‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారా

యూపీఐ, అదనపు చార్జీలు

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఈ రోజుల్లో ప్రతి అవసరానికి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లేదా ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయడం మామూలుగా మారింది. వీటివల్ల పేమెంట్లు చేయడం చాలా వేగంగా, సులభంగా మారిపోయింది.

అయితే, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత మంగళవారం పార్లమెంటులో 'ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026' ప్రవేశపెట్టాక ఈ చర్చ మొదలైంది. గురువారం లోక్‌సభలో ఈ బిల్లు పాస్ అయింది.

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం... యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన అనుమతి లభించే అవకాశం ఉంది.

మీడియా కథనాల ప్రకారం, పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను మళ్లీ తీసుకురావడానికి ఈ సవరణ చట్టపరమైన అనుకూలతను అందిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించినందుకు గాను వ్యాపారి... బ్యాంకుకు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుమునే 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' అంటారు. ఇది సాధారణంగా లావాదేవీ మొత్తంలో స్వల్ప శాతమే ఉంటుంది.

జనవరి 2020 నుంచి రూపే డెబిట్ కార్డ్‌లు, యుపీఐ చెల్లింపులపై ఈ ఎమ్‌డీఆర్‌ను రద్దు చేశారు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద ఈ-కామర్స్ సంస్థలకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపులపై మళ్లీ ఎమ్‌డీఆర్ చార్జీలు విధించడానికి ఈ కొత్త సవరణ దారి తీస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం ఒక ట్వీట్ చేసింది.

"జులైలో భారతదేశంలో యూపీఐ లావాదేవీలు 23.66 బిలియన్లకు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి" అని ట్వీట్‌లో పేర్కొంది.

మరోవైపు, ప్రభుత్వం తీసుకోబోయే ఈ అడుగుపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.

"మోదీ మీ జేబులు గుల్ల చేయడానికి ప్లాన్ చేశారు. త్వరలోనే ₹2,000 కంటే ఎక్కువ చేసే యూపీఐ చెల్లింపులపై వసూళ్లు మొదలవుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ప్రజలు అల్లాడుతుంటే, మోదీకి అవేమీ పట్టడం లేదు. కొత్త ప్లాన్లతో మీ పైసా పైసా పిండుకోవాలని చూస్తున్నారు. ప్రజలు చనిపోయినా సరే, వసూళ్లు మాత్రం ఆగకూడదన్నదే మోదీ విధానం" అని విమర్శించింది.

బీజేపీ ఎంపీ, 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎంపీ, 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్' ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్

‘మినహాయింపు అందుకే’

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూపీఐ బిల్లుపై వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐతో బీజేపీ ఎంపీ, 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడారు.

"ముందు బిల్లు పూర్తి వివరాలు రానివ్వండి. ప్రభుత్వం ఈ బిల్లు తెస్తోందంటే దాని వెనుక కచ్చితంగా సరైన కారణాలే ఉంటాయి" అని ఆయన అన్నారు.

"భారత్‌లో డిజిటల్ చెల్లింపులు చాలా వేగంగా పెరిగాయి. యూపీఐ లావాదేవీల సంఖ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. బిల్లు వివరాలు పూర్తిగా బయటకు వచ్చాక స్పష్టత వస్తుంది. ఈ బిల్లు యూపీఐ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుందని నేను భావిస్తున్నాను" అని తెలిపారు.

పరిమితికి మించిన చెల్లింపులపై చార్జీలు విధించడం గురించి అడిగినప్పుడు... "ఏదైనా సేవను వాడుకున్నప్పుడు దానికి కొంత చార్జీ ఉంటుంది. సాధారణ ప్రజలపై భారం పడకూడదనే ₹2,000 వరకు చేసే లావాదేవీలకు మినహాయింపు ఇచ్చారు" అని చెప్పారు.

యూపీఐ

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

సోషల్ మీడియాలో ఏమంటున్నారు?

ప్రజలు సోషల్ మీడియాలో ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సతీష్ కుమార్ అనే ఎక్స్ యూజర్ స్పందిస్తూ... "ఎంత మంచి నిర్ణయం. ఏటీఎమ్ నుంచి 5 సార్లు కంటే ఎక్కువ నగదు తీస్తే చార్జీలు పడతాయి. యూపీఐ ద్వారా ₹2,000 కంటే ఎక్కువ చెల్లిస్తే చార్జీలు విధిస్తారు. ఇక మున్మందు ఇంకేం చేస్తారో' అని ట్వీట్ చేశారు.

యూపీఎస్సీ అభ్యర్థులకు పాఠాలు చెప్పే సౌరభ్ త్రిపాఠి కూడా ట్వీట్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

''వ్యాపారులకే ఎండీఆర్ విధిస్తారు. కానీ, వారు ఇక వినియోగదారులను క్యాష్ చెల్లింపులు చేయమని కోరతారు. లేదా ఆ చార్జీల భారాన్ని వస్తువుల ధరల్లో కలిపేస్తారు. ఇది యూపీఐ విధానాన్ని బలహీనపరుస్తుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

"మీరు యూపీఐ, రూపే కార్డ్‌లపై వ్యాపారుల నుంచి చార్జీలు వసూలు చేస్తే, చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతుంది" అని సీనియర్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్ ట్వీట్ చేశారు.

మరో ఎక్స్ యూజర్ రిషి బాగ్రీ కూడా ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

''ఎన్‌పీసీఐ ప్రతీ ఏడాది యూపీఐ వ్యవస్థను నిర్వహించడానికి దాదాపు ₹500 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు, దీనివల్ల చిన్న నోట్ల ముద్రణ, వ్యాపారుల నిర్వహణ ఖర్చుల్లో ప్రభుత్వానికి దాదాపు ₹1,500 కోట్లు ఆదా అయ్యాయి. అందుకే మోదీ ప్రభుత్వం ఎలాంటి ఫీజు తీసుకోకుండా యూపీఐ వ్యవస్థను నిర్వహించాలని భావిస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు.

యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుము విధించవద్దని ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరారు.

ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్యాగ్ చేస్తూ... ''యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించడం అనేది డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇన్నాళ్ల ప్రగతిని వెనక్కి నెడుతుంది. లావాదేవీలపై చిన్నపాటి రుసుము కూడా చాలామంది వినియోగదారులను, వ్యాపారులను మళ్లీ నగదు చెల్లింపుల వైపు వెళ్లేలా చేస్తుంది. భారత్ సాధించిన డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని కాపాడుకుందాం" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

యూపీఐకి ఆర్బీఐ నిధులు ఇవ్వగలదా?

"యూపీఐ నిర్వహణ ఖర్చులను భరించడానికి ఆర్బీఐ వద్ద తగినంత నిధులు ఉన్నాయి" అనే శీర్షికతో ఆగస్టు 6న 'ది హిందూ' వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

బ్యాంకులు, కొన్ని రకాల వ్యాపారులపై మాత్రమే ఎమ్‌డీఆర్ విధించేందుకు ప్రస్తుతం ప్రతిపాదనలు వచ్చాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనంలో రాశారు. ఏటా ₹1 కోటి నుంచి ₹1.5 కోట్ల వరకు వ్యాపారం చేస్తూ, ₹2,000 కంటే పెద్ద మొత్తంలో యూపీఐ పేమెంట్లు తీసుకునే పెద్ద వ్యాపారులు మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

"అయితే, ఈ బిల్లులోని భాష చూస్తే భవిష్యత్తులో ఈ చార్జీలను మరిన్ని రకాల లావాదేవీలకు కూడా వర్తింపజేసేలా ఉంది. బ్యాంకింగ్ రంగ నిపుణుల ప్రకారం... యూపీఐ సిస్టమ్‌ను నడపడానికి ఒక్కో లావాదేవీకి ప్రస్తుతం దాదాపు ₹0.40 నుంచి ₹1 వరకు ఖర్చవుతోంది. అధికారిక లెక్కల ఆధారంగా 2025-26లో 24,161.69 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దీని ప్రకారం, యూపీఐ నిర్వహణకు ఏడాదికి దాదాపు ₹9,664 కోట్ల నుంచి ₹24,161 కోట్ల వరకు ఖర్చవుతుంది.

ఆర్బీఐ 2025-26లో దాదాపు ₹4.3 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇందులో దాదాపు ₹2.9 లక్షల కోట్లను మిగులు నిధిగా (సర్ ప్లస్) కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. అదే సంవత్సరంలో యూపీఐ నిర్వహణ ఖర్చు... ఆర్బీఐ బదిలీ చేసిన ఈ మిగులు నిధిలో 3% నుంచి 8.5% మాత్రమే ఉంటుంది. ఆర్బీఐ మిగులు నిధుల బదిలీ 2021-22లో ₹30,307.45 కోట్ల నుంచి 2025-26 నాటికి దాదాపు ₹2.9 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 857% వృద్ధి నమోదైంది'' అని ఆ కథనంలో ది హిందూ పేర్కొంది.

అధికారిక లెక్కల ఆధారంగా 2025-26లో 24,161.69 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దీని ప్రకారం, యూపీఐ నిర్వహణకు ఏడాదికి దాదాపు ₹9,664 కోట్ల నుంచి ₹24,161 కోట్ల వరకు ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, Dhiraj Singh/Bloomberg via Getty Images

అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ కూడా 'ఫ్రీ యూపీఐ ఫరెవర్ (ఎప్పటికీ ఉచిత యూపీఐ)'అనే శీర్షికతో ఒక ఎడిటోరియల్ రాసింది.

''భారత్ సాధించిన అతిపెద్ద విజయాల్లో యూపీఐ ఒకటని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇలాంటి డిజిటల్ చెల్లింపుల్లో సగానికి పైగా ఇక్కడే జరుగుతున్నాయి. 2025-26లో 24,000 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ ₹314 లక్షల కోట్లకు పైమాటే. నిరుడు భారత్ జీడీపీ ₹346.4 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

యూపీఐ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఏంటి? అనేక కారణాలు ఉన్నప్పటికీ, దీని వృద్ధికి అత్యంత వేగాన్ని ఇచ్చిన నిర్ణయం...ఎమ్‌డీఆర్‌ను (MDR) రద్దు చేయడమే. 2025-26లో ఆర్బీఐ దాదాపు 1,700 కోట్ల పాత లేదా పాడైపోయిన నోట్లను తీసేసి, వాటి స్థానంలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ₹4,875 కోట్లు ఖర్చు చేసింది. ఒకవేళ యూపీఐ లేకపోయి ఉంటే నగదు అవసరాలు తీర్చడానికి ఈ ఖర్చు ఇంకెంత ఎక్కువగా ఉండేదో ఆలోచించండి'' అని ఆ సంపాదకీయంలో పేర్కొంది.

చివరగా ఆ సంపాదకీయం ముగిస్తూ... "ఉచిత యూపీఐ అనేది దేశానికి నిరంతరం ఆర్థిక ప్రయోజనాలను అందించే వ్యవస్థ అని నిరూపితమైంది. ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం దీని నిర్వహణ ఖర్చుల భర్తీకి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి తప్ప... డిజిటల్ చెల్లింపుల విస్తరణను నెమ్మదింపజేసేలా రుసుములు విధించకూడదు" అని పేర్కొంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)