You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లకు దీనికి తేడా ఏమిటి
- రచయిత, రాహుల్ కాలా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
భారతీయ రైల్వే 2026 జూలై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ రైలును ప్రారంభించబోతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించనున్నారు. దీంతో, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైళ్లు నడుస్తున్న దేశాల సరసన భారత్ కూడా చేరనుంది.
విద్యుత్, డీజిల్ లేకుండా ఈ రైలు ఇంజన్ ఎలా పనిచేస్తుంది, దీని సాంకేతికత ఏమిటి? హరియాణాలో నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ ఏమిటి?
మే నెలలో, నార్తర్న్ రైల్వేలోని జింద్- సోనీపత్ సెక్షన్‌లో 10 బోగీల హైడ్రోజన్ ఆధారిత రైలును నడపడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది.
ఈ రైలు 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.
జింద్- సోనీపత్ మధ్య దూరం సుమారు 89 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఈ రైలు 2 గంటల్లోనే చేరుకుంటుంది.
ఈ సర్వీసు 74010, 74009 నెంబర్ రైళ్లుగా నడుస్తుందని భారత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారంలో వెల్లడైంది.
74010 నంబర్ రైలు ఉదయం 7:40 గంటలకు జింద్ నుంచి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు సోనీపత్ చేరుకుంటుంది.
అదేవిధంగా, 74009 నంబర్ రైలు ఉదయం 10:40 గంటలకు సోనీపత్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు జింద్ చేరుకుంటుంది.
హైడ్రోజన్ ఇంధన రైలు జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేరా, భంభేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రబ్రా, లాత్, మోహనా, బార్వాస్ని స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు రోజులో రెండు ట్రిపులు తిరుగుతుంది. మొత్తంగా రోజుకు 356 కి.మీల దూరాన్ని ఇది కవర్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ రైలులో ఒకేసారి మొత్తంగా 682 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.
హైడ్రోజన్ ఇంధన రైలు ఇప్పుడున్న ట్రాక్‌లపైనే తిరుగుతుంది.
హైడ్రోజన్ రైళ్లు సాధారణ రైల్వే ట్రాక్‌లపై ప్రయాణించగలవు. దీని కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మించాల్సిన అవసరం లేదు.
హైడ్రోజన్ ఎలా నింపుతారు?
ఈ ప్రాజెక్టులో ఇది చాలా ముఖ్యమైంది. భారతీయ రైల్వే అందించిన సమాచారం మేరకు.. ఈ రైళ్లకు హైడ్రోజన్ నింపేందుకు జింద్‌లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్‌ను నిర్మించారు.
ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సీజన్‌గా విడగొడతారు. ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను అధిక పీడన ట్యాంకులలో నిల్వ చేసి, అక్కడ నిర్మించిన ప్రత్యేకంగా ఇంధన నింపే సైడింగ్/స్టేషన్ వద్ద రైలులో నింపుతారు.
అందుకే, సాధారణ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఇంధన కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జింద్‌లోనే ఒక ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
పీఐబీ షేర్ చేసిన సమాచారంలో.. ఈ ప్రాంతంలో కంప్రెష్డ్ హైడ్రోజన్ గ్యాస్‌ను నిల్వ చేసేందుకు, పంపిణీ కోసం అవసరమైన లైసెన్స్‌ను పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) జారీచేసింది. రీఫ్యూయలింగ్ ఆపరేషన్స్ కోసం హైడ్రోజన్ కంప్రెషన్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
హైడ్రోజన్ గ్యాస్ నింపే ప్రక్రియ సజావుగా, అంతరాయం లేకుండా జరిగేలా చూసేందుకు 'హైడ్రోజన్ కంప్రెషన్ సిస్టమ్'ను (గ్యాస్ కంప్రెషన్ మెషిన్) ఏర్పాటు చేశారు.
దీంతో పాటు, అవసరమైన సాంకేతిక సహాయం, విడి భాగాలు కూడా అందించారు. అదనంగా, అత్యవసర పరిస్థితుల కోసం ఒక అదనపు కంప్రెషర్‌నూ ఏర్పాటు చేస్తున్నారు.
భారతీయ రైల్వే ప్రకారం.. ప్రపంచంలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైలును వాడుతున్నాయి, పరీక్షిస్తున్నాయి. ఈ రైలును నడిపేందుకు సిద్ధం కావడంతో.. పర్యావరణాన్ని కాపాడేందుకు అధునాతన సాంకేతికతను వాడుతున్న ప్రపంచంలోనే ఈ కొన్ని ప్రత్యేక దేశాల జాబితాల్లో భారత్ కూడా చేరింది.
హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?
సాధారణ రైళ్లు బొగ్గు, డీజిల్ లేదా ఎక్కువగా విద్యుత్‌తో నడుస్తుంటాయి. ఈ రైళ్ల ఇంజిన్ల నుంచి బయటికి వచ్చే గ్యాస్ లేదా పొగ.. పెద్ద ఎత్తున కాలుష్యానికి కారణమవుతుంది.
హైడ్రోజన్ రైలులో ప్రత్యేక ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ టెక్నాలజీ హైడ్రోజన్ గ్యాస్ సహాయంతో రసాయన చర్య జరిపి, స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైలును నడిపిస్తుంది.
డీజిల్ ఇంజన్లు నల్లటి పొగను వెదజల్లుతుండగా, హైడ్రోజన్ ఇంజన్లు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ఇతర ఇంజన్లలా కాకుండా, హైడ్రోజన్ ఇంజన్లు కాలుష్యాన్ని విడుదల చేయవు.
'నేషనల్ హైడ్రోజన్ మిషన్' అంటే ఏమిటి?
2022 ఫిబ్రవరిలో భారత్ 'నేషనల్ హైడ్రోజన్ మిషన్'ను ప్రకటించింది. ఈ మిషన్ కింద.. 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల 'గ్రీన్ హైడ్రోజన్'ను ఉత్పత్తి చేయనుంది.
గ్రీన్ హైడ్రోజన్ తయారీకి నీరు, తక్కువ రేటుకు లభించే విద్యుత్ అవసరం. భారత్‌లో ఈ రెండు వనరులు ఉన్నాయి. భారత్‌కు చాలా పొడవైన తీరప్రాంతం ఉంది. అలాగే, సూర్యరశ్మి కూడా పుష్కలంగా లభిస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో సౌరశక్తి, సముద్రపు నీరు ఎంతగానో ఉపయోగపడతాయి. భారత్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, ప్రపంచ స్థాయిలో 'గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్'గా అవతరించడానికి సిద్ధమవుతోంది.
అంచనా కంటే తక్కువ ఖర్చు
'హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్' స్కీమ్ కింద తన చారిత్రాత్మక, కొండ మార్గాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించిందని 2023 ఫిబ్రవరిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు.
ఈ మార్గంలో భూఏర్పాట్ల కోసం రూ.70 కోట్లను, రైలును తయారీకి సుమారు రూ.80 కోట్లు.. మొత్తంగా రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు.
అయితే, ఆ తర్వాత, జింద్- సోనీపత్ సెక్షన్ కోసం కొత్త రైలును నిర్మించడానికి బదులుగా, రైల్వే మంత్రిత్వ శాఖ అప్పటికే ఉన్న డీజిల్ రైలు ఇంజిన్‌ను మార్చి, దానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని అమర్చింది. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం రూ.150 కోట్ల నుంచి రూ.111.83 కోట్లకు తగ్గింది.
రూ. 111.83 కోట్లలో, కొంత భాగాన్ని రైలు లోపల ఈ కొత్త హైడ్రోజన్ టెక్నాలజీని అమర్చడానికి ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని జింద్ స్టేషన్‌లో హైడ్రోజన్ గ్యాస్‌ను నిల్వ చేయడానికి ఒక స్టోరేజ్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయడం, రైలులో గ్యాస్ ఫిల్లింగ్ సిస్టమ్‌ను అమర్చడం వంటి క్షేత్రస్థాయి ఏర్పాట్ల కోసం వెచ్చించారు.
ఇప్పుడు స్టేషన్, హైడ్రోజన్ రైలు సిద్ధంగా ఉన్నాయి. ఇది జూలై 17 నుంచి హరియాణాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు తన రోజువారీ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
పైలట్ ప్రాజెక్టుగా జింద్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
''మిగిలిన హరియాణా జిల్లాలతో పోలిస్తే జింద్ భౌగోళికంగా మెరుగైన స్థానంలో ఉంది'' అని హరియాణా నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులు సంజయ్ భాటియా బీబీసీతో అన్నారు.
ఇక్కడ పట్టణ జనాభాతో పాటు, గ్రామీణ జనాభా కూడా ఎక్కువగా ప్రభావితమవుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం జింద్‌ను ప్రధాన గమ్యస్థానంగా పెట్టుకుని, ఇక్కడి నుంచి హైడ్రోజన్ రైలును నడపాలని ఆలోచిస్తోంది.
ఇది కాకుండా, రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు జింద్‌లో ఉపాధి అవకాశాలను పెంచే ఏ పెద్ద ప్రాజెక్టునూ తీసుకురాలేకపోయాయని ఆయన అన్నారు.
రైలు రవాణా కోసం విద్యుత్ తీగలు ఇంకా వేయని ప్రాంతాలలో డీజిల్ రైళ్ల కంటే హైడ్రోజన్ రైళ్లు మెరుగైనవని సంజయ్ భాటియా అన్నారు. జింద్ కూడా అలాంటి ప్రాంతాలలో ఒకటని పేర్కొన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)