‘మోజ్తబా ఖమేనీ 90శాతం ఖతం’ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై పెరిగిన ఊహాగానాలు

ఇరాన్, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2026 మార్చి 9న తెహ్రాన్‌లో కనిపించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ (కుడివైపు), ఆయన దివంగత తండ్రి అలీ ఖమేనీల పోస్టర్లు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారని, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ కూడా 90 శాతం ఖతమైపోయారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.

"ప్రస్తుతం వారి వద్ద నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అంతా తుడిచి పెట్టుకు పోయింది. వారి వైమానిక రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి నాయకులందరూ హతమయ్యారు. వారి అత్యుత్తమ నాయకులు మరణించారు. ఖమేనీ కథ ముగిసింది, ఆయన కుమారుడు కూడా 90 శాతం ఖతమయ్యాడు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, అంతకుముందు మోజ్తబా ఖమేనీ పేరుతో శనివారం విడుదలైన ఒక రాతపూర్వక ప్రకటనలో, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది.

"మీ పవిత్ర రక్తానికి, ఈ రెండు యుద్ధాలలో అమరులైన వారందరి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మేం సంకల్పం పూనుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతీకారం తీర్చుకోవడానికి పలువురు సిద్ధంగా ఉన్నారు. చాలా తొందర్లోనే ప్రపంచంలో స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరూ ఈ మిషన్‌లో తమవంతు భాగాన్ని పూర్తి చేస్తారు" అని ఆ ప్రకటనలో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఏప్రిల్‌లో మోజ్తబా గాయపడినట్లు వార్తలు

2026 ఏప్రిల్ 23న అమెరికా వార్తాపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' ఒక కథనం ప్రచురించింది.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆ కథనం పేర్కొంది.

అయినప్పటికీ, ఆయన "మానసికంగా పూర్తిగా చురుగ్గా" ఉన్నట్లు తెలిపింది.

పేర్లు వెల్లడించని పలువురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ, మోజ్తబా ఖమేనీ ప్రస్తుతానికి నిర్ణయాలు తీసుకునే బాధ్యతలను రివల్యూషనరీ గార్డ్స్ ఐడియాలజీ ఆర్మీకి చెందిన జనరల్‌లకు అప్పగించారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

"ఆయన ఒక కాలుకు మూడుసార్లు శస్త్రచికిత్స జరిగింది, ప్రస్తుతం కృత్రిమ కాలు (ప్రోస్థెటిక్) అమర్చడం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక చేతికి కూడా సర్జరీ జరగగా, దాని పనితీరు నెమ్మదిగా పుంజుకుంటోంది. ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడం వల్ల మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు" అని అధికారులు తెలిపినట్లు పత్రిక పేర్కొంది.

చివరికి ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరమవుతుందని ఆ కథనంలో వెల్లడించారు.

ఇదే ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు. నియామకం జరిగినప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ఎలాంటి వీడియో సందేశాన్ని కూడా విడుదల చేయలేదు.

దీంతో ఆ దాడిలో మోజ్తబా ఎంత తీవ్రంగా గాయపడ్డారు? అమెరికాతో యుద్ధాన్ని ముగించడానికి జరిగిన చర్చల్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది? అనే విషయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆదివారం జరిగిన శ్రద్ధాంజలి సభకు అలీ ఖమేనీ మిగతా ముగ్గురు కుమారులు మసూద్, ముస్తఫా, మేయసామ్ హాజరయ్యారు. వారి పక్కన దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి అహ్మద్ వహీదీ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

ఇరాన్, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 మే 31 నాటి ఫోటోలో మోజ్తబా ఖమేనీ

నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు?

అలీ ఖమేనీ 1989 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను మరణించే వరకు ఇరాన్‌ను నడిపించారు. ఇరాన్ సుప్రీం లీడర్‌కు దేశ సైనిక కమాండ్ బాధ్యతలు నిర్వహించడం, న్యాయవ్యవస్థ అధిపతితో పాటు పలు ఇతర కీలక పదవులలో నియామకాలు చేయడం, యుద్ధం లేదా శాంతిని ప్రకటించడంతో పాటు ఇతర ముఖ్యమైన నాయకత్వ అధికారాలు ఉంటాయి. మతాధికార, గణతంత్ర వ్యవస్థల కలయిక కలిగిన ఇరాన్ రాజకీయ నిర్మాణంలో సుప్రీం లీడర్‌ పదవికే సర్వాధికారాలు ఉంటాయి.

తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ప్రజలతో పాటు ప్రపంచం మొత్తానికి మోజ్తబా ఖమేనీ మొదటి బహిరంగ రూపం కనిపిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఆ కార్యక్రమం ఆయన రాకుండానే ముగిసింది.

అలీ ఖమేనీ వంటి బలమైన అజమాయిషీ లేకపోవడం వల్ల, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అధికార పోరాటంలో ఏ వర్గం పైచేయి సాధిస్తుందో, దేశం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలను ఎలా అధిగమిస్తుందో అనేది మరింత అనిశ్చితంగా మారింది.

"వివిధ వర్గాల మధ్య జరుగుతున్న అధికార పోరాటంలో రాజీ కుదిర్చే సమర్థవంతమైన కేంద్ర అధికారం ప్రస్తుతానికి అక్కడ లేదు" అని స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌కు చెందిన ఇరాన్ చరిత్రకారుడు అలీ అన్సారీ ది న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

ఈ పరిస్థితి గత 37 ఏళ్లుగా ఇరాన్ ప్రజల అనుభవానికి పూర్తిగా భిన్నమైనది. అలీ ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో నిరంతరం చురుగ్గా, ప్రభావవంతంగా ఉండేవారు. ఆయన క్రమం తప్పకుండా బహిరంగ ప్రకటనలు చేస్తూ తన అభిప్రాయాలను స్పష్టం చేసేవారు.

మార్చి మధ్య నుంచి ఇప్పటివరకు మోజ్తబా ఖమేనీ పేరుతో విడుదలైన దాదాపు ఒక డజను రాతపూర్వక ప్రకటనలు మినహా... ఇరాన్ ప్రజలకు ఆయన వ్యక్తిత్వం, పనితీరు లేదా ఆలోచనలపై ఎలాంటి అవగాహన కలగలేదు. ఈ ప్రకటనలు అధికారిక సెలవు దినాల సందర్భాలలో విడుదలయ్యాయి, కొన్నింటిలో విధానపరమైన అంశాలపై ఆయన అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే చరిత్రకారుడు అలీ అన్సారీ అభిప్రాయం ప్రకారం, ప్రజలు ఆయన్ను స్వయంగా చూసేవరకు లేదా ఆయన స్వరం వినేవరకు, ఆయన నిజంగా ఏం ఆలోచిస్తున్నారనేది తెలుసుకోవడం అసాధ్యం

జూన్ నెలలో విడుదల చేసిన ఒక ప్రకటనలో, సూత్రప్రాయంగా తనకు ఈ ఒప్పందం ఇష్టం లేదని, అయితే అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇచ్చిన హామీల తర్వాతే దీనికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మోజ్తబా ఖమేనీతెలిపారు.

అయినప్పటికీ, ఆయన చేసిన ఈ ప్రకటన ఇరాన్‌లో ఒప్పందంపై జరుగుతున్న తీవ్రమైన చర్చలను ఆపలేకపోయింది. దీనికి విరుద్ధంగా, ఇరుపక్షాలు తమ తమ వాదనలకు మద్దతుగా ఈ ప్రకటనను వాడుకున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)