ఖరీదైన గోల్డ్‌పాస్ కొన్నారు, లగ్జరీ దుస్తులు ధరించారు.. 70 ఫోన్లు చోరీ చేశారు, పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

మొబైల్ ఫోన్, చోరీ, దొంగతనం, దిల్జీత్ దోసాంజ్
ఫొటో క్యాప్షన్, నవంబర్ 21న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ కచేరీ జరిగింది. ఈ కచేరీలో వృత్తంలోని నిందితులు 70 ఫోన్లు చోరీ చేశారని పోలీసులు చెప్పారు.
    • రచయిత, భార్గవ పరిఖ్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

నవంబర్ 21న అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురి మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి.

ఈ కచేరీ అనంతరం తమ మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయంటూ మొతేరా పోలీసుస్టేషన్‌లో 70 ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారు దిల్లీకి చెందినవారని పోలీసులు వెల్లడించారు.

ఈ కచేరీకి లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో అహ్మదాబాద్ పోలీసులు ముందుగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే, కచేరీ ముగిసి, ప్రజలు బయటకు వస్తున్న సమయంలో ఫోన్ల చోరీకి సంబంధించిన ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పోలీసులకు కొందరిపై అనుమానం వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిందితులు దిల్లీలోని దరియాగంజ్ ప్రాంతానికి చెందినవారు. ఖరీదైన పాస్‌లు కొని, ఖరీదైన దుస్తులు ధరించి కేవలం ఫోన్‌లు దొంగతనం చేయడానికి మాత్రమే వారు దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ట్యాక్సీలో వచ్చారని పోలీసులు తెలిపారు.

నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠాలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి ఐదు రోజుల రిమాండ్‌కు తరలించారు.

విచారణ అనంతరం ఈ ముఠా ప్రధాన సూత్రధారిని పట్టుకుని, దేశవ్యాప్తంగా విస్తరించిన మొబైల్ ఫోన్ల చోరీ నెట్‌వర్క్‌ను ఛేదించగలమని పోలీసులు చెబుతున్నారు.

మొబైల్ ఫోన్, చోరీ
ఫొటో క్యాప్షన్, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు

అసలేం జరిగింది?

నవంబర్ 21, శనివారం రాత్రి జరిగిన దిల్జీత్ దోసాంజ్ ఈవెంట్‌కు గుజరాత్‌లోని పలు నగరాల నుంచే కాక, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు.

ఈవెంట్‌కు ఉన్న పాపులారిటీతో చాలా ముందుగానే టికెట్లు అమ్ముడుపోయాయి.

అయితే, కచేరీ ముగియగానే చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కచేరీలో 10 లేదా 15 ఫోన్లు కాదు.. ఏకంగా 70 ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఖరీదైన మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయంటూ అహ్మదాబాద్‌లోని మోతేరా పోలీసు స్టేషన్‌కు 70 ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందం వెంటనే రంగంలోకి దిగాయి.

విచారణ ప్రారంభించిన పోలీసులకు మెట్రో స్టేషన్ సమీపంలో ఖరీదైన దుస్తులు ధరించి, తలపాగా చుట్టుకుని ఉన్న ఇద్దరి వ్యక్తుల కదలికలు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 24 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

కేవలం ఫోన్లు దొంగిలించడానికే దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారణకు కోర్టు అనుమతించింది.

పోలీసులకు అందిన 70 ఫిర్యాదుల్లో కొన్ని ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు అందుబాటులో లేవు. ఫోన్ పోర్టల్ ద్వారా 64 ఫోన్లకు సంబంధించిన వివరాలు లభించడంతో వాటిని నిఘాలో ఉంచారు.

మొతేరా పోలీసు, దొంగతనం, మొబైల్ ఫోన్
ఫొటో క్యాప్షన్, మొతేరా పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆర్‌వీ వించీ

చోరీకి గురైన ఫోన్లన్నీ ఆ రెండు కంపెనీలవి, ఖరీదైనవి

మోతేరా పోలీస్ స్టేషన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆర్.వి. వింఛీ బీబీసీతో మాట్లాడుతూ, కచేరీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.

"ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద చెక్ చేశాం. పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నారు. కానీ రాత్రివేళ, ఇలాంటి వేడుకలో జనాలు అందరూ ఒకేసారి బయటకు వెళ్లే సమయంలో ఫోన్‌లు దొంగతనానికి గురయ్యాయంటూ ఫిర్యాదులు రావడం మొదలైంది. దీంతో మేము అలర్ట్ అయ్యాం" ఆర్‌వీ వించీ చెప్పారు.

"ఈ ఫిర్యాదులన్నింటిలో ఉమ్మడిగా కనిపంచిన విషయం ఏంటంటే.. దొంగతనానికి గురైనవన్నీ రెండు కంపెనీలకు చెందిన అత్యంత ఖరీదైన ఫోన్‌లే. దాదాపు ఫిర్యాదులన్నీ కూడా ఖరీదైన టికెట్లు కలిగి ఉన్న గోల్డ్ పాస్ హోల్డర్ల నుంచే వచ్చాయి. స్టేడియంలోని గ్యాలరీ వద్దనున్న ఫుడ్ స్టాల్స్, మెట్రోకు దారితీసే ఎగ్జిట్ పాయింట్ వద్ద వారు తమ ఫోన్‌లను పోగొట్టుకున్నట్లు చెప్పారు" అని వించీ తెలిపారు.

"దీంతో ఆ సమయంలో ఫోన్ దొంగలు గోల్డ్ పాస్ గ్యాలరీ నుంచే బయటకు వస్తూ ఉండొచ్చని మేమో అంచనాకు వచ్చాం. దీంతో విచారణ పరిధిని కుదించి, గోల్డ్ పాస్ ఎగ్జిట్ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం’’ అని చెప్పారు.

" కచేరీ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై మా బృందానికి అనుమానం వచ్చింది. వారు తలపాగాలు ధరించి ఉన్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో తిరుగుతున్నారు. కానీ మెట్రో రైలు ఎక్కేందుకు లోపలికి వెళ్లడం లేదు.

"మొదట వారిపైనే మాకు అనుమానం వచ్చింది. దీంతో వారిని చుట్టుముట్టి తనిఖీ చేయగా, వారి వద్ద 24 ఫోన్లు లభించాయి. అవన్నీ రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన ఖరీదైన ఫోన్లే" అని వివరించారు.

రద్దీ మధ్య గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు వారిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించామని వింఛీ తెలిపారు.

వారిని విచారించడం ప్రారంభించాక, వారు దిల్లీ నుంచి ఏసీ ట్యాక్సీలో అహ్మదాబాద్‌కు వచ్చినట్లు తెలిసిందని చెప్పారు.

 నిందితులను పోలీసులు విచారిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, నిందితులను పోలీసులు విచారిస్తున్నారు

సీసీటీవీ నిఘా ఉన్నా ఎలా తప్పించుకున్నారు?

శనివారం ఉదయం 11 గంటలకు నలుగురు వ్యక్తులు ట్యాక్సీలో దిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. యెల్లో నెంబర్ ప్లేట్ ఉంటే టోల్స్ బూత్ వద్దఉన్న సీసీటీవీ నుంచి తప్పించుకోవచ్చని వారు భావించారు. మధ్యాహ్నం ఓ పెద్ద హోటల్‌లో భోజనం చేసి అహ్మదాబాద్ తిరిగివచ్చారు.

"సాయంత్రం 6 గంటల వేళ, ముందే అనుకున్న కొన్ని ఖరీదైన రెస్టారెంట్‌లకు వెళ్లారు. అక్కడే తిని, రెస్టారెంట్ వాష్‌రూంలో తమతో పాటు తెచ్చుకున్న దుస్తులను ధరించారు. హోటల్‌లో రూం తీసుకుంటే పోలీసులకు దొరికిపోతామని భావించి వారు ఈ విధంగా చేశారు" అని పోలీసులు తెలిపారు.

‘‘కచేరీకి వచ్చేవారిలో కలిసిపోయేందుకు వారు తలపాగా ధరించారు. దీంతో స్టేడియం సీసీటీవీల్లో వారి ముఖాన్ని గుర్తించడం వీలు పడదు అనేది వారి ఆలోచన. అలాగే ముందుగానే కొనుగోలు చేసిన గోల్డ్ పాస్‌లతో స్టేడియంలోకి ప్రవేశించారు. లక్ష రూపాయలకు పైగా విలువైన ఫోన్లు కలిగి ఉన్నవారిని, ముఖ్యంగా రెండు ప్రముఖ కంపెనీల ఖరీదైన ఫోన్లను ఉపయోగిస్తున్నవారిని ఈ నలుగురూ లక్ష్యంగా చేసుకున్నారు’’ అని పోలీసులు చెప్పారు.

"వీరు ఫోన్లను దొంగిలించి ఒకరి నుంచి మరొకరికి అందిస్తూ ఉండేవారు. అయితే, చోరీలను రాత్రి 10.30 గంటల తర్వాత ప్రారంభించారు. మొదట ఫుడ్ స్టాళ్ల వద్ద, ఆ తర్వాత ప్రజలు బయటకు వెళ్తూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫోన్లు దొంగిలించడం మొదలుపెట్టారు’’ అని చెప్పారు.

"ఇదే సమయంలో మాకు ఫోన్ల చోరీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం ప్రారంభమైంది. వెంటనే వాటిని విశ్లేషించగా, ఎక్కువ ఫిర్యాదులు గోల్డ్ పాస్ కలిగినవారి నుంచే వచ్చినట్లు గుర్తించాం. అలాగే, చోరీకి గురైన ఫోన్లన్నీ ఖరీదైనవే. దీంతో మా విచారణను గోల్డ్ పాస్ హోల్డర్ల పరిధికి పరిమితం చేశాం. తద్వారా ఫోన్ దొంగలను సులభంగా పట్టుకోవచ్చని భావించాం. అయితే, రద్దీ కారణంగా ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు" అని పీఐ ఆర్.వి. వింఛీ వివరించారు.

"వీళ్లు దొంగతనం చేసేందుకు దేశం మొత్తం తిరుగుతారు. కచేరీలు మాత్రమే కాదు, క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ఈవెంట్‌లకు సైతం వెళ్తారు. ఖరీదైన పాస్‌లను సైతం కొనుగోలు చేస్తారు" అని పోలీసులు తెలిపారు.

"ఖరీదైన పాస్‌లు కలిగి ఉండి, ఖరీదైన దుస్తులు ధరించే వారి వద్ద ఖరీదైన ఫోన్‌లు ఉంటాయి. అలాంటివారిపై వెంటనే ఎవరికీ అనుమానం రాదు" అని అన్నారు.

"మహ్మద్ గుల్జార్, ఆష్రఫ్ హుస్సేన్ ఇద్రిస్ అనే ఇద్దరు నిందుతులు పట్టుబడ్డారు. వారికి మిగతా ఇద్దరు తెలియదని చెబుతున్నారు. దర్యాప్తునకు సహకరించకపోవడం వల్ల వారిని 5 రోజుల పాటు నవంబర్ 27 వరకు రిమాండ్‌కు తరలించాం. రిమాండ్ అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించిన ఫోన్ దొంగల నెట్‌వర్క్‌ని ఛేదిస్తాం" అని పోలీసులు పేర్కొన్నారు.

గుల్జార్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

మహమ్మద్ సువాయిల్ గుల్జార్‌ను పోలీసు కస్టడీకి తీసుకెళ్లిన సమయంలో, ఆయన సోదరుడు మహమ్మద్ ఇస్మాయిల్ గుల్జార్‌ను పోలీసులు సంప్రదించారు.

ఈ సందర్భంగా బీబీసీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడింది. గతంలో తన సోదరుడు దిల్లీలో ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన నుంచి చిన్నచిన్న నేరాల వరకు పలు కేసుల్లో పట్టుబడ్డాడని ఆయన చెప్పారు.

"ఆయన ఎలాంటి పని చేయడం లేదు. అందుకే కుటుంబంతో కూడా ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.ఆయనకు సహాయం చేయడానికి గుజరాత్‌కు ఎవరూ రారు" అని ఆయన తెలిపారు.

అయితే, అష్రఫ్ ఇద్రిష్ కుటుంబ సభ్యులను మాత్రం సంప్రదించడం సాధ్యపడలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)