You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గబ్బిలం కరిస్తే ఏం చేయాలి.. ఇది కాటు వేస్తే ప్రాణాలకే ప్రమాదమా?
- రచయిత, కమలాదేవి నల్లపనేని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
గబ్బిలం వల్ల రేబిస్ వ్యాధి సోకి కెనడాలో ఇటీవల 11 ఏళ్ల బాలుడు చనిపోవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో గబ్బిలాల వల్ల కలిగే ప్రమాదాల గురించి మరోసారి అంతటా చర్చ జరుగుతోంది.
గతంలో నిఫా, ఎబోలా వంటి వ్యాధుల వ్యాప్తికి గబ్బిలాలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గబ్బిలం ద్వారానే కరోనా వైరస్ మానవాళికి వ్యాపించిందన్న ప్రచారమూ ఉంది. అయితే దీనిపై భిన్నవాదనలున్నాయి.
ఇన్ని రకాల వైరస్‌లు గబ్బిలాల నుంచి వ్యాపించడానికి కారణమేంటి? అసలు ఆ జీవులు ప్రాణాంతకమైనవేనా? వాటివల్ల పర్యావరణానికి కలిగే లాభనష్టాలేంటి? వాటి నుంచి మనుషులు ఎలా రక్షణ పొందాలి?
భారత్ సహా పలు దేశాల్లో గబ్బిలాన్ని చెడుకు సంకేతంలా చూస్తారు. ఇలాంటి అభిప్రాయాలు ఎందుకు వ్యాపించాయో తెలియదు కానీ.. అనేక రకాల వైరస్‌లు గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని తెలుసుకున్నప్పుడు మాత్రం గబ్బిలాన్ని చూడగానే కాస్త భయాందోళన చెందడం సహజం.
శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే వైరస్‌లతో పాటు గబ్బిలం ద్వారా సోకే మరో ప్రమాదకర వ్యాధి రేబిస్. కెనడా బాలుడు గబ్బిలం ద్వారా సోకిన రేబిస్‌తోనే చనిపోయాడని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది.
అమెరికా ఖండంలోని అనేక ప్రాంతాల్లో రక్తం పీల్చే గబ్బిలాల ద్వారా రేబిస్ సోకే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అయితే మొత్తం గబ్బిలాల సంఖ్యతో పోలిస్తే ఒక శాతం కంటే తక్కువ గబ్బిలాలు మాత్రమే రేబీస్ బారిన పడుతుంటాయని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్)తెలిపింది. అయినప్పటికీ గబ్బిలాలతో జాగ్రత్తగా ఉండాలి. పగటిపూట అసాధారణంగా తిరుగుతున్న లేదా అనారోగ్యంగా కనిపిస్తున్న గబ్బిలాలను తాకకూడదు. వాటికి ఎలాంటి ఇబ్బందీ కలిగించకూడదు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఆరోగ్యంగా ఉన్న గబ్బిలాలు సాధారణంగా మనుషులను చూసి దూరంగా ఎగిరిపోతాయి. అవి ఉద్దేశపూర్వకంగా దాడి చేయవు.
చాలా గబ్బిలాలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. వాటి చిన్న పళ్లు, బలహీనంగా ఉండే దవడలు ప్రధానంగా కీటకాలను నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అయితే హోరీ బ్యాట్, బిగ్ బ్రౌన్ బ్యాట్ వంటి కొన్ని జాతుల గబ్బిలాలకు పెద్ద, పదునైన పళ్లు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పట్టుకోకపోతే చర్మంలోకి గుచ్చుకునేలా కరవచ్చు. అందుకే గబ్బిలాలను చేతితో పట్టుకోకూడదు. తాకకూడదు.
ఒకవేళ గబ్బిలం కరిస్తే, గాయం అయిన చోటును వెంటనే సబ్బు, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లాలి.
కెనడా బాలుడి విషయంలో ముఖంపై గబ్బిలం వాలిఉన్నప్పటికీ అది బాలుణ్ని కరిచిందని తల్లిదండ్రులు గ్రహించలేకపోవడానికి కారణం గాయం కనిపించకపోవడం.
గబ్బిలం కరిచినప్పుడు నొప్పి అనిపించొచ్చు. కానీ రక్తం కారడం, స్పష్టంగా గాటు కనిపించడం వంటివి ఉండకపోవచ్చు. అందుకే గబ్బిలాన్ని నేరుగా తాకినా లేదా దాంతో ఏ విధమైన ప్రత్యక్ష సంబంధం ఏర్పడినా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి.
అవసరమైతే వైద్యులు రేబిస్ నివారణ చికిత్స అందిస్తారు. రేబిస్ లక్షణాలు కనిపించడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం గబ్బిలంతో కాంటాక్ట్ అయి ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు చేయించుకోవాలి. గాటు కనిపించకపోయినా రేబిస్ నివారణ చికిత్స అవసరమా అని వైద్యులను అడగాలి. కరిచిన గబ్బిలం అందుబాటులో ఉంటే దానికి రేబిస్ పరీక్ష నిర్వహించి 48 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటే వైద్యుల సలహా మేరకు రేబిస్ నివారణ చికిత్స కోసం వేచిచూడొచ్చు.
కెనడా బాలుడి కేసులో గబ్బిలం ముఖంపై వాలినా వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లకపోవడం అవగాహనారాహిత్యమేనని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది.
రేబీస్ సోకిన గబ్బిలాలు పగటిపూట కనిపిస్తాయి. నేలపై లేదా ఎవరి ముఖంపైనైనా కూర్చోవడం, సరిగా ఎగరలేకపోవడం లేదా సులభంగా దగ్గరకు రావడం వంటి అసాధారణ ప్రవర్తన చూపవచ్చు. అయితే ఈ లక్షణాలు లేకపోయినా గబ్బిలానికి రేబిస్ లేదని చెప్పలేం.
గబ్బిలాలు వైరస్‌ల నిలయమా?
మనుషులకు ప్రాణాంతక వైరస్‌లు వ్యాపింపచేసే వాటిలో గబ్బిలాలు ముందుస్థానంలో ఉంటాయి. రేబిస్ నుంచి ఎబోలా వరకు అనేక వైరస్‌లకు గబ్బిలాలు సహజ నిలయాలు(రిజర్వాయర్ హోస్ట్‌లు).
నిఫా వైరస్, మార్బర్గ్, రేబిస్, మెర్స్ వంటి వాటితో పాటు జంతువులకు వ్యాపించి, వాటి నుంచి మనుషులకు వ్యాపించే ఇతర వైరస్‌లు కూడా గబ్బిలాల్లో ఉంటాయి. అయితే గబ్బిలాల్లో ఉండే ప్రత్యేక రోగ నిరోధక వ్యవస్థ వల్ల ఆ వైరస్‌లు ఈ గబ్బిలాలపై ఎలాంటి ప్రభావం చూపవు.
టెరోపొడిడాయ్ కుటుంబానికి చెందిన ఫ్రూట్ గబ్బిలాలు నిఫా వైరస్‌కు సహజ నిలయాలు. ఆసియాలోని అనేక ప్రాంతాలతో పాటు ఆస్ట్రేలియాలో ఇవి కనిపిస్తాయి. ఆఫ్రికాలోని టెరోపొడిడాయ్ కుటుంబానికి చెందిన ఈడోలాన్ జాతి ఫ్రూట్ గబ్బిలాల్లో నిఫా, హెండ్రా వైరస్‌లను తట్టుకునే యాంటీబాడీలను గుర్తించారు. దీంతో ఈ వైరస్‌లు ఆఫ్రికాలోని గబ్బిలాల్లో కూడా ఉన్నాయని భావిస్తున్నారు.
నిఫా వైరస్ సోకినా ఆ గబ్బిలాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. నిఫా వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు, గుర్రాల వంటివాటి ద్వారా అది మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకిన గబ్బిలాల వల్ల కలుషితమైన పండ్లు, పండ్ల ఉత్పత్తుల ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది.
ఫ్రూట్ బ్యాట్స్‌ను ''మెగా బ్యాట్స్'' అని కూడా అంటారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద గబ్బిలాల సమూహం.
వీటిని సాధారణంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో గుర్తించవచ్చు.
ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ వ్యాప్తికీ గబ్బిలాలే కారణమని భారీ స్థాయిలో ప్రచారం జరిగింది.
అయితే చాలామంది శాస్త్రవేత్తలు కరోనాకు గబ్బిలాలను నిందించకూడదని వాదించారు. ఈ వైరస్ నిజంగా గబ్బిలాల నుంచే పుట్టుకొచ్చినప్పటికీ.. దానిని మనుషులకు సంక్రమింపజేసిన జీవులు మాత్రం ఇవి కాదని, మనుషులకు ఈ వైరస్‌ను సంక్రమింజేసిన ఆ మధ్యవర్తి పాంగోలిన్ కావచ్చునని అనుమానించారు.
మరికొందరు శాస్త్రవేత్తలు కరోనా వంటి వైరస్ నుంచి రక్షణ లభించడానికి మానవాళికి గబ్బిలాల అవసరం ఎంతో ఉందన్న వాదనలు వినిపించారు.
గబ్బిలాల వల్ల ప్రయోజనాలేంటి?
పరపరాగ సంపర్కంలో, విత్తనాల వ్యాప్తిలో, కీటకాల నియంత్రణలో తమ పాత్ర పోషించటం ద్వారా గబ్బిలాలు కీలకమైన జీవావరణ సేవలు అందిస్తున్నాయని శాస్త్రవేత్తలంటున్నారు.
ఆహారం నుంచి సౌందర్యసాధనాల వరకూ, ఇంటి సామాన్ల నుంచి ఒంటి మందుల వరకూ.. చాలా వాటికి గబ్బిలాల శ్రమ అవసరమవుతుందని, పక్షుల కన్నా రెట్టింపు విత్తనాలను గబ్బిలాలు పంపిణీ చేస్తాయని, తద్వారా ఉష్ణమండల ప్రాంతాల్లో కీలకమైన అటవీ పునరుద్ధరణ జరుగుతుందని చెబుతున్నారు.
భారత్‌లో గబ్బిలాల పరిస్థితేంటి?
భారత్‌లోని 32.8లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విభిన్న సహజ ఆవాసాల్లో 135 రకాల గబ్బిలాల జాతులు కనిపిస్తున్నాయి.
వాటిలో 16 జాతులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. చాలా జాతులకు చెందిన గబ్బిలాల సంఖ్య తగ్గుతోంది. భారత చట్టాల కింద 12 గబ్బిలాల జాతులకు మాత్రమే రక్షణ లభిస్తోంది.
గబ్బిలాల జాతులు అంతరించిపోకుండా ఉండేందుకు బాట్ కన్సర్వేషన్ ఇంటర్నేషనల్, నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్ కలిసి భారత్‌లో గబ్బిలాల భవిష్యత్తును రక్షించేందుకు పనిచేస్తున్నాయి. వివిధ రంగాల నిపుణులు, జాతీయ ప్రభుత్వ సంస్థలతో కలిసి సమగ్ర కార్యాచరణను రూపొందించి, అత్యంత ప్రమాదంలో ఉన్న గబ్బిలాల జాతులను రక్షించేందుకు సంరక్షణ చర్యలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పర్యాటకంగా ఒత్తిడి, పట్టణాల విస్తరణ వల్ల గుహలు, చారిత్రక కట్టడాల్లో వాటి నివాసాలు మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. 27సంస్థలకు చెందిన 34 మంది నిపుణులు రెండేళ్లపాటు పరిశోధన జరిపి, స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ అనే నివేదికను రూపొందించారు.
వాంపైర్ గబ్బిలాలంటే ఏంటి?
పూర్తిగా రక్తాన్నే ఆహారంగా తీసుకునే క్షీరదాల్లో వాంపైర్ గబ్బిలం ఒకటి. రాత్రివేళల్లో కిందకు వచ్చి ఆవులు, ఇతర జంతువులు, అరుదుగా మనుషులపై కూడా దాడి చేసి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి.
వాంపైర్ గబ్బిలాలు రక్తాన్ని పీల్చవు. అవి తమ పదునైన ముందు పళ్లతో చర్మంపై చిన్న కోత పెట్టి, ఆ గాయం నుంచి వచ్చే రక్తాన్ని నాలుకతో నాకుతూ తాగుతాయి. మెక్సికో, దక్షిణ అమెరికాలో ఉండే వాంపైర్ గబ్బిలాలు ఆవులు, గుర్రాలు వంటి పశువులతో పాటు జింకలు, అడవి పందులు, కొన్ని సందర్భాల్లో సీల్స్ వంటి జంతువుల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కెనడా బాలుడిపై వాలింది ఇలాంటి గబ్బిలమేనని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)