హాయ్ మూవీ రివ్యూ: సినిమాను మలుపు తిప్పిన ఆ అబద్ధం ఏమిటి?

ఫొటో సోర్స్, nayanthara/Insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
కవిన్, నయనతార జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'హాయ్' థియేటర్లోకి వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం..
రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం (కవిన్) తన మేనకోడలికి ప్రపోజ్ చేస్తాడు.
ఆమె తిరస్కరిస్తుంది. నువ్వు ధైర్యంలేని పిరికివాడివి. అమ్మానాన్నల చాటు బిడ్డవి అని ఎగతాళి చేస్తుంది.
దాంతో హీరో చనిపోవాలనుకుంటాడు.
తల్లి రాధిక వచ్చి అడ్డుకుంటే తనని ఏ అమ్మాయి ప్రేమించదని చెబుతాడు. దాంతో అతనికి వెంటనే పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. కానీ సుబ్రహ్మణ్యం ఇంట్లోంచి పారిపోతాడు.


ఫొటో సోర్స్, nayanthara/Insta
సినిమాను మలుపు తిప్పే హీరో అబద్ధం
భీమవరానికి చెందిన దేవసేన (నయనతార)కి పెళ్లి ఫిక్సవుతుంది. అందరినీ తన్ని పారిపోతుంది. వీళ్లిద్దరూ హైదరాబాద్‌లో కలుస్తారు. స్నేహితులతో కలసి ఒకే ఇంట్లో వుంటారు.
దేవసేన అంటే హీరోకి ఇష్టం. ఆమెకి ప్రేమ, పెళ్లి అంటే చిరాకు. ఉద్యోగం కోసం లండన్ వెళ్లిపోవాలనుకుంటుంది.
ఇద్దరి కుటుంబాలు వీళ్లని వెతుకుతూ ఎక్కడున్నారో తెలుసుకుంటారు. అప్పుడు గండం నుంచి బయటపడటానికి హీరో ఒక అబద్ధం చెబుతాడు. అదేంటి? చివరికి ఏమైంది? ఇది మిగతా కథ.
ఇలాంటి సినిమాలు ఎన్ని చూసుంటామో లెక్కలేదు.
ఎన్టీఆర్ మిస్సమ్మ దగ్గరనుంచి ఎన్నిరకాల కథలు వచ్చాయో చెప్పలేం. ఇంత అరిగిపోయిన కథతో తొలిసినిమా చేసిన దర్శకుడు విష్ణువడవన్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
సినిమా నిర్మించిన నయనతార దంపతులకు ఈ కథ ఎలా నచ్చిందో ఆశ్చర్యం. ఎందుకంటే యారదినీ మోహిని (2008)లో నయనతారే ఈ క్యారెక్టర్‌ని వేసింది. తెలుగులో దీన్ని ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని తీశారు.

ఫొటో సోర్స్, nayanthara/Insta
‘హాయ్’ టైటిల్ ఎందుకు పెట్టారంటే...
పాతకథనే కొత్తగా చెప్పారా అంటే అదీలేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా ప్లాట్‌గా ఫస్టాప్ నడుస్తుంది. సెకండాఫ్ కొంచెం మెరుగు. క్లైమాక్స్‌లో సుహాసిని వచ్చి ఎమోషన్ పండించింది.
రాధిక, భాగ్యరాజా, ప్రభు లాంటి మంచి నటులున్నా లాభం లేకుండా పోయింది. కారణం బలహీనమైన రైటింగ్. మంచి సీన్స్ లేకపోతే నటులు ఎంతమంది వున్నా సినిమాని నిలబెట్టలేరు.
నయనతార, కవిన్ బాగా నటించారు. అయితే అన్నీ ఏవో సినిమాలో చూసిన సీన్స్ వుంటాయి. అక్కడక్కడా కామెడీ డైలాగులున్నాయి. డబ్బింగ్ పరవాలేదు ఒక సీన్లో ఎడిటర్ మరచిపోయి హైదరాబాద్‌లో సముద్రం చూపిస్తాడు.
రెండుగంటల 20 నిమిషాల సినిమా సహనాన్ని పరీక్షిస్తూనే వుంటుంది. కథలో పసలేకపోయేసరికి కెమెరా బాగున్నా గుర్తించలేం. పాటలు ఉన్నా లేకపోయినా నష్టం లేదు.
మొదటి పది నిమిషాలకే ఈ కథ ముగింపు మనకి తెలిసిపోతే ఆసక్తి ఏముంటుంది? అలాగే దీనికి హాయ్ అని టైటిల్ ఎందుకు పెట్టారనేది పజిల్.

ఫొటో సోర్స్, nayanthara/Insta
సినిమాలో మైనస్‌లు గురించి చెప్పాలంటే...
ప్లస్ పాయింట్స్
1. నయనతార నటన
2. క్లైమాక్స్‌లో ఎమోషన్
మైనస్ పాయింట్స్
1. చెప్పలేనన్ని
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























