You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్లూ మూన్: మే 31న రానున్న పౌర్ణమి ఎందుకంత ప్రత్యేకం?
- రచయిత, డాక్టర్ టి.వి.వెంకటేశ్వరన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
2026, మే 31వ తేదీ రాత్రి తల పైకెత్తి ఆకాశం వైపు చూడండి. చీకట్లో వెండి పళ్లెంలా నిండు చంద్రుడు కనిపిస్తున్నాడా? అది మే నెలలో వచ్చే రెండో పౌర్ణమి. దీనికి ఒక విభిన్నమైన పేరుంది.. అదే 'బ్లూ మూన్ (నీలి చంద్రుడు)'.
పేరు నీలి చంద్రుడే, కానీ చంద్రుడు నీలం రంగులో మాత్రం కనిపించడు.
ఐరోపా సంస్కృతిలో నీలం రంగును అరుదైన విషయాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే, అరుదుగా లేదా అసాధారణంగా జరిగే విషయాలను సూచించడానికి వారు 'నీలం' రంగును వాడుతుంటారు. మనం కోపానికి ఎరుపు, శాంతికి తెలుపు అని చెప్పుకున్నట్టు అన్నమాట.
ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి రావడం అనేది చాలా అరుదైన విషయం. దీనిని సూచించేందుకే, ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని 'బ్లూ మూన్' అంటారు.
ఒకే నెలలో రెండు పౌర్ణములు ఎలా వస్తాయి?
దీనికి కారణం, చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎల్లప్పుడూ ఒకే వేగంతో ప్రయాణించకపోవడమే.
సూర్యుడు ఒకవైపు, భూమి మధ్యలో, చంద్రుడు మరోవైపు... ఇలా ఒకే వరుస క్రమంలో వచ్చినప్పుడు పౌర్ణమి (పూర్ణ చంద్రుడు) సంభవిస్తుంది.
ఆ క్షణంలో, ఈ మూడు ఖగోళ వస్తువుల కేంద్రాలు ఒకే అక్షంలో ఉంటాయి. అదే పౌర్ణమి సమయం.
పౌర్ణమికి కచ్చితంగా ఎన్ని రోజులు పడుతుంది?
చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి 27.3 రోజులు పడుతుంది. కానీ ప్రతి 27.3 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి రాదు.
చంద్రుడు తన 360 డిగ్రీల ప్రయాణాన్ని పూర్తి చేసే సమయానికి, భూమి కూడా తన కక్ష్యలో కొంత ముందుకు జరిగి ఉంటుంది. అందువల్ల చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేసినప్పటికీ, పౌర్ణమికి కావలసిన 'సూర్యుడు-భూమి-చంద్రుడు' ఒకే అక్షంపైకి వచ్చే అమరిక కూడా ముందుకు కదులుతుంది.
సూర్యునికి సరిగ్గా ఎదురుగా ఉండే స్థానానికి చేరుకోవడానికి చంద్రుడు మరికొంత అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అదనపు ప్రయాణం వల్ల పౌర్ణమి కాలచక్రం సగటున 29.53 రోజులకు పెరుగుతుంది. అంటే సరిగ్గా 29 రోజుల, 12 గంటల, 44 నిమిషాలన్నమాట.
అంతేకాకుండా, చంద్రుడు భూమి చుట్టూ కచ్చితమైన వృత్తాకార కక్ష్యలో తిరగడు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాడు. ఈ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రయాణించేటప్పుడు చంద్రుడి వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే పెరిజీ (భూమికి సమీప స్థానం) వద్ద చంద్రుడు వేగంగా కదులుతాడు. భూమికి దూరంగా ఉన్నప్పుడు, అంటే అపోజీ (భూమికి సుదూర స్థానం) వద్ద చంద్రుడు నెమ్మదిగా కదులుతాడు.
పౌర్ణమి గనుక భూమికి దగ్గరగా ఉండే స్థానం (పెరిజీ) వద్ద సంభవిస్తే, చంద్రుడు మళ్లీ 'సూర్యుడు-భూమి' తలాన్ని వేగంగా చేరుకుంటాడు. అదే పౌర్ణమి గనుక భూమికి దూరంగా ఉండే స్థానం (అపోజీ) వద్ద సంభవిస్తే, ఆ స్థానాన్ని చేరుకోవడానికి దానికి ఎక్కువ సమయం పడుతుంది.
దీని కారణంగా, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే రెండు పౌర్ణముల మధ్య ఉండే కాల వ్యవధిలో మార్పులు వస్తుంటాయి. ఈ రెండు పౌర్ణముల మధ్య అతి తక్కువ కాల వ్యవధి సుమారు 29.18 రోజులుగా ఉండవచ్చు. అలాగే అతి ఎక్కువ కాల వ్యవధి సుమారు 29.93 రోజుల వరకు పెరగవచ్చు.
ముప్పావు రోజు (సుమారు 18 గంటలు) మాత్రమే ఉండే ఈ వ్యత్యాసాన్ని మనం అంతగా పట్టించుకోవాలా? అని మనకు అనిపించవచ్చు.
కానీ, ఈ చిన్న చిన్న వ్యత్యాసాలే మన క్యాలెండర్లలో, మన సంస్కృతిలో చంద్రుడిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.
'బ్లూ మూన్' అనే పేరు ఎలా వచ్చింది?
ఖగోళ శాస్త్ర కోణంలో చూస్తే.. రుతువులు అంటే విషువత్తులు (ఈక్వినోక్సెస్ - పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు), అయనాల (సోల్‌స్టిసెస్) మధ్య ఉండే కాల వ్యవధులు అని అర్థం.
సౌర సంవత్సరం సుమారు 365.24 రోజుల నిడివి కలిగి ఉంటుంది కాబట్టి, ప్రతి రుతువు సుమారు 91.3 రోజుల పొడవు ఉంటుంది.
రెండు పౌర్ణముల మధ్య సగటు కాల వ్యవధి 29.53 రోజులు కాబట్టి, సాధారణంగా ఒక రుతువులో మూడు పౌర్ణములు వస్తాయి.
కానీ, చంద్రుని వేగంలో వచ్చే మార్పుల వల్ల కొన్నిసార్లు ఒకే రుతువులో నాలుగు పౌర్ణములు రావొచ్చు.
మధ్యయుగంలో యూరప్‌లో ఇదొక పెద్ద సమస్యగా మారింది. చర్చి పండుగల తేదీలను లెక్కించే బాధ్యతను అక్కడి క్రైస్తవ సన్యాసులు చూసుకునేవారు. ఒక సంవత్సరంలో 13 పౌర్ణములు రావడం వారికి అసాధారణంగా అనిపించింది. దానిని చాలా మంది అమంగళంగా (అరిష్టంగా) భావించేవారు.
అలాంటి సంవత్సరంలో, ఒక రుతువులో గనుక నాలుగు పౌర్ణములు వస్తే.. ఆ రుతువులో వచ్చే 'మూడవ పౌర్ణమి'కి "బ్లూ మూన్" అని పేరు పెట్టారు. ఇది చంద్రుడు కనిపించే రంగును సూచించేది కాదు.
శతాబ్దాలుగా ఇంగ్లిష్‌లో "ఒన్స్ ఇన్ ఎ బ్లూ మూన్'' అనే జాతీయాన్ని చాలా అరుదుగా జరిగే విషయాలను సూచించడానికి ఉపయోగిస్తున్నారు. దాదాపు అసాధ్యమైన లేదా ఎంతో అరుదైన విషయం అనే అర్థంలో దీనిని వాడేవారు.
పదమూడు పౌర్ణములు ఉండే సంవత్సరం కూడా చాలా అరుదైనదే. సాధారణ కాలచక్ర నియమానికి భిన్నమైన సంవత్సరంగా దానిని పరిగణించేవారు. ఆ అరుదైన సంఘటనకు గుర్తుగానే దీనికి 'బ్లూ మూన్' అనే పేరు స్థిరపడింది.
పద్నాలుగు, పదిహేనవ శతాబ్దాలలో ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ అమెరికాలో ఈ కథకు ఒక కొత్త మలుపు తిరిగింది.
ఐరోపా వాసులు అమెరికాలో స్థిరపడినప్పుడు తమ సంస్కృతీ సంప్రదాయాలను కూడా తమతో పాటు తీసుకెళ్లారు. అదే సమయంలో, అక్కడ నివసిస్తున్న స్థానిక తెగలైన "ఫస్ట్ పీపుల్స్" (రెడ్ ఇండియన్స్) కాల గణన జ్ఞానం కూడా దీనిపై ప్రభావం చూపింది.
పొరపాటే బాగా ప్రాచుర్యంలోకి...
అమెరికాలో ప్రాచీన తెగలు రుతువులను, చంద్రుడి గమనాన్ని నిశితంగా గమనించి కాలాన్ని అర్థం చేసుకునేవారు. ఉదాహరణకు, జనవరి నెల శీతాకాలంలో పౌర్ణమి వచ్చినప్పుడు, గ్రామాలకు వెలుపల ఆకలితో ఉన్న తోడేళ్లు ఊళలు పెట్టేవి. అందుకే కొన్ని తెగల ప్రజలు ఆ పౌర్ణమిని "వుల్ఫ్ మూన్" (తోడేళ్ల చందమామ) అని పిలిచేవారు. అలాగే, మే నెలలో పూలు వికసించే సమయంలో వచ్చే పౌర్ణమిని "ఫ్లవర్ మూన్" (పూల చందమామ) అని పిలిచేవారు.
ఆ సమయంలో అచ్చయిన 'అల్మనాక్‌లు' (ఒక రకమైన క్యాలెండర్ లేదా పంచాంగాలు) ఐరోపా సంప్రదాయాలను, అమెరికా స్థానిక తెగల జ్ఞానాన్ని ఒకదానితో ఒకటి మిళితం చేశాయి. అలా ప్రతి పౌర్ణమికి ఆయా రుతువులను సూచించేలా పేర్లు పెట్టారు.
- జనవరి - వుల్ఫ్ మూన్
- ఫిబ్రవరి - స్నో మూన్
- మార్చి - వార్మ్ మూన్
- ఏప్రిల్ - పింక్ మూన్
- మే - ఫ్లవర్ మూన్
- జూన్ - స్ట్రాబెర్రీ మూన్
- జూలై - బక్ మూన్
- ఆగస్టు - స్టర్జన్ మూన్
- సెప్టెంబర్ - హార్వెస్ట్ మూన్
- అక్టోబర్ - హంటర్స్ మూన్
- నవంబర్ - బీవర్ మూన్
- డిసెంబర్ - కోల్డ్ మూన్
ఈ పేర్లు కాలక్రమేణా అమెరికన్ల సాధారణ సంస్కృతిలో భాగమైపోయాయి. అందువల్ల ప్రతి పౌర్ణమికి ఒక పేరు అవసరమైంది. ఒక రుతువులో గనుక నాలుగు పౌర్ణములు వస్తే, అదనంగా వచ్చిన మూడవ పౌర్ణమిని "బ్లూ మూన్" అని పిలిచారు. ఈ విధంగానే 'బ్లూ మూన్' అనే భావన పుట్టింది.
ఆ తర్వాత ఈ పదం అర్థం మళ్లీ మారింది. 1937లో ప్రచురితమైన 'మైనే ఫార్మర్స్ అల్మనాక్' అనే పుస్తకం.. ఒక రుతువులో నాలుగు పౌర్ణములు ఉంటే, ఆ రుతువులోని మూడవ పౌర్ణమినే బ్లూ మూన్ అని పేర్కొంది.
కానీ, ఆ తర్వాత ఒక ప్రముఖ ఖగోళ శాస్త్ర రచయిత ఈ వివరణను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకే క్యాలెండర్ నెలలో వచ్చే 'రెండవ పౌర్ణమి'ని 'బ్లూ మూన్' అంటారని ఆయన వివరించారు.
ఆయన ఇచ్చిన ఈ తప్పుడు వివరణే ఆ తర్వాత కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అందుకే నేడు సాధారణంగా ప్రజలు 'బ్లూ మూన్' అని అన్నారంటే.. ఒకే గ్రెగోరియన్ క్యాలెండర్ నెలలో వచ్చే రెండవ పౌర్ణమి అనే అర్థం చేసుకుంటున్నారు.
ఒకే నెలలో రెండు పౌర్ణములు..
ఒకే నెలలో రెండు పౌర్ణములు రావడం ఎందుకంత అరుదు?
గ్రెగోరియన్ క్యాలెండర్‌లో నెలలన్నీ సమానంగా రోజులను కలిగి ఉండవు. కొన్ని నెలలు 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 31 రోజులు ఉంటాయి. కానీ, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే రెండు పౌర్ణముల మధ్య కాల వ్యవధి మాత్రం 29.18 రోజుల నుంచి 29.93 రోజుల వరకు ఉంటుంది.
దీని కారణంగా, 31 రోజులు ఉన్న ఒక నెలలో.. మొదటి లేదా రెండవ తేదీన గనుక మొదటి పౌర్ణమి వస్తే, అదే నెల చివరలో మరో పౌర్ణమి రావడానికి అవకాశం ఉంటుంది.
అలా ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమికే నేడు "బ్లూ మూన్" అని పేరు పెట్టారు.
రాబోయే మే 31న సరిగ్గా ఇలాంటి రెండవ పౌర్ణమి సంభవిస్తుంది. మే ఒకటవ తేదీన మొదటి పౌర్ణమి రాగా, అదే నెల మే 31న మరో పౌర్ణమి వస్తోంది. ఆధునిక అర్థంలో దీనినే 'బ్లూ మూన్' అంటారు.
ఈ పౌర్ణమి ఒక 'మైక్రోమూన్' కూడా అవుతుంది. ఆ సమయంలో చంద్రుడు భూమి నుంచి అత్యంత దూరంలో (అపోజీ వద్ద) ఉంటాడు. అందువల్ల అది సాధారణం కంటే కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. అయితే, కేవలం మన కంటితో చూసి ఈ పరిమాణ వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టం.
దీని ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. ఆధునిక అర్థంలో చెప్పుకునే ఈ 'బ్లూ మూన్' అనేది ఒక నిజమైన ఖగోళ వింత ఏమీ కాదు. మానవులు తయారు చేసుకున్న ఒక నిర్దిష్ట క్యాలెండర్ విధానంలో చంద్రుని గమనాన్ని సరిపోల్చి చూడటం వల్ల ఏర్పడిన ఒక సాంస్కృతిక భావన మాత్రమే.
భారతీయ క్యాలెండర్లను (పంచాంగాలను) పరిశీలిస్తే ఈ నిజం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది.
గ్రెగోరియన్ క్యాలెండర్‌లోని నెలలు చారిత్రక కారణాల వల్ల ఏర్పడిన కృత్రిమ కాల విభాగాలు. కానీ భారతీయ చంద్ర-సౌర క్యాలెండర్లలో నెలలు అనేవి నేరుగా చంద్రుని గమనం, స్థానంతో ముడిపడి ఉంటాయి.
మన దేశంలోని కొన్ని సంప్రదాయాలలో ఒక పూర్ణిమ నుంచి తదుపరి పూర్ణిమ వరకు ఉన్న కాలాన్ని ఒక నెలగా లెక్కిస్తారు (దీనిని పూర్ణిమాంత అంటారు). మరికొన్ని సంప్రదాయాలలో ఒక అమావాస్య నుంచి తదుపరి అమావాస్య వరకు ఉన్న కాలాన్ని ఒక నెలగా లెక్కిస్తారు (దీనిని అమాంత అంటారు).
భారత సంప్రదాయంలో 'బ్లూ మూన్' ఉందా?
భారత్‌లో పౌర్ణమి అనేది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు. అది ఇక్కడి మతం, సామాజిక జీవితం, వ్యవసాయం, పండుగలు, సంస్కృతితో చాలా లోతుగా ముడిపడి ఉంది.
తమిళ పండుగ 'తైపూసం' విషయమే తీసుకోండి. ఈ పండుగ తమిళ సౌర మాసమైన 'తై' (జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు) నెలలో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది. దీనిని ఆగ్నేయాసియా అంతటా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో 'శరద్ పౌర్ణమి' ఒక ముఖ్యమైన పండుగ. ఇది ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్/అక్టోబర్) వచ్చే పౌర్ణమి. ఈ పౌర్ణమి రాత్రి పూట పాలు, బియ్యంతో ఖీర్ తయారు చేసి చంద్రుని వెలుగులో ఉంచడం ఒక ఆచారం. ఆ రాత్రి కురిసే వెన్నెలకు ప్రత్యేకమైన పోషక గుణాలు లేదా అమృత తత్వం ఉంటుందని ఇక్కడి సాంప్రదాయ నమ్మకం. ఏడాదిలో వచ్చే పౌర్ణమిలన్నింటిలోనూ ఇది అత్యంత ప్రకాశవంతమైనదని కూడా భావిస్తారు.
ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు కలపతో తయారుచేస్తారు. ఈ చెక్క విగ్రహాలే ఆలయ ప్రధాన దైవాలు. ఆషాఢ మాసంలో రెండు పౌర్ణములు వచ్చినప్పుడు (అంటే అధిక మాసం ఏర్పడినప్పుడు), ఈ విగ్రహాలను పునరుద్ధరిస్తారు. (దీనిని నవకలేబర ఉత్సవం అంటారు).
బుద్ధ పూర్ణిమ వైశాఖ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారు. బౌద్ధమత సంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన రోజు. జైన సంప్రదాయంలో కూడా పౌర్ణమి రోజులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
తమిళ, తెలుగు సంప్రదాయంలోనూ పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాస పౌర్ణమి రాత్రి పూట మహిళలు తమ ఇంటి ముంగిట మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించేవారని సంఘం సాహిత్యంలో పేర్కొనబడింది.
ప్రాచీన చోళ దేశంలో వర్షాల కోసం నిర్వహించే 'ఇంద్ర విలా' (ఇంద్రుడి పండుగ లేదా వర్షోత్సవం) చిత్ర (చిత్తిరై) మాస పౌర్ణమి నాడు ప్రారంభమయ్యేదని సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవం నెల రోజుల పాటు సాగేది. వర్ష దేవుడైన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంగీతం, నృత్యం, ప్రత్యేక పూజలు నిర్వహించేవారు.
భారత దేశంలోని అతిపెద్ద గిరిజన తెగలలో ఒకరైన 'సంతాల్' ప్రజలు, తమ 'సోరాయ్' మాస పౌర్ణమి నాడు (ఇది చంద్ర-సౌర క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమితో సమానం) ఒక గొప్ప పవిత్ర యాత్రను చేపడతారు.
వేలాది మంది ప్రజలు ఝార్ఖండ్‌లోని బొకారోలో ఉన్న పవిత్రమైన 'లుగుబురు' కొండలకు వెళతారు. అక్కడ ఉన్న ఒక గుహలో తమ పితృదేవతల (మూల పురుషుల)ను పూజిస్తారు.
మధ్య భారతదేశంలోని 'ఒరాన్', 'ముండా' గిరిజన తెగల ప్రాచీన మతమైన 'ఆది-ధర్మం'లో భాద్రపద మాస పౌర్ణమి (ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు) వారి మూడు ముఖ్యమైన పండుగలలో ఒకటిగా ఉంది.
రాబోయే మే 31న ఆకాశంలో రెండవ 'ఫ్లవర్ మూన్' కనిపించినప్పుడు, అమెరికాలో చాలా మంది దానిని 'బ్లూ మూన్' అని పిలుస్తారు. అమెరికన్లు అనుసరించే క్యాలెండర్ సంప్రదాయం ప్రకారం అది సరైన పేరే. కానీ భారతదేశం, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలలో ఈ పౌర్ణమికి ఎలాంటి ప్రత్యేక పేరూ ఉండదు.
ఆ రోజున కూడా చంద్రుడు తన కక్ష్యలో ఎప్పటిలాగే ప్రయాణిస్తాడు. దానికి తాను 'వుల్ఫ్ మూన్' అనో, 'బ్లూ మూన్' అనో లేదా 'పూర్ణిమ' అనో తెలియదు. ఆ పేర్లన్నీ మనుషులు పెట్టుకున్నవి మాత్రమే!
ఖగోళ గమనం అనేది ప్రకృతి నియమం. కానీ, దానికి అర్థాలను ఆపాదించడం అనేది మానవ సంస్కృతి తాలూకు సృష్టి.
వ్యాసకర్త: మొహాలీలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్' (ఐఐఎస్ఈఆర్) లో ప్రొఫెసర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)