You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముఖంపై వాలిన గబ్బిలం.. రేబిస్‌తో పదకొండేళ్ల బాలుడు మృతి
- రచయిత, సరీన్ హబేషియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ముక్కు, నోటిపై గబ్బిలం వాలడంతో కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు రేబిస్ బారినపడి మరణించాడు.
ఈ ఘటన 2024లో బాలుడు తన కుటుంబంతో కలిసి ఒంటారియోలోని ఓ కాటేజ్‌కు వెళ్లిన సమయంలో చోటుచేసుకున్నట్లు ఇటీవల కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించిన ఓ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఆ బాలుడు తన ముఖంపై ఉన్న గబ్బిలాన్ని చేతితో తోసేయగా.. ఆ తరువాత బాలుడి తండ్రి దాన్ని ఒక డబ్బాలో బంధించి బయటకు వదిలేశారు.
బాలుడికి ఎలాంటి గాయాలు కనిపించకపోవడం, గబ్బిలం కూడా అసాధారణంగా ఏమీ ప్రవర్తించినట్లు అనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళలేదని జర్నల్‌లో పేర్కొన్నారు.
అయితే ఆ ఘటన జరిగిన 19 రోజుల తర్వాత బాలుడి ముఖంలో స్పర్శ కోల్పోవడం, వాపు వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది.
కొద్దిరోజుల తరువాత కుటుంబ సభ్యులు ఆ బాలుడిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు.. లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధరించేందుకు ప్రయత్నించిన విషయాలను కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ వివరంగా నమోదు చేసింది.
మొదట అత్యవసర చికిత్స వైద్యులు అతనికి బెల్స్ పాల్సీ సోకిందని భావించారు. ఈ వ్యాధి సోకితే మొఖంలోని ఒక భాగం తాత్కాలికంగా చచ్చుబడిపోతుంది.హెర్పిస్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీవైరల్ మందులను సూచించారు.
ఆ తర్వాత బాలుడు వరుసగా ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చింది. నోరు, చిగుళ్లను ప్రభావితం చేసే హెర్పిస్ జింజివోస్టోమటైటిస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
అనంతరం మొఖం కుడి భాగం బలహీనపడడంతో బాలుడిని మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చేర్చడానికి సిద్ధమవుతున్న సమయంలో బాలుడికి 39 డిగ్రీల సెల్సియస్ జ్వరం, మింగడంలో ఇబ్బంది, అయోమయం, భ్రమకు గురవడం వంటి లక్షణాలు కనిపించాయి.
అదే రోజు అతని పరిస్థితి వేగంగా విషమించడంతో చిన్నపిల్లల ఐసీయూ విభాగంలో చేర్చినట్లు జర్నల్ పేర్కొంది.
కెనడాలోని మానిటోబా విశ్వవిద్యాలయం పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగం వైద్యులు బాలుడికి రేబిస్ సోకి ఉంటుందని అనుమానించారు.
అక్కడికి కొన్ని రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో రేబిస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. కెనడియన్ ఫుడ్ ఇన్‌స్పెక్షన్ ఏజెన్సీ కూడా గబ్బిలాల ద్వారా వ్యాపించే రేబిస్ వైరస్ వేరియంట్‌ను గుర్తించింది.
ఆసుపత్రిలో చేరిన 17 రోజుల తర్వాత బాలుడు మరణించాడు.
అతనికి అలర్జీలు, అంటువ్యాధులతో బాధపడుతున్న వారితో సన్నిహిత సంబంధాలు , పురుగుల కాట్లు, విదేశీ ప్రయాణాల చరిత్ర ఏదీ లేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
కెనడాలో రేబిస్ సంక్రమణ కేసులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. 1924 నుంచి ఇప్పటివరకు కెనడాలో రేబిస్ కారణంగా 28 మంది మరణించినట్లు కెనడియన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
విస్తృత స్థాయిలో నిరంతరం వ్యాక్సీన్ కార్యక్రమాలు నిర్వహించడం వల్లే రేబిస్ కేసులు తక్కువగా ఉన్నాయని, ఈ కార్యక్రమాలను కొనసాగించకపోతే వ్యాధి మళ్లీ వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మనుషులు నేరుగా గబ్బిలాలను తాకినా, గబ్బిలాలు మనుషులను తాకినా రేబిస్ సోకే ప్రమాదం ఉంటుందన్న విషయం దృష్టిలో ఉంచుకుని వెంటనే పోస్ట్‌ఎక్స్‌పోజర్ ప్రోఫీలాక్సీ చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లక్షణాలు కనిపించడం మొదలైతే దాదాపుగా ప్రాణాంతకమవుతుందని నివేదిక హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)