పట్నాల సురేష్:‘ఆయిల్ ట్యాంకర్‌పై దాడిలో నా భర్త మరణించారని నాకు మెసేజ్ వచ్చింది’- వెల్లడించిన భార్య

    • రచయిత, శర్లీన్ మోలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు
పట్నాల సురేశ్

ఫొటో సోర్స్, PTI

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఒక ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతకుముందు వీరు గల్లంతైనట్లు వార్తలు వచ్చాయి.

మరణించిన ముగ్గురిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ కూడా ఉన్నట్లు దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు నిర్ధరించారు. ఆయన మృతదేహాన్ని స్వదేశం రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం ఒమన్‌లో భారత రాయబారి జీఏ శ్రీనివాస్‌‌తో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు, తన భర్త మృతదేహాన్ని గుర్తించినట్లు తనకు విదేశీ అధికారులు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ధ్రువీకరించారని పట్నాల సురేష్ భార్య భార్గవి పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ‘‘డ్రోన్ అటాక్‌లో మీ భర్త చనిపోయారు’’ అని గతరాత్రి తనకు మెసేజ్ వచ్చిందని సురేష్ భార్య భార్గవి వెల్లడించారు.

అమెరికా దళాల ఆదేశాలను పాటించలేదనే ఆరోపణలతో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' నౌకపై బుధవారం ఈ దాడి జరిగింది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని రక్షించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, అమెరికా దాడి, భారతీయులు మృతి, ఒమన్ అఖాతం

ఫొటో సోర్స్, Centcom

ఫొటో క్యాప్షన్, నౌక ఇంజిన్ గదిపై దాడికి సంబంధించి సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసిన ఫుటేజ్

భార్గవి ఏం చెప్పారు?

‘‘నిన్న రాత్రి, ఒక కార్యాలయం నుండి నాకు ఫోన్ వచ్చింది. అందులో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారని, వారిలో ఒకరు నా భర్త సురేష్ పట్నాల అని చెప్పారు. ఈ మధ్యాహ్నం(గురువారం), ఆయన చనిపోయారని వాళ్లు ధృవీకరించారు. ఇది యూఎస్ నేవీ చేసిందా లేక ఇరాన్ నేవీ చేసిందా అనే విషయాన్ని వారు ధృవీకరించడం లేదు. దానిని అంగీకరించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు, కానీ నేను ఆయన్ను కోల్పోయాను. మిగిలిన ఇద్దరు సిబ్బంది కూడా రాత్రే మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆయన మృతదేహం లభించలేదు. దీంతో ఈ ఉదయం రాయల్ ఒమన్ షిప్ సిబ్బంది మళ్ళీ మరో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తర్వాత నా భర్త మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన ఇక లేరని నాకు స్పష్టంగా సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన మృతదేహాన్ని తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను వారిని కోరాను. ఇది నిన్న ఉదయమే జరిగింది కాబట్టి, వీలైనంత త్వరగా ఈ సాయం చేయమని నేను వారిని కోరాను. నా భవిష్యత్తు కోసం, నా పిల్లల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో భార్గవి చెప్పారు.

మంత్రి ఏమన్నారు?

అంతకు ముందు ఈ ఘటనపై మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్' పోస్టు ద్వారా స్పందిస్తూ, ఇది విచారకర ఘటన అని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను త్వరలోనే స్వదేశానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

ఈ దాడి జరిగిన తర్వాత, దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్‌ను భారత ప్రభుత్వం పిలిపించి మాట్లాడింది.

ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నిస్తూ అమెరికా విధించిన ఆంక్షలను 'సెట్టెబెల్లో' నౌక ఉల్లంఘించిందని అమెరికా సైన్యం ఆరోపించింది.

ఒమన్ తీరానికి సమీపంలో అమెరికన్ బలగాల వైమానికదాడి, ఇరాన్

ఫొటో సోర్స్, Forward Seamen's Union of India/x.com/FSUIINDIA

ఫొటో క్యాప్షన్, ఎమ్‌టీ మారివెక్స్ ట్యాంకర్‌లోని భారతీయ సిబ్బందిని రక్షించారు.

'అదుపులోకి తీసుకోవాల్సింది'

నౌక సిబ్బంది తమ ఆదేశాలను పదే పదే నిర్లక్ష్యం చేయడంతో, ఒక యుద్ధ విమానం ద్వారా ట్యాంకర్ ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని పసిఫిక్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ 'ఎక్స్' పోస్టులో తెలిపింది.

భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం కూడా ఒమన్ గల్ఫ్‌లో పలావు జెండాతోనే ప్రయాణిస్తున్న 'ది మారివెక్స్' అనే మరో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దళాలు దాడి చేశాయి. అది కూడా తమ ఆదేశాలను పాటించలేదని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఆ నౌకలోని 24 మంది సిబ్బందిని ఒమన్ సైన్యం రక్షించిందని భారత అధికారులు తెలిపారు.

గురువారం ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో మరొక నౌకకు సంబంధించిన ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

‘‘ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలి" అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరణించిన నావికుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు సంప్రదిస్తున్నామని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ అంతకుముందు బీబీసీతో చెప్పారు.

ఆ నౌకల్లో ఉన్నవారి జాతీయత (ఏ దేశస్థులనే విషయం) గురించిన సమాచారం అమెరికా వద్ద లేదనే వాదనలు 'నమ్మశక్యంగా లేవు' అని యాదవ్ 'ది ఎకనామిక్ టైమ్స్' పత్రికకు తెలిపారు.

"ఒకవేళ ఆ నౌకలు ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, వాటిని అదుపులోకి తీసుకోవడం ప్రత్యామ్నాయ మార్గం" అని అన్నారు.

మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఏప్రిల్‌లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై మరింత ఒత్తిడి పెంచుతూ, రెండు దేశాలు వరుసగా రెండో రోజు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)