గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు నిరసనలు తెలుపుతున్న వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో ఘోర పరాజయం కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, ANI
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు నిరసనలు తెలుపుతున్న వేళ కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
2029 ఎన్నికల్లో ఘోర పరాజయం కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
ఏఎన్ఐ, పీటీఐ తదితర న్యూస్ ఏజెన్సీలతో మాట్లాడిన ఆయన... ‘‘ఎస్ఐఆర్ ముసుగులో చొరబాటుదారులను కాపాడాలనే మీ వ్యూహాన్ని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు ఇకపై ఎంత మాత్రం మీ కుతంత్రాలలో చిక్కుకోబోరని నేను రాహుల్ గాంధీకి స్పష్టం చేయాలనుకుంటున్నాను. 2029లో ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని కూడా నేను రాహుల్ గాంధీ, ఆయన సహచరులకు చెప్పాలనుకుంటున్నాను. 2029 ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీని సొంతం చేసుకోబోతోంది.. కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి పరాజయాన్ని మూటగట్టుకోబోతోంది. ఈ దేశ ప్రజలు నరేంద్ర మోదీకి, బీజేపీకి, ఎన్డీయేకు అండగా నిలుస్తున్నారు. మీరు ఈ నిజాన్ని తిరస్కరించలేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, అస్సాం ప్రజలకు నేను మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. దుష్ప్రచారాల మధ్య కూడా వారు నరేంద్ర మోదీపై, బీజేపీపై, ఎన్డీయేపై నమ్మకం ఉంచారు’’ అని అమిత్ షా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంగళవారం తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తాను తమిళనాడుకు తిరిగి వెళ్లి బీజేపీని బలోపేతం చేయడానికి, 2029 లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడులో పార్టీని మరింత పటిష్టం చేయడానికి పూర్తి సమయం కేటాయించేందుకు వీలుగా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా కూటమి నేతలతో తేనీటీ విందు అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.
“భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. వారు తమ పాత్రను పోషించాల్సి ఉంది. వారు ఆ పాత్రను పోషిస్తారని ఆశిస్తున్నాం. అయితే, మేం రాజకీయాల్లో ఉన్నవాళ్లం. ఏం జరిగినా రాజకీయంగా మా ప్రతిఘటన కొనసాగుతుంది. ప్రజల నిరసన కూడా కొనసాగుతుంది. అంతిమంగా ఈ నిరసన విజయం సాధిస్తుంది” అని ఆయన అన్నారు.
కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఫొటో సోర్స్, I&PR
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తోడ్కొని వెళ్లారు.
సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న విజయ్ క్యూలైన్లలో ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.
సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్న సీఎం విజయ్‌కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు.

ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Images
కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇండియా కూటమి నేతలను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు.
“ఈ రోజు ఇండియా కూటమి నేతలు, ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజానికి చెందిన మిత్రులను మా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించాను” అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
“ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో మనమంతా కలిసే ఉన్నాం. ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
సమావేశం అనంతరం నేతలందరూ మీడియాతో కూడా మాట్లాడతారని రాహుల్ గాంధీ తెలిపారు.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్, జనతా పార్టీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ఎన్నికల కమిషనర్లకు సమాచారం ఇవ్వలేదని, ఈ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాహుల్ గాంధీ ఇంట్లో తేనేటి విందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
పండుగలను దృష్టిలో ఉంచుకుని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును వాయిదా వేయాలని.. దీన్ని దీపావళి తర్వాత అమలుచేయాలని యూపీఐ, సేవల స్టీరింగ్ కమిటీ మంగళవారం నిర్ణయించింది.
ఎండీఆర్ అమలు తేదీని ప్రత్యేకంగా ప్రకటిస్తామని కమిటీ తెలిపింది.
వినియోగదారులకు యూపీఐ సేవలను పూర్తిగా ఉచితంగా కొనసాగిస్తూనే, వ్యాపార లావాదేవీలకు సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. ఈ విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images
పాక్ పాలిత కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలింది. ఈ పేలుడులో నలుగురు యువకులు మరణించారు.
దీనికి భారతే కారణమంటూ పాకిస్తాన్ పాలిత కశ్మీర్ సమాచార విభాగం ఆరోపించింది. సోమవారం సాయంత్రం నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న మహేంద్ర మదర్పూర్ గ్రామంలో పేలుడు జరిగినట్లు సమాచార శాఖ ఒక ప్రకటన జారీ చేసిందని బీబీసీ ఉర్దూ కథనం తెలిపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ నలుగురు యువకులు గ్రామం సమీపంలోని నీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు కోసం వెళ్లారు. అకస్మాత్తుగా శక్తివంతమైన పేలుడు జరగడంతో దాని ధాటికి నలుగురూ అక్కడికక్కడే మరణించారు. "యువకులు ప్రయాణించిన ప్రాంతంలో భారత సైన్యం ల్యాండ్మైన్లను అమర్చింది" అని పూంచ్ డివిజన్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు.
తవ్వకాలు ప్రారంభించడానికి ముందు అక్కడ మోహరించిన సైనికులతో ఆ నలుగురు యువకులు సంప్రదించారని జిల్లా అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధి షాజాద్ మాలిక్‌కు తెలిపారు. ఆ ప్రాంతం నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉందని, అందువల్ల తవ్వకాలు జరపడానికి ముందు ఆ ప్రాంతాన్ని తనిఖీలు చేయాలని, దీనికి ఒక రోజు పడుతుందని యువకులకు సైనికులు చెప్పారు. యువకులు మాత్రం సైనికుల మాట పట్టించుకోకుండా తవ్వడం మొదలుపెట్టారని జిల్లా యంత్రాంగం చెబుతోంది. దీంతో పేలుడు జరిగి నలుగురూ మరణించారు. ఈ ఘటనపై భారత్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఫొటో సోర్స్, Narendra Modi
ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వివిధ అంశాలపై బహిరంగంగా చర్చ జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
మంగళవారం దిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
"ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి. ఈ దేశంలో 100కు పైగా భాషలు ఉన్నాయి. సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, పబ్లిషర్స్ ఉన్నారు. 1,000కి పైగా శాటిలైట్ టీవీ చానెళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, సోషల్ మీడియా యుగంలో, దేశంలో 50 కోట్లకుపైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్నారు. 50 కోట్లకు పైగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. వివిధ అంశాలపై బహిరంగ చర్చలు జరుగుతాయి, వివిధ విషయాలపై చర్చిస్తారు. ఇందులో డిజిటల్ పవర్ కీలకం" అని ఆయన అన్నారు.
భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ కార్యక్రమం అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుంది.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో బయానా మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భదానా ఆదివారం నాడు హత్యకు గురయ్యారు.
"కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సోమవారం 33 మంది వ్యక్తులపై, మరో 70 నుంచి 80 మందిపై కేసు నమోదు చేశాం" అని భరత్పూర్ జిల్లా ఎస్పీ రాజేశ్ మీనా బీబీసీ న్యూస్ హిందీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు.
"గత రెండేళ్లుగా వేయిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోండా గ్రామంలో ఉన్న క్రషర్కు వెళ్లే దారి విషయంలో గ్రామస్థులకు, క్రషర్ యజమానికి (మరణించిన అత్తర్ సింగ్ భదానా) మధ్య వివాదం నడుస్తోంది. ఆ క్రషర్‌ను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది" అని రాజేశ్ మీణా తెలిపారు.
ఈ హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలోని చాలా మంది పరారీలో ఉన్నారు, చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. "పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించాం" అని వేయిర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ధీరేంద్ర బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు.
మరణించిన అత్తర్ సింగ్ భదానా ఫరీదాబాద్‌లోని పాలి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన బయానా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో క్రషర్ వద్దకు వెళ్లారు. అప్పుడే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి కర్రలతో అత్తర్ సింగ్‌పై దాడి చేశారని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీ నాయకులను దిల్లీ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తోపాటు అజింక్య షిండే సహా అనేకమంది మద్దతుదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. "ఈ రోజు తెల్లవారుజామున త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన వారిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే బృందంలోని ఇతర సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర మోదీ, మీరు ఈ నిరసనలను ఆపలేరు" అని ఆపోస్టులో దీప్కే రాశారు.

ఫొటో సోర్స్, @TheDeverakonda
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాఖాతాల్లో పోస్టు చేశారు. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్‌తో గడిపిన సమయం ఎంతో అద్బుతంగా ఉందని పేర్కొన్నారు. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తమను ఎంతో ప్రేమతో ఆహ్వానించారని, జీవితం, పని, ప్రపంచం పట్ల తన ఆలోచనలు కూడా పంచుకున్నారని తెలిపారు. ఒక్క సమావేశంతోనే ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది.
దీన్ని ఆ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలో ఇలాంటి తీర్మానం చేసిన మొట్టమొదటి శాసనసభ కేరళ.
కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎఎస్ అధికారి, ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్‌తో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) నాయకుడు, ముఖ్యమంత్రి వీడీ సతీసన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కూడా దీనికి మద్దతు పలికింది.
బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దీనిని వ్యతిరేకించారు.
మొత్తం 140 మంది ఉన్న సభలో 137 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు పలికారు.
ఎలక్షన్ కమిషన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంస్థ విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తప్పించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని తీర్మానంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.
" లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./
అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.
గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.