ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ ఎక్కడున్నాడు?

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ ఎరుపు రంగు కారులో పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో రాజ్ కుమార్ అనే యువకుడు ఆరుగురిని హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

జులై 10వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ తెల్లారేలోగా పి. రాజ్‌కుమార్ ఆరుగురిని హత్య చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

''రాజ్‌కుమార్‌పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. ఆయన మొదట ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే మరో గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. తరువాత అదే గ్రామంలోని తన ఇంట్లో భార్య, ఇద్దరు చిన్న పిల్లలను చంపాడు. ఇదంతా రాత్రి 11-12 గంటల మధ్య జరిగింది'' అని పోలీసులు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

మొదటి ప్రదేశం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ ఒక మండల కేంద్రం. మారుమూల పల్లె కాదు, చుట్టూ ఇళ్లూ, జనం లేని ప్రదేశం కూడా కాదు.

రోడ్డుకు కాస్త దగ్గరగానే ఉన్న ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు, వాళ్ల తల్లి, నాయనమ్మ.. మొత్తం నలుగురు మహిళలు ఉండేవారు.

ఆ నలుగురిలో ఇంటర్ చదివిన 17 ఏళ్ల అమ్మాయి ఉంది.

మరో 19 ఏళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు. మానసిక, శారీరక ఆరోగ్యం సరిగాలేదు.

జులై 10వ తేదీ రాత్రి సుమారు 11 గంటల తరువాత రాజ్ కుమార్ అక్కడకి కారులో వచ్చారు.

తాను తాగిన బీరు క్యాన్‌ను ఆ ఇంటి అరుగుమీదే పెట్టారు. ఆ ఇంట్లో నుంచి ఆ 17 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నంలో అడ్డొచ్చిన ఆమె తల్లి, నాయనమ్మనూ పొడిచి చంపేశారు.

ఇల్లంతా రక్తం. తన తల్లి, నాయనమ్మ చనిపోయి, చెల్లెలిని ఎవరో ఎత్తుకెళ్లిన విషయం ఆ దివ్యాంగురాలికి తెలుసో లేదో తెలియదు.

అలానే ఆ రక్తం మధ్యనే గట్టిగా అరవలేక, కదల్లేక దొర్లుతూ ఉండిపోయింది ఆ అమ్మాయి.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

రెండో ప్రదేశం

మొదటి చోట నుంచి లాక్కెళ్లిన 17 ఏళ్ళ అమ్మాయిని కారులో దగ్గరలోని దైవాలగూడ అనే గ్రామానికి తీసుకెళ్లాడు రాజ్ కుమార్.

ఊరి చివర చెరువు. నీళ్లు తక్కువ. యువత క్రికెట్ ఆడేందుకు రాళ్లను వికెట్లుగా పెట్టుకున్నారు.

ఆ వికెట్ల దగ్గర అమ్మాయి గొంతు కోసి చంపేశాడు రాజ్ కుమార్.

రాతి వికెట్ల పక్కన రక్తం మరకలు ఇంకా అలానే ఉన్నాయి.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్
ఫొటో క్యాప్షన్, రాజ్‌కుమార్ భార్య, పిల్లలను ఖననం చేసిన ప్రదేశం

మూడో ప్రదేశం

అదే గ్రామంలో అర కిలోమీటర్ ముందుకు వెళితే రాజ్‌కుమార్ ఇల్లు. తన భార్య, ముక్కుపచ్చలారని ఇద్దరు మగ బిడ్డలు మంచంపై పడుకుని ఉన్నారు.

అక్కడ ఏం గొడవ జరిగిందో ఏమో.. మంచంపై ఆ చిన్న బిడ్డలిద్దరూ ఆదమరచి నిద్రిస్తున్నట్టే కనిపిస్తున్నారు. కానీ, వాస్తవానికి ఆ పిల్లల గొంతులు కోసి ఉన్నాయి.

ఆ దృశ్యం చూసిన వారంతా కలత చెందారు.

ఎన్నో హత్య సంఘటనలను హ్యాండిల్ చేసే పోలీసులు, పోస్టుమార్టం చేసే వైద్యులు, వార్తలిచ్చే విలేఖర్లు కూడా ఆ చిన్న బిడ్డల గొంతకోసిన దృశ్యాన్ని తట్టుకోలేకపోయారు. అదే మంచం మీద పక్కనే రక్తంతో తడిసి పడి ఉంది ఆ పిల్లల తల్లి.

ఆమె రాజ్ కుమార్ భార్య.

కట్టుకున్న భార్య, పిల్లల్ని చంపాడతను. ఆ ఇంటి బయట పిల్లల చెప్పులు.. చిన్నచిన్నవి చెదురుగా పడి ఉన్నాయి.

వారి ఆటబొమ్మలు, బొమ్మకార్లు ఉన్నాయి. ఆ బొమ్మలు, చెప్పులన్నీ చనిపోయిన పసివాళ్లను గుర్తు చేస్తున్నాయి.

హత్యలు చేసిన రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను హత్యలు చేసినట్టు చెప్పారు. దాంతో తండ్రి పోలీసులకు విషయం చెప్పారు.

పోలీసులు రెండు ప్రదేశాలకు వెళ్లి కేసు విచారణ ప్రారంభించారు. రెండు కుటుంబాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.

మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. అంత్యక్రియలు ముగిశాయి. బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద రాజ్‌ కుమార్ మీద రెండు హత్యకేసులు నమోదయ్యాయి.

ఈ మూడు ప్రదేశాల్లో జరిగిన ఆరు హత్యలూ కలకలం రేపాయి. ఒకే ఇంట్లోని మూడు తరాల ఆడవాళ్లను, తన ఇంట్లో భార్యా పిల్లలను చంపిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నట్టు ఫ్యూచర్ సిటీ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.

అమ్మాయిని ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన ఎరుపు రంగు కారును పోలీసులు చేగూరు అనే గ్రామంలోని రైల్వే ట్రాక్ దగ్గర గుర్తించారు.

రాజ్ కుమార్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 2 లక్షల బహుమానం ప్రకటించారు.

రాజ్ కుమార్ ఈ హత్యలు ప్రణాళిక ప్రకారం చేశాడా? ఎవరెవరు సహకరించారు? ఆ అమ్మాయి ఎందుకు గట్టిగా కేకలు వేయలేకపోయింది? భార్యతో పాటు పిల్లల్ని ఎందుకు చంపాడు వంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. విచారణలో అవన్నీ తేలాల్సి ఉంది.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, భార్య, కుమారుడు, అత్తయ్యతో రాజ్ కుమార్

17 ఏళ్ల అమ్మాయితో ఎలా పరిచయం?

పి.రాజ్ కుమార్ స్వగ్రామం దైవాలగూడ. అదే గ్రామానికి చెందిన తన కంటే వయసులో పెద్దదైన సరిత అనే మహిళను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

"వారి ప్రేమ ఎంత కాలం నుంచి ఉందో తెలియదు. వాళ్లు బాగా ఆస్తి ఉన్నవారు. మేం లేని వాళ్లం. కానీ మా చెల్లెలు బాగా చదువుకుంది. అప్పట్లో బీఈడీ చదివి పాఠాలు చెప్పేది. 2018లో మా చెల్లికి సంబంధం చూపి పెళ్లి నిర్ణయం చేశాక, అబ్బాయి తరపు వారికి ఫోన్ చేసి తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి ఆపాడు. దాంతో పోలీసు స్టేషన్ వరకు వెళ్లాం. మొత్తానికి మా చెల్లిని తను పెళ్లి చేసుకున్నాక నేను చాలా కాలం వారితో మాట్లాడలేదు. మా అమ్మ మాత్రం వెళ్లి పురుడు పోయడం, మంచి చెడ్డలు చూడ్డం చేసేది'' అంటూ బీబీసీకి చెప్పారు సరిత సోదరుడు.

అయితే వారు తమ స్వగ్రామంలో కాకుండా మరో చోట కాపురం పెట్టారు.

ఆ ఇంటి పక్క ఇంట్లో ఇప్పుడు హతులైన కుటుంబం ఉంటుంది.

ఆ 17 ఏళ్ల అమ్మాయి తండ్రి కొంత కాలం క్రితం మరణించారు.

"ఇంటి పక్కన ఉండడం, వారి పిల్లలు ఈ ఇంట్లోకి రావడంతో పరిచయం ఉంది. కానీ ఆ అమ్మాయి తండ్రి చనిపోయాక రాజ్ కుమార్ వేధింపులు పెరిగాయి. ఆ వేధింపులు భరించలేక అమ్మాయిని కాలేజీకి పంపకుండా ఇంటి దగ్గర చదివించాం. పరీక్ష రాసి వచ్చాక కాలేజీ బయట అమ్మాయిని చెయ్యి పట్టుకుని లాక్కెళ్లబోయాడు. అమ్మాయి తండ్రిని తానే చంపాననీ, మిగిలిన వారినీ చంపేస్తాననీ బెదిరించాడు. ఆ ఘటనతో మే 16న అతనిపై కేసు పెట్టాం. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. ఎప్పుడు అడిగినా పరారీలో ఉన్నాడు అని చెప్పేవారు. ఈలోపు అతను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇక మీ జోలికి అతను రాడు అని మాతో పోలీసులు చెప్పి పంపేవారు. అతని సోదరుడు కూడా మా దగ్గరకు రాజీకి వచ్చాడు కానీ మేం ఒప్పుకోలేదు. చివరకు ఈ దారుణానికి తెగబడ్డాడు'' అని బీబీసీకి చెప్పారు హత్యకు గురైన 17 ఏళ్ళ అమ్మాయి మేనమామ.

రాజ్ కుమార్‌కి, ఆ అమ్మాయికి ఇష్టపూర్వకమైన పరిచయం ఉంది అనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు.

''ఆ అమ్మాయికి రాజ్ కుమార్ అంటే ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇష్టం ఉంటే మాకు చెప్పదు కదా? ఎటో వెళ్లిపోయేది కదా? తనను ఇబ్బంది పెడుతున్నాడని అమ్మాయే మాకు స్వయంగా చెప్పింది. పోలీసులకు కూడా ఆమే చెప్పింది. ఆమెను కూడా చంపేస్తానని రాజ్ కుమార్ బెదిరించాడు'' అన్నారు అమ్మాయి మేనమామ.

గతంలో ఆమె చేయి పట్టుకున్నప్పుడు ''మీ తండ్రిని కూడా నేనే చంపాను'' అని రాజ్ కుమార్ అన్నట్టుగా చెబుతూ.. ఆమె తండ్రి మరణంపైనా విచారణ చేయాలని వారు కోరుతున్నారు.

పోక్సో కేసు నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా ఈ అమ్మాయిని చంపి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కచ్చితమైన కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

పోలీసులపై ఆరోపణలు

అదే సమయంలో పోక్సో కేసు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం చూపారంటూ సదరు స్టేషన్ ఎస్సైపై ఆరోపణ చేసింది అమ్మాయి కుటుంబం.

''పోలీసులు మేం అడిగిన ప్రతిసారీ అతణ్ణి దొరికితే వదలం. బలమైన పోక్సో కేసు పెట్టాం అని చెప్పి పంపించేసేవారు. కానీ అతను మాత్రం ఇక్కడిక్కడే తిరిగేవారు. అలా అతనికి ముందస్తు బెయిల్ వచ్చే వరకూ నాన్చారు'' అని ఆరోపించారు అమ్మాయి మేనమామ.

కాగా.. విచారణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న స్టేషన్ ఎస్సైను అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ ఆరోపణలపై మరింత వివరణ కోసం ఫ్యూచర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ తో పాటు సంబంధిత, డీసీపీ, ఏసీపీలను ఫోన్, వాట్సప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించింది బీబీసీ. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జులై 11న ఆ ప్రాంత వాసులు ఆందోళన చేశారు.

అదే రోజు అక్కడకు రావడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

జులై 12న మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రభుత్వం తరపున పట్నం మహేందర్ రెడ్డి, ఇతర నాయకులు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

అనాథగా..

బాధిత బాలికకు 19 ఏళ్ళ వయసున్న అక్క ఉన్నారు.

ఆమె మానసిక, శారీరక దివ్యాంగురాలు. ఆమె తనకుతాను నడవలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు.

ఆమెకు అన్నం పెట్టడం, స్నానం చేయించడం, కాలకృత్యాలు.. అన్నీ ఆమె తల్లి లేదా నాయనమ్మలే చేసేవారు.

తండ్రి గతంలో చనిపోయారు. ఇప్పుడు తల్లి, నాయనమ్మ, చెల్లి ముగ్గురూ చనిపోయారు. దీంతో ఆమెను ఆదరించే వారు ఎవరు అన్న ప్రశ్న గ్రామస్తులు, బంధువులను కలచివేసింది.

చాలా మంది ఆ కుటుంబానికి ధన సహాయం చేయడానికి ముందుకు వచ్చినా, ఆ డబ్బు తీసుకుని వాడుకునే పరిస్థితి కూడా ఆమెకు లేదు.

''ఆమెకు ఆహారం కూడా పడుకోపెట్టి నోట్లో పోయాలి. 19 ఏళ్ల అమ్మాయికి బాత్రూం కూడా తల్లి, నానమ్మలే తీసుకువెళ్తారు. ఇంట్లో ఉన్న అందర్నీ ఇప్పుడు చంపేశాడు'' అని చెప్పారు అమ్మాయి మేనమామ.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

రక్తపు మడుగులో..

ఈ దివ్యాంగురాలి విషయంలో మరో తీవ్రమైన ఆరోపణ పోలీసులపై చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు.

''ఇంట్లో హత్య జరిగిన తరువాత ఆ గదంతా రక్తపుమయం అయిపోయింది. ఆ దివ్యాంగురాలు ఎటూ కదల్లేదు. అటూ ఇటు జరగడంతో ఒళ్ళంతా రక్తంతో తడసిపోయింది. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు ముందుగా బతికి ఉన్న మహిళను బయటకు తీయాలి కదా? కానీ ముందుగా మృతదేహాలను బయటకు తీశారు. ఆ తరువాత కూడా ఆ అమ్మాయిని బయటకు తీసుకు రాకుండా చాలా సేపు గదిలోనే ఉంచేశారు. మమ్మల్నీ లోపలికి పోనీయలేదు. అలా చాలా సేపు ఆ అమ్మాయి రక్తం మధ్య ఉండిపోయింది'' అని ఆరోపించారు మేనమామ.

ఈ ఆరోపణలపై వివరణ కోసం ఫ్యూచర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ తో పాటు సంబంధిత, డీసీపీ, ఏసీపీలను ఫోన్, వాట్సప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసింది బీబీసీ. వారు అందుబాటులోకి రావాల్సి ఉంది.

''ఆమెను ప్రభుత్వం ఆదుకుంటుంది. హోమ్ లో చేర్పిస్తాం'' అని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు బంధువులు చెప్పారు.

షాబాద్ హత్య కేసు, రాజ్ ‌కుమార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజ్ కుమార్ భార్య, పిల్లలు

''లవర్ల కోసం పండంటి బిడ్డలను చంపాడు''

మరోవైపు రాజ్ కుమార్ సొంత ఊరు దైవాలగూడలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ ఊరిలోనే రాజ్ కుమార్ తన భార్య, పిల్లల్ని హత్య చేసినట్లు పోలీసుల ప్రకటనలో ఉంది.

వారిని ఖననం చేసి, ఆ సమాధుల వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు ఆ పిల్లల మేనమామ, అమ్మమ్మ.

తన కూతురు సరిత, మనుమలను చంపిన రాజ్ కుమార్‌ను తిడుతూ రోదిస్తోంది అత్త జయమ్మ.

''మళ్లీ పెళ్లి చేసుకుంటాననీ, లవర్లను, మరొకళ్లను తెచ్చుకుంటానంటూ నా కూతుర్ని అడిగేవాడు. తను ఒప్పుకోకపోయే సరికి చంపేశాడు. జామపండ్ల వంటి బిడ్డల్ని మూటలు కట్టి తెచ్చారు (పోస్టుమార్టం తరువాత). అడవుల్లోని సమాధుల్లో ఆ పండ్ల వంటి బిడ్డలు, నా కూతురు పక్కన పడుకున్నారు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఎలాగోలా సాక్కుని నా కూతురు బతుకుతుందిలే అనుకున్నాను. అందుకే నా కూతురి కోసం పోరాడాను. కానీ ఇలా చేస్తాడని నాకు తెలియలేదు'' అంటూ ఏడ్చారు జయమ్మ.

''అతను కొందరు అమ్మాయిలతో మాట్లాడుతూ, ఆ విషయాన్ని కూడా మా చెల్లెలికి చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఒకసారి ఓ అమ్మాయి కోసం పురుగుల మందు తాగాడు. అటు అత్తగారింట్లో మా చెల్లిని ఎవరూ ఒప్పుకోరు. ఆమె చేతి నీళ్లు కూడా తాగరు. ఈ పరిస్థితుల్లో రాజ్ కుమార్ కొన్నిసార్లు మా చెల్లిని బాగా చూసుకున్నాడు, కొన్నిసార్లు వేధించేవాడు. అన్నీ మా చెల్లి భరించింది. రెండో కాన్పు వరకు నేను కూడా మా చెల్లితో మాట్లాడలేదు. మా అమ్మే చెల్లిని చూసుకునేది. తరువాతైనా అతని వేధింపుల గురించిచెప్పి ఉంటే, మేం పెద్దలతో పంచాయితీ చేసేవాళ్లం. కానీ ఆమె వేధింపులు భరించింది. పిల్లలతో కూడా మా బావ సఖ్యంగా లేడు. పెద్ద కొడుకు తండ్రిని చూస్తేనే భయపడిపోతాడు. ఒకసారి ఇలానే తండ్రిని చూసి భయపడి నా మీదకు ఉరికాడు. అప్పుడు నేను పిల్లల్ని చూసే పద్ధతిది కాదని బావకు చెబితే, అప్పటికి మాత్రం బాగా మాట్లాడాడు. మా చెల్లిని బాగా టార్చర్ పెట్టాడు కానీ ఆమె మాకు చెప్పకుండా నరకం చూసింది. ఇక బెట్టింగ్ యాప్ లో ఆడుతున్నాడు అని కొంత తెలుసు కానీ పక్కాగా వివరాలు తెలియదు. పోక్సో కేసు తరువాతే ఆ అమ్మాయి విషయం మాకు తెలిసింది. మా చెల్లికి ముందే తెలుసు కానీ మాకు చెప్పలేదు'' అని బీబీసీకి చెప్పారు సరిత సోదరి సంజీవ.

పోలీసుల గాలింపు కొనసాగుతోంది. రాజ్ కుమార్ ఫలానా చోట కనిపించాడంటూ వదంతులూ వస్తున్నాయి. పోలీసులు ఏ అధికారిక ప్రకటనా చేయలేదు.

కాగా నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినప్పటికీ వారెవరూ అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)