‘క్లిటోరిస్ ఉంటే మగవాళ్లు ఎగతాళి చేస్తారంటూ ఎఫ్‌జీఎం చేసింది’

- రచయిత, జోస్ కార్లోస్ క్వీటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(హెచ్చరిక: ఈ స్టోరీలో ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ - ఎఫ్‌జీఎం పద్ధతులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి)
లాటిన్ అమెరికాలోనే ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్(ఎఫ్‌జీఎం)ను చట్టవిరుద్ధంగా ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. యాక్టివిస్ట్‌లు దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
జోస్ కార్లోస్ క్వీటో అందించిన కథనం ప్రకారం.. ఈ బిల్లు కొలంబియా కాంగ్రెస్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ.. రహస్యంగా సాగే ప్రమాదకరమైన ఈ పద్ధతిని నిర్మూలించేందుకు సుదీర్ఘ పోరాటమే చేయాల్సి వచ్చింది.
కార్లా క్వినోనెజ్(ఇది అసలు పేరు కాదు) కుమార్తెకు కేవలం 6 నెలల వయసులో, ఆ పాప జేజవ్వ(గ్రేట్ గ్రాండ్‌మదర్) ఆమెకు ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ చేయించింది.
పాపను అవ్వ తన చేతుల్లో పెట్టినప్పుడు, "పాపకు తీవ్రమైన జ్వరం, శరీర భాగాలు వాచిపోయి, రక్తం కారుతోంది" అని క్వినోనెజ్ చెప్పారు. పాప ఏడుస్తూనే ఉందని అన్నారు.
"అప్పుడు నేను అవ్వను గట్టిగా నిలదీశాను, కానీ ఆమె ఇది మామూలు విషయమే. ఎవరికీ చెప్పొద్దు అని నాతో అన్నది"
ఆస్పత్రి చాలా దూరం కావడంతో, మంత్రసానిగా పనిచేసే క్వినోనెజ్ తల్లి మూలికల సాయంతో ఆ పాపకు నొప్పుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నించారు. ఆమె కూడా క్వినోనెజ్ అవ్వను హెచ్చరించింది. కానీ, ఆ వృద్ధురాలు వినిపించుకోలేదు.
"క్లిటోరిస్ ఉంటే మగాళ్లు ఎగతాళి చేస్తారంది"

కొలంబియాలో ఎఫ్‌జీఎం
ఎఫ్‌జీఎం అంటే.. వైద్యపరమైన కారణాలతో కాకుండా, స్త్రీ బాహ్య జననేంద్రియాలను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం లేదా జననాంగాలను గాయపరచడం.
దీనివల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్లతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పెద్దయ్యాక పీరియడ్స్ సమయాల్లో, ప్రసవ సమయాల్లో తీవ్ర సమస్యలు ఎదురవ్వచ్చు. అలాగే, మహిళలు లైంగిక ఆనందాన్ని అనుభవించే విషయంలోనూ ఇది ఇబ్బందిగా మారుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలు, మహిళల్లో 23 కోట్ల మందికిపైగా మహిళలు ఈ ఎఫ్‌జీఎం బారినపడ్డారు. వీరిలో ఆఫ్రికా ఖండానికి చెందినవారే ఎక్కువ.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కొలంబియాలోని ఎంబెరా తెగకు చెందిన 30 ఏళ్ల క్వినోనెజ్, తమ తెగలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు పనిచేస్తున్నారు.
ఈ నిషేధ చట్టం రావడంలో తోటి సామాజిక కార్యకర్తలు, కొలంబియా కాంగ్రెస్ సభ్యులతో కలిసి క్వినోనెజ్ కీలకపాత్ర పోషించారు.
తాను పెరిగి పెద్దయ్యే కొద్దీ తమ సమాజంలో జరుగుతున్న ఈ దారుణం గురించి అర్థమైందని ఆమె అంటున్నారు.
"పుట్టిన కొద్దిరోజులకే పిల్లలు, అందులోనూ మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారా? అని ఆలోచించేదాన్ని.
మా అమ్మ పురుడుపోసిన మా బంధువుల అమ్మాయి గురించి నాకింకా గుర్తుంది. పాప ఆరోగ్యంగానే పుట్టింది. కానీ, మూడు రోజులకే చనిపోయింది.
ఏమైందని మా అమ్మను అడిగినప్పుడు, 'జై' అనే వ్యాధి వల్ల ఆ పాప చనిపోయిందని చెప్పింది."
అప్పట్లో జై కారణంగా చనిపోయారని అనుకున్న ఆడశిశువులు, నిజానికి ఎఫ్‌జీఎం వల్ల తలెత్తిన సమస్యలతోనే చనిపోయారని క్వినోనెజ్ విశ్వసిస్తున్నారు.

ఫొటో సోర్స్, Courtesy of Diana Ramos / Photo by David Jiménez
వైద్యులు ఏమంటున్నారు?
2020 నుంచి 2026 జూన్ వరకూ, కొలంబియాలో 240 ఎఫ్‌జీఎం కేసులు నమోదయ్యాయి. బాధితులు దాదాపు ఆరేళ్లలోపు బాలికలే. అయితే, ఈ సంఖ్య కేవలం శాంపిల్ మాత్రమేనని పిల్లల వైద్యురాలు డయానా రామోస్ అంటున్నారు. అంటే, బయటకొచ్చిన కేసులు చాలా తక్కువని ఆమె భావన.
కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన కొలంబియా వాయువ్య ప్రాంతం, పెరీరా నగరంలోని శాన్ జార్జ్ యూనివర్సిటీ హాస్సిటల్లో ఆమె పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఏవో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చే బాలికలను పరీక్షిస్తున్నప్పుడు.. వారి ఒంటిపై మచ్చలు, కాలిపోయిన గుర్తులు, మ్యుటిలేషన్ ఆనవాళ్లు కనిపించేవని ఆమె చెప్పారు.
ఒక చిన్నారి పరిస్థితిని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ పాప ఆస్పత్రికి వచ్చేప్పటికి యోని మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అంటే, ఆమె పెద్దయ్యాక పీరియడ్స్ రావడం కానీ, లేదా శృంగారంలో పాల్గొనడం కానీ అస్సలు సాధ్యమయ్యేది కాదు.
"ఆ పాపకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయాల్సి వచ్చింది" అని డాక్టర్ డయానా చెప్పారు.
జీవితాంతం బాధితులను వెంటాడే లైంగికపరమైన, లింగ ఆధారిత హింసగా ఆమె ఎఫ్జీఎంని పరిగణిస్తారు. అయితే, దీనిని కేవలం శిక్షలు విధించడం ద్వారా కాకుండా.. విద్య, అవగాహన కల్పించడం ద్వారా పరిష్కరించాలని ఆమె అంటున్నారు.
"ఈ తెగలకు చెందిన కొందరు తామేమీ హాని చేయడం లేదని, మంచే చేస్తున్నామనే భావనలో ఉంటారు" అని డయానా అన్నారు.

ఫొటో సోర్స్, José Carlos Cueto / BBC Mundo
'సంస్కృతి ప్రాణాలు తీయదు'
సుమారు 3 లక్షల మంది జనాభా ఉండే 'గ్రేట్ ఎంబెరా నేషన్' కొలంబియాలోని అతిపెద్ద ఆదివాసీ తెగల్లో ఒకటి. ఈ తెగకు చెందిన ప్రజలు ఈక్వెడార్, పనామాల్లోనూ ఉన్నారు.
లాటిన్ అమెరికాలో మరెక్కడా కనిపించని ఈ ఎఫ్‌జీఎం ఆచారం ఈ తెగలోనే ఎందుకుందనే దానికి, ఆఫ్రికన్ దేశాల నుంచి బానిసలుగా తెచ్చిన వారి ద్వారా ఇది ఇక్కడికి వచ్చి ఉండొచ్చన్న కథనమొకటి ప్రచారంలో ఉంది.
మరో కథనం ఏంటంటే, వందల ఏళ్ల కిందట ఈ తెగలో ఒక ఇంటర్‌సెక్స్ శిశువు జన్మించడంతో వారిలో క్లిటోరిస్ అంటే భయం ఏర్పడింది. దానిని కత్తిరించకపోతే అది పురుషాంగంగా పెరుగుతుందని ఇప్పటికీ చాలామంది వృద్ధ మహిళలు నమ్ముతున్నారు.
లైంగిక ఆనందంతో ముడిపడి ఉన్న ఈ అవయవం ఉంటే మహిళలు విచ్చలవిడిగా ప్రవర్తించడం, ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనే పితృస్వామ్య భావజాలం నుంచి వచ్చిందని మరికొందరు భావిస్తారు.
దీని మూలాలు ఏవైనప్పటికీ, దీనిని ఒక ఆచారంగా, లేదా సంస్కృతిగా అంగీకరించేందుకు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ద గ్రేట్ ఎంబెరా నేషన్ ఆఫ్ కొలంబియా ప్రతినిధి, ప్రధాన ఆదివాసీ కౌన్సిలర్ అయిన జూలియానా డోమికో తిరస్కరించారు.
"మా సంస్కృతి అంటే మా దుస్తులు, మా హస్తకళలు, మా సంప్రదాయ నృత్యాలు, మా భాష. అంతేకానీ ప్రాణాలు తీసే ఆచారం సంస్కృతి అనిపించుకోదు. సంస్కృతి ప్రాణాలు తీయదు."
ఏళ్ల తరబడి కొనసాగిన కృషితోనే ఈ చట్టం వచ్చిందని ఆమె అన్నారు. ఇది క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలవుతుందని ఆశిస్తున్నామన్నారు.

ఎంబెరా తెగలోని మహిళలిప్పుడు ఎఫ్‌జీఎం చేయాలా? వద్దా? అనే దానిపై చర్చిస్తున్నారని, సమాజంలో మార్పు మొదలైందని క్వినోనెజ్ అంటున్నారు.
తన మనవరాళ్లకు ఎఫ్‌జీఎం చేసిన ఒక అవ్వ పశ్చాత్తాపంతో చెప్పిన మాటలు తనను కలచివేశాయని ఆమె అన్నారు.
"నేనెప్పుడూ తప్పుడు ఉద్దేశంతో అలా చేయలేదు. కేవలం నా మనవరాళ్లను మగాళ్లు ఎగతాళి చేయకూడదనే నేనలా చేశానని ఆ వృద్ధురాలు చెప్పారు" అని క్వినోనెజ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























