సీతాఫలం: తక్కువ నీటితో పెరిగే ఈ పంటకు విదేశాలలో ఎలాంటి డిమాండ్ ఉంది?

ఫొటో సోర్స్, IIHR Bangalore
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్, ముంబయి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అశోక్ శివారెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. కానీ దక్షిణ భారతదేశంలోని కరవు ప్రభావిత కోలార్ జిల్లాలో జీవనం కొనసాగించడం చాలా కష్టంగా ఉండేది.
"ఈ ప్రాంతంలో కేవలం 60 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. 1,300 అడుగుల లోతు వరకు రైతులు బోరు తవ్వాల్సి వస్తుంది. నీరు ఎక్కడ పడుతుందో తెలుసుకోవడానికే ఎక్కువ డబ్బు ఖర్చైపోతుంటుంది" అని ఆయన చెప్పారు.
నష్టాలు పెరగడంతో ఆయన కుటుంబం వ్యవసాయాన్ని వదిలేసి 2005లో బెంగళూరులో కూరగాయల దుకాణం తెరిచింది.
తర్వాత శివారెడ్డి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. కానీ, వ్యవసాయం పట్ల ఆయనకున్న ఆసక్తి తగ్గలేదు. దీంతో 2018లో మళ్లీ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ సారి శాస్త్రీయ విధానాలు అవలంబించాలనుకున్నారు.

"చాలా తక్కువ నీటితో, వర్షంపై ఆధారపడి పెరిగే, ఎక్కువ పురుగుమందుల అవసరం లేని పంట కోసం చూస్తున్నా" అని శివారెడ్డి చెప్పారు. ఇందుకు సీతాఫలాల పంటే అనువైది అని ఆయనకు అనిపించింది. పెద్ద అవకాడో సైజులో ఉండే పండు లోపల ఉండే మృదువైన, తీయటి గుజ్జు కస్టర్డ్లాంటి రుచితో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
శివారెడ్డి నివసించే ప్రాంతంలో సీతాఫలం చెట్లు సహజంగా పెరుగుతాయి. అక్కడి ప్రజలు సీతాఫలం పండ్లను సేకరించి మార్కెట్లో అమ్ముతుంటారు. ఇది మంచి అవకాశం అనుకున్నారాయన. అందుకే ఆయన చెట్లను సాధారణం కంటే భిన్నంగా దగ్గరగా నాటారు. అలాగే మూడు వేర్వేరు రకాల విత్తనాలను ఎంపిక చేశారు.
ప్రతి రకానికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానం ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
"నిరుడు సుమారు 20 టన్నులు ఉత్పత్తి చేశా. ఈ ఏడాది 25 టన్నుల వరకు పెరిగింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా సీతాఫలానికి భారీ డిమాండ్ ఉంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పొడి వాతావరణంలో ఈ పండ్లు మనగలిగినప్పటికీ, వీటి పెంపకంలో సవాళ్లు ఉన్నాయి.
సంప్రదాయ బాలానగర్ సీతాఫలం చాలా తక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. దీంతో రైతు త్వరగా అమ్ముకోవాల్సిందే. అలాగే ఈ రకం పండులో గింజలు ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారులకు అంత ఆకర్షణీయంగా ఉండదు.
సీతాఫలం గింజలు కూడా విషపూరితమైనవే. ముఖ్యంగా వాటిని నమిలితే మరింత ప్రమాదం. అందుకే వాటికి దూరంగా ఉండాలి. మరోవైపు సీతాఫలంతో తయారుచేసే ఆహార సప్లిమెంట్ల భద్రతపై యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథార్టీ సందేహాలు వ్యక్తం చేసింది.
"సాంప్రదాయ రకాల రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ గుజ్జు తక్కువగా ఉండటం, గింజలు ఎక్కువగా ఉండటం, నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉండటంవంటి సమస్యలు కూడా ఉన్నాయి" అని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్‌లో ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్ టి.శక్తివేల్ తెలిపారు.
ఐఐహెచ్ఆర్ అర్కా సాహన్ అనే హైబ్రిడ్ రకాన్ని అభివృద్ధి చేసింది. ఇది గది ఉష్ణోగ్రతలో సుమారు వారం రోజులు నిల్వ ఉంటుంది. గింజలు తక్కువగా ఉంటాయి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది. గత 20 ఏళ్లలో ఈ రకం దక్షిణ భారతదేశంలో చాలాచోట్ల విస్తరించింది.
‘‘నాటు రకాలలో 30% మాత్రమే ఉపయోగకరమైన గుజ్జు లభిస్తుంది, అదే హైబ్రిడ్ రకాల్లో 70% వరకు ఉంటుంది. అంటే అదే భూమిలో రైతులకు దాదాపు రెండింతల దిగుబడి వస్తోంది’’ అని శక్తివేల్ చెప్పారు.
అయితే పరిశోధకులు ఈ పండును ప్రాసెస్ చేయడానికి, గుజ్జు తీయడానికి కొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఐస్‌క్రీమ్, మిల్క్‌షేక్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌లలో విస్తృతంగా ఉపయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది.
కానీ, ప్రస్తుతం ఉన్నపెద్ద సమస్య ఏంటంటే సీతాఫలం గుజ్జు తీసిన వెంటనే గోధుమ రంగులోకి మారిపోతోంది. అందుకే ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు కొత్త పరికరాలు, పద్ధతులపై పని చేస్తున్నారు. తద్వారా గుజ్జు ఎక్కువసేపు తెలుపురంగును నిలబెట్టుకోగలుగుతుంది.
సీతాఫలాల ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది . దేశవ్యాప్త ఉత్పత్తిలో దాదాపు మూడో వంతు ఇక్కడే జరుగుతుంది.
ఇక్కడి రైతు నవ్‌నాథ్ మల్హారి కస్పటే అనేక దశాబ్దాలుగా సీతాఫలాల సాగు చేస్తున్నారు. ఆయన భారత్ అంతటా తిరిగి వివిధ రకాల విత్తనాలను సేకరించి, తన ఫామ్‌లో వాటిని క్రాస్-పాలినేట్ చేసి కొత్త రకాలను అభివృద్ధి చేశారు.
"సీతాఫలంపై అంతగా పరిశోధన జరగలేదు కాబట్టి దీనిపై పనిచేయాలనుకున్నా. కొత్త రకం అభివృద్ధి చేయడానికి 12 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఇది త్వరగా అయ్యే పని కాదు, దశాబ్దాల ప్రయోగాల ఫలితం" అని ఆయన తెలిపారు.
ఈ కృషి ఫలితంగా ఆయన రూపొందించిన ఎన్ఎంకే-01 పేరుగల అధిక దిగుబడి ఇచ్చే రకం 2014లో మార్కెట్లోకి వచ్చింది.
ప్రస్తుతం నవ్నాత్ మల్హారి దాదాపు 50 ఎకరాల్లో సీతాఫలాల సాగు చేస్తున్నారు. ఒక్క ఎకరాకు సుమారు 10 టన్నుల దిగుబడి వస్తోంది. ఈ మెరుగైన రకం పాడవకుండా ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల ఎగుమతులకు కూడా అవకాశం కలిగింది. గల్ఫ్ దేశాలతో పాటు యూరప్‌కు కూడా ఈ పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఎగుమతి చేయడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు.
ఇప్పటికీ ఆయన పరిశోధన కొనసాగుతోంది. ప్రస్తుతం మెరుగైన ఆకృతి, ఎక్కువ రోగ నిరోధకత కలిగిన కొత్త రకాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ఎంకే-01 సీతాఫలం రకాన్ని అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్‌కు ఎగుమతి చేస్తున్నట్టు మనోజ్ కుమార్ బరాయ్ చెప్పారు.
ఇది చాలాకాలం నిల్వ ఉంటుంది. దీని తొక్క మందంగా ఉండడం, గుజ్జు ఎక్కువగా ఉండడం, తియ్యటి రుచి ఉండడంతో ఎగుమతికి ఇతర రకాల కంటే అనుకూలంగా ఉంటుందని ఆయన అంటున్నారు.
అయితే ఇలాంటి సున్నితమైన పండ్లను ఎగుమతి చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కోత సమయం, ప్యాకింగ్, రవాణా,, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రతి దశను ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణ అత్యంత కీలకం. ఈ పండు వేడికి త్వరగా పాడైపోతుంది. కొద్దిపాటి వేడి తగిలినా నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే పగటిపూట ఉండే 40°C ఉష్ణోగ్రత ప్రభావం తగ్గించడానికి మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వీటిని రవాణా చేస్తారు.
సీతాఫలాలను ఎగుమతి చేసేముందు సుమారు 5 గంటలు ప్రీ కూలింగ్ చేసి, ఆపై రిఫ్రిజిరేటెడ్ వ్యాన్లలో తరలిస్తారు. తర్వాత కోల్డ్ రూమ్‌లలో నిల్వ చేసి ఎయిర్ ఫ్రైట్ ద్వారా పంపిస్తారు. వీటికోసం ప్రత్యేకంగా అట్టపెట్టెలు కూడా అభివృద్ధి చేశారు. ఇవి పండ్లను తాజాగా, చల్లగా ఉంచడానికి సాయపడతాయి.
అయితే ప్రస్తుతం పండును కాకుండా గుజ్జు లేదా పొడి రూపంలో కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. ఇది ఎగుమతి రంగంలో ఒక "విప్లవం" అని మనోజ్ చెబుతున్నారు.
ఈ గుజ్జును విదేశాల్లో ఐస్‌క్రీమ్ తయారీదారులు, బేకరీలు, అలాగే పల్ప్ షాట్ కేఫ్‌లు ఉపయోగిస్తాయి. అయితే దీన్ని -18°C వద్ద నిల్వ చేయాల్సి రావడం అంత తేలికైన విషయం కాదు.
మళ్లీ కోలార్ దగ్గరకు వస్తే.. రైతు అశోక్ శివారెడ్డి తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారు. మొత్తం పంటతో పాటు పల్ప్ కూడా అమ్మాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కానీ దీనికి భారీ పెట్టుబడి అవసరం అవుతుంది.
"సీతాఫలం పంట ఇప్పుడో వింత స్థితిలో ఉంది. సీతాఫలాలకు డిమాండ్ పెరుగుతోంది అందుకు తగినట్టు ఉత్పత్తి పెరగడం లేదు. వర్షపునీటిపై బతికే ఈ పంటకు రైతులు ఖర్చుతో కూడిన నీటిపారుదల వ్యవస్థను ఉపయోగించాల్సిన పనిలేదు’’ అని అశోక్ అంటున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























