‘మాయా లేదు, మర్మం లేదు’.. అంటూ వీధుల్లో అలరించిన గారడీ వాళ్లు ఏమైపోయారు?

ఫొటో సోర్స్, Antariksh Jain
- రచయిత, సుమేధా పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
దిల్లీలోని తన ఇరుకైన ఇంట్లో కూర్చున్న ఇషాముద్దీన్ ఖాన్ (55) , ఇప్పటికీ ఒక తాడును గాల్లో నిలబెట్టే విన్యాసాన్ని చేయగలరు.
ఈ ఇంద్రజాలికుడు ఒకప్పుడు కేవలం కల్పిత కథగా కొట్టిపారేసిన ఒక విన్యాసాన్ని దశాబ్దాలపాటు ప్రదర్శించారు. అంతర్జాతీయంగా పేరు సంపాదించిన ఆ రోజులకు సంబంధించిన ఫోటోలు, వార్తాపత్రికల క్లిప్పింగులను ఇప్పటికీ భద్రంగా ఉంచుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ విన్యాసాన్ని ప్రదర్శించడంకంటే, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపే సమయమే ఎక్కువైంది.
"కాలం మారిపోయింది. వీధుల్లో ప్రదర్శించే ఇంద్రజాల కళ నెమ్మదిగా అంతరించిపోతోంది. అది వెంటిలేటర్‌పై ఉన్నట్టుంది" అని ఆయన అంటారు.
ఖాన్ కథ దేశంలో జరుగుతున్న విస్తృత మార్పుకు అద్దం పడుతోంది. సంప్రదాయ వీధి కళాకారులు తమ కళతో జీవనోపాధి పొందడం రోజురోజుకూ కష్టమవుతోంది.

ఇంద్రజాలికులు, గారడీ కళాకారులు, తోలుబొమ్మలాట కళాకారులు ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడే ప్రేక్షకుల ద్వారా జీవనోపాధి పొందేవారు. అయితే, వినోదపు అలవాట్లు మారడం, ఆంక్షలు పెరగడంతో ప్రేక్షకులను సంపాదించడం కష్టమై, చాలామంది ఈ వృత్తిని వదిలిపెట్టాల్సి వస్తోంది.
దేశంలో ప్రసిద్ధి చెందిన ఇంద్రజాలికుల్లో ఒకరైన ఖాన్, మదారి కమ్యూనిటీకి చెందినవారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ఈ కమ్యూనిటికి ఎన్నో ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తోంది.
అధికారిక గణాంకాలు లేనప్పటికీ, దిల్లీలో సుమారు 400 మదారి కమ్యూనిటీ కుటుంబాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని ఖాన్ అంటున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Antariksh Jain
ఇప్పుడు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ, మదారీల మూలాలు శతాబ్దాల నాటివి.
మదారి సంప్రదాయాలకు భారత జానపద కథలు, పురాణాలు, సంచార కళాకారుల సుదీర్ఘ చరిత్రలో మూలాలు ఉన్నాయని చరిత్రకారుడు అశోక్ మాథుర్ చెబుతున్నారు.
"తరతరాలుగా ఈ నైపుణ్యాలు కుటుంబాల ద్వారానే తర్వాతి తరాలకు అందాయి" అని ఆయన వివరిస్తారు.
ఖాన్ కూడా అదే మార్గంలో నడిచారు. తండ్రి, మేనమామల నుంచి ఇంద్రజాల విద్య నేర్చుకున్న ఆయన, 12 ఏళ్ల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తాడు విన్యాసంలో 20 ఏళ్లకే నైపుణ్యం సాధించారు.
ఈ విన్యాసంలో తాడు గాల్లోకి లేచి నిలబడుతుంది. ఆ తర్వాత ఒక బాలుడు దానిపైకి ఎక్కుతాడు. భారత వీధి ఇంద్రజాల కళకు సంబంధించిన కథల్లో ఈ విన్యాసానికి చాలా కాలంగా ప్రత్యేక స్థానం ఉంది. ఇది అసాధ్యమని చాలామంది భావించేవారు. ఖాన్ దాన్నే ప్రదర్శించారు.
ఈ విన్యాసాన్ని నేర్చుకోవడానికి తనకు ఆరు సంవత్సరాలు పట్టిందని ఖాన్ చెబుతున్నారు. 1995లో దిల్లీలోని ప్రసిద్ధ కుతుబ్ మినార్ వెలుపల తొలిసారి బహిరంగంగా ప్రదర్శన ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కర్ణాటకలోని ఓ బీచ్‌లో 30 వేల మంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు.
ఆ విన్యాసం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లలో ప్రదర్శనలు ఇచ్చేందుకు పర్యటించారు.
ఈ విద్య ద్వారా తనకు వచ్చిన ఖ్యాతి భారత్‌లోని సంప్రదాయ కళాకారులపై కూడా దృష్టి పడేలా చేస్తుందని ఖాన్ ఆశించారు. కొంతకాలం అది జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, Ishamuddin Khan/Youtube
ప్రేక్షకులు కొత్త రకాల వినోదం వైపు మళ్లడం, బహిరంగ ప్రదర్శనలకు అవకాశాలు తగ్గిపోవడంతో తరతరాలుగా వస్తున్న నైపుణ్యాలతో జీవనం సాగించడం చాలామంది ఇంద్రజాలికులకు కష్టంగా మారింది.
అలాంటి వారిలో 40 ఏళ్ల ఇమామ్ ఖాన్ కూడా ఒకరు.
ఒకప్పుడు ఇంద్రజాలికుడిగా ప్రదర్శనలు ఇచ్చిన ఇమామ్, ఇప్పుడు దిల్లీ వీధుల్లో సీసాలు, రీసైకిల్ చేయగల వస్తువులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. వెస్ట్ దిల్లీలోని ప్రాంతంలో ఓ చెత్తకుప్ప సమీపంలో చెత్త ఏరుతూ ఎక్కువ సమయం గడుపుతారు. రోజుకు సుమారు 200 రూపాయలు సంపాదిస్తారు.
వీధి ప్రదర్శనల పరిస్థితి క్షీణించడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనది బహిరంగ ప్రదేశాల స్వరూపం మారిపోవడమే.
బహిరంగ ప్రదేశాలు క్రమంగా తగ్గిపోవడంతో కళాకారులు ప్రేక్షకులను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కట్కథా పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అనురూపా రాయ్ చెబుతున్నారు.
"పార్కులను మూసివేయడం, బయటి వ్యక్తులను అనుమతించని నివాస సముదాయాలు(గేటెడ్ కమ్యూనిటీలు) ప్రదర్శనలకు అందుబాటులో ఉన్న ప్రదేశాలను తగ్గించాయి" అని ఆమె అంటారు.
బహిరంగ ప్రదేశాల పట్ల మారుతున్న వైఖరులు కూడా వీధి ప్రదర్శనల క్షీణతకు కారణమవుతున్నాయని పరిశోధకురాలు, కళాకారిణి కొమితా ధండా చెబుతున్నారు.
"ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణ, నగర కేంద్రాల్లో భద్రతా నిబంధనలు కఠినతరం కావడంతో వీధి కళాకారులకు ప్రదర్శనలు ఇచ్చేందుకు చాలా తక్కువ ప్రదేశాలు మిగిలాయి" అని ఆమె అంటున్నారు.
పబ్లిక్ ప్లేసుల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి అనుమతి పొందడంలో ఖాన్ లాంటి వ్యక్తిగత కళాకారులే ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. ప్రసిద్ధ వీధి నాటక బృందం జన నాట్య మంచ్ కూడా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి తరచూ అడ్డంకులు ఎదుర్కొంటుందని ధండా చెబుతున్నారు.
చాలామంది కళాకారులకు సమస్య కేవలం ప్రదర్శన కోసం ఒక మంచి స్థలాన్ని గుర్తించడమొక్కటే కాదు. ఎక్కడ అనుమతులు దొరుకుతాయి, ఏది అనుమతించరు అనే విషయం తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారింది.
చాలామంది వీధి కళాకారులు ప్రేక్షకులు స్వచ్ఛందంగా ఇచ్చే డబ్బుపైనే ఆధారపడతారు. అయితే డబ్బు కోసం ప్రదర్శన ఇవ్వడం, యాచించడం మధ్య తేడా కొన్నిసార్లు తెలియకుండా పోతోందని నిపుణులు చెబుతున్నారు.
బ్రిటన్‌కు భిన్నంగా భారత్‌లో వీధి ప్రదర్శనల కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక నిబంధనల వ్యవస్థ లేదు. శాంతిభద్రతలు, రాకపోకలకు ఆటంకం, శబ్దం, ప్రభుత్వ భూములకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నిబంధనలు కళాకారులకు ఇబ్బందిగా మారాయి.
"అందుకే వీధి కళాకారులు బహిరంగ ప్రదేశాలకు సంబంధించిన మున్సిపల్, పోలీసు నిబంధనలతో పాటు రాష్ట్రాల వారీగా అమలులో ఉన్న యాచన నిరోధక చట్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది" అని న్యాయవాది కౌశిక్ మిత్రా అంటున్నారు.

ఫొటో సోర్స్, Antariksh Jain
కొవిడ్ చాలామంది కళాకారుల పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది.
2020లో లాక్‌డౌన్ విధించినప్పుడు బహిరంగ ప్రదర్శనలు ఆగిపోయాయి. చాలామంది ఇంద్రజాలికులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు.
"కరోనా తర్వాత బహిరంగ ప్రదర్శనలు తగ్గిపోయాయి. ముఖ్యంగా వీధి ఇంద్రజాలికులు, ఇతర ప్రదర్శనలు చేసే కళాకారులు తీవ్రంగా నష్టపోయారు. వారిలో చాలామంది నగరాలకు రాలేదు" అని ధండా చెబుతున్నారు.
తిరిగి వచ్చి ఈ వృత్తిని కొనసాగించిన కళాకారులకు కూడా సవాళ్లు మరింత పెరిగాయి.
షహీమ్ ఖాన్ ఇప్పటికీ దిల్లీ వీధుల్లో ఇంద్రజాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కొన్నిసార్లు ఆయన 12 ఏళ్ల కూతురు అలియా కూడా ఆయనతో కలిసి ప్రదర్శన ఇస్తుంటుంది.
ఒకప్పుడు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. దీంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
కోవిడ్ ముందు రోజుకు నాలుగు లేదా ఐదు ప్రదర్శనలు ఇచ్చి 1,000 నుంచి 1,200 రూపాయలు సంపాదించేవారు.
"ఇప్పుడు రెండు ప్రదర్శనలు ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. 200 నుంచి 400 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నా" అని ఆయన అంటున్నారు.
రీల్స్, షార్ట్స్ వంటి డిజిటల్ వినోదం పెరగడం సంప్రదాయ కళాకారులపై ఒత్తిడిని మరింత పెంచిందని నిపుణులు చెబుతున్నారు. వీధి కళల పట్ల ప్రజల వైఖరిలో వచ్చిన మార్పులు కూడా దీనికి కారణమయ్యాయి.
"దశాబ్దాల కిందట తాడు విన్యాసం వంటి కళలపై పాశ్చాత్య దేశాల్లో చాలా ఆసక్తి ఉండేది. కానీ కళారూపాలు, ప్రజల అభిరుచులు మారిపోయాయి. భారత్ ప్రపంచానికి చూపించాలనుకునే కళారూపాలు కూడా మారిపోయాయి" అని ధండా చెబుతున్నారు.
ఖాన్‌కు ఈ నష్టం కేవలం డబ్బుకు సంబంధించినది కాదు. తరతరాలుగా వస్తున్న ఒక కళను ఎవరూ నేర్చుకోకపోతే అది అంతరించిపోతుందని ఆయన భయపడుతున్నారు.
"ఎవరైనా నేర్చుకున్నప్పుడే ఒక విన్యాసం బతికి ఉంటుంది" అని ఆయన అంటారు.
ఖాన్ కుమారుడు అల్తమాష్ యుక్తవయసులోనే తండ్రితో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు పార్టీల కోసం బెలూన్లతో అలంకరణలు చేస్తూ జీవిస్తున్నారు. 30 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, ప్రదర్శనలను దాదాపుగా పూర్తిగా వదిలేశారు.
ఏళ్లుగా క్రమం తప్పకుండా సాధన చేయకపోవడంతో ఆయన నైపుణ్యం తగ్గిపోయింది. బీబీసీ కోసం తన గారడీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటప్పుడు లయను అందుకోవడానికి ఆయన ఇబ్బంది పడ్డారు.
"నేను నెమ్మదిగా అన్ని విన్యాసాలను మర్చిపోతున్నా" అని ఆయన అన్నారు.
కుటుంబ సంప్రదాయాన్ని తన కుమారుడు కొనసాగిస్తారని ఖాన్ ఆశించారు. అల్తమాష్ కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.
"నా తండ్రికి వచ్చినంత పేరు నాకు రాకపోవచ్చని నాకు తెలుసు. కానీ ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని మాత్రం అనుకోలేదు" అని ఆయన అంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























