శిథిలాల కింద చిక్కుకుపోయిన మనుషులు ఎన్నిరోజులవరకు బతికే అవకాశం ఉంది?

    • రచయిత, కేజల్ కసాపొగ్లు
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

వెనెజ్వెలాలో గతవారం ఒక్క నిమిషం వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతతో రెండు భీకర భూకంపాలు సంభవించాయి. ఇవి అక్కడ భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.

ఈ భూకంపాల వల్ల కనీసం 250 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో చాలా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అంతర్జాతీయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అయితే, శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు ఎంతకాలం ప్రాణాలతో ఉండగలరనేదే ఇప్పుడు ప్రశ్న.

ఇది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు బీబీసీకి తెలిపారు. బాధితుడు ఎలాంటి స్థితిలో చిక్కుకున్నాడు, అతనికి గాలి, నీరు అందుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు.. అక్కడి వాతావరణం, శీతోష్ణస్థితి, సదరు వ్యక్తి శారీరక దృఢత్వం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

సాధారణంగా చాలామందిని 24 గంటల లోపే రక్షిస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో చాలా రోజుల తర్వాత కూడా ప్రజలు శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డారు.

ఐక్యరాజ్యసమితి సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల వరకు ఎవరూ సజీవంగా కనిపించనప్పుడు, ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత సహాయక చర్యలను నిలిపివేస్తుంది.

ఇంతకీ, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండటానికి ఏయే అంశాలు దోహదపడతాయి?

ముందస్తు సన్నద్ధత ముఖ్యం

భూకంపం రాకను లేదా భవనాలు కూలిపోయే సమయాన్ని ముందుగా ఊహించడం సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలాంటి సమయాల్లో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటానికి, అతను శిథిలాల కింద ఎలాంటి స్థితిలో చిక్కుకున్నాడనే అంశం చాలా కీలకం అవుతుందన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాక్కోవడానికి సరైన స్థలాన్ని ఎంచుకుంటే, శిథిలాల కింద కూడా కొంత రక్షణ లభిస్తుందని వారు అంటున్నారు. అంతేకాకుండా, అక్కడ శ్వాస తీసుకోవడానికి గాలి కూడా దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు.

సహాయక చర్యల కోసం మూడు పద్ధతులను అభ్యసించడం ఎంతో అవసరమని తుర్కియే సహాయక సంస్థ 'ఏకేయూటీ' కోఆర్డినేటర్ మురత్ హరున్ ఒంగోరెన్ తెలిపారు. అవే 'డ్రాప్, కవర్, హోల్డ్'. ఇవి శిథిలాల కింద చిక్కుకున్న వారికి గాలి ఆడటానికి ఒక చిన్న సురక్షితమైన స్థలాన్ని ఏర్పరచగలవు.

  • డ్రాప్: ప్రమాదం శంకించగానే మొదట మోకాళ్లపై కిందకు వంగి కూర్చోవాలి.
  • కవర్: ఆ తర్వాత ఏదైనా బలమైన టేబుల్ లేదా వస్తువు కిందకు దూరి తల దాచుకోవాలి.
  • హోల్డ్: భూ ప్రకంపనలు తగ్గే వరకు ఆ వస్తువును గట్టిగా పట్టుకుని ఉండాలి.

విపత్తు సంభవించక ముందే అవగాహన, శిక్షణ వంటివి ఎంతో అవసరమని మురత్ హరున్ సూచించారు. కానీ, చాలామంది తరచూ వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. శిథిలాల కింద ప్రాణాలు ఎంతకాలం సురక్షితంగా ఉంటాయనేది ఈ ముందస్తు అవగాహనే నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం అధికారి డాక్టర్ జేత్రి రెగ్మి కూడా విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. బలమైన టేబుల్ వంటి సురక్షితమైన చోట దాక్కోవడం వల్ల ప్రాణాలతో బయటపడే అవకాశాలు పెరుగుతాయని ఆమె తెలిపారు.

అయితే, ప్రతి విపత్తు భిన్నంగా ఉంటుంది కాబట్టి దేనికీ పూర్తి గ్యారెంటీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రాథమిక రక్షణ అనేది స్థానిక ప్రజల ముందస్తు సన్నద్ధతపైనే ఆధారపడి ఉంటుందని వివరించారు.

'గాలి, నీరు అందితే సాయపడుతుంది'

శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలకు గాలి, నీరు అత్యంత అవసరం. వీటి సహాయంతోనే వారు ప్రాణాలను నిలబెట్టుకోగలరు. అయితే, ఇది ఆ వ్యక్తికి ఎంతవరకు గాయాలయ్యాయనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శరీరం నుంచి ఎక్కువ రక్తం కారిపోతే, 24 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడటం కష్టమవుతుంది.

వ్యక్తికి తీవ్రమైన గాయాలు కాకపోతే, అతను చిక్కుకున్న చోట శ్వాస తీసుకోవడానికి గాలి లభిస్తే బతికే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శిథిలాల మధ్య గాలి ఆడే ఏదైనా ఖాళీ స్థలం (ఎయిర్ పాకెట్) ఇందుకు ఉపయోగపడుతుందన్నారు.

దీని తర్వాత ప్రాణాలు నిలవడానికి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నీరు, ఆక్సిజన్ కొరతే అత్యంత పెద్ద సమస్యని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ ఎడ్వర్డ్ మూన్ తెలిపారు.

ప్రతి వయోజనుడి శరీరం నుంచి రోజూ దాదాపు 1.2 లీటర్ల నీరు బయటకు పోతుందని ఆయన చెప్పారు. ఈ నీటి నష్టం మూత్రం, శ్వాసక్రియ, చెమట రూపంలో జరుగుతుంది. శరీరం నుంచి 8 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు నష్టపోయినప్పుడు మనిషి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

కొన్ని అంచనాల ప్రకారం, నీరు లేకుండా మనిషి సుమారు మూడు నుంచి ఏడు రోజుల వరకు ప్రాణాలతో ఉండగలడు.

'గాయాల తీవ్రతే ప్రాణాపాయాన్ని నిర్ణయిస్తుంది'

ఒక వ్యక్తి తలకు గాయమైనా లేదా శరీరానికి తీవ్రమైన గాయాలైనా, శ్వాస తీసుకోవడానికి శిథిలాల మధ్య తగినంత స్థలం దొరకకపోయినా... అలాంటి పరిస్థితుల్లో మరుసటి రోజు వరకు కూడా అతను ప్రాణాలతో ఉండటం కష్టం.

ఇలాంటి సమయాల్లో గాయం తీవ్రతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం అధికారి డాక్టర్ జేత్రి రెగ్మి తెలిపారు. వెన్నెముక, తల లేదా ఛాతి భాగాల్లో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శరీరం నుంచి ఎక్కువ రక్తం కారిపోవడం, ఎముకలు విరగడం లేదా అంతర్గత అవయవాలు దెబ్బతినడం వంటివి మరణానికి దారితీస్తాయని తెలిపారు.

డాక్టర్ రెగ్మి చెప్పిన దాని ప్రకారం, శిథిలాల నుంచి రక్షించిన తర్వాత అందించే తక్షణ వైద్యం కూడా అంతే ముఖ్యం. శిథిలాల నుంచి బయటకు తీసిన తర్వాత కూడా కొందరు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకు 'క్రష్ సిండ్రోమ్' ఒక కారణం కావచ్చు. భూకంపం వంటి విపత్తులలో ప్రజలు ఎక్కువ సమయం శిథిలాల కింద నలిగిపోయి చిక్కుకున్నప్పుడు సాధారణంగా ఇది కనిపిస్తుంది.

భారీ ఒత్తిడి కారణంగా కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు ఈ సిండ్రోమ్కు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. దీనివల్ల శరీరంలో విషపూరిత పదార్థాలు తయారవుతాయన్నారు. శిథిలాలను తొలగించినప్పుడు ఈ విషపదార్థాలు శరీరమంతా వ్యాపిస్తాయని, ఇది సదరు వ్యక్తి పరిస్థితిని అత్యంత విషమంగా మారుస్తుందని తెలిపారు.

శీతోష్ణస్థితి, వాతావరణం కూడా కీలక అంశాలే

ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి కూడా ప్రజలు ఎంతకాలం ప్రాణాలతో ఉండగలరనే విషయాన్ని నిర్ణయిస్తుంది.

అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ ఎడ్వర్డ్ మూన్ ప్రకారం, తుర్కియే వంటి చలి ప్రాంతాలలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. సాధారణ పరిస్థితుల్లో ఒక వయోజన వ్యక్తి 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలరు. ఈ సమయంలో శరీరం తన వేడిని నిలబెట్టుకోగలదు.

కానీ, ఉష్ణోగ్రత అంతకంటే తగ్గినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. అలాంటి సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా చుట్టుపక్కల ఉండే చలికి తగ్గట్టుగా పడిపోవడం ప్రారంభమవుతుంది. హైపోథెర్మియా (శరీరం ప్రమాదకరంగా చల్లబడిపోవడం) ఎంత త్వరగా వస్తుందనేది., ఆ వ్యక్తి శిథిలాల మధ్య ఎంత ఒంటరిగా చిక్కుకున్నాడు, అక్కడ అతనికి ఎంతవరకు రక్షణ దొరికింది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇలాంటి పరిస్థితుల్లో చాలా త్వరగా హైపోథెర్మియా వచ్చేస్తుంది.

అదే సమయంలో ఎండాకాలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. శిథిలాల లోపల విపరీతమైన వేడి ఉంటే, ఆ వ్యక్తి శరీరం నుంచి నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది. ఇది అతను ప్రాణాలతో బయటపడే అవకాశాలను తగ్గించేస్తుంది.

మానసిక స్థితి ముఖ్యం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమయంలో మానసిక స్థితి ఒక ముఖ్యమైన అంశం. కానీ ప్రజలు తరచూ దీనికి తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మనో ధైర్యం, జీవించాలనే కోరిక మాత్రమే ప్రాణాలతో నిలవడంలో పెద్ద పాత్ర పోషిస్తాయని వారు అంటున్నారు.

"భయం కలగడం సహజం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఆందోళన చెందకూడదు. భయాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే నిగ్రహాన్ని కోల్పోకూడదు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, నేను ప్రాణాలతో బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి అనే నమ్మకం మనసులో ఉండాలి" అని సహాయక చర్యల నిపుణుడు ఒంగోరెన్ చెప్పారు.

"ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి అరవడానికి, శరీరాన్ని ఇటు అటు కదల్చడానికి అనవసరంగా శక్తిని ఖర్చు చేయడు. ఇది శరీరంలో భయాన్ని, ఆందోళనను అదుపులో ఉంచడానికి సాయపడుతుంది" అన్నారు.

శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ సంఘటనలు

1995లో దక్షిణ కొరియాలో భూకంపం సంభవించినప్పుడు, ప్రమాదం జరిగిన 10 రోజుల తర్వాత ఒక వ్యక్తిని శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు. ఆయన వర్షపు నీరు తాగుతూ, కార్డ్‌బోర్డ్ ముక్కలను నములుతూ ప్రాణాలను నిలబెట్టుకున్నట్లు తెలిసింది. తన మనసును ఆహ్లాదంగా ఉంచుకోవడానికి ఒక చిన్న పిల్లల బొమ్మతో ఆడుకుంటూ కాలం గడిపినట్లు ఆయన చెప్పారు.

2013 మేలో బంగ్లాదేశ్‌లో ఒక ఫ్యాక్టరీ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన 17 రోజుల తర్వాత ఒక మహిళను శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఆమె మాట్లాడుతూ, చాలా రోజుల వరకు సహాయక బృందాల శబ్దాలు తనకు వినిపించేవని తెలిపారు. వారి దృష్టిని ఆకర్షించడానికి తాను కర్రలు, ఇనుప రాడ్లతో శిథిలాలపై కొట్టేదాన్నని, కానీ ఎవరూ తన శబ్దాన్ని వినలేకపోయారని ఆమె చెప్పారు. చివరి రెండు రోజులు కేవలం నీటితోనే గడిపానని ఆమె వివరించారు.

హైతీలో జనవరి 2010లో సంభవించిన భీకర భూకంపంలో 2 లక్షల 20 వేలకు పైగా మంది మరణించారు. కానీ, ఒక వ్యక్తి 12 రోజుల పాటు శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారు. దోపిడీకి గురైన ఒక దుకాణం శిథిలాల మధ్య ఆయన చిక్కుకుపోయారు. ఆ తర్వాత ఇదే భూకంప శిథిలాల నుంచి మరొక వ్యక్తి ఏకంగా 27 రోజుల తర్వాత సజీవంగా లభించారు.

అక్టోబర్ 2005లో పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్‌లో భూకంపం వచ్చిన రెండు నెలల తర్వాత 40 ఏళ్ల నక్షా బీబీని సురక్షితంగా రక్షించారు. ఆమెను తన వంటగది శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు. అప్పటికే ఆమె శరీరం పూర్తిగా బిగుసుకుపోయింది. ఎంతగా బలహీనపడిపోయారంటే కనీసం మాట్లాడలేకపోయారు. మొదట ఆమె చనిపోయిందని అనుకున్నామని, కానీ బయటకు తీస్తున్న సమయంలో ఆమె కళ్లు తెరిచారని ఆమె బంధువు బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)