారు. వాస్తవానికి అధికారాన్ని పొందిన తర్వాత, వారు ఈ నగరాన్ని చాలా వరకు నాశనం చేశారు" అని చరిత్రకారుడు రోషన్ తాఖీ చెప్పారు.

చిన్హట్ యుద్ధంలో బ్రిటిష్ వారి ఓటమి

రెసిడెన్సీ ముట్టడికి ముందు, బ్రిటిష్ వారు 'చిన్హట్ యుద్ధం'లో ఓటమి పాలయ్యారు.

1857 జూన్ 30న జరిగిన చిన్హట్ యుద్ధం, పక్కా వ్యూహంతో జరిగింది.

భారతీయ తిరుగుబాటు నాయకులు బర్కత్ అహ్మద్, షహబుద్దీన్ బ్రిటిష్ వారిని తప్పుదోవ పట్టించి ఉచ్చులో పడేశారని రోషన్ తాఖీ చెప్పారు.

''వారు ఉద్దేశపూర్వకంగా బలహీనపడినట్టు కనిపించారు. దీనిని అర్థం చేసుకోలేని కంపెనీ సైనికాధికారి హెన్రీ లారెన్స్ ముందుకు వెళ్లారు.నిజానికి పూర్తి సన్నాహాలతో తిరుగుబాటు సేన అక్కడే మాటువేసి ఉంది'' అని రోషన్ తాఖీ రాశారు.

‘‘ఈ తిరుగుబాటు సైన్యంలో రాజా జైలాల్ సింగ్, రానా బెనీ మాథో లాంటి రాజులు, సిపాయిలు కూడా ఉన్నారు. వీరు బలహీనపడ్డారనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన హెన్రీసేనకు వారెంత బలంగా ఉన్నారో, తాము ఎలా ఉచ్చులో చిక్కుకున్నారో అర్థమైంది. భారత తిరుగుబాటు దళాల అశ్విక సైన్యానికి జర్మన్ యువకుడు స్మిడ్ నాయకత్వం వహించాడు. అవధ్ సైన్యంలో ఆయన అధికారికిగా పనిచేశాడు’’ అని రోషన్ తాఖీ రాశారు.

తదుపరి ఈ బలగాల తీరు చూసి భయపడిన హెన్రీ సేనలోని మొత్తం 600మంది సైనికులు వెనకడగుగు వేయడంతో ‘‘బ్రిటిషువారు ఓడిపోయారు’’ అని చరిత్రకారుడు రోషన్ తాఖీ పేర్కొన్నారు..

చరిత్రకారుడు అమ్రేష్ మిశ్రా తన 'వార్ ఆఫ్ సివిలైజేషన్ - ఇండియా ఏడీ 1857' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

"హెన్రీ లారెన్స్ సైన్యం హడావిడిగా లఖ్‌నవూకు తిరిగి వచ్చి రెసిడెన్సీలో ఆశ్రయం పొందింది" అని రోషన్ తాఖీ చెప్పారు.

చిన్హట్ వద్ద సాధించిన విజయం, బ్రిటిష్ సైన్యం అజేయమనే అపోహను బద్దలుకొట్టింది. తిరుగుబాటుదారులకు లఖ్‌నవూ, అవధ్ ద్వారాలు తెరుచుకున్నాయి.

"బ్రిటిష్ రికార్డుల ప్రకారం, ఈ యుద్ధంలో 112 మంది యూరోపియన్ సైనికులు మరణించగా, 44 మంది గాయపడ్డారు. కల్నల్ కీన్స్, కెప్టెన్ మెక్లీన్ మరణించగా.. కల్నల్ ఐన్స్, మేజర్ బ్యాంక్స్ గాయపడ్డారు. భారత వైపు జరిగిన ప్రాణనష్టంపై స్పష్టమైన రికార్డు అందుబాటులో లేదు" అని చరిత్రకారుడు రవి భట్ వివరించారు.

"కేవలం 11 మంది తిరుగుబాటుదారులు మాత్రమే మరణించారు, మౌల్వి అహ్మదుల్లా షా గాయపడ్డారు" అని కొన్ని వర్గాలు చెప్పాయి.

రెసిడెన్సీ ముట్టడి

చిన్హట్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత.. బ్రిటిష్ వారు రెసిడెన్సీలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.

"ఈ తిరుగుబాటుకు బేగం హజ్రత్ మహల్, మౌల్వి అహ్మదుల్లా షా నాయకత్వం వహించారు" అని చరిత్రకారుడు రవి భట్ పేర్కొన్నారు.

దీని తర్వాత " విప్లవకారులువాజిద్ అలీ షా, బేగం హజ్రత్ మహల్ కుమారుడు బిర్జిస్ ఖదర్‌ను అవధ్ నవాబుగా ప్రకటించారు" అని ఆయన వివరిస్తున్నారు.

"ఆ సమయంలో ఈ ముట్టడి సుమారు ఐదు నెలల పాటు కొనసాగింది. నవంబరులో బ్రిటిష్ వారు ఇక్కడి నుంచి తప్పించుకోగలిగారు. దీనికి ముందు, ఫిరంగి దాడులలో చాలా మంది బ్రిటిష్ వారు మరణించారు" అని రవి భట్ తెలిపారు.

''ముట్టడి సమయంలో, రెసిడెన్సీలో బ్రిటిష్ అధికారులతో కలిసి సుమారు 1,500 మంది పోరాడుతున్నారు. మరోవైపు, 1,200 మంది మహిళలు, పిల్లలు, సాధారణ పౌరులు ఉన్నారు. బ్రిటిష్ వారి వద్ద 30 ఫిరంగులు, 23 లక్షల నగదు ఉంది. రెసిడెన్సీ బయట నుంచి సుమారు 8,000 నుంచి 15,000 మంది భారతీయ సైనికులు ముట్టడి చేశారు'' అని చెప్పారు.

ఈ ఫిరంగులు ఇప్పటికీ రెసిడెన్సీ ప్రాంగణంలోనే ఉన్నాయి. వాటిని రెసిడెన్సీలోని మ్యూజియం భవనం వెలుపల అమర్చారు.

డాక్టర్ ఫారర్ ఆ రెసిడెన్సీలో రెసిడెంట్ సర్జన్‌గా ఉండేవారు. ఆయన నివాసం ముందు ఉన్న ఒక బోర్డు మీద "ముట్టడి సమయంలో గాయపడిన కమాండర్-ఇన్-చీఫ్‌ సర్ హెన్రీ లారెన్స్‌ను జూలై 2వ తేదీన ఇక్కడకు తీసుకొచ్చారు. జూలై 4వ తేదీన హెన్రీ లారెన్స్ మరణించారు" అని రాసి ఉంది.

ముట్టడి సెప్టెంబర్ వరకు కొనసాగింది. కానీ, 1857 సెప్టెంబర్ 22న, మొదటి బ్రిటిష్ సహాయక బృందం కాన్పూర్ నుంచి రెసిడెన్సీకి చేరుకుంది. సర్ హెన్రీ హేవ్‌లాక్ నేతృత్వంలో పంపిన సైన్యంకూడా ఈ ముట్టడిలో చిక్కుకుపోయింది.

"బ్రిటిష్ వారు ఈ రోజును కొంచెం ఊరట లభించిన రోజుగా గుర్తుంచుకుంటారు. అయితే, ముట్టడిని ఛేదించే ప్రయత్నంలో సెప్టెంబర్ 25న షేర్ దర్వాజా సమీపంలో కల్నల్ నీల్ మరణించారు" అని చరిత్రకారుడు రోషన్ తాఖీ చెప్పారు.

ఇప్పటికీ కైసర్‌బాగ్‌లోని నీల్ గేట్ ఈ సంఘటనకు గుర్తుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఈ గేటును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిస్తోంది

"ఈ ఐదు నెలల కాలంలో నవంబర్ 22న బ్రిటిష్ వారు రెసిడెన్సీ నుంచి తప్పించుకోగలిగారు. కొంతకాలం పాటు అవధ్‌పై భారతీయుల నియంత్రణ కొనసాగింది" అని రోషన్ తాఖీ వివరించారు.

అయితే, ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 1858 మార్చిలో బ్రిటిష్ వారు అవధ్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ సైన్యాధికారి సర్ కోలిన్ క్యాంప్‌బెల్ సిక్కు, గూర్ఖా సైనికుల సహాయంతో ఈ విజయాన్ని సాధించారు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)