నిజామాబాద్: గల్ఫ్ నుంచి వచ్చిన నాలుగో రోజే భర్త హత్య.. భార్య, ఆమె ప్రియుడు, బాల్య స్నేహితుడు అరెస్ట్

నిజామాబాద్ , భర్త హత్య, టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య, ప్రశాంత్ మృతి

ఫొటో సోర్స్, Nizamabad police

ఫొటో క్యాప్షన్, ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేశారని నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ మీడియాకు చెప్పారు.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

(గమనిక: ఈ కథనంలో కలచివేసే వివరాలున్నాయి).

‘భర్తను మద్యం మత్తులో ఉంచి డాబాపై నుంచి తోసేసి, ఆ తర్వాత టాయిలెట్ క్లీనర్ లిక్విడ్‌ను ఆయన చేతి నరాల్లోకి ఎక్కించి హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం’ అని నిజామాబాద్ పోలీసులు చెప్పారు.

ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతారనే కారణంతోనే ప్రియుడితో కలిసి భార్య ఈ పథకం వేశారని, వీరికి మరో వ్యక్తి సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

24 గంటల వ్యవధిలో పక్కా ప్లాన్‌తో రెండుసార్లు హత్యకు ప్రయత్నించారని.. జూన్ 30న ప్రశాంత్ మరణించారని పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిజామాబాద్ , భర్త హత్య, టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య, ప్రశాంత్ మృతి

ఫొటో సోర్స్, Nizamabad police

ఫొటో క్యాప్షన్, 12 ఏళ్ల కిందట ప్రశాంత్, సంధ్యల వివాహం జరిగింది.

అసలేం జరిగింది?

పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్ కల్‌కు చెందిన దాయిని ప్రశాంత్ (36) కు నందిపేట మండలం వెల్మల్‌కు చెందిన సంధ్యతో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి కుమారుడు (9), కూతురు (7) ఉన్నారు.

నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ప్రశాంత్ కొంతకాలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించారు. పెళ్లికి ముందే నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ఆయన భార్య సంధ్య నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నారు.

ప్రశాంత్ ఐదేళ్ల కిందట ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల కిందట ఒకసారి స్వగ్రామానికి వచ్చి వెళ్లారు

రెండోసారి జూన్‌లో తిరిగి వస్తున్నానని, ఇకపై అక్కడికి వెళ్లకూడదని అనుకుంటున్నట్లు ప్రశాంత్ తన భార్య సంధ్యకు కొన్నినెలల ముందే ఫోన్ చేసి చెప్పారు. చెప్పినట్లుగానే జూన్ 27న ఆయన తిరిగి వచ్చారు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ప్రశాంత్‌ను సంధ్య రిసీవ్ చేసుకుని స్వగ్రామం న్యాల్‌కల్‌కు కారులో తీసుకొచ్చారని మృతుడి మేనల్లుడు రాహుల్ బీబీసీతో చెప్పారు.

అయితే, జులై 1న తన కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ప్రశాంత్ తల్లి దాయిని శ్యామల మోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోడలు సంధ్యపై అనుమానం ఉందని అందులో పేర్కొన్నారు.

మొదట మద్యం మత్తులో ప్రమాదవశాత్తు మరణించి ఉంటారని భావించినా.. విచారణలో సంధ్యే తన భర్తను మరో ఇద్దరి సహకారంతో ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తేలిందని పోలీసులు చెప్పారు.

"నిజామాబాద్ పట్టణానికి చెందిన అనిల్‌తో సంధ్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. తమ రిలేషన్‌కు అడ్డువస్తాడని, ఇకపై తమ మధ్య సంబంధం కొనసాగదనే ఉద్దేశంతోనే ప్రశాంత్ హత్యకు అనిల్‌తో కలిసి సంధ్య పథకం వేశారు. జూన్ 29న మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్‌ను బంటి అనే మరో యువకుడితో కలిసి డాబాపై నుంచి తోసేశారు. గాయాలతో బయటపడ్డ ఆయన్ను నిజామాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు సంధ్య. ఆ తర్వాత ప్రశాంత్ చేతికి అమర్చి ఉన్న క్యానులా(మందులు ఇంజెక్ట్ చేయడానికి అమర్చే పరికరం) లోంచి మత్తుమందు, టాయిలెట్ క్లీనర్ లిక్విడ్‌ను ఇంజెక్ట్ చేయడంతో వాంతులు, విరేచనాలతో ప్రశాంత్ మరణించారు. ఫిట్స్ వచ్చి తన భర్త చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు'' అని ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ చెప్పారు.

నిజామాబాద్ , భర్త హత్య, టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య, ప్రశాంత్ మృతి

ఫొటో సోర్స్, Nizamabad police

ఫొటో క్యాప్షన్, అనిల్

"ఈ నేరంలో ప్రియుడు అనిల్‌తో పాటు న్యాల్‌కల్ గ్రామానికి చెందిన వెంకటసాయి అలియాస్ బంటి సంధ్యకు సహకరించారు. పూర్తి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ వేస్తాం. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న విషయం సమగ్ర విచారణలో తేలుతుంది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం" అని ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ అన్నారు.

నిజామాబాద్ , భర్త హత్య, టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య, ప్రశాంత్ మృతి

ఫొటో సోర్స్, Nizamabad police

ఫొటో క్యాప్షన్, వెంకటసాయి

'బాల్య స్నేహితుడే'

జూన్ 29న తన భర్తను మద్యం తాగించాలంటూ వెంకటసాయితో సంధ్య మాట్లాడినట్టుగా చెబుతున్న కాల్ రికార్డు ఒకటి బయటకు వచ్చింది.

అదే సమయంలో వెంకటసాయి మాట్లాడినట్టుగా చెబుతున్న ఒక వీడియోలో.. ముందస్తు పథకం ప్రకారమే ప్రశాంత్‌ను మద్యం మత్తులో ముంచామని, ఆ తర్వాత ఆయనతో తనకు గొడవ జరిగిందని, ఈ క్రమంలో డాబాపై నుంచి కిందకు తోసేశామని చెబుతున్నట్లు ఉంది.

ఈ ఆడియో, వీడియోలను బీబీసీ ధ్రువీకరించడం లేదు.

నిందితుల్లో ఒకరైన బంటి, ప్రశాంత్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులని మృతుడి మేనల్లుడు గొల్లపల్లి రాహుల్ బీబీసీతో చెప్పారు.

"ఇద్దరిదీ ఒకే గల్లీ. ఊర్లో వారిద్దరే కలిసి తిరిగేవారు. 'మరో నిందితుడు అనిల్, సంధ్య పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె సహోద్యోగి. మామయ్య తిరిగి వచ్చేస్తున్నాడన్న విషయం తెలిసిన వెంటనే సంధ్య ఉద్యోగం మానేసింది. అనిల్‌తో కలిసి మర్డర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే వీరిద్దరినీ వెంటపెట్టుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లింది" అని రాహుల్ ఆరోపించారు.

జున్ 27 నుంచి తన మేనమామను మద్యం మత్తులోనే ఉంచారని రాహుల్ అన్నారు.

'కొడుకు శవం చూపించమని వేడుకున్నా, మార్చూరీ ముందు పడుకున్నా'

"చిన్నప్పుడే తండ్రి విడిచిపెట్టి పోతే (విడాకులు తీసుకుంటే) హోటళ్లలో పనిచేస్తూ నా కొడుకును పెంచాను. ఎన్ని సంబంధాలు వచ్చినా.. సంధ్యనే ఇష్టపడ్డానంటే పెళ్లి చేశాను. చివరకు నా కొడుకును పొట్టనపెట్టుకున్నారు" అని ప్రశాంత్ తల్లి దాయిని శ్యామల బీబీసీతో అన్నారు.

శ్యామల నిజామాబాద్‌లో వేరుగా ఉంటున్నారు.

"సౌదీ నుంచి నా కొడుకు తిరిగి వచ్చినట్లు కూడా నాకు చెప్పలేదు. ఆ రాత్రి ఆసుపత్రిలో శవాన్ని అనాథలా వదిలేసి పోయారు. నేను వెళ్లి నా కొడుకు ముఖాన్ని చూపించమని మార్చురీ సిబ్బందిని వేడుకున్నాను. ఆ రాత్రి వర్షంలో మార్చురీ మెట్లపైనే పడుకున్నా. ఒక్కగానొక్క కొడుకు.. నాకు న్యాయం చేయాలి'' అన్నారామె.

ఈ ఘటనపై సంధ్య కుటుంబ సభ్యులు స్పందించేందుకు నిరాకరించారు.

'' మేం ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మమ్నల్ని డిస్టర్బ్ చేయకండి. పిల్లలిద్దరూ మా సంరక్షణలోనే ఉన్నారు'' అని సంధ్య సోదరుడు సాగర్ బీబీసీతో అన్నారు.

మరో ఇద్దరు నిందితులు వెంకటసాయి, అనిల్ సంబంధీకులు అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)