ఫుట్‌బాల్ ప్రపంచకప్: డిఫెన్స్‌తో ఎంబాపేని కట్టడి చేసి, ఫ్రెంచ్ జట్టును ఇంటికి పంపిన స్పెయిన్...

    • రచయిత, సామ్ డ్రూరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి స్పెయిన్ ఫైనల్‌కు చేరింది. డాలస్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో ఓడిపోవడంతో ఫ్రెంచ్ జట్టు ఇంటి ముఖం పట్టింది.

దూకుడుగా ఆడే ఆటగాళ్లతో నిండిన ఫ్రెంచ్ జట్టును లూయిస్ డి లా ఫ్యూంటే జట్టు నిలువరించింది.

స్పెయిన్‌కు పెద్దగా అవకాశాలు లభించనప్పటికీ, మైఖేల్ ఓయార్జాబల్, పెడ్రో పోరో వేసిన గోల్స్‌తో స్పెయిన్ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

తొలి అర్థభాగం మధ్యలో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. బంతిని క్లియర్ చేసే ప్రయత్నంలో ఫ్రాన్స్ లెఫ్ట్‌బ్యాక్ ఆటగాడు లూకాస్ డెనీ స్పెయిన్ ఫార్వర్డ్ ప్లేయర్ లామిన్ యమాల్‌ను బలంగా ఢీ కొట్టడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ప్రకటించారు.

ఒయార్జబల్ ఆ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో స్పెయిన్‌కు ఆధిక్యం లభించింది. ఆ తర్వాత స్పెయిన్ మ్యాచ్ మీద పట్టు పెంచుకుంది.

ఫస్ట్ హాఫ్ నిస్తేజంగా ముగిసినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ పుంజుకుంటుందని ఆశించారు. అయితే స్పెయిన్ సెకండ్ హాఫ్‌లోనూ చెలరేగి ఆడటంతో ఫ్రాన్స్ తేరుకోలేక పోయింది.

పెడ్రో పోరో వన్ – టూ వ్యూహాంతో డాని, ఓల్మోతో ఆడి రెండో గోల్ సాధించాడు.

దీని తర్వాత ఫ్రాన్స్‌కు పుంజుకోవడానికి అరగంటకు పైగా సమయం లభించినప్పటికీ స్పానిష్ జట్టు ఆట తీరుతో ఫ్రెంచ్ టీమ్ తేలిపోయింది.

ఈ టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్ ఇప్పటివరకు ప్రత్యర్థికి కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది.

పక్కా వ్యూహంతో పకడ్బందీగా ఆడిన స్పెయిన్

స్పెయిన్ మ్యాచ్ చివరి వరకు పూర్తి ప్రశాంతంగా సంయమనంతో అద్భుతంగా ఆడి సునాయాసంగా గెలిచింది.

వరుసగా మూడో ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరాలన్న ఫ్రాన్స్ కల చెదిరిపోయింది. ఫ్రాన్స్ జట్టు మూడో స్థానం కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో ఆడనుంది.

ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డేషాంప్స్ 14 ఏళ్ల పదవీకాలానికి ఈ టోర్నమెంట్ చివరిది కానుంది. ఈ టోర్నీ తర్వాత ఆయన తన కోచ్ పదవికి గుడ్‌బై చెప్పబోతున్నారు.

ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు స్పెయిన్ న్యూజెర్సీ చేరుకుంటోంది. ఫైనల్‌లో స్పెయిన్‌తో తలపడేందుకు ఇంగ్లండ్, అర్జెంటీనా జట్లు బుధవారం రెండో సెమీఫైనల్ ఆడనున్నాయి.

రెండోసారి ప్రపంచ కప్ టైటిల్ గెలవాలని స్పెయిన్ పట్టుదలగా ఉంది.

ఫ్రాన్స్ డిఫెన్స్‌ను బద్దలు కొట్టిన స్పెయిన్

ప్రపంచకప్‌లో అత్యంత బలంగా దాడి చేసే జట్టు, టోర్నమెంట్‌లో అత్యంత బలమైన డిఫెన్స్ ఉన్న జట్టుకు మధ్య జరిగిన పోరుగా స్పెయిన్- ఫ్రాన్స్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను అభివర్ణించారు.

అయితే మ్యాచ్ మొదలైన తర్వాత అంతా ఏకపక్షంగా సాగింది. స్పెయిన్ డిఫెన్స్ ప్లేయర్లు, ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపేను కట్టడి చేసి, అతను చెలరేగి ఆడకుండా నిరోధించారు.

టోర్నమెంట్ ఆద్యంతం ఫ్రాన్స్ తమ ఎటాకింగ్‌తో ఆకట్టుకుంది. స్పెయిన్ ఎలాంటి సంచలనాలు లేకుండా ప్రశాంతంగా, నిలకడగా ఆడింది. స్పెయిన్ ఆట అంత ఆర్భాటంగా లేకపోయినా వారి సామర్థ్యాలపై ఎవరికీ సందేహాలు లేవు.

యూరో 2024 గెలిచిన స్పానిష్ జట్టుకు అతిపెద్ద బలం లామిన్ యమాల్, నికో విలియమ్స్ అద్భుతమైన వింగ్ ప్లే.

అయితే ఈ సీజన్‌లో గాయాలు వారి ప్రభావాన్ని పరిమితం చేశాయి. వాళ్లిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క గోల్ మాత్రమే సాధించగలిగారు. అయితే టోర్నమెంట్ సాగేకొద్దీ లామిన్ యమాల్ ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న 2010 నాటి విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్రి మిడ్‌ఫీల్డ్ ప్రదర్శన అమోఘం. ఆరంభంలో ఫ్రాన్స్ వైపు నుంచి జరిగిన అనేక ఎటాక్‌లను అడ్డుకుని తన జట్టు దాడికి పునాది వేసి మ్యాచ్ వేగాన్ని నియంత్రించాడు.

తీవ్రమైన యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ గాయం కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరమైన రోడ్రి ప్రస్తుతం 2024లో బ్యాలన్ డి'ఓర్ గెలుచుకున్నప్పటి రేంజ్‌లో కనిపిస్తున్నాడు.

బార్సిలోనా ప్లేమేకర్ పెడ్రి స్థానంలో తనను ఎంపిక చేయడం కరెక్టేనని నిరూపిస్తూ ఫేబియాన్ రూయిజ్ కూడా బాగా ఆడాడు. స్పెయిన్ డిఫెన్స్ విభాగం మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది.

డిఫెండర్లు, గోల్ కీపర్ మాత్రమే కాకుండా, మొత్తం జట్టు కోచ్ డి లా ఫ్యూంటె వ్యూహం కారణంగానే ఫ్రాన్స్ తమ మొదటి గోల్ షాట్ తీసుకోవడానికి 81వ నిమిషం వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే జట్లే ప్రధాన టోర్నమెంట్లను గెలుస్తాయని తరచుగా చెబుతుంటారు. ఫ్రాన్స్ వంటి బలమైన జట్టును స్పెయిన్ ఓడించిన తీరు చూస్తే వాళ్లు సరైన తరుణంలో తమ అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది.

ఫ్రాన్స్ పేలవ ప్రదర్శన

ఈ ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఖాయమని, కేవలం రోజులు గడవడం ఒక్కటే ఆలస్యమని చాలామంది భావించారు. .

కైలియన్ ఎంబాపే నాయకత్వంలోని ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన అటాకింగ్ విభాగం టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో జట్టు తేలిగ్గా సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

నాకౌట్ దశలో స్వీడన్‌ను ఫ్రాన్స్ సునాయాసంగా ఓడించింది. బలమైన పరాగ్వేపై సులభంగా ఆధిక్యం ప్రదర్శించింది. ఆపై మొరాకోను తేలికగా ఓడించింది.

ఫ్రెంచ్ టీమ్‌లో ఎంబాపేతో పాటు మైఖేల్ ఒలిసె, ఉస్మాన్ డెంబెలె రెండుసార్లు చాంపియన్స్ లీగ్ విజేతలైన బ్రాడ్లీ బార్కోలా, డెసిరే డియూ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఏ రోజైనా ఎంబాపే ప్రదర్శన అంచనాలకు అనుగుణంగా లేకపోతే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

కానీ ఈసారి అలా జరగలేదు. స్పెయిన్ అద్భుతంగా ఆడింది. సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్ ఈ ప్రపంచ కప్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. వేగంగా, దూకుడుతో ఫుట్‌బాల్‌ ఆడే జట్టుగా పేరుగాంచిన ఫ్రాన్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయింది.

ఫ్రాన్స్ చేసే ఒక గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేస్తుందేమో అనిపించింది. కానీ స్పెయిన్ బంతితో బంతి లేకుండా కూడా ఆటను తమ ఆధీనంలో ఉంచుకుంది. దీంతో ఫ్రాన్స్‌కు గోల్ చేసే అవకాశాలు అసలు రాలేదు.

ఇప్పుడు ఫ్రాన్స్ జట్టు మూడో స్థానం కోసం ఆడాల్సి వస్తోంది. ఆ మ్యాచ్‌ ఎంబాపేకు గోల్డెన్ బూట్ రేసును మరింత బలపరుచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అతను ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)