ఇనుప ఊపిరితిత్తులు: పోలియో బారినపడి 73 ఏళ్లపాటు వీటితోనే జీవించిన ఓ మహిళ కథ

ఫొటో సోర్స్, Cindy McVey Handout
- రచయిత, ఆనా ఫగాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికాలో ఐరన్ లంగ్ ఉపయోగించిన చివరి పోలియో పేషెంట్ మార్తా లిల్లర్డ్. అయితే ఆ పరికరం కారణంగా ఆమె తన జీవితంలో వెనకబడిన సందర్భాలు లేవని, ఆమె ఆ పరిస్థితిని రానివ్వలేదని మార్తా కుటుంబ సభ్యులు అన్నారు.
జీవితంలో ఎక్కువ కాలం ప్రతిరోజూ గంటల తరబడి తన శరీరాన్ని కప్పేసి ఉంచే భారీ లోహపు పరికరంలో ఉండాల్సి వచ్చినప్పటికీ, లిల్లర్డ్ వాహనం నడపడం నేర్చుకున్నారు, చిత్రలేఖనాన్ని అలవాటు చేసుకున్నారు.
బీగిల్ జాతి కుక్కలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వాటిని పెంచుకున్నారు.
"లిల్లర్డ్ ఎంతో దృఢ సంకల్పం గల వ్యక్తి. ఆమె అనుకున్నది ఎలాగైనా సాధించేది. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగేది" అని ఆమె చెల్లెలు సిండి మెక్వే తెలిపారు.
78 ఏళ్ల లిల్లర్డ్ జూన్ నెలలో ఓక్లహోమా రాష్ట్రంలో మరణించారు. అధికారికంగా ఆమె మరణానికి పోస్ట్ పోలియో సిండ్రోమ్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వైఫల్యాలను కారణాలుగా పేర్కొన్నప్పటికీ, కోవిడ్ ప్రభావాలే తన సోదరి మరణానికి కారణమని మెక్వే భావిస్తున్నారు.
ఐరన్ లంగ్ ఎలా పని చేస్తుంది?
ఐరన్ లంగ్ నెగటివ్ ప్రెజర్ విధానంతో పనిచేస్తుంది. మోటార్ సాయంతో పనిచేసే బెల్లోస్ సిలిండర్లోని గాలిని బయటకు లాగి రోగి శరీరం చుట్టూ వాక్యుమ్ సృష్టిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు విస్తరించి గాలిని లోపలికి పీల్చుకుంటాయి. అనంతరం గాలిని తిరిగి లోపలికి అనుమతించినప్పుడు ఇదే ప్రక్రియ వ్యతిరేక దిశలో జరిగి ఊపిరితిత్తులు మళ్లీ కుచించుకు పోతాయి.
1950లలో పోలియో విజృంభిస్తున్న కాలంలో ప్రాణాలతో ఉండేందుకు వేలమంది ఇలాంటి ఐరన్ లంగ్లపై ఆధారపడ్డారు. లిల్లర్డ్ 73 సంవత్సరాల పాటు ఈ యంత్రం సాయంతోనే జీవించారు.
చాలామంది పిల్లల్లా ఆమె ఈ యంత్రానికి భయపడేవారు కాదు. "అది ఆమెకు ఒక రీచార్జ్ లాగా ఉత్తేజాన్నిచ్చేది" అని మెక్వే చెప్పారు.
1950ల మధ్యకాలంలో లిల్లర్డ్‌కు పోలియో నిర్ధరణ అయినప్పుడు, ఈ వ్యాధికి విరుగుడు లేదనే చర్చలు, ఆందోళనలు ప్రతీనోటా వినిపించేవని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఐదేళ్ల వయసున్న లిల్లర్డ్‌కు ఈ వ్యాధి గురించి తెలిసి, దాని పట్ల భయం ఉండేదని ఆమె సోదరి చెప్పారు.
"ఒకరోజు మార్తా నిద్రలేచినప్పుడు దిండు మీద నుంచి తలను కూడా పైకెత్తలేకపోయింది. పోలియో గురించిన వార్తలు బాగా విని ఉన్న తనకు పోలియో వచ్చిందని వెంటనే గుర్తించిందని చెప్పేది" అని మెక్వే తెలిపారు.
కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత లిల్లర్డ్, ఆమె కుటుంబ సభ్యులు కోలుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఆమె ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, వాటర్ థెరపీ పొందుతూ తన శరీర బలాన్ని సాధ్యమైనంత వరకు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఎడమ చేతిని కొంతవరకు ఉపయోగించగలిగారు. అలాగే కాళ్లను కూడా వాడగలిగారు.
బతకాలనే సంకల్పం కేవలం లిల్లర్డ్ది మాత్రమే కాదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అందుకు కట్టుబడి, తమవంతు సాయం చేయడానికి సిద్ధపడ్డారు.
లిల్లర్డ్ ఒంటరిగా నివసించేందుకు, అవసరమైనప్పుడు స్వయంగా ఐరన్ లంగ్లోకి వెళ్లి బయటకు రావడానికి వీలుగా ఆమె మామయ్య, తాత కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు.
"ఐరన్ లంగ్ ఉపయోగించే చాలామంది రోగులు చేయలేని పనులను ఆమె చేయగలిగేది" అని మెక్వే చెప్పారు.
లిల్లర్డ్ వాహనం నడపగలిగేలా ప్రత్యేకంగా ఒక కారులో మార్పులు చేశారు. స్టీరింగ్ వీల్‌ను ఆమె ఒడిలో ఉండేలా, సులభంగా అందుకునే విధంగా అమర్చారు.
ఆమె చేతుల కదలిక పరిమితంగా ఉండటంతో టర్న్ సిగ్నల్ నియంత్రణలను కింది భాగంలో ఏర్పాటు చేశారు. వాటిని కూడా ఆమె సులభంగా ఉపయోగించగలిగేది.
లిల్లర్డ్ ఒక కళాకారిణి, మేధావి అని మెక్వే చెప్పారు. తన సోదరి సూక్ష్మ వివరాలతో ప్రకృతి దృశ్యాలను చిత్రించేదని, అలెక్సా పరికరాన్ని ఎన్నో ప్రశ్నలు అడిగేదని తెలిపారు.
20 ఏళ్లకు పైగా తన జీవిత భాగస్వామిగా ఉన్న బహా సల్హ్తో మాట్లాడటం లిల్లర్డ్‌కు ఎంతో ఇష్టమని మెక్వే చెప్పారు. ఈ ఏడాది వీసా పొందిన ఆయన, ఈజిప్టు నుంచి అమెరికాకు వచ్చి ఫిబ్రవరిలో లిల్లర్డ్ను వివాహం చేసుకున్నారు.
జూన్ 26న లిల్లర్డ్ మరణించినట్లు ఆమె సోదరి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలియో భయం
ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేసే పోలియో 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ప్రారంభంలో తీవ్ర కలకలం సృష్టించింది. అనేక మంది చిన్నారులు చనిపోవడంతోపాటు మరెందరో శాశ్వత వైకల్యానికి గురయ్యారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 200 పోలియో ఇన్ఫెక్షన్లలో ఒకటి తిరిగి కోలుకోలేని పక్షవాతానికి దారితీస్తుంది. పక్షవాతానికి గురైన వారిలో 5 నుంచి 10 శాతం మంది శ్వాస కండరాలు పనిచేయకుండా పోవడంతో మరణిస్తారు.
1955 నుంచి పోలియోకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో 1979లో పోలియో నిర్మూలన జరిగినట్లు ప్రకటించారు. అంటే ఆ వ్యాధి ఇక సాధారణంగా ప్రజల్లో వ్యాపించడం ఆగిపోయింది.
దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్లే అది సాధ్యమైంది.
అయితే ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సిన్లపై సందేహాలు పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖా అధికారులు మరిన్ని వ్యాక్సిన్లను తప్పనిసరి కాకుండా కేవలం ఒక ఆప్షన్లా ఉండాలని సూచిస్తున్నారు.
వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సలహా కమిటీ ఛైర్మన్ కిర్క్ మిల్హోన్ ఈ ఏడాది ప్రారంభంలో పోలియో వ్యాక్సిన్‌ను కూడా ఒక ఆప్షన్ చేయాలని సూచించారు.
"పోలియోను పరిశీలిస్తే అప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనడంలో సందేహం అవసరం లేదు. ఇప్పుడు పారిశుద్ధ్య పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వ్యాధి ప్రమాదం కూడా మారింది" అని మిల్హోన్ అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు మెక్వేను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
"పోలియో భయంకరమైన వ్యాధి" అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. "ఈ వ్యాధి శరీరాన్ని వికృతం చేస్తుంది, వైకల్యానికి గురి చేస్తుంది, మనుషులను బంధిస్తుంది. ఇక్కడ దీనిని మనం అదుపులోకి తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడం లేదు" అన్నారామె.
పోలియో గురించిన జ్ఞాపకాలు ప్రజలకు చాలా దూరమైపోవడంతో అది ఎంత తీవ్రమైన వ్యాధో మరిచిపోతున్నారని మెక్వే ఆందోళన వ్యక్తం చేశారు.
"వ్యాక్సిన్‌లో సమస్యలు ఉన్నాయని వారు భావించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించకపోతే ఎదురయ్యే సమస్యలు ఇంకా చాలా తీవ్రమైనవి" అని ఆమె చెప్పారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఏడాది ముందే లిల్లర్డ్‌కు పోలియో సోకింది.
"మార్తాకు పోలియో వచ్చిన ఏడాదే ఆ వ్యాక్సిన్‌ను పరీక్షించే అవకాశం నా స్నేహితుడికి వచ్చింది" అని ఆమె చెప్పారు.
"కానీ, అప్పటికే అవకాశం చేజారిపోయింది" అన్నారు మెక్వే
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























