మండే ఎండలు - కులవివక్ష : "మేం నీళ్లు పట్టుకున్న చేతి పంపును 'శుభ్రం' చేయడానికి అగ్రవర్ణాల వాళ్లు దానిపై నీళ్లు పోస్తారు"

ఫొటో సోర్స్, Seraj Ali
- రచయిత, సుమేధా పాల్, సెరాజ్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
రెండు నెలల క్రితం.. సూర్యోదయం కాగానే 40 ఏళ్ల మమత ఆ రోజు తాను చేయబోయే 10 ప్రయాణాలలో మొదటి దానికి సిద్ధమయ్యారు.
ఉత్తర ప్రదేశ్‌లో కరవు పీడిత ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ జిల్లాలో తన ఊరి సమీపంలోని చేతి పంపు దగ్గరకు ఆమె ఖాళీ ప్లాస్టిక్ బక్కెట్లను తీసుకు వెళ్లారు.
ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల ఎండలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి మండిపోతున్నాయి.
ప్రభుత్వ తాగునీటి పథకం కింద ఏర్పాటు చేసిన కుళాయిలు రెండేళ్లుగా ఎండిపోయాయని ఆమె చెప్పారు.
వెయ్యి మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో ఎక్కువ మంది చేతి పంపుల మీదే ఆధారపడాల్సి వస్తోందన్నారు.

తమ 11 మంది కుటుంబ సభ్యులు, పశువులకు అవసరమైన తాగునీరు తేవడానికి గంటల సమయం పడుతోందని మమత అన్నారు.
అయితే ఎండ ఒక్కటే ఆమెకు అడ్డంకి కాదు. మమత దళితులలోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు.
భారత్‌లో శతాబ్దాల నాటి కులవ్యవస్థలో వీరిని ఒకప్పుడు "అంటరానివారు"గా చూసేవారు. ఇప్పటికీ వీళ్లు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Seraj Ali
నీటి కొరత వల్ల తీవ్రమవుతున్న కుల వివక్ష
ఊళ్లోని ఆధిపత్య కులాల వారు హ్యాండ్‌పంపును వాడడం పూర్తయ్యే వరకు తాను వేచి చూస్తానని, ఆ తర్వాతే తాను అక్కడికి వెళ్తానని ఆమె చెప్పారు.
"అక్కడ ఎవరైనా నిలబడి ఉంటే, మేము నీళ్లు పట్టుకోలేం. వాళ్లు వెళ్లే వరకు ఆగాల్సిందే" అని ఆమె అన్నారు.
తాము నీళ్లు పట్టుకున్న తర్వాత కొందరు అగ్రవర్ణాల వారు ఆ పంపును "శుభ్రం" చేయడానికి దానిపై నీళ్లు పోస్తారని ఆమె చెప్పారు.
"ఇది దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది" అని మమత అన్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో విస్తరించి ఉన్న బుందేల్ ఖండ్ ప్రాంతంలో కరవు ఎక్కువ. ఇక్కడ వర్షపాతం తక్కువ.
ఈ ప్రాంతం 2002 - 2016 మధ్యకాలంలో తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొని దేశంలో నీటి ఎద్దడికి చిహ్నంగా మారింది.
బుందేల్‌ఖండ్ పీఠభూమి రాతిమయమైన భూభాగం కావడం వల్ల అది ఎక్కువ భూగర్భ జలాలను నిల్వ చేసుకోలేదు.
ఈ ప్రాంతంలో ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ అస్తవ్యస్తమైన వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల నీటి లభ్యత తగ్గుతోంది.
ఈ ప్రాంతం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వందేళ్లకు పైగా వాతావరణ రికార్డులను పరిశీలించిన అధ్యయనంలో తేలింది.
ఇటీవలి కాలంలో బుందేల్‌ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.
పెరుగుతున్న ఎండలు, నీటి కొరత వల్ల శతాబ్దాల నాటి కుల వివక్ష తీవ్రమవుతోందని స్థానికులు, పరిశోధకులు చెబుతున్నారు.
పరిమితంగా ఉన్న నీటి వనరుల కోసం ఎక్కువ కుటుంబాలు పోటీ పడుతుండడంతో మొదటి నుంచీ నీటిని పొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న దళితులు ఇప్పుడు ఆ వివక్షను మరింత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Seraj Ali
వివక్ష లేదంటున్న అగ్రవర్ణాలు
"నీటి కోసం ఘర్షణలు కొత్తేమీ కాదు" అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన మితాషి సింగ్ అన్నారు.
"వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల నీటి లభ్యత తగ్గుతోంది. దీని వల్ల కులపరంగా ఇప్పటికే ఉద్రిక్తతల మరింత పెరుగుతున్నాయి" అని ఆమె చెప్పారు.
అయితే ఈ ప్రాంతంలో నీటి కొరత, కుల వివక్ష లేవని అధికారులు చెబుతున్నారు.
ఇతరుల పట్ల తాము వివక్ష చూపుతున్నామన్న ఆరోపణలను స్థానికంగా ఉన్న ఆధిపత్య కులాల వారు ఖండించారు. అలాంటిదేమీ లేదని వాళ్లు బీబీసీతో చెప్పారు.
అయితే నీటి సరఫరా విషయంలో ఒత్తిడి ఉందని వాళ్లు అంగీకరిస్తున్నారు.
ఊళ్లో నిరుపయోగంగా ఉన్న బావులను చూపిస్తూ 50 ఏళ్ల రామ్ గోపాల్ సింగ్ "ఈ బావులు 20 ఏళ్ల క్రితమే ఎండిపోయాయి" అని చెప్పారు.
ఇతర నీటి వనరులు ఎండిపోవడం లేదా కలుషితం అయ్యాయని కుళాయి కనెక్షన్లలో నీళ్లు రాకపోవడంతో ఎక్కువ కుటుంబాలు చేతి పంపుల మీద ఆధారపడుతున్నాయని ఆయన అన్నారు.
ఉదయం పూట చల్లగా ఉండటంతో ఆ సమయంలోనే అందరూ నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారని.. దీంతో ఎవరి వంతు ముందు అనే విషయంలో చిన్న చిన్న గొడవలు జరురగుతుంటాయని రామ్ గోపాల్ సింగ్ చెప్పారు.
"చేతి పంపుల దగ్గర కుల పరమైన వివాదాలు ఏమీ లేవు" అని ఆయన నొక్కి చెప్పారు.
అయితే బీబీసీతో మాట్లాడిన స్థానిక దళితులు మరోలా చెప్పారు.
చేతి పంపుల వద్ద క్యూ లాంటిదేమీ ఉండదని, గొడవల్లేకుండా ఉండేందుకు నీటి కోసం తాము తెల్లవారుజాము లేదా సాయంత్రం లేటుగా వస్తామని మమత చెప్పారు
"వాళ్లతో నాకు ఎక్కడ గొడవ జరుగుతుందో అనే భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Seraj Ali
"అగ్రవర్ణాల వారు నన్ను కొట్టారు"
అక్కడికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాజహాన్‌పూర్‌లో శివ్ కూడా ఇలాంటి అనుభవాన్నే వివరించారు.
ఆధిపత్య కులాల కుటుంబాలు నీళ్లు పట్టుకుంటున్నంత సేపు తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు హ్యాండ్‌పంపు వద్దకు వెళ్లరని ఆయన చెప్పారు.
"ఎంత ఎండగా ఉన్నా, ఒక్క బకెట్ తాగునీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చినా మేము వేచి ఉంటాం. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు" అని ఆయన అన్నారు.
మూడేళ్ల క్రితం గ్రామంలోని చేతి పంపు వద్ద అగ్రవర్ణానికి చెందిన ఒక వ్యక్తితో గొడవ జరిగాక తనపై దాడి జరిగిందని శివ్ తల్లి పర్మి దేవి చెప్పారు.
"నన్ను దారుణంగా కొట్టారు. మూడుసార్లు కింద పడేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
"ఆ దాడి కేవలం నీటి కోసం జరిగింది కాదు. కులం కారణంగానే జరిగింది" అని ఆమె అన్నారు.
తనపై దాడి గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని దళిత్ డిగ్నిటీ అండ్ జస్టిస్ సెంటర్ (డీడీజేసీ) అనే స్వచ్ఛంద సంస్థ నమోదు చేసిన ఫిర్యాదులలో ఎక్కువ భాగం ఇలాంటివే ఉన్నాయి.
2025లో ఈ ప్రాంతంలో కుల వివక్ష, అట్రాసిటీల చట్టం కింద పోలీసులు 113 కేసులు నమోదు చేసినట్లు ఈ సంస్థ తెలిపింది.
తీవ్రమైన ఎండలు ఉండే మే, జూన్‌లో తాము పరిశీలించిన ఫిర్యాదులలో ఎక్కువ భాగం నీటికి సంబంధించినవేనని డీడీజేసీకి చెందిన కుల్దీప్ సింగ్ బౌద్ధ్ బీబీసీతో చెప్పారు.
అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ ఇంకా ప్రచురించలేదు.
"తీవ్రమైన ఎండల ప్రభావాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే సమాజం నుంచి వెలివేతకు గురైన వారి కోణంలో నుంచి చూడాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Seraj Ali
అధికారులేమంటున్నారు?
జిల్లా కలెక్టర్ రాజేష్ కుమార్ పాండే కార్యాలయం ఈ ఆరోపణలను తిరస్కరించింది.
"ఈ ప్రాంతంలో నీటి పంపుల దగ్గర కుల వివక్ష ఉన్నట్లు ఒక్క ఉదాహరణ కూడా లేదు" అని ఒక ప్రకటనలో పేర్కొంది.
గ్రామాల్లోప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జల్ జీవన్ మిషన్' గురించి ప్రస్తావించింది.
అలాగే చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెరుగుదలకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది.
బుందేల్‌ఖండ్ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి విస్తృతమైన ప్రయత్నాలు జరిగాయి.
ఈ ప్రాంతంలో చెరువులు, చెక్ డ్యామ్‌లతో సహా సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించారు.
అలాగే గ్రామాల్లో నీటి సరఫరాను పర్యవేక్షించడానికి, నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి "జల్ సహేలీలు" అని పిలిచే మహిళా బృందాలు పనిచేస్తున్నాయి.
నీటి సరఫరాను పెంచడం, సమస్య పరిష్కారంలో ఒక భాగం మాత్రమేనని కులం, పర్యావరణ రాజకీయాల పరిశోధకుడు ముకుల్ శర్మ చెప్పారు.
"ఈ అన్యాయాలకు వాాతావరణ మార్పు కారణం కాదు. కానీ అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది" అని ఆయన చెప్పారు.
నీటిని ఎవరు వాడుకోవాలనేది ఇంకా కులమే శాసిస్తున్నంత కాలం కేవలం నీటి సరఫరాను పెంచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని శర్మ అభిప్రాయపడ్డారు.
మేలో ఓ రోజు ఉదయం.. చేతి పంపు వద్ద మిగిలిన కుటుంబాలు బకెట్లు నింపుకుంటుండగా మమత తన మూడు ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను కాళ్ల దగ్గర పెట్టుకుని వేచి చూస్తూ ఉన్నారు.
చలికాలంలో అయితే రోజుకు కొన్ని సార్లు మాత్రమే నీటి కోసం వస్తానని ఆమె చెప్పారు.
కానీ వేసవిలో 8 నుండి 10 సార్లు రావలసి వస్తుందని, వచ్చిన ప్రతీసారి అప్పుడు పంపు వద్ద ఎవరున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఆమె వంతు వచ్చాక తన బకెట్లను నింపుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజులో మళ్లీ ఆమె అక్కడికి మళ్లీ మళ్లీ రావాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































