You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆ 'పురాతన' నది సరస్వతేనా? ఎన్జీఆర్ఐ పరిశోధన ఏం చెబుతోంది?
త్రివేణి సంగమం అనగానే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ దగ్గర గంగ, యమున, సరస్వతి నదుల కలయిక అని ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది.
అక్కడ గంగ, యమున నదులు కనిపిస్తుంటాయిగానీ, సరస్వతి కనిపించదు. అది 'అంతర్వాహిని'గా ప్రవహిస్తుంటుందనేది చాలామంది ప్రజల విశ్వాసం.
అయితే, కొన్ని వేల సంవత్సరాల కిందట గంగ, యమునల మధ్య ప్రవహించి.. ఇప్పుడు ఉనికిలో లేని ఓ నదీ ప్రవాహాన్ని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రయాగ్ రాజ్ సమీపంలో ఈ 'పురాతన' (పాలియో) నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
‘‘అది సుమారు పదివేల సంవత్సరాల కిందట ప్రవహించి ఉండొచ్చని భావిస్తున్నాం. దీనిపై ఇంకా పూర్తి అధ్యయనం జరగాలి'' అని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త సుభాష్ చంద్ర బీబీసీతో చెప్పారు.
200 కి.మీ. మేర నదీ ప్రవాహ ఆనవాళ్లు
నదీ ప్రవాహ ఆనవాళ్లు గుర్తించేందుకు రెండు దశలలో సర్వే చేపట్టింది ఎన్జీఆర్ఐ.
మొదట దశలో.. ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమం నుంచి 1200 చ.కి.మీ. పరిధిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సహకారంతో వీరు సర్వే చేపట్టారు.
ఇందులో 14 కి.మీ. మేర 'పురాతన నది' ఆనవాళ్లను గుర్తించారు.
ఆ తర్వాత ఎన్జీఆర్ఐ నిధులతో 14 కి.మీ. నుంచి 45 కి.మీ. వరకు ఉన్న నదీ ప్రవాహంపై పరిశోధన సాగింది.
రెండో దశలో 45 కి.మీ. నుంచి 200 కి.మీ. వరకు నది ఆనవాళ్లను గుర్తించేందుకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (నమామి గంగే) ప్రాజెక్టు ఆర్థిక సహకారం అందించింది.
''ప్రయాగరాజ్ నుంచి కౌశాంబి వరకు, కౌశాంబి నుంచి కాన్పుర్ వరకు.. ఇలా రెండు విడతల్లో సర్వే చేశాం. 2018లో మొదటి సర్వే నిర్వహించగా, తర్వాత నమామి గంగే ప్రాజెక్టు సహకారంతో 2021లో మరోసారి సర్వే చేశాం'' అని సుభాష్ చంద్ర చెప్పారు.
మొదట సర్వేలో గుర్తించిన 45 కి.మీ. 'నదీ ప్రవాహం' మార్గం పరిశోధనలు 2021లోనే వెలుగులోకి రాగా, అక్కడి నుంచి 200 కి.మీ. వరకు నదీ ప్రవాహం ఉన్నట్లుగా తాజా సర్వేలో గుర్తించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు వివరించారు సుభాష్ చంద్ర.
అది సరస్వతి నదేనా?
హిందూ పురాణాల ప్రకారం, సరస్వతి నది అత్యంత పవిత్రమైనది. రుగ్వేదంలో దీని ప్రస్తావన ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లో సరస్వతి నది ప్రవాహం ఎక్కడా కనిపించదు. మరి ఆ నది ఎందుకు కనిపించదు? దీని చారిత్రక నేపథ్యంపై గతంలో బీబీసీ కథనం అందించింది.
అయితే, ఇప్పుడు ఎన్జీఆర్ఐ గుర్తించిన 'పురాతన' నదీ ప్రవాహం గంగ, యమున నదుల మధ్య భాగంలో కనిపిస్తోంది.
ప్రయాగరాజ్ నుంచి ఎగువ భాగంలో… కాన్పుర్ వరకు 200 కి.మీ. వరకు ఈ నది ఆనవాళ్లు లభించాయని సుభాష్ చంద్ర బీబీసీకి వివరించారు.
''గంగ, యుమున నదుల తరహాలోనే వంపులు తిరుగుతూ ఈ పురాతన నదీ ప్రవాహం సాగింది. ఉదాహరణకు ఫతేపుర్ వద్ద గంగ, యమున నదులు బాగా వంపు (బెండ్) తిరిగినట్లుగా ఉంటాయి. అక్కడ ఈ పురాతన నదీ ప్రవాహం కూడా వంపు తిరిగి కనిపిస్తోంది'' అని చెప్పారు.
భూమి ఉపరితలం నుంచి 10-15 మీటర్ల లోతులో దీని ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది సరస్వతి నదేనా అన్న విషయాన్ని సుభాష్ చంద్ర నిర్ధరించలేదు.
''మేం దీన్ని పాలియో నదిగా పిలుస్తున్నాం. అది సరస్వతి నదా, కాదా అన్న విషయంపై అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఆ విషయం జోలికి మేం ఇప్పుడు వెళ్లడం లేదు'' అని స్పష్టం చేశారు.
ఎన్జీఆర్ఐ విడుదల చేసిన మ్యాప్‌లో ఈ 'పురాతన' నది యమునలో కలిసినట్లు చూపించారు.
మరి, ఈ నది యమునకు ఉప నదిగా ఎందుకు భావించకూడదు? అని సుభాష్ చంద్రను బీబీసీ ప్రశ్నించింది.
"అది ఉప నది కాదు, పూర్తిగా వేరే నది. గంగ, యమున నదులకు ఏవైతే కొలతలు (లోతు, వెడల్పు, పరిమాణం) ఉన్నాయో అవే ఈ నదికీ ఉన్నాయి. ప్రవాహం కూడా ఒకే తరహాలో సాగింది" అని చెప్పారు.
గంగా నదికి గంగోత్రి, యమున నదికి యమునోత్రి నుంచి 'ప్రాథమిక' నీటి ప్రవాహం ఉన్నట్లుగానే, ఈ పురాతన నది ఎక్కడ పుట్టిందనే దానిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుభాష్ చంద్ర వివరించారు.
నది కనుమరుగవడానికి కారణమేంటి?
కొత్తగా గుర్తించిన నదీ ప్రవాహం కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్లు శాస్త్రవేత్తలకు అర్థమైంది.
హెలీకాప్టర్ ద్వారా జియోఫిజియోలాజికల్ (హెలీబోర్న్) సర్వే, డ్రిల్లింగ్ ద్వారా సర్వే చేశారు.
ఇందులో నది పారినప్పుడు ఏర్పడే ఒండ్రు మట్టి, ఇసుక వంటి మెటీరియల్ గుర్తించారు. 'టెక్టానిక్' కదలికల వల్ల ప్రభావం కూడా ఈ అంతర్థానానికి కారణంగా అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు.
''గంగ, యమున నదులు ఫతేపుర్ వద్ద వంపు తిరిగి ప్రవహించడానికి టెక్టానిక్ ప్లేట్ల కదలికలు కూడా కారణం కావొచ్చు. నది అంతరించిపోవడానికి కూడా ఆ పరిస్థితి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నాం'' అని చెప్పారు.
ప్రయాగరాజ్‌కు 26 కి.మీ. వరకు..
ప్రస్తుతం ప్రయాగరాజ్ సమీపంలో ఉన్న త్రివేణి సంగమ ప్రాంతానికి సుమారు 26 కి.మీ. దూరం వరకు ఈ 'పురాతన' నది ఆనవాళ్లను గుర్తించారు.
"ప్రయాగరాజ్‌లో సర్వే చేపట్టినప్పుడు నిర్మాణాలు, కరెంటు తీగల కారణంగా చాలా తక్కువగా ఆనవాళ్లు లభించాయి. అంటే స్వల్ప ప్రవాహాలే అని తెలిశాయి. అవి ఆక్విఫయర్స్ (చిన్న చిన్న నీటి ప్రవాహాల వంటివి) కూడా అవ్వొచ్చు. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో.. అక్కడ లభించాయి. ప్రయాగరాజ్‌లోనూ భరద్వాజ ఆశ్రమం వద్ద ఆనవాళ్లు కనిపించాయి. కానీ డ్రిల్లింగ్ చేసి నిర్ధరించుకునేందుకు నగరమంతా సర్వే చేస్తేనే నదీ ప్రవాహంపై స్పష్టత వస్తుంది" అని సుభాష్ చంద్ర వివరించారు.
భవిష్యత్తులో హిమాలయాల వరకు సర్వే చేస్తే, నది పుట్టుక, ప్రవాహంపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని ఆయన చెబుతున్నారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా సరస్వతి నది రూపం మారిందా?
'పురాతన' నది సరస్వతి అని ఎన్జీఆర్ఐ నిర్ధరించలేదు కానీ మరోసారి సరస్వతి నదీ ప్రవాహంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
గతంలోనూ వివిధ సందర్భాల్లో సరస్వతి నది ఆనవాళ్లపై అధ్యయనాలు జరిగాయి.
1999 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సరస్వతి నది అన్వేషణకు అప్పటి సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జగ్మోహన్ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ... సరస్వతి నది ఉనికికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనందున ఆ ప్రాజెక్టును కొనసాగించడంలేదని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి జైపాల్ రెడ్డి పార్లమెంట్‌కు తెలిపారు.
2006లో సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి నాయకత్వం వహించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ విషయంలో సరైన విధానాలు పాటించలేదని ఆయన మండిపడ్డారు.
2009లో యూపీఏ-2 అధికారంలోకి వచ్చాక బీజేపీ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ లేవనెత్తిన ప్రశ్నకు జలవనరుల శాఖ ఇచ్చిన సమాధానంలో భూగర్భంలో ఓ ప్రాచీన నీటి వనరును ఇస్రో కనుగొందని, బహుశా అది వేద కాలంనాటి సరస్వతి నది అయి ఉండవచ్చని ప్రభుత్వం తెలిపింది.
2014 మేలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఆ ఏడాది నవంబరులో 76 పేజీల ఓ నివేదికను ప్రభుత్వానికి ఇస్రో సమర్పించింది.
రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచారం ఆధారంగా సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ మీదుగా కచ్ ఎడారిలో కలిసినట్టు ఆ నివేదిక పేర్కొంది.
"మేం గుర్తించిన పాలియో నది సరస్వతా.. కాదా.. అనే దాని కంటే కూడా ఈ నదిని రీచార్జి చేయడం వల్ల భవిష్యత్తు బాగుంటుందని చెప్పగలను" అని సుభాష్ చంద్ర వివరించారు.
రీచార్జి చేయడం వల్ల గంగ, యమున నదుల్లో కూడా భూగర్భ జలాలు పెరిగి నీటి శుద్ధి జరుగుతుందని వివరించారు.
పురాతన నదిని రీచార్జి చేసేందుకు ఆరుచోట్ల ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారాయన.
" ఇందుకోసం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కావచ్చు" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)