దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. దీనికి కారణం ఏమిటీ, ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అజిత్ గదవీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత బంగారం, వెండి ధరలలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత చుక్కలనంటిన ముడి చమురు, బంగారం, వెండి ధరలు ఇప్పుడు వేగంగా దిగివస్తున్నాయి.
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 7 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు వెండి ధర అంతకు ముందున్న దానితో పోలిస్తే సగం తగ్గింది.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు 7 నెలల కనిష్ఠ స్థాయిలో అంటే గతేడాది నవంబర్‌నాటి స్థాయిలో ఉన్నాయి.
ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం గురువారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలు, కిలో వెండి ధర రూ. 2.15 లక్షలుగా ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి 10గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 2లక్షలకు చేరుకుంది. కిలో వెండి ధర కొన్ని రోజులు రూ. 4.04 లక్షలుగా ఉండి తర్వాత వేగంగా పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర బుధవారం 7 నెలల్లో తొలిసారి ఔన్సు (సుమారు 28.35 గ్రాములు) 4 వేల డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. బుధవారం ఒక్కరోజే బంగారం ధర 3.3 శాతం తగ్గినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలలో బంగారం కొనడం మరింత ఖరీదైనదిగా మారింది.బంగారాన్ని ఇంట్లో దాచి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఆదాయం లేదా వడ్డీ రాదు. వడ్డీ రేట్లు పెరిగితే బంగారానికి గిరాకీ తగ్గుతుంది.
2026 జనవరిలో ఔన్సు బంగారం ధర 5,594 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాతి కాలంలో 1600 డాలర్లు పడిపోయి 7 నెలల కనిష్ట స్థాయికి చేరింది.
బంగారం, వెండి ధరలు పడిపోవడం గురించి బీబీసీ బులియెన్ మార్కెట్ నిపుణులతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అంశమేంటి?
అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.
గత రెండు రోజుల్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 6వేలు తగ్గగా, వెండి ధర రూ.15,500 తగ్గింది.
గత వారం జరిగిన యూఎస్ ఫెడ్ సమావేశంలో ఫెడ్ కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించాలని చెప్పినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ చెప్పారు.
"ఐదేళ్ల నుంచి అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. దాన్ని అదుపులో ఉంచడమే యూఎస్ ఫెడ్ ప్రాధాన్యం. అమెరికాలో ఈ ఏడాదిలో ఒకటి, రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి డాలర్ల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం డాలర్ సూచీ 13 నెలల గరిష్ఠ స్థాయిలో ఉంది" అని ఆయన అన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచవచ్చని మార్కెట్ భావిస్తోందని సౌమిల్ గాంధీ చెప్పారు.
"బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. జనవరిలోని గరిష్ఠ స్థాయితో పోలిస్తే సగం తగ్గాయి. ఈ పరిస్థితి మరో 3 నెలల వరకు కొనసాగవచ్చు. అమెరికా- ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే అది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. అందువల్ల పత్రికల్లో వచ్చే కథనాల వల్ల ముడి చమురు, బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు రావచ్చు" అని సౌమిల్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
నగల వ్యాపారుల పరిస్థితి ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 4వేల డాలర్ల కంటే తగ్గడంతో భారత్‌లో కొనుగోళ్లు పెరుగుతాయా?అనే విషయంపై బీబీసీ మార్కెట్ నిపుణులతో మాట్లాడింది.
"బంగారం, వెండి ధరలు తగ్గినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ తగ్గింది. బులియన్ మార్కెట్లో మాంద్యం నెలకొని ఉందని చెప్పచ్చు. ఇప్పుడు స్కూళ్లు తెరవడంతో స్కూల్ ఫీజులు, పుస్తకాలు లాంటి వాటిపై ఖర్చు చేస్తున్నారు. దీని కారణంగా చిల్లర కొనుగోళ్లు తగ్గాయి" అని అహ్మదాబాద్‌కు చెందిన హేమంత్ సత్వారా చెప్పారు.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం, వాటిపై దిగుమతి సుంకం పెరగడంతో అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
"డాలర్ విలువ పెరగడంతో మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. అమెరికా వడ్డీరేట్లను పెంచితే విలువైన లోహాల రేట్లు తగ్గుతాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే వాటి ధరలు పెరుగుతాయి" అని ఆయన అన్నారు.
"విదేశీ మారక నిల్వల్ని కాపాడుకునేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలన్న ప్రధానమంత్రి మోదీ ప్రకటన కొంత పని చేసింది. దీనికి తోడు సుంకాలు పెరగడం, పెట్రోలు, డీజిల్ రేట్ల పెరుగుదల, ఎల్‌నినో వంటి భయాలు బంగారు కొనుగోళ్లపై ప్రభావం చూపాయి" అని హైదరాబాద్‌కు చెందిన బంగారు వ్యాపారి నిరంజన్ చెప్పారు.
బంగారం కొనాలని భావిస్తున్న వారిలో కొంతమంది రేట్లు ఇంకా తగ్గుతాయని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధరలు తగ్గుతున్నా కొనుగోళ్లెందుకు పెరగడం లేదు?
2026 జూన్ 25న అహ్మదాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.44 లక్షలు కాగా, కిలో వెండి ధర రూ. 2.19 లక్షలుగా ఉంది. వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు ఈ ధరపై మూడు శాతం జీఎస్టీని విడిగా విధిస్తారు.
"ప్రస్తుతం బంగారం, వెండి మార్కెట్లో ఎలాంటి ఆర్డర్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కళాకారులు కూడా పని లేకుండా మిగిలిపోయారు" అని హేమంత్ సత్వారా అన్నారు.
బంగారం ధరలు తగ్గినప్పుడు మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతాయని, కానీ ఈసారి కొనుగోళ్లు కొరవడ్డాయని ఆయన చెప్పారు. అన్ని ఇతర రంగాలలోనూ మందగమనం ఉందని, బులియన్ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదని హేమంత్ సత్వారా అభిప్రాయపడ్డారు.
భారత్‌లో పండుగల సీజన్ ఆగస్టులో ప్రారంభమై దీపావళి వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో పరిశ్రమలో కొనుగోళ్లు పెరుగుతాయని హేమంత్ సత్వారా ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్‌లు జరగడం లేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వెండి ధర ఎందుకు పడిపోయింది?
నిరుడు వెండి ధరలలో వచ్చిన పెరుగుదల అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అదిప్పుడు అదే వేగంతో పడిపోయింది.
దీనికి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ఒక కారణం కాగా, అదనంగా, యూఎస్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సడలడం వల్ల వెండిలో రిస్క్ ప్రీమియం కూడా తగ్గింది.
బంగారం లాగా వెండి ఎలాంటి వడ్డీని గానీ, స్థిరమైన ఆదాయాన్ని గానీ అందించదు.
దీనితో పోలిస్తే యూఎస్ బాండ్ల రాబడులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మెరుగైన రాబడి కోసం పెట్టుబడిదారులు వెండి నుండి బాండ్ల వైపు మళ్లారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























