పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయనేది నిజమేనా?
- రచయిత, సారా బెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ కోడి కూర, సూడాన్ ఒంటె బిర్యానీ, మలేషియన్ లక్సా (సూప్) లేదా బంగ్లాదేశ్ మాచెర్ ఝోల్(చేపల పులుసు).. వీటిలో ఏది వండినా అన్నింటిలోనూ ఉండే ఒక సాధారణ పదార్థం పసుపు.
అయితే, ఆహారాన్ని రుచికరంగా మార్చడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత ఇష్టపడే ఈ సుగంధ ద్రవ్యం మన ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం చూపగలదా?
"మాది పంజాబీ కుటుంబం. పసుపు ఉపయోగించని వంటకాన్ని నేనసలు ఊహించలేను" అని దక్షిణాసియా డయాస్పోరాపై ప్రత్యేకంగా పరిశోధనలు చేసే ఫుడ్ రీసర్చర్, పాడ్‌క్యాస్టర్ రాగిణి కశ్యప్ 'ఫుడ్ చైన్' కార్యక్రమంతో చెప్పారు.
ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఈ పసుపులో దాదాపు 30 రకాలు ఉన్నాయి.
దక్షిణాసియా వలసదారులతో పాటు ప్రయాణించిన పసుపు.. తూర్పున పసిఫిక్ దీవులైన బాలి, ఫిజీలతో పాటు పశ్చిమాన కరేబియన్ దీవుల వరకూ విస్తరించి ప్రపంచవ్యాప్తంగా తన తనదైన ముద్ర వేసింది.

'బలమైన సందేశం'
2,500 ఏళ్ల క్రితం నాటి గ్రంథాలలో పసుపు ప్రస్తావన ఉందని రాగిణి కశ్యప్ చెప్పారు. దక్షిణాసియాలో ఇది ప్రతిచోటా కనిపిస్తుంది. దీనికి యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయనే బలమైన నమ్మకం ప్రజల్లో ఉంది.
"నాకు ఒంట్లో బాగోలేనప్పుడు, ముందుగా గుర్తొచ్చేది ఇదే. ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇందులో కొంత ఓదార్పు, కొంత ఔషధం, కొంత గత జ్ఞాపకం ఉంటాయి" అని ప్రస్తుతం దుబయ్‌లో నివసిస్తున్న రాగిణి కశ్యప్ వివరిస్తున్నారు.
భారతదేశంలో వివాహానికి ముందు జరిగే 'హల్దీ' వేడుకలోనూ ఇది ఒక భాగం. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఈ ఆచారంలో పసుపు ముద్దను రాసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు పాశ్చాత్య దేశాల వినియోగదారులు ఈ పురాతన నమ్మకాల గురించి తెలుసుకోవడంతో పసుపు విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి.
పసుపు ఆధారిత ఆరోగ్య ఉత్పత్తుల(సప్లిమెంట్ల)లో సాధారణంగా 'కర్కుమిన్' అనే సమ్మేళనం ఉంటుంది. పసుపులోని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రధాన కారణం ఇదేనని భావిస్తారు.
ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఈ సప్లిమెంట్లను మార్కెట్‌లో అమ్ముతున్నారు.
పసుపు వినియోగంతో కలిగిన సానుకూల అనుభవాలను ప్రజలు సోషల్ మీడియాలో పంచుకోవడమే దీనికి ఇంత ఆదరణ లభించడానికి కొంతవరకు కారణమని రాగిణి కశ్యప్ అంటున్నారు.
"దాదాపు వంద కోట్ల మందిలో, ఎక్కువ సంఖ్యలో ప్రజలు పసుపు ఎన్నో సమస్యలను పరిష్కరించగలదని బలంగా నమ్మితే.. అది ప్రపంచవ్యాప్తంగా వినిపించే బలమైన సందేశం. దానికి లాబీయింగ్, సప్లిమెంట్ కంపెనీలు, ఇతర సంస్థలు కూడా తోడైతే, ఆ సందేశం మరింత బలంగా మారుతుంది" అని ఆమె అన్నారు.
'అధ్యయనం సులభం కాదు'
అయితే, కొందరు దీని ప్రయోజనాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన రసాయన శాస్త్రవేత్త డాక్టర్ క్యాథరిన్ నెల్సన్, కర్కుమిన్‌పై ఉన్న 100కు పైగా పరిశోధనా పత్రాలను సమీక్షించారు.
"ఇది అన్నింటినీ నయం చేయగలదనే వాదనలు ఉన్నప్పటికీ, పెద్దగా ఏమీ చేయలేదని తెలిసింది" అని ఆమె చెప్పారు.
పసుపు రసాయన సమ్మేళనంలోనే అసలు సమస్య ఉండవచ్చని, అందుకే దీనిపై అధ్యయనం చేయడం సులభం కాదని క్యాథరిన్ నెల్సన్ అంటున్నారు.
ఇది అత్యంత వేగంగా ప్రతిస్పందిస్తుంది, పరీక్షల్లో జోక్యం చేసుకునే సమ్మేళనంగా కూడా పనిచేయవచ్చు. అంటే, ఇది వాస్తవానికి పని చేయనప్పటికీ, పని చేస్తున్నట్లుగా అనిపించవచ్చు.
దీన్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడు చాలా చిన్న భాగం మాత్రమే రక్త ప్రసరణలోకి ప్రవేశిస్తుందని, శరీరం దీనిని సరిగ్గా గ్రహించదని క్యాథరిన్ నెల్సన్ చెప్పారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు చాలామంది దీనిని నల్ల మిరియాలతో కలిపి తీసుకుంటారు.
"ఏదైనా ఉపయోగకరమైన ఔషధాన్ని తయారు చేయడానికి ప్రారంభ పదార్థంగా తీసుకోవాలంటే ఇది నిజంగా అత్యంత చెత్త రసాయన నిర్మాణాల్లో ఒకటి" అని క్యాథరిన్ నెల్సన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మేం నిరాశ చెందాం'
దశాబ్దాలుగా పసుపుపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఫలితాలు తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అధ్యయనాల నాణ్యతలోనూ తేడాలు ఉంటున్నాయి.
పసుపు ప్రయోజనాలను సమర్థించే అనేక అధ్యయనాలు మనుషులపై నిర్వహించినవి కావని కెనడాలోని ఒంటారియోలో ఉన్న లండన్ హెల్త్ సైన్సెస్ సెంటర్‌లో కిడ్నీ వ్యాధుల నిపుణులైన ప్రొఫెసర్ అమిత్ గార్గ్ చెబుతున్నారు.
ఆయన, ఆయన సహచరులు కలిసి రెండు అతిపెద్ద అధ్యయనాలు నిర్వహించారు, ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద అధ్యయనాల్లో ఇవి కూడా భాగం. అయోర్టిక్ ఎన్యూరిజం(మహా ధమని సంబంధిత) చికిత్స తీసుకుంటున్న వ్యక్తులలో కర్కుమిన్ కిడ్నీ గాయాన్ని, వాపును నిరోధించగలదా లేదా అని నిర్ధరించడానికి మొదటి అధ్యయనం చేశారు. 600 మంది రోగులతో నిర్వహించిన ఈ ట్రయల్‌లో కర్కుమిన్ వల్ల ఎలాంటి ప్రయోజనకరమైన ప్రభావాన్ని గుర్తించలేకపోయారు.
ఆ తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందేమోనని లేదా వారి వ్యాధి ముదరకుండా అడ్డుకుంటుందేమోనని చూడటానికి కర్కుమిన్‌లోని ఒక చిన్న సూక్ష్మకణాన్ని ఇచ్చి ప్రయత్నించారు. కానీ, దీని వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉన్నట్లు వారు నిరూపించలేకపోయారు.
"మేం నిరాశ చెందాం. ఎందుకంటే, ఈ ట్రయల్‌ను ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా ప్రారంభించాం. కర్కుమిన్ పనిచేయదని నిరూపించాలన్నది మా ఉద్దేశం కాదు" అని ఆయన అన్నారు.
కానీ, వేల సంవత్సరాలుగా ప్రజలు దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నప్పుడు, ముఖ్యంగా భారత్‌లో ఈ వాస్తవాన్ని మనం ఎలా వివరించగలం?
సహజంగా లభించే ఒక పదార్థం నుంచి ఒక నిర్దిష్ట సమ్మేళనాన్ని వేరు చేసి దాన్ని ఔషధంగా మార్చడానికి ప్రయత్నించడం, అదే సహజ పదార్థాన్ని పూర్తిగా వంటల్లో ఉపయోగించడం లేదా చర్మంపై పూయడం మధ్య స్పష్టమైన తేడా ఉందని డాక్టర్ గార్గ్ చెప్పారు.
కాబట్టి, ఖరీదైన సప్లిమెంట్లు కొనుగోలు చేయడం సరైనదేనని నిపుణులు భావిస్తున్నారా?
వాటి ధరతో పాటు, అవి పనిచేస్తాయనడానికి తగినంత ఆధారాలు కూడా లేవని ప్రొఫెసర్ గార్గ్ చెప్పారు. ఇతర ఔషధ ఉత్పత్తులకు వర్తించే అదే స్థాయి నియంత్రణ నిబంధనలు సహజ ఆరోగ్య ఉత్పత్తులకు ఉండవని ఆయన అంటున్నారు.
"మనం కచ్చితంగా ఓపెన్ మైండ్‌తో ఉండవచ్చు. కానీ, ఒక పదార్థం ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నప్పుడు, దానికి అధిక నాణ్యత గల ఆధారాలు ఉండాలనే ప్రమాణాలను మనం పాటించాలి" అని ఆయన అన్నారు.
అయితే, దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుని ఆస్వాదించడం వల్ల ఎలాంటి సమస్యా లేదని ఆయన అంటున్నారు.
"పసుపుతో చేసిన ఆహారాన్ని ప్రజలు ఇష్టంగా తింటుంటే, దాన్ని కొనసాగించమని నేను వారిని ప్రోత్సహిస్తాను" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























