అవెల్లనోసా డే మున్యో: నిమిషాల వ్యవధిలో రెండు సూర్యాస్తమయాలు చూడబోతున్న గ్రామం

ఫొటో సోర్స్, Rishika Sharma
- రచయిత, రిషికా శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆ ఊరుకు వెళితే అంతా నిశబ్ధంగా ఉంటుంది. రెస్టారెంట్లు కనిపించవు. షాపులు ఉండవు. ఎప్పుడూ తెరుచుకోని ఒక బార్ మాత్రం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గ్రామం ఒక అద్బుతమైన సంఘటనకు వేదిక కాబోతోంది.
ఉత్తర స్పెయిన్‌లోని బర్గోస్ ప్రావిన్స్‌లో ఉన్న ఆ చిన్న గ్రామం పేరు అవెల్లనోసా డే మున్యో.
అయితే అంత నిశబ్ధంలో కూడా జాగ్రత్తగా వింటే లావెండర్ పొదల చుట్టూ మూగే తేనెటీగల శబ్దాలు, రాతి ఇళ్ల మధ్య ఎగురుతూ తిరిగే నలుపు-తెలుపు రంగు స్వాలో (గూటి పక్షి) పక్షుల గానాలు వినిపిస్తుంటాయి.
దూరంగా ట్రాక్టర్ గర్జనలు ఇక్కడ మనుషులు ఉంటారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది.
వారానికి ఒకసారి సమీపంలోని బేకరీ నుంచి వచ్చే ఒక తెల్లటి వ్యాన్, అక్కడ నివసించే కొద్దిమందికి రొట్టెలు అందిస్తూ గ్రామాన్ని కాసేపు మేల్కొలుపుతుంది. ఇవి తప్ప అక్కడ పెద్దగా ఏమీ జరగవు.


ఫొటో సోర్స్, Rishika Sharma
కానీ, ఖాళీగా ఉండే ఈ గ్రామం ఈ వేసవిలో ఒక్క రాత్రికి ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రదేశంగా మారబోతోంది.
2026 ఆగస్టు 12న అట్లాంటిక్ మీదుగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగం నుంచి కనిపించే ఇదే మొదటి గ్రహణం ఇదే.
‘‘ఇది 1912 తర్వాత స్పెయిన్ ప్రధాన భూభాగం నుంచి కనిపించే తొలి సంపూర్ణ గ్రహణం. అయితే ఖండమంతటా ఈ సంపూర్ణ గ్రహణం కేవలం సన్నని రేఖలో మాత్రమే కనిపిస్తుంది. ఆ మార్గంలో ఉన్న గ్రామమే అవెల్లనోసా డే మున్యో'' అని మాడ్రిడ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ మారియా తెరెసా లోపెజ్ సాంచెజ్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Rishika Sharma
ఈ చిన్న గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని భూభాగమే. బంగారపు రంగు గోధుమ పొలాలు, చిన్న చిన్న కొండలు, విస్తారమైన పడమటి దిక్కుతోపాటు, కృత్రిమ వెలుతురు, జనసందోహం లేకపోవడం... లాంటివన్నీ ఇక్కడి నుంచి గ్రహణం చూడాలన్న ఆసక్తిని పెంచుతున్నాయి.
''ఇక్కడ గ్రహణం ఏర్పడే సమయం మరింత ప్రత్యేకం. సూర్యాస్తమయానికి కొద్దిసేపటి ముందే గ్రహణం ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడ కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు సూర్యాస్తమయాలు చూసినట్లు ఉంటుంది" అని లోపెజ్ వివరించారు. అదే రాత్రి పర్సీడ్స్ ఉల్కాపాతం కూడా కనిపించనుంది. ఈ రెండు అంతరిక్ష ఘటనలు కలిసే అరుదైన అవకాశం ఈసారి వచ్చింది.
ఆ గ్రామంలో ఉంటున్న ఆల్వారెజ్ రోడ్రిగ్స్ 1937లో ఇక్కడ జన్మించారు. "గుహ వైపు వెళ్లండి. అక్కడి నుంచి మీకు అంతా కనిపిస్తుంది'' అని ఆమె సూచించారు.
దాదాపు 90 ఏళ్లుగా ఆమె ఇక్కడ నివసిస్తున్నారు. 1950లలో ఇక్కడ దాదాపు 200 మంది ఉండేవారని, చిన్న దుకాణాలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తమ ఊరి ప్రజలకు ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిళ్ల మీద వెళ్లేవారని ఆమె చెప్పారు.
రౌల్ గ్రాండే రెవిల్లా అనే వ్యక్తి వయసు ఇప్పుడు 73 ఏళ్లు. ఆయన చిన్నప్పుడు ఇక్కడి నుంచి మాడ్రిడ్ నగరానికి వలసపోయారు. తాను ఇక్కడ ఉన్న రోజుల్లో పోస్ట్‌మాన్ గాడిద మీద వచ్చి లేఖలు పంచేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన గాడిద మీద నిద్రపోతూనే వచ్చేవారని, ఆ గాడిదకు పోస్టాఫీసుతో సహా ఎక్కడెక్కడ ఆగాలో తెలుసని అన్నారు.

ఫొటో సోర్స్, Quim Llenas/Cover/Getty Images
ఎన్నో తరతరాలుగా ఈ గ్రామం వ్యవసాయం, కూరగాయల తోటలు, ద్రాక్షతోటలు, పశువుల పెంపకం మీద ఆధారపడి జీవించింది. తర్వాత వ్యవసాయంలో యంత్రీకరణ మొదలైంది. సమీపంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేకమంది మాడ్రిడ్, బిల్బావో, బార్సిలోనా వంటి నగరాలకు, ఇంకా దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
ఈ రోజు గ్రామంలో శాశ్వతంగా ఉండే ప్రజలకంటే చుట్టుపక్కల కొండలపై మేకలే ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు వందలాది గ్రామస్థులు పని చేసిన పొలాలపై ఇప్పుడు విస్తారమైన పూలతోటల మీద సూర్యకాంతి విస్తరించి కనిపిస్తుంది.
అయితే, ఇప్పుడు ఏర్పడుతున్న ఈ గ్రహణం కొన్ని కుటుంబాలను తిరిగి గ్రామానికి రప్పిస్తోంది. ఈ ప్రత్యేక సందర్భం కోసం గ్రాండే తన భాగస్వామి, కొడుకు, మనవలు, స్నేహితులతో కలిసి వస్తున్నారు.
ఆయన సోదరుడు కూడా తన ముగ్గురు పిల్లలు, మనవడు, సోదరితో కలిసి వస్తున్నారు. అంతా కలిపి దాదాపు 20 మంది వస్తారు. అంటే ఆ ఒక్క రాత్రికి గ్రామ జనాభా రెట్టింపు అవుతుంది.
కేవలం వీళ్లే కాదని, తమ పొరుగువారు కూడా తమ స్నేహితులు, బంధువులను ఆహ్వానిస్తున్నారనీ, స్పెయిన్‌తోపాటు యూకే, ఫ్రాన్స్, వెనిజ్వెలా లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారని ఆల్వారెజ్ వెల్లడించారు.
‘‘ఇలాంటి ఖగోళ ఘటనలు ఈ ఊరితో వారికి ఇప్పటికే ఉన్న అనుబంధాన్ని మళ్లీ గుర్తు చేస్తాయి" అని శాంటియాగో డి కంపోస్టెలా విశ్వవిద్యాలయంలో భూగోళశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ లుక్రెసియా లోపెజ్ అన్నారు.
ఈ గ్రామానికి సమీపంలో పారడోర్ డి లెర్మా అనే హోటల్ ఉంది. 2022 నుంచే ఈ ఏడాది ఆగస్టు 12 నాటి సూర్యగ్రహణాన్ని చూసేందుకు ఔత్సాహికులు రూములు బుక్ చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని చాలా హోటళ్ల పరిస్థితి ఇదేనని కాస్టిల్లా వై లియోన్ టూరిజం బోర్డుకు చెందిన అల్బెర్టో బోస్కే కోయెల్లో అన్నారు.
"మా హోటళ్లు అన్నీ దాదాపు బుక్ అయ్యాయి. చాలా ముందుగానే బుక్ అయ్యాయి" అని ఆయన చెబుతున్నారు.
గ్రహణాన్ని చూసేందుకు కాలిఫోర్నియా నుంచి కూడా ఒక కుటుంబం వస్తోందని గ్రాండే చెప్పారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎవరైనా ఆశ్రయం ఇస్తారా అని ఇంటింటికీ తిరిగి అడిగినట్లు గ్రాండే చెప్పారు. కేవలం 10 మంది నివసిస్తున్న ఈ ఊరు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిలోకి రావడం ఎలా అనిపిస్తుంది అని అడిగితే, తాత్కాలికంగానైనా తమ గ్రామం ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ఆశ్చర్యంగాను, సంతోషంగానూ ఉందని గ్రాండే అన్నారు.

ఫొటో సోర్స్, Rishika Sharma
బర్గోస్ ప్రాంతంలోని వివిధ కమ్యూనిటీలు సూర్యగ్రహణాన్ని చూసేందుకు అనువైన ప్రదేశాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే, అవెల్లనోసా డే మున్యోలో సూర్యగ్రహణాన్ని చూడాలంటే స్థానికులు గ్రామానికి దూరంగా ఉండే గుహల దగ్గరకు వెళ్తారు.
సంపూర్ణ గ్రహణ సమయంలో సూర్యుడు హోరైజాన్‌కు కేవలం ఎనిమిది డిగ్రీల ఎత్తులో ఉండటం వల్ల, పడమటివైపు ఎలాంటి అడ్డంకులేని ఆకాశం కావాలి. అందుకే గుహలు ఈ తరహా అంతరిక్ష ఘటనలకు స్టేడియంలో ముందు వరస సీట్లలాగా మారతాయి.
అయితే గుహలు కేవలం మంచి వ్యూ ఇచ్చే స్థలాలు మాత్రమే కాదు, తరతరాలుగా ఈ గ్రామ ప్రజలు సూర్యాస్తమయాన్ని అక్కడి నుంచే చూసేవారు. తాను చనిపోయాక తన చితాభస్మాన్ని ఇక్కడే చల్లాలని ఆ గ్రామానికి చెందిన ఒక మాజీ నివాసి కోరారని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ గ్రామానికి ఇది అది అంత భావోద్వేగపూరితమైన ప్రదేశం.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్వారెజ్ తన జీవితమంతా అక్కడే గడిపారు. ప్రతి వేసవిలో ఆల్వారెజ్ కూతుళ్లు ఇక్కడికి వస్తుంటారు. తల్లి లేకపోయినా కూడా వాళ్లు వస్తూనే ఉంటారు. గ్రాండే కూడా ప్రతి సంవత్సరం తన గ్రామానికి వస్తుంటారు. ఈసారి తన కొడుకులు, వారి పిల్లలతోపాటు వారి స్నేహితులను కూడా తీసుకొస్తున్నారు.
"నా పిల్లలు, మనవలు కూడా ఈ గ్రామంపట్ల నాకు ఉన్న అనురాగాన్ని, అనుబంధాన్ని అనుభవించాలి" అని ఆయన అన్నారు.
గ్రహణం రోజున అవెల్లనోసా డే మున్యో మళ్లీ మాటలతో సందడిగా ఉంటుంది. రెస్టారెంట్లు లేని ఆ ప్రదేశంలో కాల్చిన గొర్రె మాంసపు వాసన వ్యాపిస్తుంది. ఒకప్పుడు పాఠశాల ఉన్న చోట పిల్లల నవ్వులు వినిపిస్తాయి. ఆ తర్వాత, కొన్ని అపురూప క్షణాల్లో అక్కడ రెండుసార్లు సూర్యడు అస్తమిస్తాడు.
అందుకే, స్పెయిన్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ గ్రామం అప్పుడప్పుడూ ఇలా ప్రపంచమంతటికీ ఆసక్తికరమైన ప్రదేశంగా మారుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























