హైదరాబాద్: సైబర్ క్రైమ్స్ డీసీపీని ఎందుకు బదిలీ చేశారు? దీనిపై రాజకీయ వివాదం ఎందుకు?

మెటా

ఫొటో సోర్స్, V.C. Sajjanar,IPS/X.com/GettyImages

హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు బదిలీ వ్యవహారం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శ, ప్రతివిమర్శలకు దారి తీసింది. ఈ అంశంపై ఈ రెండు ప్రధాన పార్టీలూ ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల కేసు వ్యవహారం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒకవైపు ప్రధాని మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో భారత్‌లో కొంతసేపు నిలిపివేయడంపై జాతీయస్థాయిలో దుమారం రేగింది. దీనిపై ఆగస్ట్ 5న మెటా క్షమాపణలు చెప్పింది.

ఇదే సందర్భంలో ప్రధాని మోదీపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు చేయడం, అందులో మెటా ఇండియా హెడ్‌ను బాధ్యుడిని చేయడం.. ఆ తర్వాత రెండు రోజులకే డీసీపీని బదిలీ చేయడంతో వివాదం రాజుకుంది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మెటా ఇండియా హెడ్‌పై కేసు పెట్టడం వల్లనే డీసీపీని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం తోసిపుచ్చింది. సాధారణంగా జరిగే బదిలీల ప్రక్రియలో భాగంగా ఇది జరిగిందని, ఇందులో ప్రభుత్వ జోక్యం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరరీతిలో చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టారంటూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు జులై 29న ఓ కేసు నమోదు చేశారు. 20 మంది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్ల యూజర్లతోపాటు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌ను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న టి.సాయికిరణ్ గౌడ్ జులై 29 మధ్యాహ్నం రెండు గంటలకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి 7.40 గంటలకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇరవై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లకు సంబంధించిన యూఆర్ఎల్‌లను ఫిర్యాదులో పేర్కొనగా, ఆ అకౌంట్ల నిర్వాహకులను ఏ1గా పేర్కొన్నారు. అదే ఎఫ్ఐఆర్‌లో మెటా ఇండియా హెడ్‌ను ఏ2గా పేర్కొన్నారు.

ఈ కేసు విషయంపై గత నెల 31న మెటాను బీబీసీ ఈ-మెయిల్ ద్వారా సంప్రదించింది. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 66(సీ), 67, బీఎన్ఎస్ సెక్షన్ 353(2), 336(4) కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిపై జులై 31న జాతీయ, స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి. మెటా ఇండియా హెడ్‌పై కేసు పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మరుసటి రోజు.. ఆగస్టు 1న సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

బదిలీ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్‌ను బీబీసీ ఫోన్, వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించింది. ఆయన నుంచి సమాధానం రావాల్సి ఉంది.

అలాగే అరవింద్ బాబును ఫోన్ ద్వారా బీబీసీ సంప్రదించింది. ఆయన కూడా స్పందించాల్సి ఉంది.

అరవింద్ బాబు 2025 నవంబరులోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిది నెలలకే బదిలీ అయ్యారు.

బదిలీకి కొన్ని గంటల ముందు కమిషనర్ సజ్జనర్‌తో అరవింద్ బాబు సమావేశమైనట్లు పోలీసువర్గాలు బీబీసీతో చెప్పాయి.

కిషన్ రెడ్డి, అద్దంకి దయాకర్

ఫొటో సోర్స్, FB/Kishan Reddy/Dr Addanki Dayakar/FB

బీజేపీ, కాంగ్రెస్ పరస్పర విమర్శలు

డీసీపీ బదిలీపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.

''మెటా సంస్థకు నోటీసులు ఇచ్చిన డీసీపీ అరవింద్ బాబును ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. మెటా కంపెనీపై ఎలా కేసు పెడతారంటూ దిల్లీ నుంచి రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, తెలంగాణ సీఎంలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే డీసీపీని బదిలీ చేశారని చెబుతున్నారు. తప్పు చేయకుండానే అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయడం తెలంగాణలో పరిపాటిగా మారింది'' అంటూ విమర్శించారు.

''ఐటీ చట్టం ప్రకారం జులై 29న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోస్టులు చేసినవారితోపాటు మెటా ఇండియా హెడ్‌కు కూడా నోటీసులు ఇచ్చారు'' అని కిషన్ రెడ్డి చెప్పారు.

అయితే, అరవింద్ బాబు బదిలీకి, మెటా కేసుకు సంబంధం లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు.

"పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టారు. ప్రధాని హోదాను దృష్టిలో ఉంచుకుని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో దానికి తగ్గట్టుగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసు నమోదు చేశారు. ప్రభుత్వం స్పందించిన తీరుకు అభినందించాల్సిందిపోయి విమర్శించడం తగదు" అని చెప్పారు.

"ఈ కేసు విషయంలో గానీ, అధికారి బదిలీ విషయంలో గానీ ప్రభుత్వ జోక్యం ఏమీ లేదు. కేసు నమోదు, దర్యాప్తు పూర్తిగా పోలీసుల విధి. రూల్స్ ప్రకారమే పోలీసులు ముందుకు వెళతారు" అని అద్దంకి దయాకర్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)