ఇందిరా గాంధీ రూపాయి విలువను కావాలని ఎందుకు తగ్గించారు? సోవియట్ యూనియన్ ఎందుకు నొచ్చుకుంది?

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడుతున్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేదని అంటుంటారు. కానీ, భారతదేశంలో రూపాయి విలువను ఉద్దేశపూర్వకంగానే బలహీనపరిచిన సందర్భాలున్నాయి.

దాదాపు 60 ఏళ్ల కిందట, అంటే 1966 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రూపాయి విలువను 36.5 శాతం తగ్గించారు.

అంటే డాలర్‌తో పోలిస్తే రూపాయిని 36.5 శాతం బలహీనపరిచారు. దీని ఫలితంగా రూపాయితో పోలిస్తే డాలర్ ధర 57.4 శాతం పెరిగింది. అప్పట్లో ఒక డాలర్ ధర 4.76 రూపాయల నుంచి 7.50 రూపాయలకు చేరింది.

ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది చాలాకాలం పాటు రాజకీయ వివాదంగా నడిచింది. రాజకీయంగా, ఆర్థికంగా 1966 సంవత్సరం భారతదేశానికి ఒక సంక్షోభ సమయం.

దానికి నాలుగేళ్ల కిందట, అంటే 1962లో చైనాతో భారతదేశానికి యుద్ధం జరిగింది. అది వాస్తవాధీన రేఖను మార్చేసింది. మూడేళ్ల తర్వాత, అంటే 1965లో పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేసింది. ఈ రెండు యుద్ధాల తర్వాత భారత ఆర్థిక స్థితి చాలా బలహీనపడింది.

ఇవే కాకుండా, తీవ్రమైన కరువు వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఘోరంగా దెబ్బతింది. దీనివల్ల భారతదేశం మొదటిసారి పెద్ద ఎత్తున బియ్యం, గోధుమలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

దేశ విదేశీ మారక నిల్వలు చాలా పరిమితంగా ఉండేవి. 1965లో భారతదేశ దిగుమతులు రూ. 2,194 కోట్లు కాాగా .. ఎగుమతులు కేవలం రూ. 1,264 కోట్లు మాత్రమే.

అలా వ్యాపార లోటు రూ. 930 కోట్లకు చేరుకుంది. ఇది 1960లనాటికి అత్యధికం.

పరిస్థితులు ఎలా ఉండేవి?

భారతదేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువను తగ్గించాలని అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ఒత్తిడి తెచ్చిందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అరుణ్ కుమార్ అన్నారు.

"భారతదేశం ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ, దీని తర్వాతే ఆహార భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హరిత విప్లవం కూడా దీని తర్వాతే వచ్చింది. అయితే, రూపాయి విలువ తగ్గించిన తర్వాత భారతదేశంలో అమెరికా ప్రభావం పెరిగింది" అన్నారు.

"సోవియట్ యూనియన్ (యుఎస్ఎస్ఆర్) దీనిపై పెద్దగా సంతోషించలేదు. కానీ, 1962లో చైనా దాడి చేసినప్పుడు అమెరికా భారతదేశానికి సహాయం చేయడానికి సిద్ధమైంది. సోవియట్ యూనియన్ మాత్రం తటస్థంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో సోవియట్ యూనియన్ పట్ల ప్రభుత్వం, ప్రజల్లో ఉన్న సానుభూతి తగ్గింది. భారతదేశం సోవియట్ ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే, 1971లో సోవియట్ యూనియన్ భారతదేశంవైపు నిలబడగా, పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మళ్లీ మారిపోయాయి" అన్నారు.

1966 జూన్ 6న రూపాయి బలహీనపడిన వార్తను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' మొదటి పేజీలో ప్రచురించింది.

"ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడానికి తగినంత విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో భారతదేశం అమెరికా సహాయం కోరింది. అమెరికాకు చెందిన 'ఫుడ్ ఫర్ పీస్' ప్రోగ్రామ్ కింద భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ సొంత కరెన్సీలోనే చెల్లింపులు జరిపి ఆహార ధాన్యాలను పొందే సదుపాయం ఉంది" అని ఆ కథనం తెలిపింది.

ఇందిరా గాంధీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం, "అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ భారతదేశానికి సుమారు 1.6 కోట్ల టన్నుల గోధుమలు, 10 లక్షల టన్నుల బియ్యం పంపడంతో పాటు దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఇది భారతదేశ ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి ఉద్దేశించింది.

ఈ సహాయాన్ని అంగీకరించడం రాజకీయంగా ప్రజాదరణ లేని చర్యగా ఇందిరా గాంధీకి అనిపించింది. 1966 ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి సచీంద్ర చౌధురి.. 'ప్రపంచంలో ఉత్తమ ఉద్దేశాలు, మనకు సామర్థ్యాలు ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో విదేశీ సహాయం లేకుండా మనం ముందుకు సాగలేం' అని చెప్పారు.

కానీ, సహాయంలో కోత పడటం, దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించాలని భారతదేశంపై ఒత్తిడి పెరగడంతో ఇందిరా గాంధీ ఒక కీలక అడుగు వేశారు.

జూన్ 5 రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత.. 1966 జూన్ 6న ఆమె రూపాయి విలువను తగ్గించారు. దీని ఫలితంగా ఒక డాలర్ ధర 4.76 రూపాయల నుంచి 7.50 రూపాయలకు పెరిగింది. రూపాయిని 36.5 శాతం బలహీనపరిచారు. ఈ విధంగా రూపాయితో పోలిస్తే డాలర్ విలువలో 57.4 శాతం బలం వచ్చింది".

ఇందిరా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు విమర్శకులు దీన్ని అమెరికా, ప్రపంచ బ్యాంక్ ముందు పూర్తిగా లొంగిపోవడంగా అభివర్ణించారు.

చివరకు కాంగ్రెస్ పార్టీలో కూడా దీనిపై వ్యతిరేకత మొదలైంది. అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అప్పటి వాణిజ్య మంత్రి మనుభాయ్ షా. రూపాయి విలువను ఇంత భారీగా తగ్గించడాన్ని జీర్ణించుకోవడం కష్టమని క్యాబినెట్ సమావేశంలోనే ఆయన చెప్పారు.

భారతదేశ ప్రధాన ఎగుమతి ఉత్పత్తులు, ముఖ్యంగా జనపనార, పత్తి డిమాండ్‌లో ఎలాంటి మార్పు రాదని మనుభాయ్ షా వాదించారు.

అంటే ధరలు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా వాటి డిమాండ్‌లో పెద్దగా పెరుగుదల ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. మనుభాయ్ షా ప్రకారం.. కేవలం రూపాయి విలువ తగ్గించడం వల్ల ఎగుమతుల్లో ఆశించిన పెద్ద ఊపు రాదు.

విలువ తగ్గింపు ప్రకటన వచ్చిన కేవలం రెండు నెలల తర్వాత మనుభాయ్ షా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విలువ తగ్గింపునకు ముందు అమల్లో ఉన్న ఎగుమతి సబ్సిడీలను ఏకపక్షంగా మళ్లీ పునరుద్ధరించారు.

అంతేకాకుండా, రూపాయి విలువను తగ్గించడం అనేది "స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద పొరపాటు" అని మనుభాయ్ షా బహిరంగంగా చెప్పారు.

ఈ చర్య రూపాయి విలువ తగ్గింపు అసలు ఉద్దేశాన్ని చాలా వరకు దెబ్బతీసిందని ఆర్థిక చరిత్రకారులు భావిస్తున్నారు.

నిజానికి, ఎగుమతులను పోటీతత్వంతో కూడినవిగా మార్చడం, ఎగుమతిదారులకు ఇచ్చే ప్రత్యేక సబ్సిడీలపై ఆధారపడటాన్ని తగ్గించడమే రూపాయి విలువ తగ్గింపు ప్రధాన లక్ష్యం.

కష్టమైన నిర్ణయం

బిజినెస్ స్టాండర్డ్ మాజీ ఎడిటర్ టీఎన్ నినాన్ 2013 ఆగస్టు 16న బిజినెస్ స్టాండర్డ్‌లో రాసిన ఒక వ్యాసంలో ఇందిరా గాంధీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు.

ఆ కథనం ప్రకారం, "అప్పట్లో భారతదేశం తీవ్ర విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూపాయి విలువను భారీగా తగ్గించకుండా అదనపు విదేశీ సహాయం లభించడం కష్టమని వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసింది.

ఈ అంశం 1965 నుంచి చర్చల్లో ఉంది. బీకే నెహ్రూ రాసిన 'నైస్ గైస్ ఫినిష్ సెకండ్' పుస్తకం ప్రకారం, 1966 జనవరిలో తాష్కెంట్‌కు వెళ్లడానికి ముందే ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రూపాయి విలువ తగ్గింపునకు అంగీకరించారు. చివరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) కి కూడా 1966 జూన్‌లో ఈ ప్రకటన చేసే అవకాశం ఉన్న తేదీని తెలియజేశారు. రూపాయి విలువ తగ్గింపును వ్యతిరేకించిన కారణంగానే 1965 డిసెంబర్‌లో శాస్త్రి తన ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారిని పదవి నుంచి తొలగించారని చెబుతారు.

ఇందిరా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్లమెంట్, మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికా ఒత్తిడి వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శకులు ఆరోపించారు. అదనపు సహాయాన్ని సమకూరుస్తామన్న మాటను వరల్డ్ బ్యాంక్ వెంటనే నెరవేర్చలేకపోవడంతో పరిస్థితి మరింత క్షీణించింది. కాలక్రమేణా పశ్చిమ దేశాలు, వారి హామీలపై ఇందిరా గాంధీకి నమ్మకం తగ్గింది. తర్వాతి కాలంలో ఆమె వామపక్ష ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపడానికి ఇది ఒక కారణంగా భావిస్తారు".

"ఇందిరా గాంధీ నిర్ణయాన్ని నినాన్ సమర్థించారు. చరిత్రలో తరచుగా ఒక ముఖ్యమైన వాస్తవాన్ని విస్మరిస్తుంటారు: రూపాయి విలువ తగ్గింపు మధ్యకాలిక ప్రభావం" అని ఆయన రాశారు.

"1950-51 నుంచి 1965-66 మధ్య కాలంలో భారత ఎగుమతులు కేవలం 20 శాతం మాత్రమే పెరిగాయి. కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ దిగుమతులు 131.3 శాతం పెరిగాయి. 1950-51లో వ్యాపారం దాదాపు సమతుల్యంగా ఉండగా.. 1965-66 నాటికి భారతదేశం భారీ వ్యాపార లోటులోకి వెళ్ళిపోయింది.

రూపాయి విలువ తగ్గించిన తర్వాత ఈ పరిస్థితి మారడం ప్రారంభమైంది. ఎగుమతులు గతంతో పోలిస్తే వేగంగా పెరగడం మొదలైంది, దిగుమతులు తగ్గాయి. 1970-71 నాటికి భారత వ్యాపార లోటు అంతకు ఐదేళ్ల కిందటితో పోలిస్తే దాదాపు పదో వంతుకు పడిపోయింది. ఈ కోణంలో చూస్తే రూపాయి విలువ తగ్గింపు అవసరం మాత్రమే కాదు, అది తన లక్ష్యాన్ని కూడా నెరవేర్చింది" అని రాశారు నినాన్.

1991 మార్చిలో ఒక డాలర్ ధర 19.64 రూపాయలుగా ఉండేది. కేవలం ఒక ఏడాదిలోనే ఇది 31.23 రూపాయలకు పెరిగింది. అంటే రూపాయి దాదాపు 59 శాతం బలహీనపడింది.

దీని ఫలితంగా 1993-94 నాటికి భారతదేశ వ్యాపార లోటు అంతకు మూడేళ్ల కిందటితో పోలిస్తే ఆరో వంతుకు తగ్గిందని నినాన్ చెప్పారు. అంటే కరెన్సీ బలహీనపడటం అనేది అన్ని పరిస్థితుల్లోనూ ప్రతికూలం కాదు.

సోవియట్ యూనియన్ అసంతృప్తి

భారతదేశం అప్పట్లో అమెరికా కూటమిలో లేదు, సోవియట్ యూనియన్‌కు దగ్గరగా ఉండే దేశంగా గుర్తింపు పొందింది. ఇందిరా గాంధీ రూపాయి విలువను తగ్గించినప్పుడు అంతర్జాతీయంగా కూడా స్పందన వచ్చింది. అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ స్పందన సోవియట్ యూనియన్ నుంచి వచ్చింది.

రూపాయి విలువ తగ్గింపు ఒక పెద్ద పొరపాటని భారత వాణిజ్య మంత్రి మనుభాయ్ షాతో సోవియట్ నాయకుడు అలెక్సీ కోసిగిన్ 1966 జూలై ప్రారంభంలో చెప్పారు.

మాస్కోలో భారత రాయబారిగా ఉన్న అశోక్ మెహతా తర్వాతి కాలంలో రాస్తూ.. తాను ఈ నిర్ణయాన్ని వివరించడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడ పూర్తిగా నిశ్శబ్దం ఎదురైందని పేర్కొన్నారు.

ఆయన ఈ అనుభవాన్ని "చెవిటి వారి మధ్య సంభాషణ" గా అభివర్ణించారు. భారతదేశం పశ్చిమ దేశాల కూటమి వైపు మొగ్గు చూపుతోందనే దానికి సంకేతంగా సోవియట్ నాయకత్వం ఈ చర్యను చూసింది.

అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్ భారతదేశానికి లభించే సైనిక, ఆర్థిక సహాయాన్ని పెంచింది.

అయితే దీనిని దక్షిణ ఆసియాలో తన ప్రభావాన్ని కాపాడుకోవడానికి సోవియట్ వ్యూహంగానే చాలామంది విశ్లేషకులు చూశారు. మరోవైపు అమెరికాలో కూడా ఈ నిర్ణయంపై తర్వాతి కాలంలో నిరాశ వ్యక్తమైంది.

రూపాయి విలువ తగ్గింపు జరిగిన దాదాపు ఒక ఏడాది తర్వాత, 1967 జూలైలో అమెరికా పారిశ్రామికవేత్త జాన్ డి. రాక్‌ఫెల్లర్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జార్జ్ వుడ్స్‌కు రాసిన లేఖలో.. "రూపాయి విలువ తగ్గింపు విఫలమైంది. మేం ఆశించిన పాలసీ మార్పులను భారతదేశం చేయలేదు" అని పేర్కొన్నారు.

రూపాయి విలువ తగ్గింపును సమర్థించిన పశ్చిమ దేశాల సంస్థలు కూడా తర్వాతి కాలంలో ఫలితాలపట్ల సంతృప్తిగా లేవనడానికి ఈ వ్యాఖ్య ఉదాహరణగా నిలిచింది. భారత్ కొన్ని నెలల్లోనే ఆర్థిక సరళీకరణ దిశ నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించిందని వారు భావించారు.

భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన చెస్టర్ బౌల్స్ కూడా ఆత్మకథలో రూపాయి విలువ తగ్గింపు విషయంలో భారత సమాజంలో విస్తృత నిరసన వ్యక్తమైందని రాశారు.

ఈ వ్యతిరేకత కేవలం వామపక్ష లేదా జాతీయవాద వర్గాలకే పరిమితం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చివరకు అమెరికాలో చదువుకుని, పశ్చిమ దేశాల ఆర్థిక విధానాల పట్ల సానుభూతితో ఉంటారని భావించిన ఎంతోమంది భారతీయులు కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారని తెలిపారు.

భారత్‌లో విస్తృత చర్చ

1966 నాటి రూపాయి విలువ తగ్గింపు అనేది కేవలం ఒక ఆర్థిక నిర్ణయంగానే మిగిలిపోలేదు. అది కోల్డ్ వార్ పాలిటిక్స్, విదేశీ సహాయం, ఆర్థిక సార్వభౌమత్వం, భారత అభివృద్ధి వ్యూహంపై జాతీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది.

1966లో రూపాయి విలువ తగ్గింపుపై జరిగిన చర్చ కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, భారత మేధో, ఆర్థిక రంగాన్ని కూడా తీవ్రంగా విభజించింది.

ఈ చర్చల మధ్యే, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ 1966లో తన మొదటి ముఖ్యమైన సంచికను ప్రచురించింది. అందులో రూపాయి విలువ తగ్గింపు, దానికి సంబంధించిన ఆర్థిక ప్రశ్నలపై విస్తృతంగా చర్చించారు.

ఆర్థికవేత్తలు జగదీష్ భగవతి, టి.ఎన్. శ్రీనివాసన్ తర్వాతి కాలంలో తమ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ స్టడీలో రాస్తూ.. ఎంతోమంది ఆర్థికవేత్తలు వ్యక్తిగతంగా రూపాయి విలువ తగ్గింపును సమర్థించారని పేర్కొన్నారు.

కానీ అమెరికా, వరల్డ్ బ్యాంక్ తెచ్చిన ఒత్తిడి ఈ నిర్ణయానికి దక్కాల్సిన రాజకీయ ఆమోదాన్ని బలహీనపరిచిందని వారు భావించారు.

వారి అభిప్రాయం ప్రకారం, పరిస్థితి ఎలా తయారైందంటే.. ఎవరైనా ఆర్థికవేత్త బహిరంగంగా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తే, వారిని విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేసే వ్యక్తిగా లేదా ఏజెంట్‌గా ముద్ర వేసే ప్రమాదం ఏర్పడింది.

అందువల్ల ఎంతోమంది మద్దతుదారులు కూడా దీనికి అనుకూలంగా బహిరంగంగా ముందుకు రాలేకపోయారు. వ్యాపార రంగంలో కూడా దీనిపై భిన్నమైన స్పందనలు వచ్చాయి.

పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటా ఈ నిర్ణయాన్ని ఒక "చేదు మాత్ర" అని అభివర్ణించారు. ఈ నిర్ణయం బాధాకరమైనదే అయినప్పటికీ, అప్పటి పరిస్థితులనుబట్టి చూస్తే ఇది అవసరం కూడా కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)