మేల్‌ఘాట్: ఇప్పచెట్టు కొట్టేయడంతో ఆ చెట్టుపై ఉండే దెయ్యం హాస్టల్‌కు వచ్చిందంటూ వదంతి..మూతపడ్డ ఆశ్రమ పాఠశాల

    • రచయిత, నితేష్ రౌత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో మేల్‌ఘాట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని డోమా గ్రామంలో దెయ్యాలు కనిపిస్తున్నాయన్న వదంతులతో గిరిజన ఆశ్రమ పాఠశాల మూత పడింది.

ఆశ్రమ పాఠశాలకు చెందిన 606 మంది విద్యార్థులు భయంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. వీరిలో 263 మంది బాలురు, 343 మంది బాలికలు ఉన్నారు.

అమ్మాయిల హాస్టల్‌లోని కొంతమంది విద్యార్థినులు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా నవ్వడం, ఏడవడం, తెల్లమొహంవేయడం, అరవడం, కాళ్లూ చేతులు బిగపట్టడం, దేనికీ స్పందించకపోవడం లాంటివి చేస్తున్నట్లు ఇక్కడి విద్యార్థులు చెప్పారు.

ఈ హాస్టల్ పక్కనే మరో హాస్టల్ ఉంది. కానీ అందులోని విద్యార్థులలో మాత్రం ఇలాంటి లక్షణాలేవీ కనిపించలేదు. మూఢ నమ్మకాల నిర్మూలన కార్యకర్తలు ఈ సంఘటనపై దృష్టి సారించారు.

డోమా ఆశ్రమ పాఠశాల అమరావతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్‌డోంగ్రి, ఏక్తాయ్, చుంఖడి పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇక్కడి హాస్టల్‌లో చదువుకుంటున్నారు.

ఇక్కడ బాగా చదువు చెబుతారనే పేరు ఉండటంతో ఇతర ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలతో పోలిస్తే ఇక్కడ విద్యార్థుల నమోదు మెరుగ్గా ఉంది.

ఈ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహ విద్యార్థులతో కలిపి సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అయితే, 300 మందికి పైగా బాలికలు ఉండటానికి ఈ హాస్టల్‌లో కేవలం మూడు గదులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా బాలికలు ఉండటానికి అనువుగా లేవు. బాలుర వసతి గృహం పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇప్ప చెట్టు మీద దెయ్యం ఉందనే వదంతి

విద్యార్థుల కోసం నిర్మించిన పెద్ద హాస్టల్ భవనం సిద్ధమైనప్పటికీ, ప్రహరీ గోడ విషయంలో కోర్టులో వివాదం నడుస్తుండటంతో దాన్ని ఇంకా ప్రారంభించలేదు.

దీంతో పిల్లలు పాత హాస్టల్‌ భవనంలోనే ఉండాల్సి వస్తోంది.

ఎన్నో ఏళ్లుగా 100 మీటర్ల ఎత్తు ఉన్న ఇప్ప చెట్టు ఇక్కడ ఉండేది. కొత్త భవన నిర్మాణం కోసం దీనిని కొట్టేశారు. ఈ చెట్టుపైన ఒక దెయ్యం కుటుంబం నివసించేదని చెట్టును కొట్టేయడం వల్ల ఆ దెయ్యం కుటుంబం హాస్టల్‌కు వచ్చి నివసిస్తోందని కొంతమంది విద్యార్థులలో మూఢనమ్మకం వ్యాపించింది.

ఈ ఆశ్రమ పాఠశాల గ్రామానికి కొన్ని మీటర్ల దూరంలో ఉంది. పాఠశాల చుట్టూ చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. స్కూలు బిల్డింగ్ నిర్మాణానికి కొన్ని చెట్లను నరికివేశారు. ఆ తర్వాతే స్కూల్లో దెయ్యాల మూఢనమ్మకం వ్యాపించింది.

ఏక్తాయ్ గ్రామం డోమా నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన కొంతమంది బాలికలు హాస్టల్‌లో ఉండి స్కూల్లో చదువుకుంటున్నారు.

ఏక్తాయ్ బాలికలలో అంతుపట్టని లక్షణాలు కనిపించడంతో బీబీసీ బృందం ఆ ఊరు వెళ్లింది. ఊళ్లో ఆందరిలోనూ దీని గురించే చర్చ. బాలికల్లో ఒకరి తండ్రి శంకర్ ధికార్ ఇంటికి బీబీసీ బృందం వెళ్లింది. ఆయన కుమార్తెలో ఈ లక్షణాలు కనిపించాయి.

"ప్రస్తుతానికి పాఠశాల వాతావరణం నా కుమార్తెకు సరిపడదు. కానీ ఆమె దీని నుంచి కోలుకున్నాక ఆమెను స్కూలుకు పంపుతాం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

శంకర్ కుమార్తెకు ఆ రోజు జరిగిందేమీ గుర్తులేదు. కానీ ఆమె స్కూల్లో జరిగిన చర్చల గురించి వినేది.

ఇప్ప చెట్టును కొట్టేసిన తర్వాత వచ్చిన పుకార్ల కారణంగానే ఇదంతా జరుగుతోందనే మూఢనమ్మకం తెలిసో లేక తెలియకో ఆమె మనసులో బలంగా నాటుకుపోయి ఉండవచ్చని డాక్టర్ చెప్పారు.

మౌలిక వసతుల కొరతే కారణమా?

"ఇక్కడ బాలికలు చాలా ఇరుకైన ప్రదేశంలో ఉంటున్నారు. ఒక మంచం మీద ఇద్దరు లేదా ముగ్గురు బాలికలు పడుకుంటున్నారు. సరైన వెలుతురు లేదు. ఇరుకైన వాతావరణం దీనికి కారణం కావచ్చు" అని మూఢ నమ్మకాల నిర్మూలన సమితికి చెందిన మహిళా కార్యకర్త ఒకరు చెప్పారు.

విద్య, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మేల్‌ఘాట్ ప్రాంతంలో మూఢనమ్మకాలు కొత్తేమీ కాదు.

ఆరోగ్యం బాగా లేకపోతే గిరిజన ప్రజలు వైద్యుడి వద్దకు వెళ్లరు. వారు ఎక్కువగా భూమ్కా బాబా వద్దకు వెళ్లడానికి ఇష్టపడతారు.భూమ్కా బాబా అంటే తాంత్రిక మాంత్రిక బాబా అని అర్థం. ఆయన మంత్ర తంత్రాల ద్వారా వ్యాధులను నయం చేస్తానని చెప్పుకుంటారు.

గిరిజనుల్లో మూఢనమ్మకాలపై విశ్వాసం పెరగడానికి ఆయన కూడా ఒక కారణం.

స్థానికులకు భూమ్కాపై ఎంత నమ్మకం ఉందంటే అధికారులు ఎంత ప్రయత్నించినా గిరిజనుల్లో మార్పు తేలేకపోయారు.

విద్యార్థినులలో చాలామంది ఇప్పుడు హాస్టల్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారి కుటుంబాలు వాళ్లను పంపడానికి ఒప్పుకోవడం లేదు.

పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ చౌదరి పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

పిల్లలకు ఎలాంటి వ్యాధులు లేనప్పటికీ, తల్లిదండ్రుల భయం వల్ల వారి చదువు దెబ్బతింటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.

'దెయ్యం కాదు, ఒత్తిడి, భయం'

ఈ పరిస్థితి దెయ్యాల వల్ల కాకుండా, మానసిక ఒత్తిడి, భయం, పుకార్ల వల్ల ఏర్పడుతుందని సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారు.

విద్యార్థులను పరీక్షించినప్పుడు వాళ్లలో డిస్సోసియేటివ్, కన్వర్షన్ సింప్టమ్స్ వంటి లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నామని మనోవైద్యురాలు స్వాతి సోనావానే చెప్పారు.

తాను పరీక్షించిన ఓ అమ్మాయిలో కారణం లేకుండా నవ్వడం, ఏడవడం, మతిమరుపు, భయం, ఒత్తిడి వంటి మానసిక లక్షణాలు కనిపించాయి. మూఢనమ్మకాలు, అధిక ఒత్తిడి, భయం వల్ల ఇలాంటి లక్షణాలు కలగవచ్చని స్వాతి సోనావానే తెలిపారు.

విద్యార్థుల మనసుల్లోని భయాన్ని పోగొట్టేందుకు మూఢనమ్మకాల నిర్మూలన సమితి కార్యకర్తలు మేల్‌ఘాట్‌ చేరుకున్నారు. అంతకుముందు ఈ సమితి 300కు పైగా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

పాఠశాలకు తిరిగి హాజరుకావడానికి వీలుగా ఈ కార్యకర్తలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో అవగాహన కలిగిస్తున్నారు.

దెయ్యాల గురించిన కొన్ని సినిమాలు, చర్చలు కూడా పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేశాయని సమితి కార్యకర్తలు అంటున్నారు.

ఇది జూలై 29న గురు పౌర్ణమి రోజున ప్రారంభమైంది.

మొదట, నలుగురు విద్యార్థులు బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనూహ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తర్వాత ఈ ప్రవర్తన ఇతర విద్యార్థులలో కూడా కనిపించింది.

అయితే ఈ విద్యార్థులలో చాలామంది ఇంటికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నారు.

వాళ్లు ఇంటికెళ్లిన తర్వాత, ఇంటి పనులు పొలం పనులు చేస్తూ కనిపించారు.

ఈ అమ్మాయిలందరిలో కనిపించిన ఒక ఉమ్మడి విషయం ఏమిటంటే వారిలో చాలామంది 'కాంచన' అనే హారర్ సినిమా చూశారు. రెండవది, అమ్మాయిలందరూ ఒకే విధంగా ప్రవర్తించారని వాళ్లలో ఒకరు చెప్పారు. అంటే అమ్మాయిలు ఒకరినొకరు అనుకరిస్తున్నారు.

ప్రస్తుతం ఆశ్రమ పాఠశాల హాస్టల్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. అయినప్పటికీ, ఇంటికి వెళ్లిన చాలా మంది అమ్మాయిలు తిరిగి పాఠశాలకు రావాలని కోరుకుంటున్నారు. పాఠశాలను మూసివేస్తారేమోనని కొంతమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థులను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు గిరిజనాభివృద్ధి శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

విద్యార్థులను సురక్షితమైన వాతావరణంలో తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అదనపు కమిషనర్ సందీప్ గోలైట్ తెలిపారు.

దెయ్యం ఉందనే పుకార్ల కారణంగా పాఠశాల నిర్మానుష్యంగా మారినప్పటికీ, ఈ మొత్తం సంఘటన వెనుక ఉన్న వాస్తవం భయం.

మూఢనమ్మకాల కన్నా మానసిక ఒత్తిడి, సామూహిక భయం పుకార్ల వల్లే ఇలా జరిగిందా అని పరిశోధించడం అవసరం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)