ఇండియాలో జెన్ జెడ్ నిరసనలను చైనాలో ప్రభుత్వ మీడియా పెద్దగా కవర్ చేయకపోవడం దేనికి సంకేతం

ఫొటో సోర్స్, Satish Bate/Hindustan Times via Getty Images
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇటీవల కాలంలో భారత్‌లో యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలంలో ఎదురైన అతిపెద్ద రాజకీయ ఎదురుదెబ్బల్లో ఒకటిగా చైనా వ్యాఖ్యాతలు అభివర్ణించారు.
భారత విద్యావ్యవస్థపై యువతలో తగ్గుతున్న నమ్మకానికి ఈ నిరసనలే నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ పరిణామాలపై చైనా అధికారిక మీడియా కేవలం ప్రాథమిక సమాచారానికే పరిమితమైంది. కానీ, మోదీ ఆర్థిక విధానాలు భారత విద్యావంతులైన యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడంలో విఫలమయ్యాయని ఫుదాన్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకురాలు అభిప్రాయపడ్డారు.
చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వీబో'లో యూజర్లు ఈ నిరసనలను ప్రస్తావిస్తూ, ఇవి భారత విద్యావ్యవస్థ, పరిపాలన లోపాలను ఎత్తిచూపుతున్నాయని వ్యాఖ్యానించారు.
నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడాన్ని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో యువత జూన్ 20 నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు.
ఇది కాకుండా దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో యువత ఆందోళనలు జరిగాయి. జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ నిరసన ప్రదర్శన ముగిసింది.
భారతదేశంలో దేశవ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల వెనుక నిరుద్యోగంపై వారిలో ఉన్న విస్తృత ఆందోళనలే ప్రధాన కారణమని చైనా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, @narendramodi
'పీఎం మోదీకి రాజకీయ ఎదురుదెబ్బ'
జాతీయవాద వార్తలు, వ్యాఖ్యలకు సంబంధించిన 'గ్వాంచా.సీఎన్' (Guancha.cn) వెబ్సైట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై విస్తృతమైన విశ్లేషణను దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన ఫుదాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు చెన్ జువో రాశారు.
"అధికారంలో ఉన్న 12 సంవత్సరాల కాలంలో భారత ప్రధానమంత్రి(మోదీ) ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన రాజకీయ ఎదురుదెబ్బల్లో ఇది ఒకటిగా నిలిచింది" అని ఆమె రాశారు.
"ఒక బలమైన రాజకీయ నాయకుడి అధికారం ఆయన అచంచలమైన వైఖరిపై ఆధారపడి ఉంటుంది. మోదీ లొంగిపోవడానికి దారితీసిన పరిస్థితులు, ఈ వ్యవహారం నియంత్రణ దాటిపోయిందనే విషయానికి సంకేతం. అందుకే ఈ నిరసన ప్రదర్శనలు ఆయన పదవీకాలంలోనే అతిపెద్ద రాజకీయ ఎదురుదెబ్బల్లో ఒకటిగా మారాయి" అని చెన్ జువో రాశారు.
"ఈ సంక్షోభం మొదటగా మోదీ ఆర్థికాభివృద్ధి విధానాలు భారీ సంఖ్యలో ఉన్న విద్యావంతులైన భారత యువతకు అవకాశాలను కల్పించలేకపోతున్నాయనే విషయాన్ని చూపిస్తోంది" అని పేర్కొన్నారు.
"భారత ప్రభుత్వం కాక్రోచ్ల భారీ ఉనికిని చూసి భయాందోళనకు గురైంది" అని అదే వెబ్సైట్లో జులై 23న ప్రచురితమైన మరో కథనంలో రాశారు.
సీజేపీ ఎక్స్ ఖాతాను భారత్ నిషేధించిందని, ఒక మంత్రి వారిపై "పాకిస్తాన్, ఇతర భారత వ్యతిరేక ముఠాల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారనే" ఆరోపణలు చేశారని రాశారు. అయితే, చైనాలో 'ఎక్స్' అందుబాటులో లేనప్పటికీ, వారు ఎక్స్ ఖాతాపై విధించిన నిషేధాల గురించి ప్రస్తావించడం గమనార్హం.
"ప్రశ్నపత్రాలు లీక్ కావడం అనేది లక్షలాది మంది పరీక్షార్థులకు ఒక వ్యవస్థాగత, నెమ్మదిగా ఎక్కే విషం లాంటిది" అని చైనాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వార్తాసంస్థ 'ద పేపర్' అభివర్ణించింది.
సమకాలీన అంశాల పత్రిక 'నాన్ఫెంగ్చువాంగ్' (సౌత్ రివ్యూస్) జులై 27న ప్రచురించిన ఒక వ్యాసంలో, "జెన్ జెడ్ యువత అసంతృప్తి కేవలం ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితం కాలేదు. ఇది మోదీ ప్రభుత్వంపై భారత సమాజంలోని అన్ని వర్గాలలో ఉన్న విస్తృత అసంతృప్తికి దారితీసింది" అని రాసింది.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
ప్రధాన ప్రభుత్వ మీడియా మౌనం
చైనాకు చెందిన 'శిన్హువా' వార్తాసంస్థ, ప్రభుత్వ ప్రసార మాధ్యమం సీసీటీవీ వంటి ప్రధాన అధికారిక మీడియా సంస్థలు ఈ నిరసన ప్రదర్శనల కవరేజీకి దూరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ పాఠకుల కోసం ప్రచురితమయ్యే 'చైనా డైలీ' అనే ప్రభుత్వ ఇంగ్లీష్ దినపత్రిక కేవలం జులై 21న విద్యార్థులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై కథనాన్ని మాత్రమే ప్రచురించింది.
జాతీయవాద వైఖరిని ప్రదర్శించే 'గ్లోబల్ టైమ్స్' సైతం జులై 23న తన చైనీస్ ఎడిషన్‌లో కేవలం ఒక సాధారణ వార్తను మాత్రమే ఇచ్చింది. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారని ఆ వార్త పేర్కొంది.
సాధారణంగా, చైనా ప్రభుత్వ మీడియాలో ఇతర దేశాల నిరసనల కవరేజీ చాలావరకు వారి సొంత ప్రయోజనాలకు అనుగుణంగా, ఎంపిక చేసిన అంశాలపైనే ఉంటుంది. గతంలో తైవాన్ అధికార పక్షమైన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను, జీ-7 వ్యతిరేక నిరసనలను ఈ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.
అదే సమయంలో, చైనా సత్సంబంధాలు కలిగి ఉన్న లేదా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న భారత్ వంటి దేశాలలో జరిగే నిరసన ప్రదర్శనలకు మాత్రం అక్కడి మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Anshuman Poyrekar/Hindustan Times via Getty Images
పరిపాలన లోపాలతో ముడి
ఈ నిరసన ప్రదర్శనలను భారత విద్యావ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన లోతైన సమస్యలను ఎత్తిచూపేవిగా చైనా సోషల్ మీడియా ఖాతాలు, యూజర్లు అభిప్రాయపడ్డారు.
చైనాలో ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన వీబోలో '#యువ భారతీయ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై ఆగ్రహం#' అనే హాష్‌ట్యాగ్ కింద పలు ఖాతాలు పోస్టులను పంచుకున్నాయి. వాటిలో విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆందోళనకారులు సంబరంగా జరుపుకొంటూ, ఆనందం వ్యక్తం చేస్తున్న పోస్టులు కనిపించాయి. జులై 29 నాటికి ఈ హాష్‌ట్యాగ్‌ను 1.4 కోట్లకు పైగా నెటిజన్లు చూశారు.
నాన్ఫెంగ్వాంగ్ చేసిన ఒక పోస్టు కింద ఒక యూజర్ స్పందిస్తూ, పరీక్షల్లో కాపీ కొట్టడం అనేది "భారతదేశంలో సర్వసాధారణమైన విషయంగా" కనిపిస్తోందని రాశారు.
భారత నిరసనలను మరో యూజర్ ప్రస్తావిస్తూ, సామాజిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఒక బలమైన పరీక్షా విధానం ఎంత ముఖ్యమో చైనా చాలా కాలంగా గుర్తిస్తూనే ఉందని రాశారు.
కెనడాలో నివసిస్తున్న విశ్లేషకుడు, భారత విమర్శకుడైన జయంత్ భండారీ వీడియోలను కూడా పలువురు వీబో యూజర్లు పంచుకున్నారు.
ఆ వీడియోలలో భండారీ, భారత ప్రజల్లో నైపుణ్యాల కొరత కారణంగా నరేంద్ర మోదీ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. అంతేకాదు, భారతదేశంలో ఉన్న సమస్యలన్నింటికీ మోదీ ఒక్కరే కారణం కాదని, ఆయన కేవలం ఒక నిదర్శనం మాత్రమేనని భండారీ వ్యాఖ్యానించారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా దేశ పరిస్థితి ఇలాగే దిగజారుతూనే ఉంటుందని అన్నారు.
విద్యార్థుల నిరసనలు, నినాదాలకు సంబంధించిన పలు వీడియోలను జులై 23న 'సౌత్ ఏషియన్ స్టడీస్ న్యూస్‌లెటర్' వీబో అకౌంట్లో పంచుకున్నారు. ఈ అకౌంట్‌ను చెన్ జువో పర్యవేక్షిస్తుంటారు.
ఆ వీడియోలపై ఒక యూజర్ స్పందిస్తూ, ఈ బహిరంగ విమర్శలు ఇప్పుడు భారత విద్యావ్యవస్థను దాటి, మోదీ "పరిపాలనా సామర్థ్యం"పై కేంద్రీకృతమయ్యాయని కామెంట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























