కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గేయం పూర్తి ఆలాపనపై జైరాం రమేష్ ఏం చెప్పారు?

స్వాతంత్య్ర దినోత్సవం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు.

ఈ ఇద్దరు నేతలు గతసారి కూడా ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఇది స్వాతంత్య్ర దినోత్సవాన్ని అవమానించడమేనని బీజేపీ అంటోంది.

దీనిపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, మాట్లాడుతూ ''ప్రతీదానిలో అవమానమే వారికి కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ, స్వాతంత్య్ర పోరాటంలో కానీ పాలుపంచుకోని వారే ఇలా బాధపడతారు'' అన్నారు.

ఇదే సమయంలో, దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జాతీయ గేయం ''వందేమాతరాన్ని'' పూర్తిగా వినిపించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ''అసౌకర్యానికి'' గురైనట్లు కనిపించింది.

ఇప్పటి వరకు, వందేమాతరం రెండు చరణాలను మాత్రమే ఆలపించేవారు. అయితే, వర్షాకాల సమావేశాల సందర్భంగా, ప్రభుత్వం వందేమాతరం పూర్తి గేయానికి జాతీయ గేయంతో సమానమైన చట్టపరమైన రక్షణను కల్పించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1937లో వందేమాతరాన్ని జాతీయ గేయంగా స్వీకరించే విషయంపై రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సంప్రదించినప్పుడు, ముస్లింలు, బ్రహ్మ సమాజం లాంటి ఏకేశ్వరోపాసనను విశ్వసించే వారు, ఆ తర్వాత చరణాల్లో దుర్గాదేవీ ప్రస్తావన ఉన్నందున వాటిని వ్యతిరేకించవచ్చని అన్నారు.

మాతృభూమి సౌందర్యాన్ని వర్ణించినందున తొలి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఉంచాలని నెహ్రూకు ఠాగూర్ సూచించారు.

ఈ విషయాన్ని జర్నలిస్ట్, రచయిత నీలంజన్ ముఖోపాధ్యాయన్ ఆగస్ట్ 14న ఫ్రంట్‌లైన్‌లో ప్రచురించిన ఒక కథనంలో ప్రస్తావించారు.

''శిశిర్ కుమార్ దాస్ సంపాదకత్వం వహించిన 'ది ఇంగ్లీష్ రైటింగ్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్' అనే పుస్తకంలో స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు'' అని నీలంజన్ ముఖోపాధ్యాయన్ బీబీసీకి చెప్పారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వినిపించిన పూర్తి వందేమాతరం వీడియోను రీపోస్టు చేసిన బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ''పూర్తి వందేమాతరం గేయంపై తల్లీ కొడుకులు, జాతీయ అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కొన్ని మనస్తత్వాలు ఎప్పటికీ మారవు'' అని రాశారు.

మరోవైపు, దీనిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, ''కోల్‌కతాలో 1937 అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ సెషన్‌లో, గాంధీజీతో సహా ప్రముఖ నేతలందరూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో 'వందేమాతరం' గేయాన్ని ఆలపించాలని నిర్ణయించారు. ఇది జాతీయ గేయం'' అని అన్నారు.

అయితే, వందేమాతరానికి చెందిన కేవలం రెండు చరణాలను మాత్రమే ఆమోదం పొందాయని పేర్కొన్నారు.

మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏం జరిగింది?

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి సీపీపీ (కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

జాతీయ గేయం 'వందేమాతరం' వినిపించేటప్పుడు, కాంగ్రెస్ నేతలు అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. 'వందేమాతరం' రెండు చరణాలు వినిపించేంత వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత నుంచి వారు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది.

కాంగ్రెస్ నాయకులు మొదటి 55 సెకన్ల పాటు జాతీయ గేయాన్ని ఆలపించారు. కానీ, అది మరింత కొనసాగడంతో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ అసౌకర్యంగా కనిపించారు.

ఈ కార్యక్రమం వీడియోలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ మధ్యలో కొంత సంభాషణ జరుగుతున్నట్లు కనిపించింది.

సోనియా గాంధీ కాస్త అసౌకర్యంగా కనిపించారు. మల్లికార్జున్ ఖర్గేతో ఏదో మాట్లాడినట్లు కనిపించారు. ఆ తర్వాత, ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఒక కాంగ్రెస్ కార్యకర్తను పిలిచి, ఏదో మాట్లాడారు.

సోనియా గాంధీ తల ఊపుతూ కనిపించారు. జాతీయ గేయం సుమారు మూడు నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత జెండాను ఎగురవేసి, 'విశ్వ తిరంగ ప్యారా' అనే విజయ జాతీయ గేయాన్ని ఆలపించారు.

ఈసారి వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్రకోటలో జరిగిన అధికారిక కార్యక్రమంలో 80 ఏళ్ల సంప్రదాయంలో తొలిసారిగా, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జన గణ మన' జాతీయ గీతానికి ముందు 'వందేమాతరం' జాతీయ గేయాన్ని ఆలపించారు.

మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, @kharge

ఈ వివాదంపై జైరాం రమేష్ ఏమన్నారు?

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అసౌకర్యానికి గురయ్యారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు.

''మొత్తం వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదు. దాన్ని ఆపే ప్రయత్నం జరగలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు (మల్లికార్జున్ ఖర్గే) ఎక్కువ సేపటి నుంచి నిలబడి ఉండటంతో, సోనియాజీ ఆయనకు కుర్చీ తీసుకురమ్మని చెప్పారు అంతే'' అని జైరాం రమేష్ చెప్పారు.

కేరళలో ఈ గేయాన్ని పాడలేదని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ ప్రశ్నపై స్పందించేందుకు నిరాకరించారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఈ పాట మొత్తాన్ని వినిపించారు.

ఈ కార్యక్రమంలో వందేమాతరం విషయంలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది. ఇక రెండవది జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించడంలో ఎలాంటి తప్పులేదని జైరాం రమేష్ అంటున్నారు. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరేంటి?

ఈ సంఘటన ఆయన గతంలో చెప్పిన వైఖరికి భిన్నంగా ఉంది. గతంలో, మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఆయన చెబుతూ వచ్చారు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ ఇదే వైఖరిని కొనసాగించింది. ఈ సంఘటన పార్టీకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

కేరళలో 'వందేమాతరం' గేయం ఆలపించడంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని, 'జన గణ మన' గీతాన్ని ఆలపించాలని కోరారు.

విద్యాశాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో జాతీయ గేయం 'వందేమాతరం' గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు.

ప్రోటోకాల్ అధికారి జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఈ సూచనలు ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)