You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆహార భద్రత చట్టం సురక్షితమైన ఆహారానికి పూచీ పడటం లేదా?
- రచయిత, నికితా యాదవ్
- నుంచి, దిల్లీ
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలోని 55 ఏళ్ల నిర్మలారావు తన వంటగదిలో ఉడకబెట్టిన పసుపుకొమ్ములను మధ్యాహ్నపు ఎండలో ఆరబెట్టేందుకు ఓ ట్రేలో సర్దారు.
తరువాత అంతకుముందురోజు ఎండిన పసుపు కొమ్ములను తీసుకుని, ఆ పక్కనే ఉన్న మిక్సీలో వేసి చక్కటి బంగారు రంగు పొడిగా గ్రైండ్ చేశారు.
ఇలా ఇంట్లోనే మసాలా దినుసుల తయారీకి తన సాయంత్రాలను వెచ్చించాల్సి వస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేదు.
మిక్సీ నుంచి బంగారు రంగులోని పసుపు పొడిని ఓ జాడీలోకి పోస్తూ "మనం ఇలా చేయాల్సిన అవసరం రాకూడదు. కానీ, ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్న సరుకులను అస్సలు నమ్మలేకపోతున్నాం" అన్నారు నిర్మలారావు.
నిర్మలా రావు ఒక్కరే కాదు.. భారత్‌లోని అనేక నగరాల్లోని కొన్ని మధ్యతరగతి కుటుంబాలు తమ కిచెన్‌ను చిన్నపాటి ఫుడ్-ప్రాసెసింగ్ యూనిట్లుగా మారుస్తున్నాయి. సొంతంగా మసాలా పొడులు చేసుకోవడం, ఇంట్లోనే పన్నీరు తయారు చేయడం, నేరుగా పొలాల నుంచే ధాన్యం కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నాయి.
ఈ మార్పు పాతకాలపు పద్ధతులపై ఉన్న మమకారంతో కాకుండా,మార్కెట్‌లో దొరికే వస్తువులపై నమ్మకం లేకపోవడం వల్ల వచ్చింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2022 నుంచి 2025 మధ్య కాలంలో అధికారులు పరీక్షించిన ఆహార నమూనాలలో దాదాపు ప్రతి ఆరింటిలో ఒకటి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాయి. ఇదే కాలంలో 1,100 కంటే ఎక్కువగా ఫుడ్ బిజినెస్ లైసెన్సులు రద్దయ్యాయి.
పరిశుభ్రత లోపించడం, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనల నుంచి కల్తీ లేదా రసాయనాలు కలపడం వంటి అనేక కారణాల వల్ల ఈ నమూనాలు విఫలమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ఆహార భద్రతా అధికారులు గత నెలలో 3,000 కిలోల కంటే ఎక్కువ కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదించింది.
ఈ టీపొడి ఆకర్షణీయంగా కనిపించడానికి, లాభాలు గడించడానికి ఇందులో సింథటిక్ రంగులు, బెల్లం పాకం, గడువు తీరిన టీ పొడిని కలిపినట్లు తేలింది.
భారత్‌లో ఆహార కల్తీ కొత్త విషయం కాదు. కానీ, విస్తారమైన అసంఘటిత ఆహార రంగానికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థ, అధికారులు వేగం అందుకోలేక సతమతమవుతున్నారు. అవి స్పందించే లోపే ఆహార భద్రతపై భయాందోళనలను సోషల్ మీడియా శరవేగంగా వ్యాప్తి చేస్తోంది. ఈ రెండూ కలిసి తీవ్రమైన విశ్వాస సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి.
కొన్ని దశాబ్దాల కిందట, ఆహార కల్తీ అంటే పాలలో నీళ్లు కలపడం లేదా ధాన్యంలో రాళ్లు ఉండటం వంటివి మాత్రమే. కానీ నేడు డిటర్జెంట్ కలిపిన పాలు, సింథటిక్ రంగులు దట్టించిన మసాలా దినుసులు తనిఖీలలో వెలుగుచూస్తున్నాయి.
'ఫిర్యాదు తర్వాతే తనిఖీలు...'
కల్తీని నిరోధించడానికి భారత్‌లో నియమ నిబంధనలు ఉన్నాయి. 2006 చట్టం ప్రకారం ఏర్పడిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ), ఆహారాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా నిల్వ చేయాలి, ఎలా రవాణా చేయాలి, ఎలా విక్రయించాలో నియంత్రిస్తుంది.
''ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఆహార భద్రతా చట్టాలలో ఒకటి'' అని ఎఫ్ఎస్ఎస్ఏఐ మాజీ చీఫ్ పవన్ అగర్వాల్ అన్నారు. ''ఆహారాన్ని ఎలా విక్రయించాలో, విక్రయించకూడదో స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశిస్తుంది'' అన్నారు.
కానీ ఆచరణలో చూస్తే, ఏదైనా సమస్య ఏర్పడిన తర్వాత మాత్రమే ఈ చట్టం ఎక్కువగా అమల్లోకి వస్తుంది.
''పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే వాటిని పరీక్షించాల్సి ఉంటుంది. కానీ మన ఆహార ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ భాగం ఆ విధంగా పనిచేయడం లేదు'' అని అగర్వాల్ చెప్పారు.
''అధిక శాతం ఆహార ఉత్పత్తులను, వాటిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు లేదా అనుమానాలు తలెత్తినప్పుడు మాత్రమే పరీక్షిస్తుంటారు'' అని ఆయన అన్నారు.
అప్పటికే, ఆ కల్తీ వస్తువులు వివిధ నగరాలు లేదా రాష్ట్రాలకు రవాణా అయిపోయి ఉంటాయి.
సరిగ్గా బ్రాండింగ్ గానీ, ప్యాకేజింగ్ గానీ లేకుండా, సాధారణంగా చిన్న పరిమాణంలో విక్రయించే నూనె, పిండి, మసాలా దినుసులు వంటి 'విడి' ఆహార ఉత్పత్తుల వల్ల ఎదురయ్యే సవాలును కూడా ఆయన నొక్కి చెప్పారు.
భారత్ వ్యాప్తంగా లెక్కలేనన్ని చిన్న చిన్న వ్యాపారులు, రిజిస్టర్ కాని దుకాణాలు, గుర్తింపు లేని చిన్న పరిశ్రమలు ఎలాంటి పత్రాలు లేకుండానే ఇటువంటి వస్తువులను విక్రయించడం, రీప్యాక్ చేయడం, పంపిణీ చేయడం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రమాదకరమైన ఆ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి లేదా ఎక్కడికి చేరాయి అని కనిపెట్టడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.
మరోవైపు, ఆహార పరీక్షల వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన లోపం కూడా ఉందని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ 'ఆరిగా రీసెర్చ్' మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ అరోరా అభిప్రాయపడ్డారు.
"వ్యాపారులు ప్రతి ఆరు లేదా 12 నెలలకు ఒకసారి మాత్రమే శాంపిల్స్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. కానీ, ఆ పరిమిత పరీక్షా సమయాన్ని కూడా వారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు" అని ఆయన చెప్పారు.
"మిగతా బ్యాచ్‌లు ఎలా ఉన్నప్పటికీ, పరీక్షకు పంపే బ్యాచ్ మాత్రం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వారు జాగ్రత్త పడతారు" అని అన్నారు.
ఆహార భద్రతా చట్టాల అమలు సామర్థ్యం బలహీనంగా ఉండటం కూడా మరొక పెద్ద అడ్డంకి అని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో, వేలాది నమోదిత (రిజిస్టర్డ్) ఆహార వ్యాపారాలను, అలాగే లెక్కలేనన్ని అనధికారిక వ్యాపారాలను పర్యవేక్షించడానికి 500 కంటే తక్కువ మందే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని ఫుడ్ సేఫ్టీ నిపుణుడు సంజయ్ ఇందాని తెలిపారు. ఈయన గతంలో రెగ్యులేటరీ సంస్థతో కలిసి పనిచేశారు.
''ప్రతిదానిని పర్యవేక్షించడం దాదాపు అసాధ్యం. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న అధికారులు వ్యాపారులను ఎలా జవాబుదారీలుగా ఉంచగలరు?'' అని ఆయన ప్రశ్నించారు.
ఇటలీ, యూకే వంటి దేశాలు తమ పటిష్టమైన సరఫరా వ్యవస్థ పత్రాల ఆధారంగా నాణ్యత లేని ఉత్పత్తులను చాలా వేగంగా గుర్తించి, మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోగలవని నిపుణులు చెబుతున్నారు. దీనికి విరుద్ధంగా, దేశంలో కల్తీ లేదా కలుషితమైన బ్యాచ్‌ను గుర్తించడానికే వారాల సమయం పడుతుంది. ఒకవేళ అదీ సాధ్యమైతేనే!
ఈ సమస్య తీవ్రత దేశంలోని అత్యున్నత కార్యాలయాల వరకు చేరింది. గత నెలలో, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆహార భద్రతపై ఒక సమావేశాన్ని నిర్వహించింది. అధికారులు కలుషితమైన ఉత్పత్తులను గుర్తించి, వాటిని మార్కెట్ నుంచి తొలగించే లోపే.. అవి విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, చాలామంది వినియోగదారులు ఒక సరళమైన పరిష్కారానికి వచ్చారు... 'ఎక్కువ చెల్లించండి, తక్కువ ఆందోళన చెందండి'.
ముంబయిలో నివసించే 29 ఏళ్ల తియాష్ దే మాట్లాడుతూ, నాణ్యత లేని ఉత్పత్తుల భయం తనను ఎక్కువ ధర ఉన్న ప్రత్యామ్నాయాలను కొనేలా చేసిందని చెప్పారు.
''ధరలు ఎక్కువగా ఉండి, నా బడ్జెట్‌పై భారం పడుతున్నప్పటికీ, నేను పెద్ద బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతాను. ఎందుకంటే అవి కల్తీ లేనివని నా మనసులో ఒక నమ్మకం ఉంటుంది'' అని ఆమె చెప్పారు.
ఆమె నేరుగా పొలం నుంచి ఇంటికే పాలు సరఫరా చేసే సర్వీస్ కోసం మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. మనశ్శాంతి కోసం ఈ అదనపు ధర చెల్లించడం విలువైనదేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈమె ఒక్కరే కాదు.. పట్టణ ప్రాంతాల్లో చాలామంది వినియోగదారులు నమ్మకమైన ఆహారం కోసం అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల దేశంలో సేంద్రీయ ఆహార మార్కెట్ 2033 నాటికి 10.81 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్' (సీఎస్ఐఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మీనాక్షి సింగ్ అంచనా వేశారు.
'కలుషిత పదార్థాలతో దుష్ప్రభావాలు'
మనుషులను వెంటనే అనారోగ్యానికి గురిచేయని ఆహారమే ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఆకస్మాతుగా అనారోగ్యానికి గురిచేసే ఫుడ్ పాయిజనింగ్ లాంటిది కాకుండా కలుషితమైన లేదా నాణ్యత లేని పదార్థాలను పదేపదే తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు బయటపడటానికి చాలా ఏళ్లు పట్టవచ్చు.
''స్వల్పకాలంలో, ప్రజలు జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి లేదా అలసటను ఎదుర్కొనవచ్చు'' అని దిల్లీ సమీపంలోని ఫోర్టిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి రింకేష్ కుమార్ బన్సాల్ తెలిపారు. ''కాలక్రమేణా, ఇది కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడానికి, హార్మోన్ల సమస్యలకు, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరగడానికి దారితీయవచ్చు'' అని ఆయన వివరించారు.
అయితే, ప్రస్తుత భయాందోళనలకు అనారోగ్యం కంటే ఆన్‌లైన్‌లో విస్తరిస్తున్న సమాచారమే ఎక్కువ కారణమని నిపుణులు అంటున్నారు.
''ఆహార కల్తీ ఒక్కసారిగా ఏమీ పెరిగిపోలేదు, కానీ సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు దీని గురించిన సమాచారం చాలా వేగంగా వ్యాపిస్తోంది'' అని అగర్వాల్ చెప్పారు.
''మనం తినే ఆహారం పట్ల చాలా సున్నితంగా ఉంటాం, అది మనకు చాలా వ్యక్తిగతమైన విషయం. అందుకే ఇలాంటి వార్తలేవైనా వెంటనే మన దృష్టిని ఆకర్షిస్తాయి'' అని ఆయన పేర్కొన్నారు.
చివరికి అసలైన ఒత్తిడి వినియోగదారుల నుంచే రావాలని ఆయన అంటున్నారు.
''అవగాహన పెరిగి, ప్రజలు సురక్షితమైన ఆహారాన్ని డిమాండ్ చేయడం ప్రారంభించినప్పుడు వ్యాపారులు కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించక తప్పని పరిస్థితి వస్తుంది'' అని అగర్వాల్ చెప్పారు.
మారే పరిస్థితులకు ఒక సంకేతాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. కల్తీ ఆహారాన్ని ఇంట్లోనే ఎలా గుర్తించాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ క్రమం తప్పకుండా మార్గదర్శకాలను ప్రచురిస్తుంది. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి విధానం అరుదుగా ఉంటుందని ఆయన చెప్పారు.
'తయారీదారుడి నుంచి వినియోగదారుడి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ్యతాయుతమైన భావన ఉండాలి' అని సౌరభ్ అరోరా అన్నారు.
''భారతదేశంలో తరచుగా ఒక మానసిక స్థితి కనిపిస్తుంది. నేను స్వయంగా దీనిని తిననంత కాలం, ఇది వేరే ఎవరో ఒకరి సమస్య అనుకుంటారు. కేవలం నిబంధనల ద్వారా మాత్రమే దీనిని పరిష్కరించలేం' అని వివరించారు.
మరోవైపు దిల్లీలోని రావు గారి వంటగదిలో, ఒకప్పుడు మార్కెట్ నుంచి కొన్న ప్యాకెట్ల కోసం కేటాయించిన షెల్ఫ్‌లో.. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా దినుసుల జాడీలు కొలువుదీరాయి.
ఇలా ఇంట్లోనే వస్తువులను తయారు చేసుకోవడం చాలా సమయం తీసుకుంటుందని, ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ పూర్తి సమయం ఉద్యోగాలు చేసే కుటుంబాలకు ఇది నిజంగా ఆచరణాత్మకం కాదని సౌరభ్ అరోరా అంగీకరించారు.
'కనీసం ప్రాథమిక ఆహారాన్ని కూడా నమ్మలేనప్పుడు, సామాన్య ప్రజలు ఇంకేం చేయాలి?' అని ప్రశ్నిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)