You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'డీల్ దాదాపుగా కుదిరినట్టే, కానీ..', ఇరాన్‌తో ఒప్పందంపై జేడీ వాన్స్ ఏమన్నారంటే..
- రచయిత, డానియల్ బుష్, మాక్స్ మాట్జా
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
యుద్ధానికి ముగింపు పలికేలా ఒక ఒప్పందానికి రావడానికి ముందు అమెరికా, ఇరాన్ ఇంకా కొన్ని కీలకమైన వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని బీబీసీ అడిగిన ప్రశ్నకు వాన్స్ స్పందిస్తూ, ఇరుపక్షాలు ఈ ఒప్పందాన్ని ఎప్పుడు ఖరారు చేస్తాయి? అసలు చేస్తాయా లేదా? అని ఇప్పుడే చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని అన్నారు.
ఒప్పందం గురించి వచ్చిన ఊహాగానాల ప్రకారం, ఈ ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణకు మరో 60 రోజుల పొడిగింపు ఉంటుంది. అలాగే, ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయి.
దీనికి ముందు, అమెరికన్ అధికారులు గురువారం బీబీసీతో మాట్లాడుతూ, ఇరుదేశాలు ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక ముసాయిదాపై ఒక అవగాహనకు వచ్చాయని, అయితే దీనికి ట్రంప్‌తో పాటు ఇరాన్ అగ్రనాయకత్వం ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు.
కానీ, ఈ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని లేదా ధ్రువీకరించలేదని ఇరాన్‌కు చెందిన ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ 'తస్నీమ్' రిపోర్ట్ చేసింది.
గురువారం సాయంత్రం వాన్స్ విలేఖరులతో మాట్లాడుతూ... చర్చల ప్రతినిధులు ఒప్పంద పత్రంలోని "భాషాపరమైన కొన్ని పదాల విషయంలో కొంత ముందుకు, కొంత వెనక్కు అన్న చందంగా చర్చలు సాగుతున్నాయని, అందులో యురేనియం శుద్ధి అంశం కూడా ఉంది" అని అన్నారు.
"మేం లక్ష్యానికి చేరువలో ఉన్నాం. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం" అని ఆయన విలేఖరులతో అన్నారు.
ఇరాన్ అత్యంత శక్తివంతమైన యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, దాని వద్ద ఉన్న ప్రస్తుత నిల్వలను వదిలించుకోవాలని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే, ఈ నిల్వలను అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే అవకాశం ఉంది.
'చిత్తశుద్ధి'తో చర్చలు..
వాషింగ్టన్ డీసీలో విలేఖరులతో మాట్లాడిన వాన్స్ ఆశాభావంతో కనిపించారు. ఇరాన్ ప్రతినిధులు "చిత్తశుద్ధితో" చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నామని అన్నారు.
ఇరుపక్షాలు ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని, చర్చలు పురోగతిలో ఉన్నాయని కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఆచరణలో ఎలాంటి స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు.
ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల వంటి మిత్రపక్షాలు, ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న డెమొక్రాట్లు, అలాగే ఈ ఘర్షణ ఇంతకాలం సాగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కొంతమంది కాంగ్రెస్ రిపబ్లికన్లు కూడా ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
అయితే, గురువారం వచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఈ చర్చలు ఎంత అనిశ్చితంగా ఉన్నాయో స్పష్టం చేశాయి.
ప్రతిపాదిత ఒప్పందంపై ఇరు దేశాలు ఒకరి ప్రకటనలను మరొకరు ఖండిస్తూ, చాలా తక్కువ వివరాలు మాత్రమే వెల్లడించాయి. దీంతో ఈ శత్రుత్వానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు నిజంగా ఎంత చేరువగా ఉన్నాయనే విషయమై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకవేళ చర్చలు విఫలమైతే "ఆప్షన్ బి", అంటే మళ్లీ యుద్ధానికి దిగడం కూడా తమ పరిశీలనలో ఉందని ట్రంప్‌తో పాటు ఇతర అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, కాల్పుల విరమణను పొడిగించడం వల్ల అమెరికా, ఇరాన్ బృందాలకు మరింత సంక్లిష్టమైన, సాంకేతిక అంశాలపై చర్చించడానికి సమయం దొరుకుతుంది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, దాని వద్ద మిగిలి ఉన్న అత్యంత శక్తిమంతమైన యురేనియం నిల్వలపై చర్చలు జరపవచ్చు.
ఆ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని, లేదా ఇరాన్‌తో కలిసి అక్కడే ఉంచి గానీ, లేదా ఏదైనా మూడో దేశంలో గానీ దాని తీవ్రతను తగ్గించవచ్చని ట్రంప్ గతంలో సూచించారు.
హార్ముజ్ ఆంక్షలు?
ప్రచారంలో ఉన్న ఈ ఒప్పందం ప్రకారం, హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలపై ఎలాంటి "ఆంక్షలు లేని" రవాణాకు అనుమతి లభిస్తుందని, అలాగే ఆ ఇరుకైన సముద్ర మార్గంలోని మైన్‌లను తొలగించడానికి ఇరాన్‌కు 30 రోజుల సమయం ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి.
దీనికి బదులుగా అమెరికా కూడా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ఇరాన్ మళ్లీ చమురు విక్రయాలను ప్రారంభించేందుకు వీలుగా ఆంక్షల నుంచి మినహాయింపులు ఇస్తుంది.
గురువారం నాడే అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం గురించి మొదటగా నివేదించిన 'ఆక్సియోస్' వార్తా సంస్థ... ఈ ప్రతిపాదనపై ట్రంప్‌కు పూర్తి వివరాలు అందించినప్పటికీ, ఆయన వెంటనే దీనిపై సంతకం చేయలేదని, పరిశీలించడానికి మరో రెండు రోజుల సమయం తీసుకుంటారని పేర్కొంది.
అంతకుముందు బుధవారం నాడు, ఇరు దేశాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అనధికారిక అవగాహన ఒప్పంద ముసాయిదా ఉందని, అందులోని కీలక వివరాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది.
ఇరాన్ ఓడరేవులపై వాషింగ్టన్ విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ సరిహద్దుల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం, అలాగే ఇరాన్ - ఒమన్ దేశాల పర్యవేక్షణలో హార్ముజ్ జలసంధి గుండా సైనికేతర రవాణాను పునరుద్ధరించడం వంటి అంశాలు ఆ నివేదికలో ఉన్నాయి.
అయితే, ప్రచారంలో ఉన్న ఆ ముసాయిదా పత్రాన్ని వైట్ హౌస్ "కేవలం కల్పితం" అని కొట్టిపారేసింది.
ప్రపంచంలోని మొత్తం ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), చమురు సరఫరాలో ఐదో వంతు సాధారణంగా ఈ హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. అందువల్ల ఇది మూతపడటం ప్రపంచ ఇంధన వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
గురువారం వైట్ హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్, ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తలను ధ్రువీకరించడానికి నిరాకరించారు.
"అధ్యక్షుడి కంటే ముందే మనం ఒక నిర్ణయానికి రావడం తప్పే అవుతుంది, అంతిమంగా అధ్యక్షుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది," అని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో కుదిరే శాంతి ఒప్పందంలో ఇరాన్ "పునర్నిర్మాణం" అంశం కూడా ఉంటుందా? అని ప్రశ్నించగా, ''మనం అవతలి వైపు (పునర్నిర్మాణం) గురించి ఆలోచించే ముందు, మొదట ఒప్పందాన్ని సాధించాల్సి ఉంది,'' అని ఆయన సమాధానమిచ్చారు.
మరోవైపు, గత కొన్ని రోజులుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒకదానిపై ఒకటి పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
బుధవారం రాత్రి దక్షిణ ఇరాన్‌పై అమెరికా కొత్తగా దాడులు జరిపిన నేపథ్యంలో, గురువారం నాడు ఆ ప్రాంతంలోని ఒక అమెరికా సైనిక స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) తెలిపింది.
అలాగే, తమ దళాలు ఒక అమెరికా విమానాన్ని (బహుశా డ్రోన్ కావచ్చు) కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా గురువారం నివేదించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ నివేదికలను తోసిపుచ్చింది.
''అమెరికాకు చెందిన ఏ విమానమూ కూలిపోలేదు. మా వైమానిక ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయి" అని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)